ఒక జంతువైయ్యుండి నువు గడ్డి తింటావా? ఒక పశువ్వైయ్యుండి నువు నీరు త్రాగుతావా? ఎంత ధైర్యం!
నీకు మరణశిక్ష తప్పదు!
ఈ మాటలు వింతగా అనిపించినా, జరుగుతున్న నిజం అది!
కంగారూలు ఆస్ట్రేలియాలో అనాదిగా ఉంటున్న జంతువులు. గడ్డి తిని బ్రతికే శాకాహార జంతువులు. ఆ భూభాగాన్ని ఆధునిక ప్రపంచం కనుగొనకముందే, ఆ భూభాగానికి ఆస్ట్రేలియా అనే పేరు పెట్టకముందునుంచే ఆ జంతువులు అక్కడ ఉన్నాయి. ప్రపంచంలో మరెక్కడా కంగారూలు లేవు. అందువల్ల ఆస్ట్రేలియా ప్రజలను కూడా కంగారూలు అని పిలుస్తారు. వారు కూడా దానిని ముద్దుపేరుగా భావించి స్వాగతిస్తారు.
అటువంటి ఈ కంగారూలు అచ్చం కంగారు లాగానే ఉండే వలబీలు ఒకప్పుడు ఆస్ట్రేలియాలో రక్షితజంతువులు. వాటిని పెంచుకొనడం, అమ్మడం, కొనడం ఇవన్నీ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు.
కాని, రాను రాను వాటి జనాభా ఎక్కువైపోయిందట! గడ్డిని విపరీతంగా మేసేస్తున్నాయట! (!!!).
భారత్‌లో మన రైతులు తెల్లదోమ ఎర్రనల్లి వంటి పురుగులను ఎలా చీడపురుగులుగా భావిస్తారో, ఆవిధంగా ఆస్ట్రేలియా రైతులు కంగారూలను చీడపురుగులుగా పరిగణించారు. ఆ సమయంలో ఆస్ట్రేలియాలో వాటి సంఖ్య 27 మిలియన్లు అని అధికారులు లెక్కలు తేల్చారు. కాదు 500 మిలియన్లు అని "కంగారూల వ్యతిరేకులు" వాదించారు.
మొత్తానికి ఆ సమయంలో కంగారూలను చంపడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతించక తప్పలేదు. తత్ఫలితంగా రెండు దశాబ్దాలలో 90 మిలియన్ల కంగారూలు చంపబడ్డాయి.
కానీ ప్రపంచంలో మరెక్కడా ఆశ్రయం లేక, తమ దేశంలో మాత్రమే నివసించే కంగారూలను మరీ నిర్దాక్షిణ్యంగా వధించడం ఆస్ట్రేలియన్ ప్రజలకే కొద్దిపాటీ బాధను కలిగించింది. (!!!). అందువల్ల, చంపేటప్పుడు కంగారూలకు మరీ ఎక్కువ బాధ కలగకుండా చంపాలని శాసనాలు కూడా వెలువడ్డాయి. (!!!).
కంగారూలు మార్సూపియల్ అనే ఒక విలక్షణమైన జాతికి చెందిన జంతువులు. ఆ జాతికి చెందిన తల్లి జంతువులు తమ పిల్లలను తమ పొట్టలో ఉన్న సంచీలో వేసుకుని సంచరిస్తూ ఉంటాయి. అలా తమ తల్లి పొట్టలోని సంచీలో ఉండే పిల్ల కంగారూకు joey అని పేరు.
అయితే తల్లి కంగారూలను కాల్చి చంపేసిన తరువాత వాటి పొట్టలో ఉండే ఈ పిల్ల కంగారూలను ఏమి చేయాలి అని ఆస్ట్రేలియాలో వాదోపవాదాలు బయలుదేరాయి.
వాటిని వదిలివేయాలి, సంరక్షణ ఆలయాలలో పెంచాలి అని వాదించిన వారు కొందరు. వాటిని వదిలిపెట్టేస్తే అవి అనాథలై సరైన ఆహారం లభించక, భయంకరమైన ఆకలిచావులు చస్తాయి కాబట్టి, వాటిపట్ల దయ చూపి, వాటి తల్లిని చంపిన వెంటనే వాటిని కూడా కాల్చేయాలి అని వాదించిన దయార్ద్రహృదయులైన ఆస్ట్రేలియన్లు మరికొందరు.
చివరకు దయార్ద్రహృదయుల వాదమే నెగ్గింది. వారి మాట చట్టంగా మారింది. దాదాపు 2 దశాబ్దాల పాటు, ప్రతియేటా దాదాపు ఒక మిలియన్ పిల్లకంగారూలు "చట్టబద్ధంగా" చంపబడ్డాయి. ఆస్ట్రేలియాలో పిల్లా పెద్దా కంగారూల రక్తం ఏరులై పారింది.
సంవత్సరానికి ఎన్ని కంగారూలను చంపవచ్చునో ఇకాలజీ సైంటిస్టులు లెక్కలు వేసి మరీ చట్టానికి సహకరించారు. వేట సరదాగా ఉన్నవారిని కొన్ని కొన్ని ప్రాంతాలలో కంగారూల వేటకు అనుమతించి ఆస్ట్రేలియా ప్రభుత్వం మంచి ఆదాయాన్ని రాబట్టుకుంది. వీకెండ్ రోజులలో వాటి వేటను నిషేధించి, ప్రజా వ్యతిరేకతను కూడా ఎదుర్కొన్నది. కంగారూలను చంపడం ఎంత వరకు సమంజసం అని 2015లో ఆస్ట్రేలియా ప్రభుత్వం సర్వే నిర్వహిస్తే, చంపడం మంచిదే అంటూ 85% ఆస్ట్రేలియా ప్రజలు అనుకూలంగా మాట్లాడారు. విదేశీ బీఫ్‌ను తినకండి, స్వదేశీ కంగారూను తినండి అంటూ దేశభక్తి పొంగి పొర్లించారు.
కంగారూలు కూడా మనవంటి ప్రాణులే. వాటిని చంపడం అన్యాయం అని అక్కడక్కడ మాట్లాడిన వారిని ప్రజలందరూ వింత జంతువులను చూసినట్లు చూశారు. అలా మాట్లాడే వారందరూ చట్టానికి అవిధేయులే అని ప్రభుత్వం ప్రకటించవలసివచ్చింది.
అలా కేవలం గడ్డిని తిని బ్రతికే కంగారూలు మనుషుల స్వార్థానికి దారుణంగా బలైపోయాయి.
వాటి మాంసాన్ని ఆస్ట్రేలియా ప్రజలు ఎగబడి తిన్నారు. కుక్కల వంటి తమ పెంపుడు జంతువులకు ప్రేమతో తినిపించారు. అలా ఎంత తిన్నా 5% కంటె ఎక్కువ తినలేకపోయారు. 95% మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేసి మరింత ఆదాయాన్ని పొందారు.
అయితే క్రమంగా వింతవింత రోగాలు ఆస్ట్రేలియాలో ప్రబలిపోయాయి. సూపర్ మార్కెట్లలో ఉండే కంగారూల మాంసంలో బ్యాక్టీరియా చాలా అధికంగా ఉందని ఆరోపణలు వచ్చాయి. దాంతో నెమ్మదిగా కంగారూల వధ తగ్గుముఖం పట్టింది.
2017లో ఈ సంవత్సరానికి ఒక మిలియన్ కంగారూల కంటే ఎక్కువ కంగారూలను చంపరాదు అని ఆస్ట్రేలియా ప్రభుత్వం "దయతలచి" అనుగ్రహించింది.
ఆస్ట్రేలియాలో ప్రచండమైన బుష్‌ఫైర్ గత అయిదు నెలలుగా విజృంభించి అడవులన్నిటినీ బూడిద చేస్తున్న విషయం తెలిసిందేగా? వర్షాలు కురవకపోవడంతో, అడవుల్లో ఎండుగడ్డి ఎక్కువై మంటలు సుదూరప్రాంతాలకు కూడా వ్యాపిస్తున్నాయట. కంగారూలను విచక్షణా రహితంగా చంపకుంటే ఇంతగా ఎండుగడ్డి పెరిగేది కాదు, అంత బారుగా ఎదిగేది కాదు అని కొందరు ఇకాలజిస్టులు "ఇప్పుడు" అంటున్నారు.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు, అడవులు కాలాక ఇప్పుడు వారికి కంగారూలు ముద్దొస్తున్నాయి!!!
అదీ, తమ స్వదేశంలో కంగారూల దురవస్థ!
ఒంటెలు మాత్రం ఆస్ట్రేలియాలో మొదటినుండి లేవు. "ఆహార-అవసరాలకోసం, శ్రామిక-ఆవసరాలకోసం" దిగుమతి చేసుకొనబడ్డ జంతువులు.
1840-1907 మధ్యలో బ్రిటిష్ పాలకులు భారత్ నుండి దాదాపు 10000 నుండి 20000 వరకు ఒంటెలను తరలించారు. ఈ ఫొటో చూడండి. వాటి మూపురాలను చూస్తే అవి భారతదేశపు ఒంటెల సంతతి అని స్పష్టంగా తెలుస్తుంది. చైనా దేశపు ఒంటెలకు రెండు మూపురాలు ఉంటాయి.
2009లోనే ఈ ఒంటెలను కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వం చీడపురుగులుగా ప్రకటించింది. అప్పటి నుంచి కంగారూలను చంపినట్టే ఒంటెలను కూడా చంపుతూనే ఉన్నారు. జంతు ప్రేమికుల ఆందోళనలను మామూలుగానే ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఇప్పుడు ఆస్ట్రేలియా అడవులలో 8 లక్షల ఒంటెలు ఉన్నట్లు ఒక అంచనా.
ఇప్పుడు ఇవి నీటిని ఎక్కువగా తాగేస్తున్నాయని వీటి మీద ఆరోపణ వచ్చింది. అందువల్ల ఆస్ట్రేలియా చట్టం వాటికి మరణశిక్ష విధించింది. పదివేల ఒంటెలను చంపి పారేయమని క్రొత్తగా ఉత్తర్వులు ఇచ్చింది.
సింహాలు పులులు తోడేళ్లు అనకొండలు మొసళ్ళు ఇలాంటివి మాత్రమేనా క్రూరజంతువులు? మనుషులను కూడా ఆ జాబితాలో వెంటనే చేర్చాలి. లేదా వాటన్నిటినీ తీసేసి మనిషి మాత్రమే ఏకైకక్రూరజంతువుగా మిగిలిపోవడం చాలా సమంజసం.
No comments:
Post a Comment