Tuesday, 24 March 2020

సెల్ఫ్ ఐసోలేషన్‌లో బీర్బల్




అక్బర్ తన రవీజల్‌ వుజారా (ముఖ్యమంత్రి) అయిన బీర్బల్ మాటకు ఎంతో విలువనిచ్చేవాడు.  

బీర్బల్ తెలివితేటలు కేవలం అక్బర్ చెంత మాత్రమే కాక మొగల్ సామ్రాజ్యం అంతటా ప్రఖ్యాతి గాంచాయి.  పాదుషా తరువాత పాదుషా అంతటి వాడిగా ప్రజలందరూ అతడిని గుర్తించి గౌరవించారు.

అయితే ఇది అక్బర్ గారి వ్యక్తిగత హల్లాకు (మంగలి) అయిన రజాక్‌కు నచ్చలేదు. బీర్బల్ వచ్చిన తరువాత అక్బర్ తన లొల్లాయి సలహాలను అంతగా పట్టించుకోకపోవడమే అందుకు కారణం.  

ఇటువంటి కడుపుసంకటం కేవలం రజాక్‌కు మాత్రమే కాదు.  అక్బర్ మహ్‌కమా‌ (సభ) లోని వారందరికీ కూడా ఉండింది.  వారందరూ  అక్బర్‌ను ప్రతిరోజూ కలిసే రజాకుతో కలిసి బీర్బల్ పీడను ఎలా వదిలించుకోవాలో బాగా ఆలోచన చేసి ఒక పథకం వేశారు.

ఆ పథకం ప్రకారం, 
ఒకరోజు రజాక్ సభకు వచ్చి "ఆలంపనా, ఆలంపనా, నాకు రాత్రి ఒక ముఖ్యమైన కల వచ్చింది" అని పాదుషాకు అందరిముందూ విన్నవించుకున్నాడు.



"అవునా?  ఏమిటా కల?"

"ఆలంపనా!  గతరాత్రి మీ అబ్బాజాన్ గారైన హుమయూన్ నా కలలోకి వచ్చారు."

అక్బర్ సంతోషపడ్డాడు.  "శభాష్!  నీ రాజభక్తి మెచ్చదగింది" అన్నాడు.

"కానీ, ఆలంపనా" అంటూ రజాక్ నసిగాడు.

అతడి ముఖాన్ని చూసిన అక్బర్‌కు అనుమానం వేసి,  "ఏమైంది రజాక్? మా అబ్బాజాన్‌కు ఏమైనా సమస్య వచ్చిందా?" అని అడిగాడు.

"జీ, ఆలంపనా" అన్నాడు రజాక్.  
"జన్నత్‌లో మీ అబ్బాజాన్ దిగులుతో ఉన్నారు.  తమకు ఇక్కడ  బీర్బల్ ఉన్నట్లుగా జన్నత్‌లో తనకు ఎవరూ సరైన సలహాదారు లేడని చాల బాధగా ఉన్నారు.  అందువలన వెంటనే బీర్బల్‌ను తన చెంతకు పంపి, ఇక్కడ మీరు వేరొకరిని చూసుకొనవలసిందిగా తమకు చెప్పమన్నారు" అని చెప్పేశాడు .

సభ నిండా హాహాకారాలు చెలరేగాయి.  "యా ఖుదా!  పాదుషా గారి అబ్బాజాన్‌కు ఎంత కష్టం వచ్చింది!" అని అందరూ ముక్తకంఠంతో విచారం వ్యక్తం చేశారు.

పాదుషా తన అబ్బాజాన్ మాటను తప్పక గౌరవించాలని అందరూ ఒత్తిడి చేశారు.

అక్బర్ బీర్బల్ వైపు చూశాడు. 



బీర్బల్ ఠక్కున లేచి నిలబడ్డాడు.  "జహాపనా!  ఈ సభలో మరెవ్వరికీ కలుగని అపురూపమైన అదృష్టం నాకు కలగడం నాకు ఎంతో ఖుషీకీ బాత్.  నేను తప్పకుండా జన్నత్‌కు పోయి మీ అబ్బాజాన్‌కు సలహాదారుగా ఉంటాను.  అయితే నా కుటుంబానికి వీడ్కోలు చెప్పేందుకు గాను నాకు ఒక వారం రోజుల వ్యవధిని ఇవ్వవలసింది" అని కోరాడు.

అక్బర్ అందుకు అంగీకరించాడు.  బీర్బల్ కుటుంబం యావజ్జీవితం సుఖంగా ఉండేందుకు తగినన్ని ధన కనక వస్తు వాహనాలను ముందుగానే ఇచ్చేశాడు.

ఈ వారం రోజులలో బీర్బల్ తన ఇంటి నుంచి పాదుషా తోటలోనికి రహస్యంగా ఒక భూసొరంగం తవ్వించాడు.  

వారం రోజుల తర్వాత తిరిగి వచ్చి, తోటలో ఒక స్థలాన్ని చూపి, "జహాపనా, మీ అబ్బాజాన్‌గారు నాకు కలలో కనబడి, ఇక్కడ నన్ను సజీవంగా పూడ్చిపెట్టమన్నారు.  అలా చేస్తే నేను నేరుగా జన్నత్‌కు చేరుకుంటానట" అని చెప్పాడు.

అక్బర్ అలాగే ఆ ప్రాంతంలో గొయ్యి తవ్వించి అందులో బీర్బల్‌ను దింపించాడు.  దాని పైన పలకలు వేసి అందమైన సమాధిని కట్టించేశాడు.

బీర్బల్ సొరంగం గుండా హాయిగా తన ఇంటికి చేరుకున్నాడు.  ఆరు నెలలు మరీ హాయిగా కడుపులో చల్ల కదలకుండా సెల్ఫ్ ఐసోలేషన్‌లో కాలం గడిపాడు.

తరువాత ఒక శుభముహూర్తాన అక్బర్ తన దర్బారులో ఉండగా విచ్చేశాడు.  ఇంత బారున జులపాలు, గడ్డం పెరిగి ఉన్న బీర్బల్‌ను ఎవరూ వెంటనే గుర్తుపట్టలేకపోయారు.

బీర్బల్ తనను తాను పరిచయం చేసుకునేసరికి గుర్తించిన అక్బర్ ఎంతో ఆనందపడ్డాడు.  

మిగిలిన వాళ్ళు ఆశ్చర్యపోయారు.   కుట్రదారులు భయపడ్డారు. 

బీర్బల్ సభలోని వారందరికీ జన్నత్ లోని అనేక విషయాలను కథలుకథలుగా చెప్పాడు.  బీర్బల్ జన్నత్‌కు వెళ్లి తిరిగి వచ్చాడు అనే విషయం అందరికీ ఖచ్చితంగా తెలిసిపోయింది.  

"బీర్బల్! ముందుగా ఈ విషయం చెప్పు - మా అబ్బాజాన్ గారు కులాసాగా ఉన్నారా?" అని పాదుషా అడిగాడు. 

"అంతా బాగానే ఉంది కానీ జహాపనా" అని బీర్బల్ నసుగుతూ రజాక్ వైపు ఒక చూపు చూశాడు.

ఆ చూపులో ఏం కనిపించిందో ఏమో గాని, రజాక్ నిలువెల్లా గజ గజ వణికి పోయాడు.




"చెప్పు బీర్బల్! అక్కడ మా అబ్బాజాన్ గారికి ఏదైనా ఇబ్బందిగా ఉన్నదా?"

"అవును జహాపనా!" అన్నాడు బీర్బల్, మునివేళ్ళతో తన గడ్డం నిమురుకుంటూ.  

"అదేమి జన్నతో గాని జహాపనా, అక్కడ  ఒక్క హల్లాకు (మంగలి) కూడా లేడు.  నేను కేవలం ఆరు నెలలు మాత్రమే జన్నతులో ఉన్నానా?  అయినా నా గడ్డం చూడండి, ఎంతగా పెరిగిపోయిందో!   అటువంటిది, ఇప్పటికే సంవత్సరాల తరబడి అబ్బాజాన్ గారు జన్నత్‌లో ఉంటూ ఎంతగా ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకొని, మీ వ్యక్తిగత హల్లాకు అయిన రజాక్‌ను వెంటనే తన చెంతకు పంపమని మీకు చెప్పవలసిందిగా నాకు హుకం జారీ చేశారు" అని తాపీగా చెప్పాడు.

☠💀☠💀☠💀

ఆ తరువాత ఏమి జరిగిందో చదువరులే తమ తమ ఊహానుగుణంగా తెలుసుకొనగలరు.

🍎నీతి🍎
ఎంత కాలము సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉన్నచో మనకు అంతగా బుద్ధిసూక్ష్మత పెరుగును.  కావున, సెల్ఫ్ ఐసొలేషన్ కాలమును దిగులు చెందక, సంతోషంగా, హాయిగా గడుపుదుము గాక!

1 comment:

  1. సందర్భానికి తగిన ఉత్తమ కథ.. 🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...