"ఈ భూమి ఎవరిది? ఈ నేల ఎవరిది?"
"ఇంకెవరిది? మనదే!"
"కాదు! ఈ భూమి పక్షులది. జంతువులది. మనుషులది. సకలచరాచరప్రాణులన్నిటికీ ఈ భూమి మీద, ఈ నేల మీద అధికారం ఉంది!"
"ఏమిటా ఆవేశం? ఈ భూమి మనది కాదంటున్నావేమోనని హడలి చచ్చాను. నిజమే! 'మనది' అంటే మన అందరిదీనూ! మనం కూడా సకలచరాచరప్రాణులన్నిటిలోనూ భాగమే కదా?"
"మనుషులు దేశాల మధ్యన గీసే సరిహద్దులు కృత్రిమమైనవి."
"అవును! అవి సర్వే మ్యాపులలోనూ, అట్లాసు మ్యాపులలోనూ మాత్రమే కనిపిస్తాయి!"
"ఆ విధంగా కృత్రిమంగా సరిహద్దులు గీసి, ఆ ప్రాణుల సంచారాన్ని అడ్డుకొనలేము."
"నిజమే! సరిహద్దులు కేవలం పేపర్లమీద ఉన్నంతవరకు కృత్రిమమైనవే. కాని, ఆ సరిహద్దుల పొడుగునా కంచెలు గోడలు కట్టడం సాధ్యం కాదు. అందువల్ల సంచారాన్ని అడ్డుకొనడం, పరిమితం చేయడం సాధ్యం కాదు."
"నా మాటలను సమర్థిస్తున్నావా, వ్యతిరేకిస్తున్నావా?"
"అనుమానమెందుకు? నువ్వు తానా అంటే నేను తందానా అంటున్నాను కదా?"
"కానీ, వెక్కిరిస్తున్నావేమోనని అనుమానం వస్తోంది."
"నాక్కూడా మరో అనుమానం వస్తోంది."
"ఏమిటది?"
"మనం ఇప్పుడనుకున్న ఆదర్శాలు చాల గొప్పవే గాని, ఆ మాటలన్నీ ఆచరణసాధ్యమేనా అని!"
"ఎందువల్ల ఆచరణసాధ్యం కావు?"
"Charity begins at Home అంటారు కదా?"
"అయితే?"
"నువ్వేమో సకలచరాచరప్రాణులూ సమానమే అంటావు!"
"అవును! కావాలంటే మా ఇంటికి వచ్చి చూడు. మా ఇంట్లో ఆవులు ఉన్నాయి. మేకలు ఉన్నాయి. కోళ్లు, కుక్కలు ఉన్నాయి."
"మీ ఇంట్లో నువ్వు ఉన్నావు. మీ కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. కదా?"
"అవును! అయితే ఏమిటి?"
"అవన్నీ కూడా నీలాగా మీ కుటుంబసభ్యులలాగా ఇల్లంతా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయా?"
"అదెలా తిరుగుతాయి? మనం మనుషులము, అవి పశువులు కదా?"
"ఇప్పుడే కదా, సకలచరాచరప్రాణులు సమానమే అని గంతులు గంతులు వేశావ్?"
"అంటే నా ఉద్దేశం అన్నింటికీ సమానంగా బ్రతికే హక్కు ఉన్నదని!"
"మరి, సరిహద్దులు ఉండరాదు, సరిహద్దులు ఉండరాదు అంటూ కలవరించింది కూడా నువ్వే కదా? కాని, మీ ఇంటిలో ఉండే పశువుల సంచారానికి కనబడని కృత్రిమమైన సరిహద్దులు పరిమితులు నువ్వు సృష్టించినవే కదా?"
"ఇంటిలో సంచారానికి పరిమితులు ఉన్నప్పటికీ, అవి మా ఇంటిలో ఆనందంగానే జీవిస్తున్నాయి కదా?"
"మీ ఇంటికి ప్రత్యేకమైన అతిథులు వచ్చినప్పుడు, వారికి నువ్వు విందులు వినోదాలు చేసేటప్పుడు కూడా ఆ కోళ్లు మేకలు క్షేమంగా ఆనందంగా జీవిస్తూ ఉంటాయా మరి?"
"ఎంతెంత లోపలకు పోయి శల్యపరీక్షలు చేస్తున్నావన్నా!"
"సకలచరాచరప్రాణులు సమానమే అని నువ్వు అన్నప్పుడు ఆ మాటను పాటించి చూపించాలి కదా? నేను మాత్రం పాటించను, కానీ, ఎట్టి పరిస్థితులలో అయినా మిగిలిన వారందరూ తప్పక పాటించవలసిందే అంటే ఎలా?"
"ఎంతైనా అవి పశువులు, మనం మనుషులం కదాన్నా?"
"అంటే పశువులు-పశువులు సమానం, మనుషులు-మనుషులు సమానం, ఆ పశువులెన్నటికీ మనుషులతో సమానం కాదు - అంటావు! అంతేనా?"
"అంతేన్నా!"
"పశువులు-పశువులు సమానం అయితే, నువ్వు ఆవులు మేకలు కోళ్లను మాత్రమే ఎందుకు పెంచుకుంటున్నావు? ఓ పెద్దపులిని కూడా తెచ్చుకొని ఇంట్లో పెంచుకోవచ్చు కదా?"
"భలే మాట్లాడతావ్ అన్నా! అదెలా సాధ్యం? అవి క్రూరజంతువులు, నేను పెంచుకునేవి సాధుజంతువులు!"
"ఇప్పుడే పశువులు-పశువులు సమానం అని చెప్పావ్! ఆ మాట తప్పని అంటున్నావా?"
"అన్నా, నువ్వు వితండవాదం చేస్తున్నావ్!"
"అవునా? అసలు వితండవాదం అంటే ఏమిటి? దాని స్వరూపస్వభావాలు ఏమిటో చెప్పు?"
"అన్నా నువ్వు సంస్కృతం మాట్లాడుతున్నావ్! ఆ భాష నాకు రాదు."
"పశువులు-పశువులు సమానం కాదు అని తేల్చేశావ్. ఇప్పుడు భాష-భాష కూడా సమానం కాదని చెప్పబోతున్నావా?"
"మరి, మన ఇంటిలో ఉండే ప్రాణులు, ఎక్కడో అడవిలో ఉండే ప్రాణులు సమానమే అని ఎలా అనుకోమంటావ్ నా?"
"పోనీ మన ఇంటిలో ఉండే ప్రాణులన్నీ సమానమే అని మనం అనుకోవచ్చా?"
"సరే అలాగే అనుకుందాం."
"మన ఇంట్లో ఏదో ఒక మూల ఒక తేలు కనిపిస్తుంది. ఒక జెర్రి కనిపిస్తుంది. వాటిని కూడా మీ ఇంటిలో కోళ్లతో మేకలతో సమానంగా పెంచుకుంటావా?"
"అదెట్లా పెంచుకుంటాం అన్నా? కనిపించిన వెంటనే వాటిని కొట్టేసి, ఆ కోళ్లకు మేతగా వేస్తాం కదా?"
"మరి ఇంటిలో ఉండే ప్రాణులన్నీ సమానమే అని చెప్పావు కదా? ఆ తేలు ఆ జెర్రి ఇంటిలో పుట్టిన ప్రాణులే కదా?"
"ఇంటిలో పుట్టినప్పటికీ, అవి విషప్పురుగులు. మనకు హాని చేస్తాయి కదా అన్నా?"
"ఇంటిలో ఎలుక తిరుగుతూ ఉండటం చూస్తాము. అది విషప్పురుగు కాదు. ఇది మనను కరిచేది కాదు. అయినప్పటికీ దానిని మన పిల్లికి ఆహారంగా చేయాలని చూస్తాము. మరి అలా చేయడం న్యాయమేనా?"
"అన్యాయమన్నా! ఏమిటీ న్యాయమీమాంస?"
"పోనీ ఇదైనా చెప్పు. ఇంట్లో ఎలుకలు ఉండటం నీకు ఇష్టం లేదు. ఆ ఎలుకలను తినడానికి ఒక పాము నీ ఇంట్లోకి వస్తుంది. ఇది ఆ ఎలుకలను తిని మనకు సహాయం చేస్తుంది అని సంతోషపడకుండా, నువ్వు ఆ పామును కూడా చంపడానికి ప్రయత్నిస్తావు. న్యాయమే అంటావా?"
"న్యాయమే అన్నా! అది ఎలుకలను తినడానికి మాత్రమే వచ్చినప్పటికీ, ఏదైనా పొరపాటు జరిగితే, మనుషులను కూడా కాటు వేస్తుంది. అందువల్ల దానిని చంపడం న్యాయమే."
"అవునా? ఒక పక్క నువ్వేమో సరిహద్దులు ఉండరాదు, కంచెలు ఉండరాదు, గోడలు ఉండరాదు అంటావు. మరి సాయంత్రమైతే చాలు, ఇంటిలోని ద్వారాలకు, కిటికీలకు ఇనుపతెరలు వేస్తావు. ఎందుకని?"
"దోమలు ఇంట్లోకి రాకుండా! అవి ఇంట్లోకి వస్తే రాత్రంతా నరకమే!"
"ఎలాగూ ఇంట్లో ఆలౌట్ వెలిగిస్తావు కదా? వాటిని లోనికి రానిస్తే నష్టమేమిటి?"
"ఇదేం తిక్క ప్రశ్న అన్నా?"
"😆😂🤣 సరే. తిక్క ప్రశ్నేలే. తమ్ముడికి సగం తిక్క ఉంటే, పెద్దోడైన అన్నకు కనీసం దానికి రెట్టింపు తిక్క ఉండొద్దా? మరి దీనికి కూడా సమాధానం చెప్పు. ఇంట్లో సాలెపురుగులు గూళ్లు కడతాయి కదా? అవి మనకు నరకం చూపించే దోమలను పట్టి మనకు సహాయం కూడా చేస్తాయి కదా? అవి మనలను కాటువేసేంత విషప్పురుగులు కూడా కాదు కదా? ఆ విధంగా మనకు ఉపకారం చేసే సాలెపురుగుల గూళ్ళను మనం వారం వారం చీపురుకట్టతో ఎందుకు తీసి పడేస్తాం?"
"అన్నా, ఏందన్నా ఈ ప్రశ్నలు? మన ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకోవాల్నా వద్దా?"
"మన ఇల్లు అనేది ఒకటుంటుందా తమ్ముడూ?
కంచెలు గోడలు
మనకడ్డంకా?
తీసి పడేద్దాం,
తోసి పడేద్దాం!
అని నువ్వు పాటలు పాడుతూ ఉంటే, ఏదో సందేహం వచ్చి అడిగాను. అంతే!"
"సరే అన్నా. నీ ప్రశ్నలు అయిపోయినట్టేనా? ఇంకా ఉన్నాయా?"
"అడుగుతున్నాను కదా? మన ఇంటిలో మనకు అపకారం చేసేవి ఏవీ ఉండరాదు అని నువ్వు సిద్ధాంతం చేసినట్టేనా?"
"అవున్నా! మన ఇంటిలో మనకు అపకారం చేసేవి ఏవీ ఉండడానికి వీల్లేదు. అంతే!"
"మరి వీధుల్లో దోమల పొగ వెదజల్లకపోతే ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శిస్తావు? వీధి మన ఇల్లు కాదు కదా?"
"మన ఇల్లు కాకపోయినప్పటికీ 'మన వీధి' కదా? అందువల్ల విమర్శిస్తాను."
"మన వీధిలో కాకుండా నగరంలో ఎక్కడో దొంగతనం జరుగుతుంది. అయినప్పటికీ మనం పోలీసుల చేతగానితనాన్ని నిందిస్తాము. మరి, అది మన ఇల్లు కాదు, మన వీధి కూడా కాదు కదా?"
"మన ఇల్లు కాకపోవచ్చు, మన వీధి కాకపోవచ్చు, అయినప్పటికీ అది మన నగరమే కదా?"
"దేశంలో ఎక్కడో ఒక పెద్ద బాంబు పేలుతుంది. అమాయికులైన జనాలు ఒక్క క్షణంలో పీనుగులు అయిపోతారు. అది జరిగింది మన ఇంట్లో కాదు. మన వీధిలో కాదు. మన నగరంలో కూడా కాదు. అయినప్పటికీ, అది ప్రభుత్వవైఫల్యమే అంటూ మనం నిందిస్తాము. ఎందువల్ల?"
"ఆ సంఘటన మన ఇంటిలో జరగకపోవచ్చు, మన వీధిలో జరగకపోవచ్చు, మన నగరంలో కూడా జరగకపోవచ్చు, అయినప్పటికీ అది జరిగింది మన దేశంలోనే కదా? ఈరోజు జరిగిన దుర్ఘటనకు ప్రభుత్వ వైఫల్యం అని మనం ఎత్తిచూపకపోతే, ప్రభుత్వం అది తన తప్పు కాదు అని భావించి నిష్క్రియంగా ఉండిపోతుంది. అటువంటి దుర్ఘటనలు మరోసారి జరగకుండా ఎటువంటి ప్రయత్నమూ చేయదు. అందువల్ల ప్రభుత్వాన్ని నిలదీస్తాం గాని, ఊరికినే నిందించడం నాకేమైనా సరదానా? ఎక్కడో దుర్ఘటన జరిగితే నాకెందుకు అని మనం ఊరుకుంటే ఈరోజు మరో నగరంలో జరిగిన దుర్ఘటన, మరొకప్పుడు మన నగరంలోనే జరిగే అవకాశం ఉంది. పోలీసులను విమర్శించకపోతే మరో వీధిలో జరిగిన దొంగతనం మా వీధిలోనే జరిగే అవకాశం ఉన్నది. తరువాత ఆ దొంగ మరొక రోజు నా ఇంటి తలుపు తట్టకుండానే, నా అనుమతి లేకుండానే నా ఇంట్లో ప్రవేశించే అవకాశం కూడా ఉంటుంది."
"కాబట్టి, మనం విమర్శలు గాని, నిందలు గాని ఎందుకు చేస్తాం? పోలీసులలోనూ ప్రభుత్వాలలోనూ చలనం కలిగించేందుకు చేస్తాం. అవునా?
"అంతే కదా మరి?"
"దొంగతనాలను, నేరాలను అరికట్టాలంటే పోలీసుల చెంత ఆయుధాలు ఉండాలి. ఒప్పుకుంటావా ఒప్పుకోవా?"
"ఒప్పుకుంటాను."
"మరి ఆ పోలీసుల దగ్గర ఆయుధాలు ఉంటే మనల్ని గాని, మన ఇంట్లోవాళ్లని గాని మన మిత్రులని గాని కాల్చి పడేస్తారేమో అని భయం వేయడం లేదా?"
"భయమెందుకు? వారు మనల్ని ఎందుకు కాలుస్తారు? మనమేమైనా దొంగలమా, నేరగాళ్లమా?"
"అద్భుతంగా చెప్పావు. నేరాలు జరగకుండా ఆపాలంటే పోలీసులకు ఆయుధాలు ఎంతగా అవసరమో, దేశంలో ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా చూసేందుకు గాను ప్రభుత్వానికి కూడా చట్టాలు అంతగా అవసరం. ఒప్పుకుంటావా లేదా?"
"అన్నా నన్ను ట్రాప్ లో పడేస్తున్నావు."
"😃 నువ్వు సరిహద్దులు మిథ్య అంటున్నావు. నేను నిన్ను ట్రాప్ చేయడం మిథ్య అని నేనంటున్నాను."
"అన్నా, గందరగోళంలో పడేస్తున్నావు."
"స్పష్టత ఉంటే గందరగోళమెందుకు? మొదట సకల చరాచర ప్రాణులు సమానమే అన్నావు. తరువాత అలా కాదు, అలా కాదు, మనుషులు వేరు పశువులు వేరు అన్నావు. ఆ తరువాత పశువులు-పశువులు సమానం, మనుషులు-మనుషులు సమానం, పశువులు-మనుషులు వేరు అన్నావు. ఆ తరువాత అలా కాదు అలా కాదు, పశువులు-పశువులు కూడా సమానం కాదు, అవి కూడా వేరే వేరే అన్నావు. నీకు ఏది సౌకర్యంగా ఉంటే అది సరైనది, ఏది సౌకర్యంగా లేకుంటే అది చెడ్డది అంటున్నావు. ఇంకా మనుషులు-మనుషులు కూడా సమానమే అనే మాట మిగిలిపోయింది. అది కూడా నిజం కాకపోవచ్చు అని నీకు ఇప్పుడే అనుమానం కలిగింది. అందువల్లనే గందరగోళమనుకుంటున్నావు!"
"అయితే మనుషులు మనుషులు సమానం కాదంటావా అన్నా?"
"నా మాటకు విపరీతార్థాలు తీయకపోతే, అవును, మనం ఎన్ని ఆదర్శాలు వల్లించినప్పటికీ, మనుషులు-మనుషులు సమానం కాలేకపోతున్నారు అనే నేను అంటాను. మన మిత్రులతో మనం ఉన్నంత చనువుగా సమాజంలో అందరితోనూ ఉండగలమా? అంతటి చనువు తీసుకుందాము అని మనం భావించినప్పటికీ, వివిధ కారణాల వల్ల అది సాధ్యం కాదు. మనం మన పిల్లల పట్ల వహించినంత శ్రద్ధను ప్రపంచంలోని పిల్లలందరి పట్ల వహించగలమా? అందరి పట్ల శ్రద్ధ చూపడం న్యాయం అని మనకు తెలిసినప్పటికీ, అది మనకు సాధ్యం కాదు. మన కుటుంబాన్ని పోషించుకొనడం మన బాధ్యతగా భావిస్తాము. దేశంలోని అనాథలందరినీ పోషించడం నా కర్తవ్యం అని భావించగలమా? భావించినప్పటికీ, ఆ విధంగా అందరినీ పోషించేంతటి శక్తి మనకు ఉంటుందా? ఇలా ఎన్ని ఉదాహరణలు చెప్పాలి?
అందువల్ల, ఆదర్శాలు మహోన్నతంగా ఉండవలసిందే కాని, మనకే స్వయంగా ఆచరణాత్మకంగా సాధ్యం కానప్పుడు, వేరొకరు ఆచరించాలని కోరడం న్యాయం కాదు."
"సరేనా."
"నీకు ఇష్టం లేకున్నా నేను బలవంతంగా ఒప్పిస్తున్నానని నువు భావించినప్పటికీ, నిష్ఠురసత్యం మాత్రం ఇదే!"
"అలాగే కానివ్వండన్నా. Charity begins at Home అంటే ఇదేనా?"
"😊"
No comments:
Post a Comment