Monday, 23 July 2018

రసికుడు - నీరసికుడు

“హనుమంతుడు రసికుడు” అన్నారు మిత్రుడు ఒకాయన తన ఫేస్ బుక్ గోడపై.

కొందరు మెచ్చుకున్నారు – కొందరు నొచ్చుకున్నారు – ఆ మిత్రుని మాటల్లో చెప్పాలంటే – కొందరు తిట్టిపోశారు.

వారి వారి ప్రతిస్పందనలు వారు “రసిక” అనే పదాన్ని అర్థం చేసుకున్న పద్ధతిని బట్టి ఉన్నాయి. 


“రసికుడు” అనే పదం తప్పుడు పదం ఏమీ కాదు. రసాస్వాదన చేయగలిగినవాడు అని అర్థం. కాని, తెలుగు సినిమాలు చాలా పదాలను దుర్వినియోగం చేసినట్టుగానే “రసికుడు” అనే పదాన్ని కూడా దుర్వినియోగం చేశాయి. శృంగారలోలుడు అనే అర్థాన్ని ప్రేక్షకుల మెదళ్లలో కూరి కూరి వదిలాయి.

శృంగారంలో మాత్రం తప్పు ఏముంది? 
నవరసాలను పేర్కొనే శ్లోకంలో శృంగారానికే మొదటి స్థానం ఇచ్చారు.

శృంగారహాస్యకరుణరౌద్రవీరభయానకాః.
బీభత్సాద్భుతశాంతాశ్చ నవ నాట్యే రసాః స్మృతాః. – అన్నారు.

మహాకావ్యాలలో అంగిరసాలుగా ఉండదగినవి - శృంగారము లేదా వీరము. మిగిలినవి అంగరసాలు మాత్రమే అనేశారు పెద్ద పెద్ద సాహిత్యశాస్త్రవేత్తలు కూడా. కాబట్టి, శృంగారపురుషుడై ఉండటం తప్పేమీ కాదు.

కాని, అదే సాహిత్యశాస్త్రవేత్తలు రసాభాసలను కూడా పేర్కొన్నారు. అంటే అవి రసం లాగా అనిపిస్తాయేమో కాని, నిజానికి రసాలు కావు అని అర్థం. 

వీరరసం ప్రధానమైనదే – కాని పడకగదిలో కూర్చుని “ఆ శత్రువును ఇలా ఎదుర్కోవాలి, ఈ శత్రువును ఇలా దునుమాడాలి” అని వీరాలాపాలు చేస్తే అది రసాభాస. 

అలాగే శృంగారరసం కూడా ప్రధానమైనదే – కాని, యుద్ధరంగంలో విజృంభించవలసిన వేళ ప్రియురాలి చెంతకు చేరి సరససల్లాపాలు ఆడాలనిపిస్తే మాత్రం అది రసాభాస.

శత్రువును పరాభవిస్తే – అది వీరరసం. కాని, గౌరవింపదగిన పెద్దలను పరాభవిస్తే అక్కడ వీరరసాభాస మాత్రమే. అక్కడ ఆ పని చేసినవాడిమీద జుగుప్స కలుగుతుంది. అంటే అది బీభత్సరసం ఔతుంది.

సీతారాముల మధ్యనో రాధాకృష్ణుల మధ్యనో ఉన్న అనురాగాన్ని వర్ణిస్తే అది శృంగారరసం అవుతుంది. ఆ శృంగారం కూడా రెండు రకాలు. విప్రలంభశృంగారం అని, సంయోగశృంగారం అని. ఎడబాటులో ఉన్నపుడు – విప్రలంభం, పరస్పరసముఖత ఉన్నపుడు సంయోగం అన్నమాట. 

భవభూతి వ్రాసిన ఉత్తరరామచరితంలో సీతారాముల నడుమ విప్రలంభశృంగారం దేదీప్యమానమైనది.

సంయోగశృంగారవర్ణనలు కలిగిన కావ్యాలకు కూడా కొదవ లేదు. 

ఇట్లా కేవలం శృంగారాన్ని మాత్రమే కాదు, నవరసాలను చక్కగా పండించిన కావ్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. 

రసాభాస కాకుండా వాటిని సర్వజనమనోరంజకంగా నడిపిన కవులను భర్తృహరి ప్రశంసించాడు కూడా.

“జయంతి తే సుకృతినో
రససిద్ధాః కవీశ్వరాః,
నాస్తి యేషాం యశఃకాయే
జరామరణజంభయమ్” - అన్నాడు. 

ఈ నవరసాలన్నీ యథాయోగ్యంగా భారతీయులచేత ఆదరింపబడ్డాయి. కాబట్టి, భారతీయులు రసహృదయులే (రసికులే) కాని నీరసహృదయులు కారు. అందులో సందేహం అక్కరలేదు, అసహ్యించుకొనదగినది కూడా ఏమీ లేదు.

కాని, 
రసికత్వం ఉండవలసింది కేవలం కవులలోనే కాదు, చదివే పాఠకులలో కూడా ఉండాలి. అప్పుడే ఆ కవిత్వానికి రాణింపు. అప్పుడే ఆ కవిత్వానికి మెప్పుకోలు. 

“ఓ చతురాననుడా! మిగిలిన కష్టాలను వందలకు వందలుగా, యథేష్టంగా, మా నుదుటన వ్రాసుకో, సహిస్తాము. కాని, సమయసంగతిసందర్భాలను పట్టించుకోకుండా మా కవిత్వాన్ని అపార్థం చేసుకొనేవారికి, లేదా ఏమాత్రం అర్థం చేసుకోలేని నీరసహృదయులకు మా కవిత్వాన్ని వినిపించే దౌర్భాగ్యం మాత్రం మా నుదుటన వ్రాయబోకయ్యా" – అని కవులు బ్రహ్మను పరిపరివిధాల వేడుకున్నారట.

"ఇతరతాపశతాని యదృచ్ఛయా విలిఖ
తాని సహే చతురానన.
అరసికేషు కవిత్వనివేదనం శిరసి
మా లిఖ మా లిఖ మా లిఖ."

ఇలా ఎందుకు వేడుకొనడం అంటే – 
ఈ నీరసహృదయులు చక్కని కవిత్వానికి కూడా వంకలు పెడతారు. అపహాస్యం చేస్తారు. విపరీతార్థాలను కల్పిస్తారు. అలా చేసి, ఆయా కవుల పట్ల, కవిత్వం పట్ల విముఖత్వం కలిగించినా పరవాలేదు. 

కాని, 
ఈ అరసికులు ఆయా కావ్యాలలో ఉన్నతాదర్శాలకు ప్రతీకగా తాము నిలిపిన పాత్రల పట్ల కూడా వైముఖ్యం కలిగిస్తారు. అందుకని.

భారతీయకావ్యశాస్త్రసంప్రదాయంలో అందరి చేత ఎంతగానో గౌరవింపబడే అభినవగుప్తాచార్యులు అని ఒకానొక మహాపండితుడు (క్రీస్తుశకం 950 సం.) ఉన్నారు. ఆయన సహృదయుడు అనే పదం వాడారు. సహృదయుడు అంటే కవితో సమానమైన హృదయం కలిగినవాడు – అంటే – కవి హృదయాన్ని అర్థం చేసుకొనగలిగిన వాడు అని అర్థం. అతడే రసికుడు. అంటే - కవిహృదయాన్ని అర్థం చేసుకొనలేని వాడు నీరసికుడు అన్నమాట!

"సీతను వెదుకుతూ రావణుని అంతఃపురానికి వెళ్లిన హనుమంతుడు అక్కడ నిద్రావస్థలో ఉన్నటువంటి, చెదిరిన వస్త్రాభరణాలతో ఉన్నటువంటి యువతులను చూశాడు" అన్నంతవరకు ఏ ఇబ్బంది లేదు. అందులో అసహజం అయినది ఏమీ లేదు. 

కాని, 
అక్కడ హనుమంతుని కూడా అతి సామాన్యుడైన ఒక చంచలహృదయునిగా భావించి “ఆహా! ఎంతటి లక్కీ ఫెలో రా!” “ఆహా ఎంతటి రసికుడురా!” అని పాఠకులు కామెంట్లు చేస్తే మాత్రం నిస్సందేహంగా అది వారి నీరసికత్వమే.

ఆ సమయంలో రాముని కార్యం పూర్తి చేయాలి అనే సుస్థిరమైన ధ్యేయం తప్ప మరేమీ హనుమంతుని మనసులో లేదు. 

సీతకోసం బయలుదేరిన హనుమంతునికి దారిలో మైనాకుడు ఎదురై విశ్రాంతి తీసుకోమన్నాడు. హనుమంతుడు నిరాకరించాడు. నాగమాత సరమ తన నోటిలోనికి ప్రవేశించకుండా హనుమంతుడు ముందుకు పోలేడని సవాలు చేసింది. హనుమంతుడు చాకచక్యంగా ఆమె నోటిలోనికి ప్రవేశించి కూడా సురక్షితంగా బయటకు వచ్చాడు. తనను ఆహారంగా చేసుకోదలచిన సింహికను భుజబలంతో నిర్జించాడు. లంకిణిని ఒక్క పిడికిటిపోటుతో పడగొట్టాడు. లంకలో ఎవరి కంటనైనా పడితే పని చెడిపోతుందని భావించి అంగుష్ఠమాత్రుడై సంచరిస్తూ సీతను వెదుకుతున్నాడు. అదే ప్రయత్నంలో రావణుని అంతఃపురంలో కూడా వెదికాడు. అక్కడ పైన చెప్పినట్లు వివిధ అవస్థలలో నిద్రిస్తున్న స్త్రీలను చూశాడు. అయినా అతని మనస్సులో ఎటువంటి వికారమూ కలుగలేదు. వీరెవరూ సీత కాదు అని నిశ్చయించుకుని తన అన్వేషణను కొనసాగించాడు. ఇన్ని పనులు చేస్తూ కూడా అతడు తన అలసటను, ఆకలిదప్పులను ఏమాత్రం లెక్కచేయలేదు. 

ఇంతవరకు, ఈ విధంగా హనుమంతుని కార్యసాధకత్వాన్ని పాఠకుల మనసులో ముద్రవేయడానికి వాల్మీకిమహర్షి సుందరకాండలో 11 సర్గలను, 621 శ్లోకాలను వెచ్చించి, గొప్ప ప్రయత్నం చేశాడు.

కాని, ఆ మహాకవి ప్రయత్నాలకు చెదగొడుతూ, ఆ ప్రయత్నాలను చెడగొడుతూ, ఆయన ఉద్దేశ్యానికి వ్యతిరేకంగా “రావణాంతఃపురంలో ఆ విధంగా ఉన్న స్త్రీలను చూసిన హనుమంతుడు రసికుడే (శృంగారపురుషుడే) సుమా” అని వ్యాఖ్యానిస్తే మాత్రం వెగటు పుడుతుంది. 

మహోన్నతమైన హనుమంతుని వ్యక్తిత్వాన్ని విస్మరించి, అతనికి లేని దోషాన్ని ఆపాదించడంవల్ల హాస్యరసం పుట్టదు. జుగుప్స అనేది స్థాయిభావంగా కలిగిన బీభత్సరసం పుడుతుంది.

ఆహా, అలాగేం కాదు, కవి హృదయాన్ని నేను అర్థం చేసుకున్నాను, అక్కడ ప్రతిపాదింపబడింది శృంగారరసమే తప్ప వీరరసం కాదు అని దబాయించే అవకాశం కూడా ఉంది. 

కాని, ఏ రసాన్నైనా వ్యక్తపరిచే కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటిని అనుభావాలు అంటారు. “అనుభావో వికారస్తు భావసంసూచనాత్మకః” – అని దశరూపకం అనే గ్రంథంలో ధనంజయాచార్యులు (క్రీస్తుశకం 975 సం.) చెప్పారు. 

తాత్కాలికమైన నిశ్చేష్టత, తాను ఉన్న పరిసరాలను విస్మరించడం, పులకింతలు, స్వేదం, ముఖకవళికలలో మార్పు, దొంగచూపులు, మాటల్లో తడబాటు – ఇటువంటివి అన్నమాట. 

సుందరకాండలో ఆ స్త్రీలను చూసిన హనుమంతుడిలో ఇటువంటి వికారభావాలు ఏమీ కలుగలేదు. అలాగే, శృంగారరసాన్ని సూచించే కొన్ని సంచారి భావాలు – హర్షము, ఈర్ష్య, మోహము – వంటివి కూడా హనుమంతునిలో ఈషణ్మాత్రం కలుగలేదు. అందువల్ల అక్కడ హనుమంతుడు శృంగారపురుషుడు అని చెప్పడం సమంజసం కాదు. 

వీరిలో సీత లేదు అని నిశ్చయించుకుని, మరెక్కడ ఉందో వెతకాలి అని భావిస్తూ తక్షణమే అక్కడనుండి వెడలిపోయాడు. కాబట్టి, ఇక్కడ కూడా హనుమంతుని కార్యసాధకత్వమే – ఎటువంటి ఆటంకాలకూ లొంగని ఉత్సాహమే – కవి చేత ప్రతిపాదించబడింది. అదే వీరరసం. 

ఇలా కవిహృదయాన్ని అర్థం చేసుకోకుండా, మాకు తెలిసిందే రసం అంటే - మా ఇంట్లో, కిటికీలు మూసిన గదిలో వెలుతురు లేకపోవడానికి కారణం ఆ సూర్యుడే అని నిందించినట్లు ఉంటుంది.

అందుకే ఇలాంటివారికి కవిత్వం వినిపించే దౌర్భాగ్యం మా నుదుటన వ్రాయకు దేవుడోయ్ అని ఆ కవులు మొత్తుకున్నది.

మనకుడబ్బు అవసరమే, అలాగే చెప్పులు కూడా అవసరమే. కాని, దేనిని ఎక్కడ పెట్టాలో దానిని అక్కడే పెట్టాలి. ఇంటి బయట చెప్పుల స్టాండులో డబ్బూ నగలూ పెట్టం. అలాగే, బ్యాంకులో లాకర్ తీసుకొని అందులో మన చెప్పులు దాచుకోం. నాకు ఇంత డబ్బు ఉంది అంత డబ్బు ఉంది అని వీధిలో ఎగ్జిబిషన్ పెట్టం. అలాగే చెప్పులను జేబులో పెట్టుకుని తిరగం. 

ఈ విధంగా ప్రతిదానికి నిర్దేశింపబడిన లోకరీతి ఒకటి ఉంటుంది. దానినే ఔచిత్యం అంటారు. దానినే మర్యాద (హద్దు) అంటారు. ఔచిత్యంపాటించకుంటే లోకంలో నవ్వులపాలు అవుతారు. మర్యాద పాటించకుంటే లోకం ఆ మనిషిని దూరంగా పెట్టే ప్రమాదం ఉంది.

కాబట్టి, శృంగారరసాన్ని ఆస్వాదించేందుకు తగిన కావ్యాలు బోలెడున్నాయి. అక్కడ నిరభ్యంతరంగా ఆస్వాదించుకోవచ్చు.  కృష్ణుడు నాయకుడుగా కలిగిన ఒక శృంగారకావ్యాన్ని చూపి చూశారా కృష్ణుడు ఎంతటి రసికుడో? అంటే ఏ గొడవా ఉండదు. కాని, యుద్ధరంగంలో అర్జునునికి భగవద్గీతను బోధించే కృష్ణునిలో శృంగారపురుషత్వం చూస్తే అది రసాభాస.  అలా చూసేవాడు తింగరివాడు. 

అలాగే, సుందరకాండలో హనుమంతుని లోకోత్తర-ఉత్సాహాన్ని – అంటే వీరరసాన్ని – కవి ప్రతిపాదిస్తూ ఉండగా అక్కడ ఆ వీరరసాన్ని ఆస్వాదించకుండా హనుమంతుడిని శృంగారపురుషుడని కామెంటు చేయడం వల్ల రసాభాస జరగక మానదు. అదే జరిగింది కూడా.

కాబట్టి మనం కవిహృదయాన్ని తెలుసుకుని రసికులం అవుదాం – కవి హృదయాన్ని పెడదారి పట్టించి నీరసికులం కాకుండా ఉందాం. 

ఇదంతా మా మిత్రుని పోస్టులో, కామెంట్లలో పెట్టదగినంత చిన్న విషయం కాదు కాబట్టి, నా గోడ మీద ప్రత్యేకమైన పోస్టుగా వ్రాయవలసి వచ్చింది.

ఇతి శమ్.

No offending Comments Please...

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...