Monday, 23 July 2018

రాజ్యబహిష్కారశిక్ష


జానపదుల కథ లెండి. ఎంతటివారినైనా ఎలాగైనా తమ కథలోనికి ఒక పాత్రగా లాగేస్తారు. ఎప్పటి కృష్ణరాయలు, మరెప్పటి రామలింగడు! పాత్రలు చాల ప్రాచీనమైనవే! పాఠం మాత్రమే నిత్యనూతనం!

ఓ సారి సభ జరిగింది.
సభలో ఎవరు గొప్పవారనే చర్చ వచ్చింది.

కొందరు అమ్మ గొప్పదన్నారు.
కొందరు తల్లిదండ్రులిరువురూ గొప్పవారన్నారు.
కొందరు గురువు గొప్పవాడన్నారు.
కొందరు రైతు గొప్పవాడన్నారు.
కొందరు భూదేవి గొప్పదన్నారు.
కొందరు సూర్యుడు గొప్పవాడన్నారు.
కొందరు దేవుడు గొప్పవాడన్నారు.

వాదోపవాదాలు జరిగాయి.
చివరకు దేవుడు గొప్పవాడనే పక్షం వాళ్లది పైచేయి అయింది. ఇంత జరుగుతున్నా తెనాలి రామలింగడు నోరు విప్పితే ఒట్టు! అందరికీ అది వింతల్లోకెల్లా వింతగా ఉంది. చేప నేలమీద బతికినంత, చీమ సముద్రాన్ని ఈదినంత వింతగానే ఉంది అందరికీ.

చివరకు కృష్ణరాయలే అడిగేశాడు - "ఏమంటావ్ రామలింగా, నిశ్శబ్దంగా ఉన్నావేం? అంటే దేవుడే అందరికంటె గొప్పవాడని నువు కూడా ఒప్పకున్నట్టే కదా?" అన్నాడు.

ఈ అవకాశంకోసమే ఎదురుచూస్తున్నాడేమో మనిషి, "ఒప్పుకోనుగాక ఒప్పుకోను మహారాజా!" అనేశాడు.

దేవుడిగొప్ప పక్షం వాళ్లు తక్షణమేవిరుచుకుపడ్డారు.
ఎవరు?
ఎవరది?
ఎక్కడున్నారు?
నువు చూసొచ్చావా?
అని ప్రశ్నలపరంపర మొదలైంది.

"అవును.
నేను చూశా.
చూస్తూనే ఉన్నా.
ఇక్కడే ఉన్నారు.
మీరు కూడా చూస్తూనే ఉన్నారు."
అన్నాడు రామలింగడు తాపీగా.

ఎవరో?
అదెవరో?
ఎవరికీ ఊహకు కూడా అందలేదు.

కాసేపయ్యాక,
మళ్లీ మాటలు మొదలు.
"ఎవరది?
చెప్పు.
పేరు చెప్పు.
చూపించు."

"ఇంకెవరనుకున్నారు?"
👀👀👀👀👀👀
అందరి కళ్లూ రామలింగడినే చూస్తున్నాయి.
👂👂👂👂👂👂👂
అందరి చెవులూ రామలింగడి మాటలనే వింటున్నాయి.

"అదెవరో కాదు,
సాక్షాత్తు మన మహారాజులవారే!
వారే దెవుడికంటె గొప్పవారు!"
అన్నాడు రామలింగడు.

😶 😶 😶
అంతే! కాసేపు భయంకరమైన నిశ్శబ్దం తాండవనృత్యం చేసింది. ఏ ఒక్కడూ కిక్కురుమనలేదు. లేదు, మహారాజు కంటె దేవుడే గొప్పవాడు అనేంత సాహసం ఏ ఒక్కడూ చేయలేకపోయాడు. రామలింగడు రాజుగారిని అందరిముందు ఇంతగా కాకా పట్టగలడని ఒక్కరంటే ఒక్కరు కూడా ఊహించలేకపోయారు. చివరకు ఏకంగా రాజుగారు కూడా. ఇలా విజయవంతంగా రామలింగడు అందరినోర్లూ మూయించేశాడు.

కాసేపయ్యాక కొందరు చప్పట్లు కొట్టారు. వారిని చూసి మరికొందరు కొట్టారు. చివరికి అందరూ కొట్టారు. దేవుడిగొప్పపక్షంవాళ్లు కూడా విధిలేక చప్పట్లు కొట్టవలసి వచ్చింది.

👏👏👏

ఇప్పుడు విజేతకు బహుమతినివ్వాలి!
రాజుగారు తన చేతులమీదుగానే ఇవ్వాలి!
రామలింగడు చిరునవ్వుతో రాజుగారిని చూస్తున్నాడు.

కాని,
కాని,

రాజుగారికి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి!
తనను దేవుడికంటె గొప్పవాడని పొగిడించుకుని, అందుకు బహుమతిని ఇస్తున్నట్టుంది! తనకు ఇంతటి ఇబ్బందిని కలిగించిన రామలింగడిమీద రాజుగారికి పట్టలేనంత కోపం వచ్చింది.

"చూడు రామలింగా!" అన్నాడు.

"చూడు,
దేవుడి కంటే మహారాజే గొప్ప అని ఊరికే అనడం కాదు, ఏ విధంగా గొప్పో సహేతుకంగా చెప్పి అవునంటూ సభలో అందరినీ ఒప్పించాలి. లేెదంటే ముందు నీకు, ఆ తరువాత ఇపుడు చప్పట్లు కొట్టినవారందరికీ కొరడా దెబ్బలు తప్పవు"

అందరికీ భయమేసింది.
మళ్లీ అందరి కళ్లూ అందరి చెవులూ రామలింగడివైపు జాలిగా తిరిగాయి. రామలింగడే మమ్మల్ని కాపాడాలి! రామలింగడే గెలవాలి! అని అందరూ ప్రార్థనలు చేస్తున్నారు. చేయక చస్తారా? తమచేత కూడా చప్పట్లు కొట్టించి ఇరికించేశాడుగా మరి! రాలింగడిమీద పీకలదాకా కోపం ఉన్నవాళ్లు కూడా రామలింగడే గెలవాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.

"సహేతుకంగానే చెబుతాను మహారాజా!" అన్నాడు రామలింగడు. "నా అంతటి హేతువాది, మునుపు లేడు, ఇపుడు లేడు, ఇకమీదట రాబోడు" అన్నాడు.

"సరే, చెప్పు మరి!"

"మీరు చేయగలిగిన ఒక పనిని దేవుడు కూడా చేయలేడని నిరూపిస్తా. ఆ లెక్కన మీరు దేవుడి కంటె గొప్పవారని నిరూపించబడినట్లేగా?"

శ్రీకృష్ణదేవరాయలతో సహా సభాసదులందరూ ఆశ్చర్యపోయారు.

ఏమిటది?
ఏమిటా పని?
రాజు చేయగలిగి, దేవుడు మాత్రం చేయలేని పని అంటూ ఒకటి ఉంటుందా?

కొందరు 😱😱😱 ఇలా చూస్తున్నారు.

కొందరు 😵😵😵 ఇలా చూస్తున్నారు.

ఇంకొందరు 🤔🤔🤔 ఇలా చూస్తున్నారు.

"అదేమిటో చెప్పవయ్యా, ఆలోచిద్దాం, దేవుడు చేయగలడో లేడో?" అన్నారు మహారాజావారు.

"ఏముంది మహారాజా?
మీకు ఎవరిమీదనైనా కోపం వస్తే దేశబహిష్కారశిక్ష వేయగలరు. చెప్పండి, దేవుడు ఆ శిక్షను వేయగలడా? వేసినా అమలు జరిపించుకోగలడా?"

సభ దద్దరిల్లిపోయింది.
👏👏👏👏👏👏👏
చప్పట్లే చప్పట్లు.

రాజుగారి రాజ్యానికి హద్దులున్నాయి. కాబట్టి రాజ్యబహిష్కారశిక్ష వేస్తే మెడబట్టి సరిహద్దుల బయటకు గెంటేస్తారు. మరి దేవుని రాజ్యానికి హద్దులేవీ? సమస్తవిశ్వమూ ఆయన రాజ్యమే కదా? మరి ఎక్కడకు గెంటివేయగలడు, పాపం?

రామలింగని యుక్తికి చప్పట్లు. రామలింగడు తమకు శిక్ష తప్పించినందుకు చప్పట్లు. దేవుడే గొప్ప పక్షంవాళ్లు తమ దేవుడిని రామలింగడు తక్కువ చేయనందుకు చప్పట్లు.

శ్రీకృష్ణదేవమహారాయల పెదవులమీద దరహాసం కనిపించింది. రామలింగడు మరీ మతిమీరి మితిమీరిన పొగడ్తలతో తనను ఇబ్బంది పెట్టనందుకు.

విజేతగా నిలిచిన రామలింగనికి మహారాజులవారే స్వయంగా బహుమతిని అందజేశారు.

💮శుభం💮

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...