Saturday, 28 July 2018

శ్రీకృష్ణుడితో ఇంటర్వ్యూ - 2

శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడితో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ:
((రెండవ భాగం))

ప్రశ్న 13
మీ మాటలు వింటే ధర్మరాజు మీద మీకు కాస్త కోపం ఉన్నట్టుందే?

కృష్ణుడు:
ఎందుకు ఉండదూ? ఎలాగో కష్టపడి యుద్ధాన్నంతా ఓ కొలిక్కి తెచ్చామా? దాదాపు దుర్యోధనుడొక్కడే మిగిలిపోయాడు. మడుగులో దాక్కున్నాడు. అతడిని యుక్తిగా ఏదో ఒక రకంగా బయటకు రప్పించాము. ఈలోగా ధర్మరాజు - "ఓయ్ దుర్యోధనా! మా పాండవులు ఐదుగురిలో ఎవరో ఒకరిని ఎంచుకో. వారితో నీకు నచ్చిన ఆయుధంతో యుద్ధం చేసి గెలు చూద్దాం. ఏ ఒక్కర్ని గెలిచినా మొత్తం రాజ్యాన్ని నీకే ఇచ్చేస్తాను" అనేశాడు. అపుడు నాకు ఎంత కోపం వచ్చిందో!

ప్రశ్న 14
అయినా, దుర్యోధనుడు మంచివాడు, నిజాయితీపరుడు కదా! అందుకే ఏ సహదేవుడినో ఎంచుకుని ఓడించకుండా తనకు తగిన జోడీ అని భీముడిని ఎంచుకున్నాడు! లేకపోతే పరిస్థితి ఎలా ఉండేది?

కృష్ణుడు:
దుర్యోధనుడికి నిజాయితీనా? ఆ మాత్రం నిజాయితీ ఉంటే పాండవులు అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసిన వెంటనే వారి రాజ్యాన్ని వారికి ఇచ్చి ఉండాల్సింది.

సరే, ప్రస్తుతానికి వస్తే, ధర్మరాజు సవాలును స్వీకరించి మీరన్నట్టు ఏ సహదేవుడినో ఎంచుకొని గదతో పడగొట్టి రాజ్యాన్ని సంపాదించేవాడే. కానీ, అతడు అలా చేయకపోవడానికి కారణం నిజాయితీ కాదు, మంచితనం కూడా కాదు, అలా చేస్తే అతడి పిరికితనానికి, కక్కుర్తితనానికి జనాలు నవ్వుకొనేవారు. వెక్కిరించేవారు. అభిమానధనుడని పేరుపొందిన దుర్యోధనుడికి అటువంటి అవహేళన చావుకంటే దుర్భరం. జనాల మాటలు వినలేక గుండెలు పగిలి చచ్చుండేవాడు.

అలాగని అతడు భీముడిని కూడా తన ప్రత్యర్థిగా ఎంచుకోలేదు. "మీలోనే ఎవరైనా రండి, మీలోనే ఎవరైనా రండి, మట్టి కరిపించేస్తా, సవాల్!" అంటూ ప్రగల్భాలు పలికాడు. ఆ మాటల్లో ఏ నకులుడో సహదేవుడో రాకపోతారా అనే ఆశ కూడా ఉంది. వారంతట వారే వచ్చి తన చేతిలో చస్తే అది తన తప్పుగా ఎవరూ భావించలేరు కదా? తనకు అటు రాజ్యమూ వస్తుంది, ఇటు అవహేళన చేసేవారు కూడా ఎవరూ ఉండరు అనే దురాశ అతడిది. కానీ పాపం, అతడి ఆశ చెల్లలేదు. అతడు చేసిన సవాలును భీముడే స్వీకరించి ముందుకొచ్చి అతడిని మట్టికరిపించాడు.

ప్రశ్న 15
అసలు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టింది మీరే అని చాలమంది అంటారు?

కృష్ణుడు:
దుర్యోధనుడు భీముడికి విషం పెట్టినపుడు, ఆ భీముడికి కాళ్ళు చేతులు కట్టేసి నీటిలోని తోసి చంపదలచినపుడు నేను చాల చిన్నపిల్లవాడిని.

అప్పటికి నేను ఇంకా యశోదానందుల బిడ్డడిననే అనుకుంటూ ఉన్నాను. అప్పటికి కుంతి మా అత్త అని తెలియదు. పాండవులు మా బావలు అని తెలియదు. మధురానగరిలో రాజకీయాలు కూడా తెలియవు, కంసుడు నన్ను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని కూడా తెలియదు. ఏదో అమాయికంగా ఆవులు కాచుకుంటూ, మిగిలిన పిల్లలతో ఆడుకుంటూ, మా జోలికి వచ్చిన చిన్న చిన్న పాములను కాలితో తొక్కేసి తరిమేస్తూ - ఇలా బయటి ప్రపంచం తెలియకుండా కాలం గడిపేవాడిని. అలాంటి నేను ఆ సమయంలో హస్తినాపురానికి వచ్చి భీముడికి విషం పెట్టమని దుర్యోధనుడికి చెప్పానా?

ఏమయ్యా, ఇది శకునిని అడగవలసిన ప్రశ్న కదా, నన్ను అడుగుతున్నారేమిటి?

ప్రశ్న 16
అలా కాదు, మీరు తలచుకుని ఉంటే అసలు యుద్ధానికి కారణమైన జూదమే జరగకుండా ఆపగలిగి ఉండేవారు కదా?

కృష్ణుడు:
ఆ సమయంలో మా యాదవులమీద కక్షగట్టిన సాళ్వరాజు, సౌభరి అనే విమానాన్ని ఎక్కి వచ్చి ద్వారకమీద దాడి చేశాడు. నేను మా వారితో కలసి వాడితో యుద్ధం చేయడంలో నిమగ్నమై ఉన్నాను. అదే సమయంలో ఇక్కడ జూదం జరిగింది. లేకుంటే నేను పిలవకున్నా ఈ జూదానికి వచ్చేవాడినే, జూదం జరగకుండా చూసేవాడినే.

ప్రశ్న 17
కాదు, కౌరవులు పాండవులు జూదమాడుతూ ఉండగా మీరు ద్వారకలో 'విన్నావా యశోదమ్మా' అనే ఒక నృత్యరూపకాన్ని చూస్తూ మైమరచి ఉన్నారు కదా?

కృష్ణుడు:
ఏమయ్యా? మాయాబజార్ సినిమాకు నువ్వు వీరాభిమానివిలా ఉన్నావే? మాయాబజార్ ఒక కల్పితకథ. అసలు మా అన్న బలరామునికి శశిరేఖ అనే కూతురే లేదు. పాండవుల వనవాసకాలంలో సుభద్రాభిమన్యులు పూర్తిగా
ద్వారకలోనే నివసించారు. దేవకాంత, అతిసౌమ్యురాలూ అయిన మా వదిన రేవతిగారిని తుచ్ఛమైన డబ్బుకు ఆశపడే సామాన్యస్త్రీగా చిత్రీకరించారే? సరే, లోకం ఇలా ఉంటుంది సుమా అని జానపదులకు అర్థమయేలా చెప్పేందుకు ఈరకమైన సినిమా తీశారులే అని జాలిపడి మేము ఊరుకున్నాము.

ప్రశ్న 18
కానీ, మీరు ఎక్కడో దూరాన ఉన్నప్పటికీ, ద్రౌపదికి పరాభవం కలుగకుండా కాపాడారు కదా? అంత చేసిన వారు అదే చేత్తో దూరం నుండే జూదాన్ని ఎందుకు ఆపలేకపోయారు?

కృష్ణుడు:
ఎందుకు ఆపలేదు? ధృతరాష్ట్రుడి మనసులో భయం పుట్టించాను. ద్రౌపదికి వరాలు ఇచ్చే మిషతో జూదంలో పాండవులు ఓడిపోయినదంతా తిరిగి వారికి ఇప్పించాను. అంతా సవ్యంగానే ఉండింది.

ఈలోగా రెండోసారి కూడా జూదానికి పిలుపు వచ్చింది. ధర్మరాజు తగుదునమ్మా అని మళ్ళీ వెళ్ళాడు. రెండోసారి పన్నెండేళ్ల వనవాసము, ఒక యేడు అజ్ఞాతవాసము అనే నియమంతో మళ్ళీ పందెంలో ఓడిపోయాడు.

ఇలా ఎన్ని సార్లు భక్తులను దేవుడు కాపాడాలి? కష్టం అనుభవిస్తేనే గాని సుఖం విలువ తెలియదు. అందుకని రెండోసారి నేను కాపాడే ప్రయత్నం చేయలేదు. పైగా రెండో సారి కూడా అడ్డం తగిలి ఉంటే "తప్పులు చేసిన ప్రతిసారీ దేవుడొచ్చి కాపాడతాడు" అనే మానసికదౌర్బల్యం జనాలందరికీ కలిగేది. అది ప్రమాదకరం. "అసలు తప్పులే చేయకుండా ఉండాలి" అనే ఆదర్శం ప్రచారం కావాలి. అందుకే రెండో సారి ఊరుకున్నాను.

ప్రశ్న 19
కానీ మీకు తరువాతనైనా పాండవులను గట్టెక్కించే శ్రమ తప్పలేదు కదా?

కృష్ణుడు:
నిజమే. కానీ, ఎంత శక్తిమంతులు అయినా పొరపాట్లు చేస్తే కష్టపడవలసి ఉంటుంది సుమా అనే భయం అందరికీ ఉండాలంటే ఆ మాత్రం శ్రమ పడక తప్పదు.

ప్రశ్న 20
కానీ, మీరు ఆనాడు అలా ఊరుకొనడం వల్లనే కదా, యుద్ధం సంభవించింది?

కృష్ణుడు:
దీనికి నేను ముందే సమాధానం చెప్పాను. క్షత్రియుడు కోరుకునేది ఇటువంటి మరణాన్నే. తెలిసి కూడా అధర్మంవైపు నిలబడిన వారు మరణించారు. ధర్మం కోసం ప్రాణాలర్పించినవారు ధన్యులయ్యారు.

ప్రశ్న 21
క్షత్రియులు అలా మరణిస్తే మంచిదని మీరంటున్నారు. కాని, ఆ మరణించిన వీరుల కుటుంబాలలో ఎంతటి సంక్షోభం కలిగి ఉంటుందో కదా!

కృష్ణుడు:
మీ ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ ఈ విషయం దగ్గరకే వచ్చి ఆగుతున్నాయి. ఆవు వ్యాసంలాగా. (నవ్వులు) అసలు భగవద్గీతలో అర్జునుడి విషాదం కూడా ఇదే కదా!

క్షత్రియులు అంటేనే ప్రాణాలకు తెగించి ఉండే జాతి అని ఇంతకు ముందే చెప్పాను. అసలు ఏ వృత్తికి చెందినవాడైనా, ఇంటి బయటకు వెళ్లినవాడు మరలా ఇంటికి క్షేమంగా తిరిగి రాగలడని ఎవరైనా హామీ ఇవ్వగలరా? క్షత్రియవృత్తిని అవలంబించిన వారిలో ఈ ప్రమాదశాతం మరింత ఎక్కువగా ఉంటుంది. ఆ కుటుంబం వారు చిన్నతనం నుండి ఆ సంక్షోభానికి సిద్ధపడి బ్రతికేలా మానసికమైన సన్నద్ధత ఉంటుంది.

నాటి సమాజం నేటి సమాజం వంటిది కాదు, వారి కుటుంబానికి మంచి గౌరవమర్యాదలు ఉంటాయి. ఆ యోధుల కుటుంబాలకు రాజుల అండదండలు ఉంటాయి. వారికి ఆర్థికసంక్షోభం ఉండే సమస్య లేదు. అయితే మనిషి లేకపోవడం అనే కొరతను ఎవరూ తీర్చలేరు. కానీ, క్షత్రియజాతికి గుండెనిబ్బరం జన్మతః సిద్ధిస్తుంది.

సుఖదుఃఖాలు శాశ్వతాలు కావు. "ధర్మ ఏకో హి నిశ్చలః." ధర్మం ఒకటే శాశ్వతమైనది. కాబట్టి, నేటి మనుషులను, నేటి సమాజాన్ని చూసిన కళ్ళతో నాటి మనుషులను, నాటి సమాజాన్ని అంచనా వేయకండి. మళ్ళీ ఇటువంటి ప్రశ్నను వేస్తే మీదగ్గర అడగడానికి మరే ప్రశ్నలూ లేవనుకుని ఇంటర్వ్యూ ను ఇంతటితో ముగిద్దాము.

ప్రశ్న 22
స్వామీ, స్వామీ, కోప్పడకండి. మరో రెండు మూడు ప్రశ్నలున్నాయి.
మరి యుద్ధంలో అబద్ధమాడమని మీరు ధర్మరాజుకు చెప్పారా లేదా? అది తప్పు కాదా? గదాయుద్ధంలో దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టమని భీముడికి చెప్పారా లేదా? అది తప్పు కదా?

కృష్ణుడు:
అవునయ్యా. అవును ధర్మరాజుకు, భీముడికి నేను అలా చెప్పిన మాట నిజమే. అసలు నా అవతారరహస్యాలలో అది ఒకటి.

కలియుగంలో దురాచారులెందరెందరో భారతానికి వస్తారు. వారు చేసే ప్రతి వెధవ పనిని కప్పిపుచ్చుకుంటూ భారతీయులు చేసే ప్రతిపనినీ తప్పు పడుతూ ఉంటారు. వారు చంపితే వీరత్వం అంటారు. వారికి ఎదురుతిరిగి భారతీయులు చంపితే క్రూరత్వం అంటారు. ఈరకంగా వారు తప్పు చేస్తే ఆనాటి అవసరం అలా చేయించింది అంటారు. భారతీయులు తప్పనిసరై అలా చేయబోతే నానా యాగీ చేస్తారు. భారతీయులు ఏమి చేయాలో తెలియని ధర్మసంకటంలో ఇరుక్కుని నిస్సహాయులౌతారు. వారికి నేను కర్తవ్యం బోధించదలచాను.

మాయాచారో మాయయా బాధితవ్యః.
సాధ్వాచారో సాధునా ప్రత్యుపేయః..

మాయగాళ్లని మాయతోనే కొట్టాలి.
మంచివారితో మంచిగానే వ్యవహరించాలి.

ఇలా స్వయంగా నేను చెప్పినప్పటికీ నిజంగా అలా మాయ చేసి దెబ్బ కొట్టవచ్చునా అని వెనుకంజ వేస్తూ పిరికివాళ్ళనిపించుకొనేంత వెర్రి వాజమ్మలు కలియుగభారతీయులు. అందుకే వారికి ఆదర్శంగా స్వయంగా నేనే కురుక్షేత్రయుద్ధంలో అలా చేసి చూపించవలసి వచ్చింది. ఈ కలియుగంలో ధర్మాన్ని నిలబెట్టడం కోసం అబద్ధమాడినా పరవాలేదు. నియమం తప్పినా పరవాలేదు. అటువంటి సందర్భాలలో తప్పొప్పులు ఏమి చేసినా నాకు వదిలిపెట్టండి, కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించండి అని చెప్పదలిచాను.

ప్రశ్న 23
ధన్యులం స్వామీ, ధన్యులం. మీ ఉపదేశాన్ని భారతీయులందరూ సక్రమంగా గ్రహిస్తే వారికి ఇక తిరుగు ఉండదు. కాని, మీకు పక్షపాతం దేనికి స్వామీ, ఒకవైపు "సర్వత్ర సమదర్శనః" అంటారు. కానీ అంత గొప్ప భగవద్గీతను అర్జునుడికి మాత్రమే బోధించారు.

కృష్ణుడు:
అయ్యో పిచ్చోడా, నేను వేరు, అర్జునుడు వేరు అనుకుంటున్నావా?

यो2हं तमर्जुनं विद्धि, यो2र्जुनः सोहमेव तु।
నేనెవరిననుకుంటున్నావో ఆ నన్ను అర్జునుడనే తెలుసుకో.
ఇతడు అర్జునుడు అని ఎవరిని గూర్చి అనుకుంటున్నావో అతడు నేనేనని తెలుసుకో.

భగవద్గీతను నాకు నేనే బోధించుకున్నా. అది నా ఆత్మప్రబోధం.

ప్రశ్న 24
శ్రీకృష్ణా, నమో నమః. నమో నమః. పరమానందం. పరమానందం.
కానీ, మేము మీరన్నట్టే సామాన్యులం కదా స్వామీ, మీరు ఆ భగవద్గీతను దుర్యోధనుడికి చెప్పి ఉంటే యుద్ధం ఉండేది కాదేమోనని మా ఆశ.

"भक्तो2सि मे सखा चेति रहस्यम् एतदुत्तमम्"

అంటూ అర్జునుడికి మాత్రమే చెప్పారు కదా.

కృష్ణుడు:
(నవ్వులు) ఏమయ్యా తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా?

రాయబారానికి వెళ్ళినపుడు నేను మంచి మాటలు చెప్పనే లేదంటావా? దుర్యోధనుడు కాస్త ఓపికగా విని ఉంటే ఆ భగవద్గీతను అప్పుడే చెప్పి ఉండేవాడినేమో? కానీ, నా మాటలు వినే ఓపిక ఆయనకెక్కడిది? ఆయన నా మాటలు వినకుండా తన మిత్రుల మాటలు విన్నాడు. నన్నే బంధించే ప్రయత్నం చేశాడు.

అప్పుడు కూడా సభామధ్యంలో నా విశ్వరూపం ప్రదర్శించాను. భయపడ్డాడు కానీ అర్థం చేసుకోలేకపోయాడు. తరువాత నన్ను ఇంద్రజాలం చేసే గారడీ వాడినంటూ హేళన చేశాడు.

"యద్భావం తద్భవతి" అని వినలేదా?
"యే యథా మామ్ ప్రపద్యన్తే తాన్ తథైవ భజామ్యహమ్"
(భగవద్గీత 4.11)

నన్ను గూర్చి ఎవరు ఏమనుకుంటే నేను వారికి అలాగే కనిపిస్తాను. అనిపిస్తాను. నువ్వేమనుకుంటావో నీ యిష్టం.

ప్రశ్న 25
స్వామీ, మీ మాటలు నాకు అయోమయం కలిగిస్తున్నాయి. ఒకవైపు అన్నీ చేసే భగవంతుడిని నేనే అంటారు. మరో వైపు నీ భావన ఎలా ఉందో అలాగే జరుగుతుంది అంటారు.  అందుకనే అర్జునుడిలా నేను నిన్ను అదే విధంగా ఆశ్రయిస్తున్నాను.

కార్పణ్యదోషోప హతస్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః.
యత్ శ్రేయః స్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తే2హం శాధి మాం త్వాం ప్రపన్నమ్.

కృష్ణుడు:
ఇది ప్రశ్నలా లేదే?

*****
ఉపసంహారం:
******
అలా ఇంటర్వ్యూ అర్ధాంతరంగా ముగిసిపోయింది.

ఇంటర్వ్యూ చేసేటపుడు ఎదుట ఉన్నవారు ప్రఖ్యాతి చెందిన వ్యక్తి అయితే అతడిని అయోమయంలో పడేస్తూ అతడి చేత వివాదాస్పదవ్యాఖ్యలు చేయిస్తూ అతడికి తెలియకుండా అతడి మాటల మీద ప్రజాభిప్రాయం కోరుతూ, రాచి రంపాన పెట్టడమే ఇంటర్వ్యూ అని కదా ఈరోజుల్లో భావం?

కానీ, అలా చేస్తూ చేస్తూ అతని మాటలు బలేగా నచ్చేసి అతనికి భక్తుడైపోయి నువ్వే నాకు దిక్కంటే ఆ ఇంటర్వ్యూ ప్రత్యక్ష ప్రసారం అవుతున్నప్పటికీ కట్ చెప్పాల్సిందే కదా?

అలా నేను చేస్తున్న/చేసిన ఇంటర్వ్యూ మధ్యలో ఆగిపోవలసి వచ్చిందన్న మాట. అయినప్పటికీ ఆయననుండి సాధ్యమైనన్ని ఎక్కువ విషయాలను రాబట్టాననే భావిస్తున్నాను.

ఈ ఇంటర్వ్యూ చదివినవారికి, విన్నవారికి, కన్నవారికి అందరికీ నిశ్చితమైన శ్రేయస్సు కలుగుగాక!

ఇంటర్వ్యూ రెండవ భాగం కూడా శ్రీకృష్ణార్పణమస్తు.

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...