Monday, 23 July 2018

శ్రీరాముని వనవిహారం

ఆహా సీతా!
विचित्रपुलिनां रम्यां हंससारससेविताम्।
कमलैरुपसम्पन्नां पश्य मन्दाकिनीं नदीम्।।
రంగురంగుల ఇసుకతిన్నెలతోనూ రమ్యమైనది, హంసలు సారసపక్షులకు ఆశ్రయం ఇస్తున్నదీ, మిక్కిలి కమలాలతో శోభిస్తున్నదీ అయిన ఈ మందాకినీ నదిని చూడు!
ఈ నదీతీరంలో ఎన్నెన్ని చెట్లు పెరిగాయో చూడు! అవి పూవులతోనూ పండ్లతోనూ ఎలా కళకళలాడుతున్నాయో చూడు!
జింకలు గుంపులు గుంపులుగా వచ్చి నీటిని బురదరంగులోనికి ఎలా మార్చేస్తున్నాయో చూడు! ఆహా ఈ రమణీయతీర్థాలు నాకు ఎంతో ఆనందం కలిగిస్తున్నాయి!
కొండమీద చెట్లు గాలికి ఎలా ఊగిపోతూ పూవులను ఆకులను ఎలా వెదజల్లుతున్నాయో చూడు! నదికి అటూ ఇటూ ఉన్న ఈ కొండలు తమ చేతులను ఊపుతూ నాట్యం చేస్తున్నట్లు లేవూ?
दर्शनं चित्रकूटस्य मन्दाकिन्याश्च शोभने।
अधिकं पुरवासाच्च मन्ये च तव दर्शनात्।।
ఓ సీతా!
నిన్ను, ఈ చిత్రకూటాన్ని, మందాకినీనదిని చూస్తుంటే అయోధ్యాపురంలో నివాసం దీనికంటె సుఖప్రదం కాదనిపిస్తోంది!
హాయిగా మూడుపూటలా స్నానం చేస్తూ, తేనెలను, దుంపలను, పండ్లను ఆరగిస్తూ ఉంటే అయోధ్య కాని, కోసలరాజ్యం కాని అసలు గుర్తుకే రావటం లేదు.
అంటూ చిత్రకూటం చెంత మందాకినీ తీరంలో -
ఓ లక్ష్మణా!
విన్నావా! నెమళ్ల క్రేంకారనాదాలు! ఆ కొండగుహలను చూడు, ఎన్నెన్ని ఉన్నాయో! ఎంతెంత పెద్దవో! చూడు!
ఆ కొండల మీద బంగారు, వెండి, రాగి రంగులలో మిల మిల మెరుస్తున్న ధాతువులను చూడు!
సాల వృక్షాలు, తాళవృక్షాలు, తమాలవృక్షాలు, ఖర్జూరాలు, పనసలు, ఆమ్రాలు, చంపకాలు, కేతకులు, చందనాలు, నీపాలు, లికుచాలు, ధవాశ్వాలు, శమీకింశుకపాటలాలు! ఆహా! ఎన్నెన్ని రకాలతో వృక్షసంపద ఇక్కడ నిండుగా వర్ధిల్లుతున్నదోో చూడు!
అంటూ గోదావరీతీరాన పంచవటిలో -
ఆహా లక్ష్మణా!
పంపానదీజలాలలో తేలాడుతూ వాటి అలలపై ఊగాడుతున్న వందలు వందల పక్షిసమూహాలను చూడు! నెమళ్లు, క్రౌన్చాల మధురధ్వానాలను విను!
లక్ష్మణా!
వర్షాకాలం వచ్చిందిగా! మేఘాలు మనం ఉంటున్న గుహకు ఎంత చేరువగా వచ్చాయో చూడు, ఈ మేఘాలను మెట్లుగా చేసుకుని, కొండపైకి పోయి, కొండమల్లెలు, గన్నేరులు కోసుకుని, మాలలల్లి, సూర్యునికి మనం సమర్పించుకోవచ్చును!
मेघोदरविनिर्मुक्ताः कल्हारसुखशीतलाः।
शक्यम् अञ्जलिभिः पातुं वाताः केतकिगन्धिनः।।
కలువల చల్లదనాన్ని, మొగలిపూల సువాసనలను మోసుకొస్తూ మేఘాలనే తెరల నడుమనుండి గాలి మనవైపే సూటిగా వీస్తున్నది చూడు! ఆహా! ఈ చల్లని పిల్లగాలులను దోసిళ్ళతో పట్టి తాగేయవచ్చుననిపిస్తోంది కదా లక్ష్మణా!
వర్షాకాలం ముగిసి శరదృతువు ఆరంభం కాబోతోంది. మేఘాలు కుంభవృష్టిని మానేసి ఉరుముతున్నాయి. సెలయేళ్ళ శబ్దం నెమళ్ళ అరుపులను తలపిస్తోంది. మేఘాలను శిఖరాలపై దాల్చిన పర్వతాలు మదపుటేనుగుల్లా ఉన్నాయి చూడు లక్ష్మణా!
అంటూ కిష్కింధ చెంత ప్రస్రవణగిరిపై -
ఇలా - వాల్మీకి మహర్షులవారి రాముడు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మైమరచిపోయేవాడు.
కాని, రంగనాయకమ్మ గారు తన రాముడు అందాలను ఆస్వాదించలేని జడబుద్ధి మందబుద్ధి, అంటూ తిట్టి తిట్టి పోసుకుంది.
అందుకే,
వాల్మీకి రాముడితో రంగనాయకమ్మ గారి రాముడిని పోల్చకండి.
ఈ రాముళ్లు ఇద్దరూ పూర్తిగా వేరు వేరు.
వాల్మీకి రాముడిని ప్రపంచమంతా మెచ్చింది.
రంగనాయకమ్మ గారి రాముడు స్వయంగా కన్నతల్లి అయిన రంగనాయకమ్మకే నచ్చలేదు!
రంగనాయకమ్మగారు ఇద్దరు రాముళ్ళూ ఒకటేనని అందరికీ నచ్చజెప్పేందుకు విషవృక్షం ఎక్కి అరుస్తోంది. నమ్మకండి. తన నీళ్లను పాలలో పోసి కలిపేసి అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్న వ్యాపారి ఈవిడ!

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...