Tuesday, 27 March 2018

వ్యక్తి ఆరాధన

***
వ్యక్తి అనేది ఒక స్త్రీలింగపదం. 
పృథగాత్మ అని అమరకోశం అర్థం చెబుతుంది. అంటే - ఒక పదార్ధం నుండి మరొక పదార్థాన్ని వేరుగా చూపే విశేషమే వ్యక్తి. వ్యక్తము అయినది వ్యక్తి అనే భావంలో స్పష్టత అనే అర్థం కూడా ఉన్నది. 

మానవుని స్వభావము మానవత్వము. 
పశువు స్వభావము పశుత్వము. 
అలాగే, వ్యక్తి స్వభావము వ్యక్తిత్వము. 

అంటే, ఒక మనిషిని (అనుకుందాము) వేరొకమనిషి నుండి వేరు చేసి చూపే ప్రత్యేకస్వభావమే వ్యక్తిత్వము.

వేరు చేయడం అంటే ఇక్కడ దురర్థం ఏమీ లేదు. 
ప్రతి ఒక్కరికి తమదైన ప్రత్యేకత ఉంటుంది. 
అలా ఉండకపోతే అసలు ఓ మనిషిని మనం గుర్తు పట్టలేము. 

ఓ బియ్యపు గింజను చూపి బియ్యం బస్తాలో పడేసి, కలిపేసి, ఏదీ, ఇపుడు చూపించిన బియ్యపు గింజను తిరిగి చూపమంటే చూపగలమా? చూపలేము కదా? అంటే, వాటికంటూ ఒక వ్యక్తిత్వం లేదు అని అర్థం అన్నమాట. 

శారీరకంగానూ, మానసికంగానూ, ఆలోచనల ప్రకారంగానూ, నడవడిక ప్రకారంగాను, సంస్కృతిపరంగాను, నేర్చుకున్న విద్యల ప్రభావం వల్లను, పెరిగిన ప్రాంతం వల్లను, వివిధ అవగాహనలవల్లను - ఇలా మనిషి అనేకరకాలుగా ప్రభావితుడై తనకంటూ ఒక ప్రత్యేకతను ఒక స్వభావాన్ని సంతరించుకుంటాడు. అది అతడి వ్యక్తిత్వం. అది సాంఘికంగా ఆమోదయోగ్యం కావచ్చు, కాకపోవచ్చు కూడా. కాబట్టి వ్యక్తి అంటే మనిషి కాదు, వ్యక్తిత్వమే.
***

ఇక ఆరాధన అనే పదం. దీనికి వాచస్పత్యనిఘంటువు ప్రకారం 1సంసిద్ధి 2సాధన 3సంతోషపరచడం 4సేవించడం అనే అర్థాలు ఉన్నాయి.

భగవదారాధన అనే పదం తీసుకుంటే - భగవంతుని సిద్ధింపజేసుకొనటం, భగవంతుని సాధించటం, భగవంతుని సంతోషపరచడం లేదా భగవంతుని సేవించడం అనే అర్థాలు వస్తాయన్నమాట.
***

ఇపుడు వ్యక్తి ఆరాధన అంటే ఏమిటో అర్థమైంది కదా?
వ్యక్తిత్వాన్ని సిద్ధింపజేసుకొనడం, 
వ్యక్తిత్వాన్ని సాధించడం.
వ్యక్తిత్వంతో సంతోషపరచడం, (& సంతోషపడడం) 
వ్యక్తిత్వాన్ని సేవించడం.
***

వాల్మీకి రాముడిని ఆరాధించి అతని చరిత్రను రామాయణంగా మనకు అందించాడు. రాముడు ఒక మనిషిగా పుట్టాడు. కానీ, అతని వ్యక్తిత్వానికి ఆకర్షింపబడి, అతనిని ఘనంగా కీర్తించిన వాల్మీకి అతడిని దేవుడిగా మార్చేశాడు! 

కాని, వాల్మీకి గుడ్డిగా రాముని పట్ల "వ్యక్తి ఆరాధన" కనబరచిన దాఖలాలు లేవు. తన ఆశ్రమానికి విచ్చేసిన నారదుడిని పట్టుకుని - "నా సమకాలికులలో... 

1గుణవంతుడు 2వీరుడు 3ధర్మం తెలిసినవాడు 4కృతఙ్ఞతకలిగినవాడు 5సత్యవంతుడు 6దృఢవ్రతుడు 7మంచి నడవడిక కలిగినవాడు 8అన్ని ప్రాణుల పట్ల దయకలిగినవాడు 9విద్వాంసుడు 10సమర్థుడు 11దర్శనమాత్రంతో ఆహ్లాదం కలిగించేవాడు 12ఆత్మవంతుడు, 13కోపాన్ని జయించినవాడు 14 తేజస్వి 15అసూయలేనివాడు 16రోషం కలిగితే దేవతలను కూడా భయపెట్టగలిగినవాడు 

ఇన్ని గుణాలు కలిగినవాడు ఎవడున్నాడని" అడిగి, అవన్నీ కలిగినవాడు రాముడని నారదుడు చెప్పగా, తనకు సృష్టికర్త ప్రసాదించిన జ్ఞానంతో నారదుని మాటలు నిజమేనని తెలుసుకుని, అప్పుడు రామాయణ రచన చేశాడు.

అదీ వ్యక్తి ఆరాధన. 

అర్జునినితో సహా పాండవులు అందరూ శ్రీకృష్ణుని ఆరాధించారు. పాండవుల ప్రతి అభ్యుదయంలోనూ శ్రీకృష్ణుని పాత్ర సుస్పష్టంగా ఉన్నది. అతడు తమకు దూరమైనపుడు... 

"మన సారథి, మన సచివుడు, మన వియ్యము, మన సఖుండు, మన బాంధవుడున్, మన విభుడు, గురుడు, దేవర, మనలను దిగనాడి చనియె మనుజాధీశా!"

అని ఎంతగానో శోకించారు. అతడు లేని లోకంలో బ్రతకడం దుర్భరంగా తోచి రాజ్యాన్ని సంపదలను వదలుకొని మహాప్రస్థానానికి బయలుదేరారు.

అదీ వ్యక్తి ఆరాధన. 

అయితే ఒక్క విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. తమ ఆరాధకులైన వాల్మీకిని గాని పాండవులను గాని వారు ఆరాధించిన వ్యక్తులు ఎన్నడూ అసంతృప్తికి గురిచేయలేదు. వారి నమ్మకానికి విరుద్ధంగా ప్రవర్తించలేదు. 

ముందుగానే చెప్పినట్టు, వారు చేసినది వ్యక్తి ఆరాధన అని మనం అంటున్నా, నిజానికది ఆ వ్యక్తులలో ఉన్న గుణాల ఆరాధన. అదే వ్యక్తిత్వ ఆరాధన కూడా.

ఈవిధంగా మహామహులే వ్యక్తి ఆరాధన చేశారు. తప్పేమీ లేదు. వ్యక్తి ఆరాధనను మన సంస్కృతి నిరుత్సాహపరచదు. అలాగని ప్రోత్సహించదు కూడా. ఎందుకంటే మనం ఆరాధింపబూనుకున్న వ్యక్తులు సరైనవారు కాకపోతే, తత్ఫలితంగా మంచిదైన మన వ్యక్తిత్వాన్ని కూడా బలవంతంగా చంపుకొనవలసి వస్తుంది. 

తనకు ఆశ్రయం కల్పించాడన్న ఒకే ఒక్క కారణంగా కర్ణుడు దుర్యోధనుని కోసం తనదైన వ్యక్తిత్వాన్ని చంపుకొనవలసి వచ్చింది. దుర్యోధనుడి వ్యక్తిత్వాన్నే తన వ్యక్తిత్వంగా స్వీకరించి దుష్టచతుష్టయంలో ఒకడిగా మిగిలిపోవలసి వచ్చింది.
***

ఈ విషయాలపై కుప్పలు తెప్పలుగా బోలెడన్ని ఉదాహరణలను ఇవ్వవచ్చు. కాని, అన్నం ఉడికిందని తెలుసుకొనేందుకు ఒకటి రెండు మెతుకులు చాలు కదా?

నేటి కాలంలో సర్వసుగుణాలూ మూర్తీభవించిన వ్యక్తి ఎవరూ లేరు. ప్రతి ఒక్కరిలోనూ కొన్ని సుగుణాలు ఉన్నాయి, కొన్ని దుర్గుణాలు కూడా ఉన్నాయి. సంపూర్ణ వ్యక్తి ఆరాధనకు తగినవారు ఎవరూ లేరు. ఉన్నారనే భ్రమలు కూడా ఎవరికీ లేవు. 

కాబట్టి హంసైర్యథా క్షీరమివామ్బుమధ్యే అన్నట్టు - నీటిని వదిలి పాలను స్వీకరించే రాజహంసల మాదిరి ఆయా వ్యక్తులలో సుగుణాలను మెచ్చుకుంటూ, దుర్గుణాలను ఖండిస్తూ తామరాకుపై నీటిబొట్టులా ఉండటమే మనం ఈనాడు చేయగలిగింది. 

అది మాత్రం ఎందుకని మౌనం ఆచరిస్తే మరీ మంచిది. మౌనం సర్వార్థసాధకం అవునో కాదో గాని, మౌనం మునేర్లక్షణం అనే మాట ప్రకారం, అది మునుల లక్షణం.

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...