Monday, 26 March 2018

వాలి అభినివేశం - రాముని సంయమనం



వాలిసుగ్రీవుల అంతిమయుద్ధం ప్రారంభమైంది.
*
తౌ భీమబలవిక్రాన్తౌ సుపర్ణసమవేగినౌ  ఇద్దరూ భయంకరమైన బలపరాక్రమాలు కలిగినవారు.  గరుత్మంతునితో సమానమైన వేగం కలిగినవారు.  ఘోరవపుషౌ ఉన్నతమైన భీకరమైన శరీరాలు కలిగినవారు.  అటువంటి వారిద్దరూ అన్నదమ్ములు.  అన్నదమ్ములై పుట్టి ఒకరినొకరు చంపుకోవాలి అన్నంత కక్ష వారిలో ఎందుకు పెరిగింది?  ప్రపంచంలో ఎక్కడైనా పరస్పరం కలహించుకునే సోదరులు కనిపిస్తే వారిని వాలిసుగ్రీవులు అని పోల్చేంత వైరం వీరి మధ్యలో ఎందుకు కలిగింది?
}}}{{{
ఒకప్పుడు వానరరాజ్యమైన కిష్కింధకు వాలి రాజుగా, సుగ్రీవుడు యువరాజుగా ఉండేవారు.  అలా ఉండగా ఒకసారి మాయావి అనే దానవుడు వాలిని యుద్ధానికి రమ్మని సవాలు చేసి, తీరా అతడు వచ్చేసరికి, భయపడి పారిపోయాడు.  వాణ్ణి వదలనంటూ వాలి వెంటబడ్డాడు.  సుగ్రీవుడు అన్నకు తోడుగా అనుసరించాడు.  మాయావి పారిపోయి ఒక బిలంలో దూరిపోయాడు.  “సుగ్రీవా, నువ్వు ఇక్కడే ఉండు, వాణ్ణి చంపిగాని బయటకు రానుఅని వాలి ఆ బిలంలోనికి దూరి వెళ్లాడు.
అలా మాయావిని చంపేందుకు తాను బిలంలో దూరినపుడు బయట ఉండిన సుగ్రీవుడు, తనను మళ్లీ బయటకు రానివ్వకుండా బిలానికి పెద్ద బండరాయిని అడ్డుగా మూసి, స్వయంగా తానే రాజయ్యేందుకు కుట్ర పన్నాడని వాలి ఆరోపణ.  సంవత్సరం పాటు ఎదురు చూశాక బిలం నుండి బయటకు రక్తప్రవాహం రావడం చూసేసరికి, అన్న ఆక్రందనలు వినబడేసరికి, మహావీరుడైన తన అన్ననే చంపగలిగిన మాయావినుండి తమ రాజ్యానికి కూడా ప్రమాదం రాగలదని శంకించి, ఆ మాయావి మరలా బిలం నుండి బయటకు రాకూడదనే ఉద్దేశంతో బిలాన్ని మూసివేశానని సుగ్రీవుని సంజాయిషీ. సరే, వాలి మాయావిని చంపేసి, తరువాత ఆ బిలానికి అడ్డుగా ఉంచిన రాయిని పగులగొట్టి తిరిగి వచ్చేసరికి సుగ్రీవుడు రాజుగా ఉన్నాడు.  నిజానికి అన్నను నిగ్రహించి రాజు కావాలనే ఆశ ఉండి ఉంటే సుగ్రీవునికి ఆ సమయంలో తగినంత సామర్థ్యం ఉండింది.  కాని, అప్పటికి అన్న అనే గౌరవం మెండుగా ఉండడంవల్ల సుగ్రీవుడికి అటువంటి తలంపే పుట్టలేదు.
{నిగ్రహేపి సమర్థస్య న ప్రావర్తత బుద్ధిః భ్రాతుర్గౌరవయంత్రితా. (రామాయణం ౪.౯.౨౩)}
తప్పైంది అన్నా, మరలా నువే రాజువు కా అన్నా.  త్వమేవ రాజా మానార్హఃఅని వాలి పాదాల చెంత తల పెట్టి ప్రణమిల్లాడు సుగ్రీవుడు.  {బలాదస్మి సమాగమ్య మన్త్రిభిః పురవాసిభిః రాజభావే నియుక్తోహం శూన్యదేశజిగీషయా (రా.౪.౧౦.౧౦)} రాజపదవి ఖాళీగా ఉంటే ఆ రాజ్యాన్ని జయించాలనే కోర్కె శత్రువులకు పుడుతుంది.  అందువల్ల మంత్రులు, పురజనులు కలిసి నన్ను రాజుగా బలవంతంగా నియమించారు.  (కేవలం ఆ కారణం వల్లనే నేను కూడా అంగీకరించవలసి వచ్చింది)అని సవినయంగా వివరించాడు.
అయినా వాలి క్రోధం చల్లారలేదు.  సుగ్రీవుని చంపదలిచాడు.  {స మాం జిఘాంసుః(రా.౪.౪౬.౧౦)}  సుగ్రీవుడు తన రాజ్యాన్ని తీసుకొనడం మాత్రమే ఆ కోపానికి కారణంకాదు.  వేరే మరొక కారణం ఉంది.  అన్నదమ్ములు చనిపోతే వారి భార్యలను స్వీకరించడం ఆ వానరజాతుల్లో సహజం.  ఆ పద్ధతిలో, వాలి చనిపోయాడు అనే తలంపుతో అతని భార్య ఐన తారను సుగ్రీవుడు తన భార్యగా సంగ్రహించాడు.  మరలా అదొక్కటే కారణం కాదు, వాలికి సుగ్రీవుని భార్య అయిన రుమ మీద కన్ను ఉంది.  కాబట్టి, వాలి రుమను పొందాలంటే సుగ్రీవుడు చావాలి.  అందువల్ల, సుగ్రీవుని చంపడమే మంచిదని వాలి భావించాడు.  సుగ్రీవుడు ప్రాణాలు దక్కించుకొనేందుకు పారిపోయాడు.  అయినా వాలి వదలలేదు.  వెంటబడి తరిమాడు.  {తతోహం వాలినా ప్రధావితః. (రా.౪.౪౬.౧౨)}  సుగ్రీవుడు ఎక్కెక్కడకు వెళ్లినా అక్కడకు తరుముకుంటూ వెళ్లాడు.  చివరకు శాపకారణంగా, వాలి అడుగుపెట్ట సాహసించలేని మతంగమహర్షి ఆశ్రమం కలిగిన ఋష్యమూకపర్వతంపై సుగ్రీవుడు తలదాచుకున్నాడు.  ఆ విధంగా ఎలాగో తప్పించుకున్నాడు.  ఇంకా బ్రతికే ఉన్నాడు.  కాని, వాలి అధికారమదంతో రుమను బలాత్కారంగా తన భార్యగా గ్రహించాడు.  సుగ్రీవుని ఏదో ఒక విధంగా చంపించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.  ఈవిధంగా సుగ్రీవుడు తన రాజ్యాన్ని అన్యాయంగా అపహరించాడు అనేది వాలికి కేవలం ఒక సాకు మాత్రమే.  అసలైన కారణం తమ్ముని భార్య మీద వ్యామోహం.
ఆ సమయంలో సుగ్రీవునికి శ్రీరాముడు మిత్రునిగా లభించాడు.  వాలి చేసిన అధర్మాన్ని, సుగ్రీవుని భయాన్ని శ్రీరాముడు అర్థం చేసుకున్నాడు.  “రామా!  నాకు మేలు చేకూర్చడానికి ఈరోజే వాలిని చంపెయ్”  {తమద్యైవ ప్రియార్థం మే వాలినం జహి కాకుత్స్థ (రా.౪.౧౨.౧౧)} అని, ఎన్నో కఠినమైన కష్టాలను అనుభవించిన ఉద్వేగంతో సుగ్రీవుడు రాముని కోరాడు. 
సరే, నువే స్వయంగా మీ అన్నను యుద్ధానికి పిలిచి చంపేసెయ్.  నీకు చేతగాని పక్షంలో నేను చంపేస్తాఅన్నాడు రాముడు.
అలా మొదలైంది వాలిసుగ్రీవుల అంతిమయుద్ధం.
}}}{{{
తర్జయానౌ పరస్పరం ఇద్దరూఒకరినొకరు బెదిరించుకుంటూ, నిన్ను అలా చంపుతా, ఇలా చంపుతా అని పరస్పరం ఆవేశంతో సవాళ్లు విసురుకుంటూ, “వృక్షైః సశాఖైః శిఖరైః వజ్రకోటినిభైర్నఖైః ముష్టిభిర్జానుభిః పద్భిః బాహుభిశ్చ పునః పునః” - చెట్లను పీకి చావబాదుకుంటూ, గండశిలలను ఎత్తి విసురుకుంటూ,  పదునైన గోళ్లతో చీల్చుకుంటూ, పిడికిళ్లతో పొడుచుకుంటూ, మోకాళ్లతో కుమ్ముకుంటూ, ఎగిసి కాళ్లతో తన్నుకుంటూ, అరచేతులతో చరచుకుంటూ, ఎదుటివాడిని చేతుల్లో బంధించి నొక్కి చంపేయాలంటూ ప్రాణాలకు తెగించి యుద్ధం చేశారు.  ఇద్దరి శరీరాలూ రక్తం వోడుతున్నాయి.  ఇలా చిరకాలం పోరాడిన పిమ్మట – “వాలినా భగ్నదర్పస్తు సుగ్రీవో మంద విక్రమః” – వాలి చేతిలో సుగ్రీవునికి గర్వభంగమై అతని పరాక్రమం సన్నగిల్లింది.  
రాముని సహాయం కోసం దిక్కులు చూడటం మొదలు పెట్టాడు.  వాలిసుగ్రీవులు ఉభయులూ రూపంలో ఒకే విధంగా ఉన్నప్పటికీ, గజపుష్పమాలనుధరించిన సుగ్రీవుడిని రాముడు గుర్తుపట్టగలిగాడు.



సుగ్రీవునికి తన సహాయం అవసరమైందని గ్రహించి, శ్రీరాముడు వెంటనే తన కోదండానికి శరసంధానం చేశాడు.  ప్రళయకాలభీకరమైన ఆ బాణం తగిలి ఇంద్రధ్వజంలా వాలి కూలిపోయాడు.  అంత పెద్ద దెబ్బతిన్నప్పటికీ, శక్రదత్తా వరా మాలా దధార హరిముఖ్యస్య ప్రాణాన్” – ఇంద్రుడు ఇచ్చిన మాల ధరించి ఉండడం వల్ల వాలి ప్రాణాలు వెంటనే పోలేదు.
అపుడు రామలక్ష్మణులు ఇద్దరూ తన చెంతకు రావడం చూచి, వాలి రాముడిని చాల పరుషంగా నిందించాడు.


నువ్వు ఓ రాజకుమారుడివి.  గొప్ప వంశంలో పుట్టినవాడివి.  ధర్మం చదువుకున్న వాడివి.  బలవంతుడివి. నువ్వు కరుణ కలిగినవాడివని, ప్రజలకు హితం చేసేవాడివని అందరూ నీగురించి చెబుతూ ఉంటారు.  కాని, నేను వేరొకరితో యుద్ధం చేస్తూ ఉండగా నన్ను ఎందుకు ఇలా బాణంతో కొట్టావు?  నా భార్య తార నన్ను హెచ్చరించినా నేను కాలవశుడనై ఆమె మాటలను ఖాతరు చేయక సుగ్రీవుడితో యుద్ధానికి వచ్చాను.  ఇంద్రియనిగ్రహము, మనోనిగ్రహము, సహనము, ధర్మాచారణము, అపరాధులను దండించడము ఇవి రాజలక్షణాలు కదా?  మరి నన్ను ఎందుకు బాణంతో కొట్టావు?  నీవు అధర్మపరుడవు.  పాపాలను చేసే వాడవు.  గడ్డి చేత మూయబడి బయటకు కనబడని బావి వంటి వాడవు.  నీకు గాని, నీ ప్రాంతానికి గాని ఎటువంటి హానినీ నేను చేయలేదు.  నన్ను ఎందుకు కొట్టావు?  సాధారణంగా భూమి కోసమో డబ్బు కోసమో రాజు యుద్ధం చేస్తాడు.  కాని, నేను పండ్లూ దుంపలూ తింటూ అడవుల్లో తిరిగే వానరుడిని.  నన్ను ఎందుకు కొట్టావు?  నిరపరాధినైన నన్ను ఎందుకు కొట్టావు?  నా చర్మం గాని, నా రోమాలు గాని, నా ఎముకలు గాని, నీకు ఉపయోగపడవే?  మరి ఎందుకు కొట్టావు?  నా మాంసం నీకు తినరానిది.  మరి ఎందుకు కొట్టావు?  నేను యుద్ధంలో దుర్జయుడను.  నాతో నేరుగా యుద్ధానికి దిగి ఉంటే ఈపాటికి యముడిని చూసి ఉండేవాడివి.  సుగ్రీవుడిని బదులు ముందు నన్నేఅడిగి ఉంటే రావణాసురుడిని చావబాది, వాడి గొంతుకు తాడు కట్టి ఇగ్గుకొచ్చి నీకు అప్పగించేవాడిని.  సీతను ఎక్కడ దాచి ఉన్నా నీకు తెచ్చి ఇచ్చి ఉండేవాడిని.కాని, సుగ్రీవుడికి మేలు చేయడం కోసం నీవు నన్ను చంపదలిచావు.  అది అనుచితం.  సమాధానం చెప్పుఅంటూ ఆక్రోశించాడు.
}}}{{{
రాముడు వాలికి తగిన సమాధానం ఇచ్చాడు.  అవేమిటో తెలుసుకొనే ముందు,  వాలి మాటలలోనే మనకు తెలిసిపోయే కొన్ని నిజాలను పరిశీలిద్దాం.
1         రాముడు ఎవరో, అతడు ఎంతటి శక్తివంతుడో, అతడు ఎటువంటివాడని అందరూ భావిస్తున్నారో కర్ణాకర్ణిగా వాలికి ఖచ్చితంగా ముందే తెలుసు.
2         రావణాసురుడి ద్వారా ఆ రాముడికి ఎటువంటి అపకారం జరిగిందో కూడా తెలుసు.
3         రాముడు తన తమ్ముడైన సుగ్రీవుడితో స్నేహం చేశాడని తెలుసు.
4         అటువంటి పరిస్థితులలో సుగ్రీవుడితో యుద్ధం చేస్తే తనకు ప్రమాదం పొంచి వుంటుందని కూడా తెలుసును.
ఇప్పుడు చూద్దాం, ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ వాలి చేసిన పొరపాట్లు ఏమిటో
రామసుగ్రీవుల స్నేహం గూర్చి తెలుసుకున్నప్పటికీ వాలి కలవరపడలేదు.  ఆ రాముడు సత్త్వవంతుడు, తేజస్వి,(రా.౪.౧౭.౧౪) జితోత్సాహుడు, సమయజ్ఞుడు (రా.౪.౧౭.౧౬) అని తెలిసినప్పటికీ, అటువంటివాడు సుగ్రీవుడితో స్నేహం చేశాడే,  అందువల్ల సుగ్రీవుని బలం పెరిగింది కదాని భయపడలేదు.  ఆ రాముడు సానుక్రోశుడు (రా.౪.౧౭.౧౬) అంటే తనను ఆశ్రయించినవారి దుఃఖాన్ని తన దుఃఖంగా భావించేవాడు (కాబట్టి, సుగ్రీవుని దుఃఖాన్ని పోగొట్టేందుకుగాను తనను అణచివేసేందుకు ప్రయత్నం చేస్తాడు) అని తెలిసినా తూష్ణీంభావం వహించాడు.  తన బలంపై వాలికి అపారమైన నమ్మకం.  ఎవడినైనా నేను ఓడించగలను అని అతివిశ్వాసంతో ప్రతిక్రియారహితుడై ఉండిపోయాడు.  అది ఉత్తమమైన రాజనీతి కాదు.  అది సంపూర్ణంగా అతడి నిర్లక్ష్యం.  వేరొక బలవంతుడు ఉంటే అతడిని వెంటనే నిగ్రహించాలి.  లేదా, అతడితో స్నేహమైనా చేయాలి.  అతడితో స్నేహం ఇష్టం లేకుంటే అతడి శత్రువుతోనైనా స్నేహం చేయాలి.  అది చక్కని రాజనీతి.  కాని, వాలి ఇవేమీ చేయలేదు. బలవంతుడైన రామునితో మైత్రికి ప్రయత్నం చేయలేదు.  కనీసం రామసుగ్రీవుల మధ్య భేదం కల్పించేందుకు కూడా సంకల్పించలేదు.  సరే, ఆ రకంగా వాలి నిర్లక్ష్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఉన్నాడు కాబట్టి, అతడిని ఎవరూ దెబ్బ కొట్టరాదు అని ఎవరైనా అంటే, అంతకంటె మూర్ఖత్వం మరొకటి లేదు.
సరేనండి, వాలి రాముడితో మైత్రికి ప్రయత్నించలేదు, మరి కనీసం రాముడైనా సుగ్రీవుని కంటె బలవంతుడైన వాలితోనే స్నేహం చేసి ఉండవచ్చు కదా?  అని సందేహం రావచ్చు.  స్వయంగా వాలే రాముడిని అడిగాడు –“ఏమయ్యా రామా?  నీ తెలివి తక్కువతనం కొద్దీ సీతను రావణుడు ఎత్తుకుపోయాడు.  అప్పుడు మరింత తెలివితక్కువగా, “నాకు సహాయం చేయవయ్యాఅని బలహీనుడైన సుగ్రీవుడిని అడిగావు.  కాని, ఆ సహాయమేదో నన్నే ముందు ఎందుకు అడగలేక పోయావు?  అడిగి ఉంటే నేను అట్లా చేద్దున్, ఇట్లా చేద్దున్ కదాఅని అన్నాడు.  కాని, రాముడు ఆ పని ఎందుకు చేయలేదో చూద్దాం.
వాలికి రావణాసురుడు స్నేహితుడు.  వారేదో అల్లాటప్పా స్నేహితులు కారు, “నీతో చిరకాలం ప్రగాఢమైత్రిని కోరుతున్నాను.  నా రాజ్యం, నా భోగసంపదలు, నా వస్త్రాభరణాలు, నా భోజనాదులు ఇకమీదట అవిభక్తంగా మన ఇరువురివీఅని రావణుడు పలికిన పిమ్మట, అగ్నిసాక్షిగా వారిద్దరూ అన్నదమ్ములవంటి స్నేహితులైనారు. (రా.౭.౩౪.౪౦-౪౨)  అటువంటి వాలికి స్నేహితుడైన రావణుడివల్లనే రాముడికి అపకారం జరిగింది.  మరి అగ్నిసాక్షిగా చేసుకున్న ఆ స్నేహపు ఒప్పందం ప్రకారం, వాలి తన చిరకాలమిత్రుడైన రావణుడికే తోడ్పడతాడు గాని, ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి,  క్రొత్తవాడైన తనకు ఎలా సహాయం చేస్తాడని రాముడు భావించడం సహజం.
అంతే కాదు, రావణుడు సీతను అపహరించినట్టే, వాలి కూడా తన తమ్ముని భార్యను అపహరించాడు.  ఈ విధంగా రావణుడు, వాలి, ఇరువురూ ఒకే రకమైన తప్పు చేశారు.  ఇటువంటి పరిస్థితులలో రాముడు తన స్వార్థం కోసం వాలితో స్నేహం చేసి, రావణుడిని మాత్రం చంపుతాడా? – ఆ రకమైన ద్వంద్వనీతిని లోకం హర్షింఛి ఉండేదా?  “ఓ రామా!  నీతో స్నేహం చేశాడని, నీకు సహాయం చేశాడని, తప్పు చేసినవాలిని క్షమించేస్తావా?  అదే తప్పు చేసిన రావణాసురుడిని మాత్రం పరాయివాడని చంపేస్తావా?  ఇదే రకమైన ధర్మం రామా?”  అని లోకం దుమ్మెత్తి పోసేది కాదా?
ఈ వానరసోదరులలో సుగ్రీవుడు బలహీనుడు, వాలి బలవంతుడు అనే విషయం రాముడికి తెలియనిది కాదు.  కాని, వాలితో స్నేహం చేస్తే నా పని సులువుగా ఐపోతుందేమో అనే ప్రలోభానికి రాముడు లొంగిపోలేదు.  ధర్మం తెలిసినవాడే కాక, దానిని చక్కగా ఆచరించేవాడు కూడా కాబట్టి, వాలిని వదిలి, సుగ్రీవుడితోనే స్నేహం చేశాడు.  అపరాధిని శిక్షించాడు.  ఇటువంటి చక్కని స్థిరమైన రాజనీతిని, ధర్మాన్ని పాటించిన రాముడిని, “నువ్వు కామాత్ముడివి, నువ్వు చంచలస్వభావం గలవాడివి, ధర్మవిచక్షణ లేనివాడివిఅని వాలి నిందించడం హాస్యాస్పదం కాదా?
అంతేకాదు, “నేను నిరపరాధిని, నేను అకిల్బిషుడిని, నేను ఉదాసీనుడిని” (రా.౪.౧౭.౨౨,౩౩,౪౪) అని వాలి పదే పదే రామునిముందు తనను గూర్చి చాటుకున్నాడు.  అటువంటి చాటువులు ఎన్ని సార్లు పలికినప్పటికీ, అపరాధి నిరపరాధి ఐపోడు.  సుగ్రీవుడి పట్ల వాలి తప్పు చేసినప్పటికీ, అది తప్పు కాదని, నేను చేసింది ధర్మమేనని అతడు దబాయించాడు.  కిష్కింధలో అతని ప్రాపు గోరి, అతని ప్రక్కనుండే మంత్రులు కూడా అవును ప్రభూ!  మీరు చేసిన దానిలో తప్పేమీ లేదుఅని వంత పాడి పాడి, అతడి తప్పుడు అభిప్రాయానికి బలం కలిగించి ఉంటారు.  అంతమాత్రాన తప్పు ఒప్పై పోదు. కాని, ధర్మాధర్మాలు ఏమిటో క్షుణ్ణంగా ఎరిగిన రాముడి ముందు వాలి దబాయింపులు చెల్లలేదు.  అందువల్లనే రాముడు ఓ వాలీ,నీది వానర చాపల్యం.  నీ మంత్రులు కూడా అలాంటివారే”  (రా.౧౮.౧౬) అని అన్నాడు.
వాలి ఎందుకు అపరాధి అయినాడో ముందర చెప్పిన కథలోనే చూశాం.
1 క్షమించమని శత్రువు కోరినా క్షమించాలి అనేది ఆనాటి రాజనీతి.  కాని, తన స్వంత తమ్ముడైన సుగ్రీవుడు క్షమించమని కోరి పాదాక్రాంతుడైనా, వాలి అతడిని చంపబూనుకున్నాడు. (రా.౪.౯.౨౬)
2 యుద్ధం చేయకుండా పారిపోయేవాడిని వెంట తరిమి చంపడం రాజధర్మానికి విరుద్ధం.  కాని, తనను సవాలు చేసిన మాయావిని వాలి వెంటాడి వెంటాడి చంపడంలోనే అతడి క్రూరత్వం తెలుస్తుంది. అలాగే, సుగ్రీవుడు ఎటు పారిపోయినా, అతడిని చంపివేసే ఉద్దేశంతోనే, వాలి నాలుగు దిక్కులలోనూ దేశదేశాంతరాలకు తరుముకుంటూ పోయాడు.  (రా.౪.౪౬.సర్గ)  మొత్తానికి మతంగాశ్రమప్రాంతంలో వాలి అడుగు పెట్టలేడు కాబట్టి సుగ్రీవుడు బ్రతికిపోయాడు.  వాలి కోపం తాత్కాలిమైనది అయ్యుంటే అర్థం చేసుకొనదగినదే.  కాని, చాలకాలం గడిచినప్పటికి, అతడు సుగ్రీవుని చంపించే ప్రయత్నాలు మానలేదు.  కాబట్టి, తన ప్రాణరక్షణకోసం వాలిని చంపాలి అని సుగ్రీవుడు భావించడంలో గాని, అందుకు రాముని సహాయం కోరడంలో గాని తప్పు లేదు.
3 రాజధర్మం కాపాడడమే కాని, అపహరించడం కాదు.  కాని, తమ్ముడు బ్రతికి ఉండగానే వాలి తన తమ్ముడి భార్యను అపహరించాడు.  (రా.౪.౧౮.౧౮)  అది అధర్మమని రాముడు స్పష్టంగా చెప్పాడు.
{ఔరసీం భగినీం వాపి భార్యాం వాప్యానుజస్య యః|
ప్రచరేత నరః కామాత్ తస్య దండో వధః స్మృతః||}      
కూతురు పట్ల, సోదరి పట్ల, తమ్ముని భార్య పట్ల ఏ నరుడు కామంతో వ్యవహరిస్తాడో అతడికి మరణమే సరియైన దండనం.
ఈ విధంగా వాలి రాజధర్మాన్ని అతిక్రమించాడు.  భ్రాతృధర్మాన్ని కూడా అతిక్రమించాడు. కాబట్టి, నూటికి నూరు శాతం అపరాధి.  దండన తప్పదు.  కాని, నేరుగా దండన విధించడమేనా?  అతడు మారేందుకు ఒక అవకాశం ఇచ్చి ఉండాలి కదా అని ఎవరైనా అనవచ్చు.
సామదానభేదదండోపాయాలు అని నాలుగు ఉన్నాయి.  అపరాధిని నిగ్రహించడానికి అవి నాలుగు మార్గాలు.  వాలి సామోపాయానికి లోబడేవాడైతే తార మంచి మాటలు చెప్పినపుడైనా శాంతించి, తమ్మునితో రాజీకి వచ్చి ఉండేవాడు.  కాని, అలా జరగలేదు.  దానోపాయానికి లోబడేవాడైతే, “అన్నా, రాజ్యం నీదే, నేను నీ దాసుడిగా ఉంటానుఅని సుగ్రీవుడు అన్నపుడే మెత్తబడి ఉండేవాడు.  కాని, అలా జరగలేదు.  భేదోపాయానికి లోబడేవాడైతే రామసుగ్రీవుల స్నేహం సంగతి తెలిసినపుడైనా పరాయివారి జోక్యం వద్దు, మన మధ్య కలహం కూడా వద్దు తమ్ముడూ, కలిసివుందాం రాఅంటూ రాయబారం పంపించి ఉండేవాడు.  కాని, తన బలం పట్ల మితిమీరిన నమ్మకంతో, అతడు రాముని బలాన్ని కూడా తక్కువ అంచనా వేశాడు.  ఏ రాయబారమూ లేదు.  ఈవిధంగా, వాలిపట్ల ఈ సామదానభేదాలు ఏమీ ప్రభావం చూపలేకపోయాయి.  అతడిలో ఎటువంటి మార్పును కలిగించలేకపోయాయి.  వాలిలో ఏ కోశానా కనీసం పశ్చాత్తాపమైనా లేకపోయింది.  కాబట్టి, ఇక మిగిలింది దండోపాయమే.  ఈ విధంగా రాముడికి వాలిని దండించడం తప్ప మరో మార్గం లేకపోయింది.  అంతే కాదు, తన మిత్రుడికి కలిగిన ఆపదను తొలగించడం, అతడిని రక్షించడం మిత్రధర్మం.  రాజధర్మంలో అది అతి సహజం.  “వాలి బ్రతికి వుండగా సుగ్రీవునికి రక్షణ లేదుఅని తేలిపోయిన తరువాతనే, రాముడు వాలిని దండించబూనుకున్నాడు.
ఇక, ఆ దండన ఎలా ఉండాలి అనేది నిశ్చయించవలసినది అపరాధి కాదు.  దండధరుడే ఆ దండం ఎలా విధించాలి, ఎప్పుడు విధించాలి అని తేల్చుకుంటాడు.  తానే స్వయంగా చంపాలా, వేరొకరి చేత చంపించాలా,  ఆ అపరాధిని ముందు నుంచి చంపాలా, వెనుక నుంచి చంపాలా, పదిమందితో ముట్టడించి చంపాలా, తల నరికి చంపాలా, ఉరి తీసి చంపాలా అనేది దండధరుని ఇష్టం.  కాబట్టి, రాముడు తనకు పెద్ద క్లేశకరం కాని పద్ధతిలో వాలిని దండించాడు.
కాబట్టి, సూటిగా చెప్పాలంటేరాముడు వాలితో యుద్ధం చేయలేదు.  యుద్ధం చేస్తేనే ముందునుండి యుద్ధం, వెనుకనుండి యుద్ధం అనే ప్రశ్నలు రావాలి.  ఒక రాజు, ఒక మదాంధుడైన అపరాధిని దండించాడు.  ఇక్కడ అంతకంటె జరిగింది మరేమీ లేదు. 
}}}{{{
ఇక వాలి -  తనకు విధించిన దండనకు అసలు కారణాన్ని విస్మరించి, అందరితోనూ విస్మరింపజేయిస్తూ, అసందర్భమైన ధర్మపన్నాలు చాల వల్లించాడు.
మాంసం కోసం చంపదగిన జంతువులలో వానరం లేదే?”  అని వాలి రాముడిని అడిగాడు.  నిజమే, రాముడు చర్మం కోసమో, లేక మాంసం కోసమో వాలిని చంపలేదు.  రాజు ధర్మాన్ని రక్షించే ఉద్దేశంతో దుర్మార్గుడిని చంపుతాడే తప్ప, అతగాడి మాంసం తినడం కోసం కాదు.
కాని, అసలు వాలి ఆ ప్రశ్నను అడిగిన ఉద్దేశమే వేరు.  నేను నిరపరాధిని అని అతడు పైకి ఎంత దబాయించినా, తమ్ముని భార్యను తాను అపహరించడం తప్పు అని అతనికి అంతరాంతరాలలో తెలుసు. అతడంటే భయం వున్న కిష్కింధలో, అతడి వాదన చెల్లుబాటు అవుతుందేమో గాని, ధర్మజ్ఞుడైన రాముడి ముందు ఆ వాదన చెల్లదని అతనికి స్పష్టంగా తెలుసు.  అందువల్ల, “నరుడెవరైనా అటువంటి తప్పు చేస్తే అతడికి ధర్మశాస్త్రం ప్రకారం మరణదండన విధించాలి కాని, ఆ ధర్మశాస్త్రం జంతువులమైన, వానరులమైన మా పట్ల చెల్లదు కదా?” అనే మెలిక పెట్టదలిచాడు. 
కాని, రాముడి వద్ద ఆ ప్రశ్నకు కూడా సమాధానం ఉన్నది వానరులలో కూడా, బ్రతికి ఉన్న వాడి భార్య జోలికి మరొక వానరుడు పోకూడదు.  కాని, వాలి అటువంటి తప్పు చేశాడు.  అందువల్లనే, “ఓ వానరా!  అని సంబోధించి, నువు వానరుల కట్టుబాటునే ఉల్లంఘించినందువల్ల దండన విధించాను”  (రా.౪.౧౮.౧౯,౨౦) అని స్పష్టం చేశాడు.
నన్ను చంపింది రాజ్యం కోసమా డబ్బుకోసమా?” అని వాలి రాముడిని అడిగాడు.  రాజు ఆ రెండింటి కోసమే ఎవరినైనా చంపుతాడు అనుకొనడం తప్పు.  ఆపదలో ఉన్న తన స్నేహితుడిని కాపాడుకొనేందుకు కూడా రాజు అతడి శత్రువును చంపడం సహజం.
రాజహంతకుడు, గోబ్రాహ్మణహంతకుడు, మిత్రద్రోహి, గురుద్రోహి నరకానికి పోతారుఅని వాలి శాపనార్థాలు పెట్టాడు.  కాని, రాముడు అటువంటి పనులేమీ చేయలేదు.  రాముడి చేత వాలి దండనకు గురి అయ్యాడే తప్ప హత్యకు గురి కాలేదు.  ఈ సందర్భంలో ద్రోహులలోని రకాలను గురించి ప్రస్తావించిన వాలి, తాను చేసిన భ్రాతృద్రోహాన్ని గూర్చి మాట మాత్రమైనా ప్రస్తావించలేదు.  తనకు అపరిచితుడైన రాముడు అడిగితే, అగ్నిసాక్షిగా తన మిత్రుడైన రావణాసురుడిని బాగా తన్ని సీతను తెచ్చేవాడిని అని అన్నాడు. అలాచేస్తే రావణుడికి తాను మిత్రద్రోహం చేసినట్లే అవుతుందని కూడా అనిపించలేదు. 
అసలు నేను నీకు ఏమి అపకారం చేశానని నన్ను చంపావు?” అని అడిగాడు.  అపరాధి ఎవరి పట్ల తప్పు చేసినా, అ తప్పును అతడు చేశాడని ఋజువైతే న్యాయాధికారి అతడికి దండన విధిస్తాడు. అది అతడి విధి.  అతడి ధర్మం. అంతే గాని, అపరాధి పట్ల ఏదో దురుద్దేశం మనసులో పెట్టుకుని దండన విధించినట్లు కాదు.  కాని, “నీకేం అపకారం చేశానని నాకు దండన విధించావు?” అని ఎవరైనా అపరాధి ఆవేశంతో ఒక న్యాయాధికారిని ప్రశ్నిస్తే అది హాస్యాస్పదంగా ఉంటుంది.
సరే, ఇవన్నీ ధర్మవిచారణకు సంబంధించిన విషయాలు.  వాలి చేసిన వాదనలలో ఔచిత్యం ఏమీ లేదని తేలిపోయింది.
ఈరకంగా తన వాదనలు ధర్మానికి గాని, తర్కానికి గాని నిలబడేవి కావని స్వయంగా వాలికి కూడా తెలుసు.  అందువల్ల, “బలవంతుడు ఏమి చేసినా సరైనదే” – అనే సార్వత్రికప్రకృతిన్యాయాన్ని పైకి తీశాడు.  అదే మరొక రకంగా చెప్పాలంటే అరణ్యన్యాయం.  బలమైన పులి బలహీనమైన జింకను చంపేస్తుంది.  ఇది న్యాయమా కాదా అని అడవిలోని జంతువులేవీ విచారణకు కూర్చోవు.  బలమైన జంతువు ఏమైనా చేస్తుంది. మిగిలిన బలహీనజంతువులు ఆ కాసేపు కంగారుపడి అటూ యిటూ పరుగెత్తినా, ఆ తరువాత, ఆ సంఘటనను మరచిపోయి, తమ బ్రతుకుతెరువులో తాము నిమగ్నమైపోతాయి.
అటువంటి అడవిలో పుట్టి పెరిగిన నేను, ఒక బలమైన అడవి జంతువును మాత్రమే అని వాదిస్తే, ఆ రకంగా నేను చేసిన పని జంతుసహజమైనది, అందువల్ల సమంజసమైనదేనంటూ సమర్థించుకోవచ్చునుఅని భావించిన వాలి, “ఓ రామా!  నువ్వు నన్ను వెనుకనుండి కొట్టావు గాని, నాతో నేరుగా తలపడి ఉంటే ఈపాటికి యముడిని చూసి ఉండేవాడివిఅన్నాడు భీకరంగా, తన చివరి వాదనగా తన దేహబలాన్ని ఘనంగా చాటుకుంటూ.
రాముడు ఆ మాటలను కూడా చిరునవ్వుతో కొట్టి పడేశాడు.  వాలి ఆ విధంగా తనను తాను ధర్మానికి లోబడే సామాజికునిగా కాక, అరణ్యన్యాయాన్ని అపేక్షిస్తున్నఅడవి జంతువును అని పరోక్షంగా ప్రకటించుకోగానే  – “బలమైన అడవి జంతువులను, అవి ఏమరుపాటుగా ఉన్నప్పటికీ, చాటునుండి వేటాడటం క్షత్రియులకు సహజమే, అందులో దోషమేమీ కాదుఅని తేల్చేశాడు.
{విధ్యంతి విముఖాంశ్చాపి న చ దోషోత్ర విద్యతే|”  (రా.౪.౧౮.౪౧)}
[కొందరు ఈ సందర్భంగా ఇంద్రుడు వాలికి ప్రసాదించిన ఒక హారాన్ని గూర్చి, ప్రస్తావిస్తారు.  వాల్మీకి రామాయణంలో కూడా ఆ హారం ప్రస్తావించబడింది.  దానిని ఎవరైనా ధరిస్తే, అతడు యుద్ధం చేసేటపుడు ఎదుట నిలిచినా ప్రత్యర్థిలోని శక్తిని అది అమాంతం లాగేస్తుంది అంటూ దాని గూర్చి చెబుతారు.  కాని, ఆ కథను గూర్చిన చర్చ ఇక్కడ చేయటం లేదు.]
}}}{{{
ఇంత జరిగాక, వాలికి మరే రకమైన వాదనా మిగలలేదు.  తన వాదనలన్నిటికీ రాముని వద్దనుండి ధర్మబద్ధమైన రీతిలో సమాధానాలు దొరికాయి.  చివరకు తాను చేసింది తప్పు అని గ్రహించాడు. తనను చంపడంలో రాముడు ఎటువంటి తప్పునూ చేయలేదని అంగీకరించాడు.
{న దోషం రాఘవే దధ్యౌ ధర్మేధిగత నిశ్చయః|” (రా.౪.౧౮.౪౬)}
అంతే కాదు,
నువ్వు చెప్పినది సరైనదే రామా!అన్నాడు.  “నేను నిన్ను బాధిస్తూ పలకడం పొరబాటేఅన్నాడు.
{యత్ త్వమాత్థ నరశ్రేష్ఠ!  తదేవం నాత్ర సంశయః| (రా.౪.౧౮.౪౭)}
{తదయుక్తం మయా పూర్వం ప్రమాదాదుక్తమప్రియమ్| (రా.౪.౧౮.౪౮)}
ఓ ధర్మాత్ముడా!  నన్నుఆదరించుఅని శరణువేడాడు.
{మాం ధర్మజ్ఞ పరిపాలయ! (రా.౪.౧౮.౫౦)}
అతడికి ప్రేమాస్పదులైన వారెవరికీ ఎటువంటి హాని జరుగదని, వారందరూ కూడా మునుపటిలాగానే సుఖంగా ఉంటారని సుగ్రీవుడి తరపునరాముడు వాలికి అభయం ప్రసాదించాడు.(రా.౪.౧౮.౬౭)
}}}{{{
చివరలో వాలి మరొక రహస్యం కూడా చెప్పాడు– “ఓ రామా!  నా భార్య అయిన తార సుగ్రీవుడితో యుద్ధం వద్దు అని నన్ను వారిస్తూ ఉన్నప్పటికీ, నీ చేతిలో చావు కోరే నేను వచ్చాను”.  (రా.౪.౧౮.౬౦)
{త్వత్తోహం వధమాకాంక్షన్ వార్యమాణోపి తారయా|
సుగ్రీవేణ సహ భ్రాత్రా ద్వంద్వయుద్ధముపాగతః||}    
ముందే అనుకున్నట్టు నేను నిరపరాధిని అని పైకి ఎంతగా దబాయించినా, వాలికి తన అంతరాంతరాలలో తాను అపరాధిని అని తెలుసు.  అందువల్లనే ధర్మాత్ముడని పేరుపొందిన రాముడి చేతిలో దండన అనుభవించాలని రహస్యంగా కోరుకుని ఉండవచ్చు.  బానే వుంది.  మరి, ఆవిధంగా చావాలని వచ్చినవాడు తన కోరిక నెరవేరితే హాయిగా చచ్చిపోవాలి గాని, రాముడిని అన్ని రకాలుగా తిట్టడం ఎందుకు అని సందేహం రాదా?
వస్తుంది, ఎందుకు రాదు?
యోగశాస్త్రంలో అభినివేశం అని పరిభాషాపదం ఉన్నది.  అది పంచక్లేశాలలో ఒకటి.  దాని ప్రభావమే వాలి రాముడితో చేసిన వాదనలు.
కాని, వాలి దూషణలకు రాముడు కోపం తెచ్చుకోలేదు.  సంయమనం కలిగి ప్రశాంతంగా సమాధానాలు చెప్పాడు.   సంయమం అనేది కూడా యోగశాస్రపు పారిభాషికపదమే.  సంయమం కలిగినవాని ప్రజ్ఞ అమోఘమైనదని కూడా యోగ శాస్త్రం చెబుతుంది.  తత్ఫలితంగా అపరాధి తన దోషం తెలుసుకున్నాడు.
ఓ రామా! నీబాణం దెబ్బ తీవ్రంగా తగలగానే నాకు చిత్తక్లేశం కలిగింది.  దాంతో అభినివేశం పెచ్చరిల్లి నిన్ను దూషించాను.  నన్ను క్షమించు.అని తెలివి వచ్చిన తరువాత వాలి స్వయంగా చెప్పాడు.  (రా.౪.౧౮.౬౯)
{శరాభితప్తేన విచేతసా మయా ప్రదూషితస్త్వం యదజానతా ప్రభో|
ఇదం మహేన్ద్రోపమ భీమవిక్రమ ప్రసాదితస్త్వం క్షమ మే నరేశ్వర||}
ఈ విధంగా వాలి అభినివేశం, రాముని సంయమనం మూలకంగా మనకు రామాయణంలో ఈ అద్భుతమైన ఘట్టం లభించింది.
}}}{{{
అందరికీ శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు.
శ్రీరాముని అనుగ్రహం చేత యావజ్జనులు సమస్తక్లేశదూరులై సంయమనం కలిగి, సుఖసంతోషాలతో వర్ధిల్లుదురు గాక!
{*సర్వమిదం యేన ప్రసాదితం మచ్ఛరణ్యాయ తస్మై శ్రీరామాయ పునః సద్యః సమర్ప్యతే*}


No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...