సీతారామలక్ష్మణులు దండకారణ్యంలో ప్రవేశించారు. సీతను అపహరించజూచిన విరాధుని రామలక్ష్మణులు సంహరించారు. శరభంగమహర్షి ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ వానప్రస్థులైన వైఖానస-వాలఖిల్యాది మునులు అనేకులు రాముని సందర్శించారు.
शरभङ्गाश्रमे रामम् अभिजग्मुश्च
तापसाः। (రామాయణం.3.6.6)
“నాయనా,
మేము దుంపలను ఫలాలను మాత్రమే భుజిస్తూ మా ధర్మాలను మేము నిర్వర్తిస్తూ ఉన్నాము. శాస్త్రం ప్రకారం మా ధర్మఫలంలో నాల్గవభాగం మమ్మల్ని రక్షించే ప్రభువుకు చెందుతుంది.
तत्र राज्ञश्चतुर्भागः प्रजा धर्मेण रक्षतः। (రామాయణం.3.6.14)
“కాబట్టి మా తపోధనంలో నాల్గవభాగం (25%) మేము మీకు పన్ను కడుతున్నట్టే లెక్క.
ప్రజల ఆదాయం నుండి కనీసం ఆరవభాగం (17%) పన్నుగా
స్వీకరించి కూడా ఆ ప్రజలను కన్నబిడ్డల్లా కాపాడని ప్రభువుకు గొప్ప అధర్మం
కలుగుతుంది”.
अधर्मस्तु महांस्तात भवेत्तस्य महीपतेः।
यो हरेद्बलिषड्भागं न च रक्षति पुत्रवत्।। (రామాయణం.3.6.11)
అంటూ స్పష్టం చేశారు. ముందరి
కాళ్ళకు బంధం వేశారు. అప్పుడు తమ బాధలను చెప్పుకున్నారు
–
“రామా! రాక్షసులు చాలామంది
మునులను నిష్కారణంగా చంపేశారు. ఇదుగో, వారి
శరీరాలు దగ్గరలోనే పడి ఉన్నాయి. వచ్చి
చూడు”.
एहि पश्य शरीराणि मुनीनां भावितात्मनाम्।
हतानां राक्षसैर्घोरैः बहूनां बहुधा वने।। (రామాయణం.3.6.16)
“మేము నిన్ను శరణు కోరుతున్నాము. ఓ వీరుడా!
నీవు తప్ప మాకు మరో దిక్కు లేదు.
మమ్మల్ని ఆ రాక్షసుల బారినుండి కాపాడు”.
రాముడు ఆ మాటలను విని ఆవేదన చెందాడు.
“అయ్యలారా! మీరు నన్ను ఈ
విధంగా వేడుకొనడం తగదు. మీ మాటలు నాకు
ఆజ్ఞగా భావిస్తాను. మీ మాటపై ఎవరి జోలికీ
పోని తపస్వులకు శత్రువులైన రాక్షసులను యుద్ధంలో చంపదలచుకున్నాను” అని మాట ఇచ్చాడు.
नैवमर्हथ मां वक्तुम् आज्ञप्तोऽहं तपस्विनाम्। (రామాయణం.3.6.21)
तपस्विनां रणे शत्रून् हन्तुमिच्छामि राक्षसान्। (రామాయణం.3.6.25)
తరువాత సీతారామలక్ష్మణులు మరలా అరణ్యంలో సంచారం ప్రారంభించారు. ఆ సందర్భంలో సీతమ్మ రాముని ఒక మాట అడిగింది.
“ఓ రాఘవా! వినా వైరం రౌద్రతా
(ఎటువంటి వ్యక్తిగతశత్రుత్వం లేకపోయినప్పటికీ వేరొకరిని చంపబూనడం) ఎంతవరకు సమంజసం? దండకారణ్యంలో ఉన్న రాక్షసులతో
ఎటువంటి శత్రుత్వమూ నీకు లేదు. వారిని నీవు
నిష్కారణంగా సంహరించడం నాకు ఇష్టం లేదు.”
बुद्धिर्वैरं विना हन्तुं राक्षसान् दण्डकाश्रितान्।
अपराधं विना हन्तुं लोकान् वीर न कामये।।(రామాయణం.3.9.25)
“మనం ఇప్పుడు వనవాసం చేస్తున్నాం.
కాబట్టి తపస్సు మాత్రమే చేసుకోవాలి.
మళ్ళీ అయోధ్యకు వెళ్లి మీరు రాజు ఐన తరువాత మరలా క్షత్రియధర్మం పాటించుదురు
గాని.
देशधर्मस्तु पूज्यताम्। (రామాయణం.3.9.28)
भवेस्त्वं निरतो मुनिः। (రామాయణం.3.9.28)
पुनर्गत्वा त्वयोध्यायां क्षत्त्रधर्मं चरिष्यसि। (రామాయణం.3.9.28)
{అంతవరకు రాక్షసులతో యుద్ధం గిద్ధం అనే మాటలు పక్కన పెట్టండి}”
అని స్పష్టంగా చెప్పింది.
రాముడు సీతమ్మకు తగిన సమాధానమే చెప్పాడు –
हितमुक्तं त्वया देवि त्वयैवोक्तमिदं वचः।
क्षत्त्रियैर्धार्यते चापो नार्तशब्दो भवेदिति।। (రామాయణం.3.10.3/4)
“ఓ దేవీ! ఇంతకు మునుపు నువ్వే
నాతో ఒకసారి ఒక మంచి మాట చెప్పావు గుర్తుందా?
ఆర్త శబ్దం వినబడకుండా ఉండేందుకే క్షత్రియులు ధనుస్సును (ఆయుధాన్ని)
ధరిస్తారు అని?” అన్నాడు.
“నీవు తప్ప మాకు వేరే దిక్కు ఎవరూ లేరు అని ఆ మునులు నాతో మొర
పెట్టుకున్నారు. వారి ఆర్తిని
క్షత్రియుడనైన నేను దూరం చేయకుండా ఎలా ఉండగలను?
అందువల్లనే వారిని కాపాడతానని మాట ఇచ్చాను. ఇపుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎలా
ఉండను? నా ప్రాణాన్నైనా
వదులుకుంటాను. నిన్నూ, లక్ష్మణుడిని కూడా వదులుకుంటాను గాని, ఇచ్చిన మాటను మాత్రం
వదులుకోలేను”.
अप्यहं जीवितं जह्यां
त्वां वा सीते सलक्ष्मणाम्
न तु प्रतिज्ञां संश्रुत्य। (రామాయణం.3.10.19)
“అసలు వారు నన్ను అడగకున్నా వారిని కాపాడటం నా కర్తవ్యం. ఇక మాట ఇచ్చిన తరువాత మరొకవిధంగా నేను చేయలేను”
అంటూ స్పష్టంగా చెప్పాడు.
||
తనదాకా వస్తే కానీ
||
అనంతరకాలంలో శూర్పణఖ సీతమీద దాడికి దిగబోయింది. లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి
పంపించాడు. ఆమె తన సోదరులైన ఖరదూషణత్రిశిరులను
రామలక్ష్మణుల మీదికి ఉసిగొలిపింది. రాముడు
వారిని వారి పద్నాలుగు వేలమంది అనుచరులతో సహా చంపేశాడు. అపుడు సీత భయం తొలగి ఆనందించింది.
बभूव हृष्टा जनकात्मजा। (రామాయణం.3.30.41)
ధర్మాధర్మాలు ఎలాగున్నా, తన అనుచరులను చంపినందుకు రావణుడు రామునిపై ప్రతీకారం
తీర్చుకోదలిచాడు.
కాని, “ఓ రావణా! నువు రాముని
యుద్ధంలో జయించలేవు”
न हि रामो दशग्रीव शक्यो जेतुं त्वया युधि। (రామాయణం.3.31.27)
అని అకంపనుడు స్పష్టంగా చెప్పిన మీదట, రామునితో నేరుగా తలపడే దమ్ము
రావణుడికి లేకపోయింది. కాని, అదే అకంపనుడు
రావణుడికి మరో ఉపాయం చెప్పాడు.
तस्यापहर भार्यां त्वं प्रमथ्य तु महावने।
सीतया रहितः कामी रामो हास्यति जीवितम्।। (రామాయణం.3.31.31)
“రావణా! రాముని
ఎలాగైనా మోసం చేసి, అతని భార్య ఐన సీతను ఎత్తుకొచ్చేయ్. కామాత్ముడైన రాముడు సీత లేకపోయేసరికి ప్రాణాలు
వదిలేస్తాడు’’ అని చెప్పాడు.
రావణుడికి ఆ మాట నచ్చింది.
अरोचयत तद्वाक्यं रावणो राक्षसाधिपः। (రామాయణం.3.31.32)
చివరకు రావణుడు అలాగే చేశాడు. మారీచుడితో కలసి మాయను పన్ని, సీతను ఎత్తుకొచ్చేశాడు. వారి పన్నాగం దాదాపు ఫలించినట్టే అనిపించింది. సీత కనబడకపోయేసరికి రాముడికి మతి పోయినంత
పనైంది. పాపం ఏడిచాడు. సీత ఏదీ ఏదీ అని కనిపించిన చెట్టు పుట్టలను అడిగాడు. పక్షులను జంతువులను అడిగాడు. ఆమె ఎటువంటి బాధలు పడుతోందో అని వగచాడు. కానీ, ఆ బాధ త్వరలోనే కోపంగా మారింది.
సీతను
ఎత్తుకుపోయింది వీరే అని ఎవరిమీదనైనా అనుమానం వస్తే వారిమీదకు కోపంతో
ఉరకబోయాడు. నన్ను చేతగానివాడని
భావిస్తున్నారేమో!
निर्वीर्य
इति मन्यन्ते नूनं माम्। (రామాయణం.3.64.57)
“సీత క్షేమంగా
ఉండకపోతే నా బాణాలతో ముల్లోకాలకూ మర్యాదలు లేకుండా చేస్తాను. (సరిహద్దులనేవి లేకుండా ధ్వంసం చేసి
పారేస్తాను.)” అనేంతవరకూ పోయాడు.
निर्मर्यादान्
इमान् लोकान् करिष्याम्यद्य सायकैः। (రామాయణం.3.64.71)
చివరకు తన కోపాన్ని
సక్రమమైన మార్గంలోనికి మలిచాడు.
సుగ్రీవునితో స్నేహం చేశాడు. అతడు
పోగొట్టుకున్న రాజ్యం అతనికి వచ్చేలా చేశాడు.
హనుమంతుడు సీతమ్మ ఎక్కడ ఉన్నదో వెతుకుతూ లంకకు చేరుకున్నాడు. అశోకవనంలో ఆమెను చూశాడు. “తల్లీ, నువు నాతో వస్తే నిన్ను రాముని వద్దకు
చేరుస్తాను” అన్నాడు.
కాని, సీతమ్మ
అందుకు ఒప్పుకోలేదు. “అలా కాదు” అన్నది.
यदि
रामो दशग्रीवम् इह हत्वा सबान्धवम्।
मामितो
गृह्य गच्छेत तत् तस्य सदृशं भवेत्।। (రామాయణం.3.37.64)
“రాముడు స్వయంగా
వచ్చి, ఈ రావణాసురుడిని అతడి బంధువులందరితో సహా చంపి, నన్ను సగౌరవంగా ఇక్కడినుండి
తీసుకుని పోతే అది అతని బలపరాక్రమాలకు తగిన విధంగా ఉంటుంది” అన్నది.
చివరకు రామునికి అంతపని చేయక తప్పలేదు. అందుకే, తనదాకా వస్తే గాని, ఒక ఆదర్శంలో ఔచిత్యం తెలియదని పెద్దలు అంటారు.
చివరకు రామునికి అంతపని చేయక తప్పలేదు. అందుకే, తనదాకా వస్తే గాని, ఒక ఆదర్శంలో ఔచిత్యం తెలియదని పెద్దలు అంటారు.
{భక్తులకు గమనిక –
ఈ సందర్భంలో సీతమ్మ వారిని సాధారణ మానవస్త్రీ గా మాత్రమే పరిగణించి ఈ వ్యాసము
వ్రాయడమైనది.)
No comments:
Post a Comment