క్షరం తు అవిద్యా - అమృతం తు విద్యా
''అవిద్య నశించిపోయేది. విద్య మాత్రము అమరం."
"కోటి విద్యలు కూటి కొరకే" అంటారు కదా? మరి ఆ కోటి విద్యలూ అమరమేనా?
కాదు. ఎందుకంటే అవి నిజానికి అవిద్యలు. మనం ఎంతో ప్రేమగా కూడు పెట్టి పోషించుకునే ఈ శరీరమే పెద్ద అశాశ్వతమైన వస్తువు. అశాశ్వతమైన దాన్ని పోషించుకునే విద్య శాశ్వతం అమరం ఎలా అవుతుంది? కానే కాదు. ఇవన్నీ నిజానికి మనం విద్యలని భ్రమిస్తున్న అవిద్యలు.
మరి విద్య ఏమిటి?
"సా విద్యా యా విముక్తయే". విముక్తిని కలిగించేదే అసలైన విద్య. విముక్తి అంటే బంధనం నుండి బయటపడటం.
అంటే? ఉద్యోగం రాగానే తన వాళ్లనుండి విముక్తిని పొంది వేరే వూరికో వేరే దేశానికో పరుగులెత్తేందుకు ఉపయోగపడేదేనా విద్య అంటే?
కాదు. అది బంధువులతో వచ్చిన బంధాన్ని తెగదెంపి కొత్త బంధాన్ని కల్పించేది మాత్రమే. తల్లిదండ్రుల బాధ్యతను వదులుకుని ఆఫీసు పనుల బాధ్యతను స్వీకరిస్తే అది విముక్తి ఎలా అవుతుంది?
మరి?
"ద్వే విద్యే వేదితవ్యే పరా చైవాపరా చేతి" అని ముండకోపనిషద్బోధ. (1.4)
అపరా విద్య అంటే వేదవేదాంగాలు. (వీటి వలన కూడా విముక్తి లేదు.
ఇవి అసలైన విద్యను సాధించేందుకు తోడ్పడే సాధనాలు మాత్రమే.)
"అథ పరా యయా తదక్షరమధిగమ్యతే" - ఏ విద్య వలన అమృతత్వం, అమరత్వం (విముక్తి) లభిస్తాయో అదే పరా విద్య.
నిజానికి బంధనమంటే జననమరణాలే. ఈ జన్మలో పడినన్ని బాధలు పడి మరణించినా బంధనం నుంచి తప్పించుకోలేము. మళ్లీ పుట్టవలసిందే. మళ్లీ మరణించవలసిందే. ఈ జననమరణాలు అనంతచక్రంలా పరిభ్రమిస్తూనే ఉంటాయి. ఈ మహాబంధనం నుండి విముక్తిని కలిగించేదే విద్య. నిజమైన విద్య. పరా విద్య.
అదే ఆత్మవిద్య. (తాను ఎవరో తాను తెలుసుకునే విద్య.) అదే బ్రహ్మవిద్య కూడా.
కస్త్వమ్? కోఽహమ్? కుత ఆయతః? తత్త్వం చింతయ తదిహ భ్రాతః! (తమ్ముడూ, నువ్వెవడవో? నేనెవడనో? నువు ఎక్కడనుంచి వచ్చావో? ఆ తత్త్వాన్ని గురించి చింతన చేయవయ్యా) అంటారు శంకరులు తమ మోహముద్గరంలో. ఆత్మవిద్యను నేర్చుకున్నవారు మాత్రమే ఆ క్వశ్చన్ పేపరును ఆన్సర్ చేయగలరు.
సరే. ఆవిద్యను నేర్చుకొనడం ఎలా?
అద్భుతం. అసలు ఇలా ఆత్మవిద్యను నేర్చుకుందామనే సంకల్పం కలగడమే కోటానుకోట్ల జన్మల పుణ్యఫలం.
ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనమ్
ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః।
ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి
శృత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్।।
(గీత2.29)
ఈ ఆత్మవిద్యను ఒకడు ఆశ్చర్యంగా చూస్తాడు. మరొకడు ఆశ్చర్యంగా చెబుతాడు. వేరొకడు ఆశ్చర్యంగా వింటాడు. కాని ఈ చూసినా, చెప్పినా, విన్నా దానిని తెలుసుకోగలిగినవాళ్లే ఎవరూ లేరు. ఎందుకంటే అది బ్రహ్మవిద్య మరి!
కాని, ఆ విద్యను నేర్చుకుందామనే సంకల్పం అందరికీ కలగదనుకున్నాం కదా? వేలాది మనుషులలో ఎవడో ఒక్కడికి సంకల్పం కలిగి ప్రయత్నిస్తాడు. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే. అలా ప్రయత్నించే వారిలో నూటికో కోటికో ఒకరికి సిద్ధి కలుగుతుందట. (గీత 7.3)
వారు ముక్తులంటే. అదీ విద్య అంటే.
విద్యాపీఠంలో నడుస్తుంటే ఇటువంటి ఫలకాలు దారి పక్కనే నిలబడి పలకరిస్తూ మనకు చిన్న చిన్న వాక్యాలతో పెద్ద పెద్ద పాఠాలను బోధిస్తూ ఉంటాయి.
No comments:
Post a Comment