అబ్బో ఆ మనిషి గొప్ప ధీమంతుడురా అంటూ ఉంటాం. లేదా వింటూ ఉంటాం. మనకున్న అభిమానాన్ని బట్టో కలిగిన ఆశ్చర్యాన్ని బట్టో ఎవరినైనా అలా ప్రశంసిస్తాం గాని...
...అందరూ ధీమంతులు కాగలరాా? ధీగుణాలు కలిగినవారు మాత్రమే ధీమంతులు కాగలరు. మరి ధీగుణాలు ఏమిటి?ఎనిమిది ధీగుణాలు కామందకీయరాజనీతిశాస్త్రంలో చెప్పబడ్డాయి. (వాటిని శంకరార్యులు తన జయమంగళవ్యాఖ్యలో నిర్వచించారు. శంకరార్యులు వేరు, శంకరాచార్యులు వేరు)
వాటిని క్రింద పట్టికలో పొందుపరచాను.
చాణక్యులవారు తమ అర్థశాస్త్రంలో కూడా ఈ ఎనిమిది ధీగుణాలను చెప్పారు. ఈ క్రింద చెప్పిన క్రమంలో కాక, ధారణకు ఊహకు నడుమ 'విజ్ఞానం' అనే ధీగుణాన్ని పేర్కొన్నారు.
విజ్ఞానం అంటే నిర్వచనం - వివిధసాధ్యసాధనస్వరూపవివేకజ్ఞానమ్ - అని. అంటే అర్థం చేసుకున్న విషయాలలో నేను సాధింపదగినది ఇది అని, సాధించేందుకు ఉపయోగపడే సాధనం ఇది అని వాటి నడుమ తేడాను తెలుసుకొనగలగటం. సాధనం అంటే పరికరం - instrument.
బుద్ధి, నైపుణ్యం, తెలివితేటలు సాధ్యాలు. అంటే సాధింపదగినవి. వాటిని సాధించాలంటే పుస్తకాలు కేవలం సాధనాలు. సాధించవలసినది పుస్తకాలను కాదు కదా?
{{ అలాగే, మనిషి సుఖపడాలంటే ధర్మం చేయాలి. కాబట్టి ధర్మం అనేది సాధ్యం. (సాధింపదగినది.) తల్లిదండ్రులను గురువులను సేవించడం, అతిథులను ఆదరించటం, పేదలను ఆదుకొనటం, ప్రాణుల పట్ల దయతో వ్యవహరించటం, చెట్లు నాటటం, చెఱువులు బావులు తవ్వించటం మొదలైనవి ధర్మకార్యాలు అనుకుందాం.
అయితే ఇవన్నీ చేయటం అంత సులువు కాదు. అందుకు తగినంత ధనం కావాలి. కాబట్టి ధనం అనేది ధర్మం సాధించడానికి ఒక సాధనం (instrument) మాత్రమే.
((ఒకప్పుడు సాధ్యమైన వస్తువు మరొకప్పుడు అంటే సాధింపబడిన తరువాత వేరొక దానిని సాధించేందుకు సాధనం కావచ్చు.))
ధనాత్ ధర్మం - తతః సుఖమ్ అనేది క్రమం. సంపాదించిన ధనంతో ధర్మం చేయాలి. ఆ ధర్మం వలన సుఖం కలుగుతుంది అనేది క్రమం. అలా కాకుండా నేరుగా ధనంతో సుఖాన్ని పొందగోరటమే అక్రమం.
కాని, మనుషులు ధనమే సాధ్యమనుకుని, ధర్మాన్ని మరచిపోయి ధనాన్ని సాధించడంలోనే తమ యావజ్జీవితాన్ని గడిపేస్తున్నారు. అంటే దేవుడి పటాన్ని దానికి చేయవలసి పూజను విడిచిపెట్టి ఆ పటాన్ని గోడకు వేలాడదీయటానికి ఉపయోగపడే మేకులను పోగుచేసుకుంటున్నాడన్నమాట.
ధనం సంపాదిస్తే చాలు సుఖపడతాం కదా, మరలా ధర్మం దేనికి అనుకోవచ్చు. అలాగని, ధర్మం విడిచి, అక్రమార్జన చేస్తే, దొంగతనాలు, దోపిడీలు మోసాలు చేసి ధనం సంపాదిస్తే ఆ మనిషికి భౌతికంగానో లేదా మానసికంగానో పీడ తప్పదు. అతడు ధనం సంపాదించిన తీరు తెలిస్తే అతడికి భౌతికంగా దండన తప్పదు. ఒక వేళ అధికారులకు తెలియకున్నా, మానసికంగా నేను ఎప్పుడు పట్టుబడతానో అనే భయం అతన్ని వేధిస్తూ సుఖపడనివ్వకుండా చేస్తుంది కదా.
అటువంటి అధర్మపరుడు బయటకు చాల అందంగా కనిపిస్తున్నా లోపల చెదలు కొట్టేసిన చెట్టులాంటివాడు. }}
సరే,, తాను రాజు కావాలని కోరుకున్నవాడికి ఈ ధీగుణాలు తప్పక ఉండాలని రాజనీతిశాస్త్రజ్ఞుల తాత్పర్యం.
కాని, మన దురదృష్టవశాత్తు కాస్త డబ్బుండి, కాస్త మాటకారితనం ఉండి, కాస్త జనాలను పోగేయగలగటం చేతనైనవారందరూ ఈ రోజుల్లో నాయకులు రాజులు ఐపోతున్నారు.
అయితే వారందరూ గొప్ప రాజులు కాలేరు. మిణుగురుపురుగు స్వయంప్రకాశకం కాబట్టి దానిని సూర్యుడు అనగలమా?
No comments:
Post a Comment