Sunday, 5 December 2021

దేశమంతా అర్జునులు ఉన్నారు. ఒకే ఒక్క కృష్ణుడు కావలెను.


 


1 అర్జునవిషాదయోగం

నాటి అర్జునుడి మానసికపరిస్థితిని చూస్తుంటే నేటి భారతీయుల మానసికపరిస్థితి గుర్తుకు వస్తోంది.

అవతలివాడి జోలికి పోకుండా తమ దారిన తాము బ్రతుకుదామనుకున్నప్పటికీ ఆ అవతలివాడు తమ ఉనికిని కూడా సహించలేకపోతున్నాడు అని తెలుసును.

బాల్యంలోనే తమ బలాన్ని (భీముడిని/ఐక్యతను) ఓర్వలేక, ఆ అవతలివాడు కపటంతో స్నేహం నటిస్తూనే విషం పెట్టి చంపజూశాడు అని తెలుసును.

తాము ప్రజల అభిమానాన్ని చూరగొంటూ ఉంటే సహించలేక ఆ అవతలివాడు రాజధానినుండి తమను వెళ్లగొట్టి వేరొకచోట తమను తమ తల్లితో సహా సజీవదహనం చేసేందుకు దారుణమైన ప్రయత్నం చేశారని తెలుసును.

తమ పౌరుషంతో దిగ్విజయం చేసి సార్వభౌములైనప్పటికీ ఏమాత్రం గర్వాన్ని ప్రదర్శించకుండా ఆ అవతలివాడిపై సహజమైన అతి సౌమ్యమైన సౌభ్రాతృత్వం కనబరచినప్పటికీ వాడు తమపై అసూయపడి, మయా ద్యూతంలో తమ సమస్తసంపదలను తమ రాజ్యాన్ని కాజేశారని తెలుసును.

సభలో అందరిముందూ తమ ధర్మపత్నిని ఆ అవతలివాడు విచక్షణారహితంగా అవమానం పాలు చేయాలని ప్రయత్నించిందీ తెలుసును.

ఆ అవతలివాడు తమను అడవులపాలు చేసింది చాలక తాము అడవిలో పడుతున్న అగచాట్లను కళ్లారా చూసి ఆనందించేందుకు, తమకు ఏమాత్రం అపరిచితం కాని వైభవాన్ని తమకే చూపి తమలో ఈర్ష్యను రాజేయాలనే ఉద్దేశంతో ఘోషయాత్ర పేరిట చేసిన దుస్సాహసం తెలుసును.

తాము అడవిలో ఉన్నప్పటికీ తమను వేలాదిమంది పండితవరేణ్యులు ఆశ్రయించి అండగా ఉండటం ఆ అవతలివాడు సహించలేక, తమను దూర్వాసమహర్షి శాపానికి గురిచేయాలని విఫలయత్నం చేసిన విషయం కూడా తెలుసును.

మహాసార్వభౌమపదవిని అలంకరించిన తమ పెద్దన్నతోబాటు, మహాసమ్రాజ్ఞిగా పదవీశోభితురాలై ఉండిన తమ ధర్మపత్నితో పాటుగా తమను అజ్ఞాతవాసంలోనికి నెట్టి, కఠినమైన సేవకవృత్తిని అవలంబించవలసి వలసి వచ్చేట్లు చేశాడని కూడా తెలుసును.

పరిస్థితులకు తలవొగ్గి, ఆ అవతలివాడు విధించిన సమస్తనియమాలను తు చ తప్పకుండా పాటించినా చివరకు ఆ అవతలివాడు తమ వంతు వచ్చేసరికి ఆ నియమాలను ఉల్లంఘించి తమకు తమ రాజ్యాన్ని అప్పగించకుండా సూది మొన మోపినంత భూమిని కూడా ఇవ్వను పొమ్మన్నది కూడా తెలుసును.

తాము ఇపుడు యుద్ధానికి దిగినది తమ వంతు రాజ్యాన్ని సాధించుకునేేందుకేనని కూడా తెలుసును.

అయినా సరే,
అయినా సరే,

స్వయంగా మహావీరుడైనప్పటికీ, సమస్తకౌరవసైన్యాన్ని ఒక్క పాశుపతంతో క్షణకాలంలో భస్మీపటలం చేయగలిగిన మహాశక్తిమంతుడై ఉన్నప్పటికీ, తమను జీవితాంతం సంతోషంతో ఉండనివ్వకుండా దుఃఖసముద్రంలో ముంచదలచినవాడు, వీలైతే తమను సమూలంగా అంతం చేసేందుకు సర్వవిధప్రయత్నాలను అలుపెరగకుండా చేసిన ఆ అవతలివాడు ఎవడో కాదు, స్వయానా తమ సోదరుడే అని, అతడితో నేను యుద్ధం చేయడమా? వద్దు, యుద్ధం చేయను అని భావించడం ఆనాడు ఒక్క అర్జునుడికే చెల్లింది. అది అర్జునవిషాదం.

వీళ్లందరూ ఎవరు? నావాళ్లే కదా? నాతో కలసి ఇదే దేశంలో బ్రతుకుతున్నవాళ్లే కదా? వీరు నా పట్ల ఎంతటి శత్రుత్వం కనబరుస్తూ ఎన్ని విధాలుగా తమను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నా వీరిపట్ల నేను శత్రుత్వం వహించలేను అని భావించడం ఈనాడు కేవలం భారతీయులకే చెల్లింది. ఇది సమస్తభారతీయవిషాదం.

చివరకు అర్జునుడి విషాదం ఎంతవరకు వచ్చిందంటే,
"ఏతాన్న హన్తుమిచ్ఛామి
ఘ్నతోఽపి మధుసూదన" (గీత1.35)
"వీరి చేతిలో నేను చంపబడినా నాకు సమ్మతమే గాని, నేను మాత్రం వారిని చంపదలచుకోను" అనేంతవరకు వచ్చింది.

ఆ అవతలివాడు తమకు ఎన్ని అపకారాలు చేసినా, తమ పట్ల ఎన్ని అపరాధాలు పౌనఃపున్యంగా చేసినా, చివరకు పదకొండు అక్షౌహిణుల సైన్యాన్ని ప్రోగు చేసుకుని సమస్త ఆయుధాలు ధరించి, దయాదాక్షిణ్యాలు లేకుండా ఆ మరుసటి క్షణంలోనే తమను క్రూరాతిక్రూరంగా చంపడానికి సంసిద్ధంమై ఉరకలు వేస్తూ ఉన్నప్పటికీ, వారిని స్వజనం (నావారు) గా భావించి వారి పట్ల కనికరమే కనబరచడం అర్జునుడికే చెల్లింది.

స్వజనం హి కథం హత్వా
సుఖినః స్యామ మాధవ (గీత1.37)

"మనవారిని మనమే చంపుకుని మనం ఎలా సుఖంగా ఉండగలం కృష్ణా?" అని ప్రశ్నించాడు.

ఆ అవతలివారు కాశ్మీరంలోను, బెంగాల్లోను, కేరళలోను నరమేధం చేశారు. చేస్తున్నారు. అమాయికులైన పాల్ఘర్ సాధువులను తలలు పగులగొట్టి చంపేశారు. దేవాలయాలను ధ్వంసం చేశారు. ధ్వంసం చేయాలని తమవారికి పిలుపునిస్తున్నారు. లవ్ జిహాద్ పేరిట తెగబడుతున్నారు. భైంసాను తగులబెట్టారు. పండుగలను, ఆచారాలను అవహేళను చేస్తున్నారు. ఆచారవంతులను మూర్ఖులని అవహేళన చేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నెన్నో అకృత్యాలు చేశారు. పదిహేను నిమిషాల్లో ముగించేస్తాం అని తమ ఉద్దేశాన్ని స్పష్టంగా బయటపెట్టుకున్నారు. అయినా వీరంతా నావారు అనుకొనడం ఈనాడు భారతీయులకే చెల్లింది.

కృష్ణా, వీరిని చంపడం మహాపాపం.
అహో బత మహత్పాపం (గీత1.45)

నేను ఏ మాత్రం స్పందించను. నేను ఆయుధం ధరించను. వారందరూ కత్తులు పట్టి నన్ను చంపినా సరే, అదే నాకు క్షేమం.
యది మామ్ అప్రతీకారమ్
అశస్త్రం శస్త్రపాణయః।
ధార్తరాష్ట్రా రణే హన్యుః
తన్మే క్షేమతరం భవేత్।। (గీత1.46)
అని భావించడం విషాదం కాక మరేమిటి?

అది విషాదం ఎందుకైంది?
విషమ్ అత్తి (విషమును తింటుంది) కాబట్టి విషాదమైంది. విషం తినడమంటే ఏమిటి? చావును కోరి తెచ్చుకోవడం అన్న మాట. ఆత్మహత్య అన్న మాట. అర్జునుడు ఆత్మహత్యకు పూనుకున్నట్టే లెక్క. అది అధర్మం.

ఎందువల్ల అధర్మం?
అర్జునుడు క్షత్రియుడు. ధర్మరక్షణకోసం, ప్రజారక్షణకోసం యుద్ధం చేయటం, అవసరమైతే యుద్ధంలో ప్రాణాలర్పించడం క్షత్రియధర్మం. తన ధర్మాన్ని వదిలి, నేను యుద్ధం చేయను అనడం అధర్మమే కదా.

ఇంతవరకు భగవద్గీతలో మొదటి అధ్యాయం.

అందువల్లనే కృష్ణుడు అర్జునుడి మానసిక పరిస్థితిని కశ్మలం అన్నాడు. క్లైబ్యం అన్నాడు. నీది క్షద్రమైన హృదయదౌర్బల్యం అన్నాడు. అనార్యజుష్టమన్నాడు. అస్వర్గ్యమన్నాడు. అకీర్తికరమన్నాడు. ఓ పెద్ద ప్రజ్ఞావాదాలు మాట్లాడుతున్నావే? అన్నాడు. (ఇది రెండవ అధ్యాయంలో - మరుసటి పోస్టులో చూద్దాం)

భక్తోఽసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్ (గీత 4 3) - "అర్జునా, నువు నా భక్తుడవు కాబట్టి, స్నేహితుడవు కాబట్టి, ఎంతో రహస్యమైన ఈ యోగాన్ని నేను నీకు చెబుతున్నాను" అంటూ వివరించడం మొదలుపెట్టాడు.

ఎంతో చర్చ జరిగిన పిమ్మట అర్జునుడికి మోహం తొలగిపోయింది. తన ధర్మం పట్ల చాల స్పష్టమైన అవగాహన కలిగింది. కృష్ణా, నేను నీ మాట వింటాను అంటూ ధర్మయుద్ధానికి సిద్ధమయ్యాడు. (ఇది పద్దెనిమిదవ అధ్యాయం చివర)

ఈ విధంగా విషాదం వదిలించుకున్నవారికే విజయం లభిస్తుంది. భగవద్గీతకు అటువంటి విషాదాన్ని వదిలించే శక్తి ఉన్నది. భగవంతుడై గీతను బోధించగల ఆచార్యుల అవసరం ఉన్నది. అందువల్ల భగవద్గీతాపఠనాన్ని అలవరచుకొమ్మని భారతీయులందరినీ ప్రోత్సహిద్ధాం. భగవద్గీతాసారాన్ని మరింతగా మన జీవితాలకు సమన్వయం చేసుకునేట్లు చేయగల జగద్గురువు కృష్ణుడు ఆచార్యుల రూపంలో అవతరించుగాక.

దేశమంతా అర్జునులు ఉన్నారు.
ఒకే ఒక్క కృష్ణుడు కావలెను.

~మార్గశీర్షశుక్లతృతీయా, ప్లవః~

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...