కాలోఽస్మి - (గీత 11.32)
నేను కాలస్వరూపుడను. మహాకాలుడను.
అహమేవాక్షయః కాలః (గీత 10.33)
మొదలు మధ్యము తుది లేని ఆదిమధ్యాంతరహితుడను అని భగవంతుడు స్వయంగా తనను గూర్చి తాను తెలియజేశాడు.
అటువంటి అనంతుని అచ్యుతుని కొలవటం మనకు సాధ్యమయ్యే పనేనా?
గోవింద గోవింద అని కొలువవో మనసా అని అన్నమయ్య అంటే ఏ స్కేలుతో కొలవాలి అంటూ యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు అధ్యాపకురాలు ఒకావిడ తన క్లాసులో విద్యార్థులముందు అవహేళన చేస్తూ మాట్లాడుతుందట.
ఎంతటి అనంతుడైనా భగవంతుని కొలవడం సాధ్యమే. ఎలా కొలవాలో స్వయంగా ఆయనే మనకు తెలియజేశాడు.
పత్రం పుష్పం ఫలం తోయం
యో మే భక్త్యా ప్రయచ్ఛతి।
తదహం భక్త్యుపహృతమ్
అశ్నామి ప్రయతాత్మనః।।
(గీత 9.26)
ఒక ఆకు, ఒక పూవు, ఒక పండు లేదా ఇన్ని నీళ్లైనా సరే నాకు ఎవరు భక్తితో సమర్పించినా దానిని నేను ప్రీతితో స్వీకరిస్తాను అని సాక్షాత్తు భగవంతుడే తనను కొలిచే పరికరాలను పేర్కొన్నాడు.
సత్యభామ తన అహంకారం కొద్దీ సకలైశ్వర్యాలతో భగవంతుని కొలిచి అతనిని తన స్వంతం చేసుకుందామంటే అది ఆమెకు అసాధ్యమైపోయింది. రుక్మిణమ్మ భక్తితో చిన్న తులసి ఆకు వేసి ఆమాత్రంతోనే అతడిని కొలిచేసిన కథ ఆబాలగోపాలానికి తెలిసిన కథే కదా?
కాబట్టి, భగవంతుని కొలిచే సాధనం లేదా స్కేలు భక్తి.
కొలుచుట అంటే బట్టల షాపులో సేల్స్ మన్ మీటరు బద్దతో బట్టలను కొలవటం వంటిది కాదని ఆ అవహేళన చేసిన ఆ మూర్ఖశిఖామణికి తెలియకపోదు. అడవిలో పుట్టి అడవిలో పెరిగిన కణ్ణప్పకు ఉన్నంత జ్ఞానం కూడా ఆవిడకు లేకపోయింది.
సరే.
భగవంతుడు అంతటి అనంతకాలస్వరూపుడైనా, మనలను అనుగ్రహించడం కోసం మనకు అందుబాటులోనే ఉంటాడు.
భారతదేశంలో ఏటా సరాసరి 110 మిలియన్ టన్నుల వరి పండుతుంది. అందులో మనకు కావలసింది ఎంత? మనలో ఒకొక్కరం సంవత్సరానికి కనీసం 50 కిలోగ్రాములైనా గట్టిగా తినగలమా?
అలాగే, నిర్వికారము నిర్గుణము నిరంజనము అయిన భగవంతుని అనంతస్వరూపం అవగాహన చేసుకొనడం మనకు అంత సులువు కాదు.
అందువల్ల ఆయనే స్వయంగా అనేక ఉపాయాలతో మనకు చేరువ అవుతాడు. ఈరోజు కార్తిక-అమావాస్య. రేపటినుండి ఆయన మార్గశిరమాసరూపంలో మన చెంతకు వచ్చి నెలరోజులు ఉంటాడు. మాసానాం మార్గశీర్షోఽహం (గీత 10.35) అని స్వయంగా ప్రకటించాడు.
మరి మన చెంతకు కోరి వస్తున్న భగవంతుని మనం ఎలా కొలిచేది? ముందే అనుకున్నాం కదా? భక్తితో ఎవరు ఎలా కొలిచినా ఆయన అనుగ్రహిస్తాడు.
పోనీ కొంత వివరంగా తెలుసుకోవాలంటే భగవద్గీత తొమ్మిదవ అధ్యాయాన్ని (రాజవిద్యా రాజగుహ్యయోగాన్ని) చదివితే అర్థమౌతుంది.
అసలు కేవలం తొమ్మిదవ అధ్యాయం మాత్రమే ఎందుకు? ఈ ప్లవనామసంవత్సర మార్గశిరమాసంలో మనం రోజుకో అధ్యాయం చొప్పున పద్దెనిమిది రోజుల్లో భగవద్గీతను సంపూర్ణంగా అర్థసహితంగా చదివేద్దామా? నెలలో ముప్పై రోజులుంటాయి కదా? పద్దెనిమిది రోజుల్లో పద్దెనిమిది అధ్యాయాలు చదివేస్తే తక్కిన రోజుల్లో ఏం చేయాలి అనుకోవద్దు. మరలా రివిజన్ చేసేద్దాం.
మార్గశీర్షశుక్ల-ఏకాదశినాడు పరమపవిత్రమైన గీతాజయంతి కూడా వస్తుంది. గీత తక్కిన పుస్తకాలవంటిది కాదు. భగవంతుడు స్వయంగా తన నోట పలికినది. అందుకనే ఇది భగవద్గీత అయింది. అర్జునుని నిమిత్తకారణంగా మార్చుకుని సమస్తమానవాళిశ్రేయస్సును కోరి ఆయన బోధించినది.
మన పుట్టిన రోజున మనకోసం మన మిత్రుడు ఏదైనా బహుమతిని ఇస్తే దానిని సంతోషంతో స్వీకరిస్తాం. ఆ బహుమతి పొట్లంలో ఏముందో చూడాలనే కుతూహలంతో బయట రంగురంగుల పేపరును గబ గబా చించేసి మరీ చూసి ఆనందిస్తాం కదా?
మరి మన జీవితాంతం ఉపయోగపడే బహుమతిగా భగవంతుడు స్వయంగా ప్రసాదించిన భగవద్గీతరూపంలోని ఉపదేశాన్ని మనం ఇంకా ఎంతకాలం పాటు పుస్తకాల పేజీల్లో మాత్రమే దాచుకుంటాం?
రేపు చదువుదాం ఎల్లుండి చదువుదాం అని ఇంకా ఎంతకాలం వాయిదాలు వేసుకుంటూ పోదాం? తీరిక దొరకటం లేదు అనే మాటను కాసేపు పక్కన పెడదాం. మనకు ఒక సామెత ఉండనే ఉంది. సముద్రంలో అలలు తగ్గిన తరువాత స్నానం చేద్దామనుకుంటే మన జన్మలో మనం సముద్రస్నానం చేయలేం. కాబట్టి ఎన్ని అలలున్నా స్నానం చేసేయాలంతే.
భగవద్గీత మన జ్ఞానసంపద. మన ఆధ్యాత్మికసంపద. మన తాతతండ్రులందరూ అనుభవించిన మహాభాగ్యసంపద. వారసత్వంగా మనకు సంక్రమించిన పైతృకమైన ఆస్తి. అందువల్ల భగవద్గీతను చదవడం మన హక్కు. ఆ హక్కును మనం ఎట్టి పరిస్థితులలోనూ వదులుకోరాదు. అంతే కాదు, మన తరువాత తరాల వారికి కూడా ఈ సంపదను అందించే బాధ్యత మనకున్నది.
చదివితే మనకు ఏమొస్తుంది? ఏమిటి లాభం?
దానికి సమాధానం కూడా మనకు గీతలోనే దొరుకుతుంది.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన। (గీత 2.47)
నీవు నీ పనిని చేయడం మీదనే శ్రద్ధ చూపు. ఫలితం నాకు వదిలెయ్.
అని సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు. అర్జునుడంతటివాడే అతని మాటను నమ్మాడు. తాను చేయవలసిన పనిని చేశాడు. మనం కూడా సంపూర్ణవిశ్వాసంతో అలాగే చేద్దాం.
యత్ర యోగేశ్వరః కృష్ణః
యత్ర పార్థో ధనుర్ధరః।
తత్ర శ్రీర్విజయో భూతిః
ధ్రువా నీతిర్మతిర్మమ।।
https://www.facebook.com/srinivasakrishna.patil/posts/4536826569771321
No comments:
Post a Comment