Saturday, 7 August 2021


 తొలిజామున చిరునవ్వుతో వికసించిన ఈ చిన్ని పూవు సొగసు చూడండి.


బహువర్ణరంజితమై విరాజిల్లే ఈ అద్భుతప్రపంచం పుట్టంధునికి కనబడదు, దాన్ని ఎంతగా వర్ణించి వర్ణించి చెప్పినా అతడికి అర్థం కాదు. అతడికి జలపాతపు హోరు వినిపిస్తుందే తప్ప జలపాతం కనిపించే అవకాశం లేదు.

సుమధురమైన వివిధసంగీతధ్వనులను, ప్రాకృతికశబ్దమాధుర్యాలను ఒక చెవిటి వాడు ఎంతమాత్రం వినలేడు. కోకిలను చూస్తాడు, నెమలిని కూడా చూస్తాడు, వాటి వర్ణాలను తప్ప వాటి గళాలను గ్రహించలేడు. కచేరీలో పాడుతున్న బాలమురళీకృష్ణకు, పని చెడగొట్టిన నౌకరును తిడుతున్న యజమానికి నడుమ పెద్ద తేడా లేదని అతనికి అనిపించవచ్చు. స్వరాలెన్నో తెలియని మనం కూడా శ్రుతిలయలను గ్రహించి ఆనందిస్తాం. ఆరోహణలను అవరోహణలను విని తన్మయులమవుతాం. వాటిని గూర్చి ఎంత చెప్పినా ఆ చెవిటివానికి అర్థం కాదు.

ప్రతి జ్ఞానానికి ఒక ఇంద్రియం సహకరించాలి.
వర్ణజ్ఞానానికి కన్నులు కావాలి. శబ్దజ్ఞానానికి చెవులు కావాలి. స్పర్శజ్ఞానానికి చర్మం కావాలి. రుచిని గ్రహించేందుకు నాలుక కావాలి. వాసనను తెలుసుకొనేందుకు ముక్కు కావాలి. ఇవన్నీ ఉంటే చాలదు. వీటన్నిటిని సమన్వయించేందుకు మనసు కావాలి. ఆ మనసు రోగగ్రస్తం కాకుండా, దారి తప్పకుండా మన స్వాధీనంలో ఉంటే భౌతికవిజ్ఞానమంతా మన సొత్తు కాగలదు.

నా భాష సులువని నాకు అనిపించేందుకు కారణం నా మనసు. లెక్కలు కష్టమని అనిపించేందుకు కారణం కూడా నా మనసే. అంత మాత్రాన భాష గొప్పదని, గణితం కొరకరాని కొయ్య అని నేను నిర్ణయిస్తే అది నా మూర్ఖత్వం.

మన జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, మనసుకు కూడా పరిమితమైన శక్తులు మాత్రమే ఉంటాయి. నా కండ్లు ఎంత బాగా చూడగలిగినా గోడ అవతల ఏముందో చూడలేవు. నేను ఎంత బలవంతుడినైనా కొండను ఎత్తలేను. నా కాళ్లు చేతులు ఎంత పొడుగైనా నేను సముద్రం ఈదలేను.

అంత మాత్రాన గోడకు ఇవతల కనిపించింది మాత్రమే సత్యమని, గోడ అవతల ఏమీ లేదని, నేను ఎత్తగలిగిన నా కంచమే ఉపయోగకరమైనదని, నేను ఎత్తలేని ఆ కొండ పనికి మాలినదని, నేను ఈదగలిగిన పంట కాలువ ప్రాణప్రదాయిని అని, నేను ఈదలేని ఈ సముద్రం నీరు పంటకు పనికిరాదని - ఇలా వాటిని నిందించడం మన అజ్ఞానానికి చిహ్నం. సంపూర్ణమైన అజ్ఞానానికి ఇవన్నీ గట్టి నిదర్శనాలు.

అలాగే, సైన్సు పేరిట మనకు అర్థమైంది కాబట్టి అది గొప్పదని, శాస్త్రం పేరిట ఉన్నది మనకు అర్థం కాలేదు కాబట్టి అది పనికిమాలినదని తీర్మానాలు చేయడం కూడా అజ్ఞానమే. పరిపూర్ణమైన అజ్ఞానమే. అజ్ఞానం అనే పదాన్ని మించి దాన్ని వర్ణించడానికి ఇంకో పదమేదైనా ఉంటే, అది కూడాను.

నేనెత్తగలిగిన కేజీ బరువును చీమ ఎత్తలేదు కాబట్టి, తేనెటీగ మోయలేదు కాబట్టి, చీమలను, తేనెటీగలను అల్పప్రాణులు అని నేను అనవచ్చు. కాని, అవి అదృశ్యమైన రోజుకు నేను అంతరించిపోయే రోజుకు పెద్ద దూరం ఉండదు.

నూరేండ్లు తదేకధ్యానంతో అధ్యయనం చేసినా ఒకే ఒక్క branch of science ను అవగాహన చేసుకొనడం కూడా ఒక మనిషికి సాధ్యం కాదు. కాని, ఆ మనిషి తాను సమస్తవిజ్ఞానాన్ని, సమస్త శాస్త్రాలను, ఔపోసన పట్టినట్లుగా, ఇదే గొప్పది, ఇదే పనికివచ్చేది, అది మాత్రం పనికిమాలినది అని పెదరాయుడిలా తీర్పులివ్వడం ఉంది చూశారూ? అది కూడా సంపూర్ణమైన అఖండమైన అజ్ఞానమని నేను సవినయంగా విన్నవించుకుంటున్నాను.

Previously posted at
https://www.facebook.com/srinivasakrishna.patil/posts/2390853931035273

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...