Saturday, 7 August 2021

దృష్టికోణం


వేప చెట్టు గొప్పదే.

మనకెంతో ఉపయోగకరమైనదే.
అనేకపక్షులకు ఆశ్రయప్రదాతే.
కాని, ఇక్కడ చూడండి.

నా దృష్టికోణాన్ని బట్టి ఆ వేపచెట్టు, మేఘవేష్టనకమూ, అంబరచుంబీ అయిన ఆ మహాపర్వతం కంటే సమున్నతంగా కనిపిస్తోంది.

కనిపించిందా, లేదా?
కాబట్టి, వేపచెట్టు పర్వతం కంటె ఉన్నతమైనది అని నేనంటాను. మీరు ఒప్పుకొని తీరాలి. ఏం? ఎందుకు ఒప్పుకోరు?

***
ఏమయ్యా, నువు పర్వతాన్ని ఆ వేపచెట్టు క్రింద నుండి చూడడం బాగుంది కాని, నువున్న ఆ ప్రదేశాన్ని వదిలి, కాస్త ఇవతలికి వచ్చి చూస్తావా? ఉహూ అని తల అడ్డంగా ఆడిస్తావేం? ఎందుకు రావు?

నీ దృష్టికోణాన్ని మాత్రమే నువు పరిగణిస్తానంటే, మేము ఒప్పుకున్నా లేకపోయినా నువు పరిగణించేది మాత్రమే సత్యమంటే ఎలా?

నీ స్థానం నుండి నువు కదలనంటే, మరో కోణం నుండి చూడడానికి నువు నిరాకరిస్తే, నీకు సృష్టికర్త ప్రసాదించిన కన్నులనబడే సత్యాన్వేషకసాధనాలైన వనరులు బూడిదలో పోసిన పన్నీరే కదా!

అలసిపోయేంత దూరం నువు నడుస్తూ పోతే, అలా నడిచినంతసేపూ ఆ కొండ నీకు కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి వేపచెట్లు దారిలో కొల్లలు కొల్లలుగా కనిపిస్తూనే ఉంటాయి. నీ మొదటి వేప చెట్టు ఎక్కడుందో నీకు అసలు కనబడకపోవచ్చును కూడా! అదీ ఆ కొండ ఔన్నత్యం.

ఉన్న కన్నులను కూడా ఆమాత్రం సద్వినియోగం చేసుకోకపోతే అంధగజన్యాయంలో ఆ అంధులు ఆ గజాన్ని తడిమి ఎవడికి వాడు తాను తెలుసుకున్నదే సంపూర్ణజ్ఞానమని భ్రమించినట్లు ఉంటుంది కదా!

అసలు ప్రపంచం Bidimensional స్థాయినుండి Tridimensional స్థాయికెదిగి చాలా కాలమైందే?

అలా కాదంటే చెప్పు,
ఆ వేపచెట్టు ఆ పర్వతం కంటే ఉన్నతమైనదని అప్పటికీ నువ్వంటూనే ఉంటే, నీ సిద్ధాంతం ప్రకారమే, ఆ వేపచెట్టు కంటె, ఆ పర్వతం కంటె కూడా నా అరచెయ్యి, నీ అరచెయ్యి రెండూ పెద్దవేనని ఒకే ఒక్క క్షణంలో ఋజువు చేస్తాను.

సరేనా?

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...