Saturday, 14 August 2021

యుద్ధం ఎందుకు చేయాలి?




ఒకప్పుడు భారతదేశంలో ఎన్నో రాజ్యాలు ఉండేవి. ప్రతి రాజ్యానికి అధిపతిగా ఒక రాజు ఉండేవాడు. సాధారణంగా రాజ్యాలమధ్య సఖ్యత ఉండేది. అయితే అప్పుడప్పుడు ఆయా రాజుల నడుమ కలహాలు సంభవించేవి. అందుకు ఎన్నో కారణాలు.

రాజ్యస్త్రీస్థానదేశానాం జ్ఞానస్య చ బలస్య చ।
అపహారో మదో మానః పీడా వైషయికీ తథా।।

జ్ఞానార్థశక్తిధర్మాణాం విఘాతో దైవమేవ చ।
మిత్రార్థం చావమానశ్చ తథా బంధువినాశనమ్।।

అంటూ కౌటిల్యశిష్యుడైన కామందకుడు యుద్ధాలకు కారణాలను పేర్కొన్నాడు.

1) రాజ్యరక్షార్థమ్ -
(అంటే అధికారరక్షణం కోసం యుద్ధం)

2) స్త్రీరక్షార్థమ్ -
(సీతమ్మ కోసం రావణాసురుడితో రాముడు చేసిన యుద్ధం - స్వయంవరంలో ద్రౌపది క్షత్రియేతరుని వరించిందనే అక్కసుతో దుర్యోధనాదులు చేసిన ఆగడం, కృష్ణుడు రుక్మిణికోసం చేసిన యుద్ధం - ఆధునిక చరిత్రలో చితోర్ రాణి పద్మిని ఆత్మగౌరవం కాపాడడం కోసం జరిగిన యుద్ధం మొదలైనవి ఉదాహరణలు)

3) స్థానరక్షార్థమ్
(అంటే రాజధానిరక్షణకోసం యుద్ధం)

4) విషయపీడాప్రతికారః -
(దేశానికి చెందిన ప్రజలను, శత్రువులు పీడిస్తుంటే వారిని రక్షించుకొనడం కోసం యుద్ధం)

5) దేశరక్షార్థమ్ -
(దేశానికి చెందిన భూభాగాన్ని రక్షించుకొనడం కోసం యుద్ధం)

6) జ్ఞానరక్షార్థమ్ -
(విద్యాలయాలపై, గురువులపై, విద్యార్థులపై దాడి జరిగినపుడు యుద్ధం - మారీచసుబాహులతో రాముని యుద్ధం)

7) బలరక్షార్థమ్ -
(సైన్యంపై దాడి జరిగినపుడు ప్రతికారం తీర్చుకోవాలి - పుల్వామా వంటి ఘటనలు జరిగినపుడు)

8) మదః -
ఆయా రాజుల పొగరు కారణంగా వైరం ఏర్పడుతుంది. ద్రుపదుడు తన పొగరు కొద్దీ ద్రోణాచార్యునితో వైరం పెంచుకున్నాడు. వారి వైరం వారి సంతానానికి కూడా అంటుకుంది. యుద్ధంలో ద్రుపదపుత్రుడైన ధృష్టద్యుమ్నుడు మర్యాదను అతిక్రమించి ద్రోణాచార్యులవారి శిరస్సును ఖండించాడు. ఆ ధృష్టద్యుమ్నుని ద్రోణపుత్రుడైన అశ్వత్థామ హతమార్చాడు.

9) మానః -
తనకు చాలని ఆత్మాభిమానం కారణంగా వైరం ఏర్పడుతుంది. లేదా శక్తిమంతుల ఆత్మాభిమానాన్ని నిష్కారణంగా దెబ్బ కొట్టినా వైరం ఏర్పడుతుంది. శ్రీకృష్ణుడు తనను పరాజితుడిని చేసి తన చెల్లెలైన రుక్మిణిని వివాహం చేసుకున్నందుకు రుక్మి ఆత్మాభిమానం దెబ్బతిన్నది. మనస్సులో ఏవిధంగానైనా యాదవులను అవమానించాలనే కక్ష గూడు కట్టుకుంది. ఒకసారి బలరాముడితో జూదం ఆడుతూ బలరాముడు గెలిచినప్పటికీ ఓడిపోయాడని వెక్కిరించాడు. కాదు నేనే గెలిచానని బలరాముడంటే నువ్వు అబద్ధాలాడుతున్నావని ఆరోపించాడు. బలరాముడు మండిపడి ఒకే ఒక్క పిడికిలిపోటుతో రుక్మిని యమలోకానికి పంపించేశాడు. అలాగే రాజసూయయాగసభలో శ్రీకృష్ణునికి పాండవులు చేసిన అగ్రపూజను సహించలేక వాచాలత కొద్దీ అందరినీ నిందిస్తూ శ్రీకృష్ణుని ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన శిశుపాలుడు శిరశ్ఛేదం చేయించుకున్నాడు.

10) అర్థరక్షార్థమ్ -
(దేశానికి ఆదాయాన్ని తెచ్చే వనరులపై ఆక్రమణ జరిగినపుడు వాటిని కాపాడుకొనడం కోసం యుద్ధం)

11 ) ధర్మరక్షార్థమ్ -
(ధర్మాన్ని కాపాడటం కోసం - ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా తమకు నచ్చిన విధంగా జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అది ధర్మజీవనం. కాని, ఇతరులను నిష్కారణంగా పీడించటం, తాము చెప్పినట్టే ప్రజలందరూ నడచుకోవాలి అనటం అధర్మం. ఆవిధంగా లోకానికి భౌతికంగా కాని, మానసికంగా కాని, నైతికంగా క్షోభ కలిగించే వారిని అణచడం కోసం జరిగే యుద్ధం - ఉదాహరణ కురుక్షేత్రయుద్ధం)

12) దైవమ్ -
(అపార్థాల వలన, శకునివంటి పైశున్యకారులవలన విరోధం చెలరేగి యుద్ధం జరుగవచ్చు)

13) మిత్రార్థమ్ -
(ఆప్తమిత్రులను రక్షించడం కోసం, వారి ప్రయోజనాలను కాపాడటం కోసం యుద్ధం - సుగ్రీవుని కోసం రాముడు, రాముని కోసం సుగ్రీవుడు చేసిన యుద్ధాలు)

14) అవమానప్రతికారః -
(రాజుకుగాని, దేశానికి గాని అవమానం లేదా ఆపద కలిగినపుడు యుద్ధం చేయవచ్చు - తమ దేశంలో ట్విన్ టవర్లపై జరిగిన దాడికి ప్రతికారంగా అమెరికా ఒబామాను హతమార్చింది కదా, అటువంటి యుద్ధం)

15) బంధువినాశప్రతికారః -
(ఆత్మీయబంధువులను నాశనం చేసిన వారిపై యుద్ధం - రాత్రివేళ నిద్రిస్తున్న తమ కుమారులను హతమార్చిన అశ్వత్థామను వెంటాడి పట్టుకున్న భీమార్జునులు ఉదాహరణార్హులు)

ఈ విధంగా యుద్ధం చేయటానికి కొన్ని కారణాలు ఉంటాయి. ప్రస్తుతం మన దేశానికి ఇరుగు పొరుగు అనదగిన ఆఫ్ఘనిస్థాన్ లో యుద్ధసంక్షోభం జరుగుతోంది. తాలిబన్లకు ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి నడుమ రాజ్యంకోసం యుద్ధం నడుస్తోంది.
ఇక్కడ రాజ్యమంటే భూభాగం కాదు. రాజ్యమంటే ఒక దేశపు భూభాగం పై అధికారం అని మాత్రమే అర్థం. ఒక దేశపు రాజ్యాంగానికి (!) విరుద్ధంగా లేదా ఆ దేశప్రజలకు అభ్యంతరకరమైన రీతిలో ఆ దేశప్రజలపై పెత్తనం చేసే అధికారాన్ని ఎవరైనా బలాత్కారపూర్వకంగా చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తే వారితో విరోధం కలుగుతుంది. అందువల్ల యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్థానంలో జరుగుతున్నది అదే. తాలిబన్లు బలాత్కారపూర్వకంగా ఆఫ్ఘనిస్థాన్లో రాజ్యాధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం ప్రతిఘటిస్తోంది.

ఇది ఇలా ఉండగా, భారతప్రభుత్వం ఆఫ్ఘనిస్థాన్ విషయంలో జోక్యం చేసుకోవాలి - అక్కడి సంక్షోభాన్ని సరిజేయాలి అని కొందరు మిత్రులు అభిప్రాయపడుతున్నారు. మరి కొందరు అది తనకు మాలిన ధర్మం - అది మనకు అనవసరమైన విషయం అంటున్నారు.

పైన పేర్కొన్నవాటిలో మనం (భారతదేశం) ఆఫ్ఘనిస్థాన్ క్షేత్రంలో
(ప్రస్తుతం) యుద్ధం చేసేందుకు తగిన కారణాలు ఒకటి రెండు ఉన్న మాట నిజమే.

1 అది మన రాజ్యం కాదు - (ఒకప్పుడు మన రాజ్యం అనే సెంటిమెంటు వద్దు). అందువల్ల మనం యుద్ధం చేయవలసిన అవసరం లేదు.

2 తాలిబన్లు తాము ఆక్రమించిన ఆఫ్ఘన్ భూభాగంలోని స్త్రీలపై దుర్భరమైన అత్యాచారాలు చేస్తున్న మాట నిజమే. ధర్మానికి కట్టుబడి ఆ స్త్రీలను రక్షించవలసిన బాధ్యత మనకున్నది.

3) కాబూల్ మన రాజధాని కాదు. అందువల్ల మనం యుద్ధం చేయవలసిన అవసరం లేదు.

4) ఆఫ్ఘన్లో ఉన్నది మన దేశపు ప్రజలు కారు. అందువల్ల మనం యుద్ధం చేయవలసిన అవసరం లేదు. కాని వారు శరణుకోరితే వారిని రక్షించవలసిన బాధ్యత మనకుంటుంది.

5) ఆఫ్ఘన్ ప్రస్తుతం మన భూభాగం కాదు. అందువల్ల మనం యుద్ధం చేయవలసిన అవసరం లేదు.

6) మన విద్యాలయాలవంటివి ఆఫ్ఘన్లో లేవు. అందువల్ల మనం యుద్ధం చేయవలసిన అవసరం లేదు.

7) మన సైన్యంపై తాలిబన్లు దాడి జరపలేదు. అందువల్ల మనం యుద్ధం చేయవలసిన అవసరం లేదు.

8) తాలిబన్లు తమ పొగరుకొద్దీ మనకు అపకారం చేస్తే దండించవలసిందే. కాని వ్యవహారం అంతదూరం రాలేదు.

9) తాలిబన్ల ఆత్మాభిమానాన్ని మనం గాని, మన ఆత్మాభిమానాన్ని వారుగాని దెబ్బతీయడం జరగలేదు అందువల్ల మనకూ వారికీ ఈ విషయంలో వైరం లేదు.

10) మన ఆదాయవనరులకు తాలిబన్లవల్ల నష్టం కలుగలేదు. అందువల్ల మనం యుద్ధం చేయవలసిన అవసరం లేదు.

11) ధర్మమంటే కొందరు మతం అని భావిస్తుంటారు. అలాగైతే ఆఫ్ఘన్లో తాలిబన్లవలన చిత్రహింసలకు గురి అవుతున్నది ఇస్లాం మతస్థులే. కాని, భారతదేశంలోని ఇస్లాం మతస్థులు ఆ విషయమై తమ కలవరాన్ని వ్యక్తపరచటం లేదు. అందువలన మనం తగుదునమ్మా అని యుద్ధానికి పోవడం సమంజసం కాదు. అలా కాదు, ధర్మమంటే మతాతీతమైన మానవనీతి అని భావించినపక్షంలో మనకు ఆ ప్రజలను రక్షించవలసిన బాధ్యత ఉన్నది.

12) దైవమ్ అనేది మన చేతిలో లేని విషయం. దైవికంగా యుద్ధం సంభవిస్తే పోరాటం చేయవలసిందే.

13) ప్రస్తుతకాలపు ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం మనకు మిత్రుడే. కాబట్టి వారిని రక్షించవలసిన బాధ్యత మనపై ఉంది.

14) తాలిబన్లు భారతదేశాన్ని తమ చేష్టలతో అవమానిస్తే చేష్టలతోనే ప్రతికారం చేయాలి. తమ మాటలతో అవమానిస్తే మాటలతోనే ప్రతికారం చేయాలి.

15) తాలిబన్లు ఆఫ్ఘన్లో పని చేస్తున్న భారతపౌరులను హతమార్చడం వంటి పనులను చేస్తే ప్రతికారంగా యుద్ధం చేయవచ్చు.

ఈ విధంగా మనం తాలిబన్లతో యుద్ధం చేయడానికి తగిన కారణాలు కొన్ని ఉన్నాయి. కాని, చాల కారణాల వలన మనం వారితో యుద్ధం చేయవలసిన అవసరం లేదు.

"ప్రయోజనమనుద్దిశ్య న మందోఽపి ప్రవర్తతే" అని అందరూ అంగీకరించే మాట.

ఏదో ఒక ప్రయోజనం లేదా ఏదో ఒక లాభం లేకపోతే ఒక మూర్ఖుడు గాని చివరకు ఒక సోమరిపోతు గాని ఏ పనీ చేయడు.

మరి ఇక తెలివైనవారి సంగతి వేరే చెప్పాలా? ఎన్నెన్నో బాధ్యతలు కలిగినవారు నిష్కారణంగా యుద్ధం వంటి అతి పెద్ద సమస్యలను చేతులారా నెత్తికెత్తుకుంటారా?

"భూమిర్మిత్రం హిరణ్యం చ విగ్రహస్య ఫలం త్రయమ్"

యుద్ధం వలన మూడు ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది అంటూ కామందకుడు వాటిని పేర్కొన్నాడు.

1) శత్రుభూభాగాన్ని మన దేశంలో కలుపుకోవడం
2) వేరొకదేశంతో మన మైత్రీసంబంధాన్ని దృఢం చేసుకొనడం
3) ధనలాభం

ఈ మూడింటిలో ఏ ఒక్కదానినీ ఆశించకుండా యుద్ధం చేయడం వృథా అని రాజనీతిశాస్త్రజ్ఞుల అభిప్రాయం.

పైగా యుద్ధం అనేది ఒకరోజుతోనో ఒక నెలలోనో ఒక సంవత్సరంలోనో ముగిసేది కాదు. దాని ప్రభావం మంచిదైనా చెడ్డదైనా దేశప్రజలందరిపైనా సుదీర్ఘకాలం ఉంటుంది. కాబట్టి యుద్ధాన్ని మనంతట మనంగా (స్వయంగా) అనాలోచితంగా నిష్కారణంగా మొదలు పెట్టరాదు.

కాని, ఇతరులు మనపై యుద్ధాన్ని ప్రకటిస్తే మాత్రం ఆత్మరక్షణకోసం భీకరమైన యుద్ధానికి సిద్ధం కావలసిందే. ఎందుకంటే అది జీవన్మరణసమస్య.

ఇంకా, కాని ఎంతటి పరాక్రమవంతుడైనా యుద్ధాన్ని ఒంటరిగా చేయరాదు. అభిమన్యుడు అసహాయశూరుడై చేసిన అసామాన్యయుద్ధపు ఫలితం తెలిసిందే కదా? కాబట్టి, యుద్ధం చ బహుభిస్సహ అన్నారు. యుద్ధమనేది మిత్రులందరినీ కలుపుకుని చేయవలసిన పని.

అందువల్ల ఆఫ్ఘన్ ప్రజలను రక్షించాలనుకుంటే ప్రపంచంలోని ఇతరదేశాలను కలుపుకుని క్రమంగా సామభేదదానదండోపాయాలను ప్రయోగించి తాలిబన్లను వారి మిత్రులను కూడా దారికి తీసుకురావాలి. లొంగదీసుకోవాలి. ఆ రెండూ కూడా సాధ్యం కాకుంటే వారిని సమూలంగా నాశనం చేయాలి. దానికి చాల కాలం పట్టవచ్చు. కాని, ఫలితం ముఖ్యం. ఆ ఫలితమే ప్రపంచానికంతటికీ చిరసుఖకారి.

ఇతి శమ్.



భారతస్వాధీనతాదినోత్సవసందర్భంగా అందరికీ శుభాకాంక్షలు



 



No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...