Monday, 27 April 2020

కోఽరుక్?




అనగా అనగా కేరళదేశం.  ఆయుర్వేదవైద్యానికి ప్రసిద్ధిగన్న దేశం.  అటువంటి దేశంలో ప్రఖ్యాతి చెందిన ఎనిమిది వైద్యకుటుంబాలు ఉండేవి.  అందులో ఒకానొక కుటుంబానికి చెందినవాడే ఆలత్తియూర్ నంపి.  (నంబి)

నంబి మహాభక్తుడు.  ఆయన ప్రతి రోజూ తమ కులదైవమైన శివుని మందిరానికి పోయి దర్శనం చేసుకుని, ధ్యానం చేసుకొనేవాడు.  ఒకరోజు అతడు దేవాలయానికి పోయినపుడు అక్కడ ఉన్న చెట్టుపై రెండు పక్షులు కూర్చుని కోరుక్ కోరుక్ అని అరవడం విన్నాడు.  ఆ పక్షుల మధురశబ్దాలను విని నంబి చాల ఆనందించాడు.  అవి ఏవో క్రొత్తరకం పక్షులు అనుకున్నాడే గాని, అంతగా వాటి శబ్దాలను పట్టించుకోలేదు.  అయితే అవి ప్రతి రోజూ ఆ చెట్టు మీద అదే స్థానంలో అదే సమయంలో కూర్చుని అరవడం అతడు గమనించాడు.

అలా వింటూ వింటూ ఉండగా, కోరుక్ - కోరుక్ అనే శబ్దాలతో ఆ పక్షులు తనను కోరుక్? - కోఽరుక్? అని తనను ప్రశ్నిస్తున్నట్టుగా నంబికి అనిపించింది.  

(సంస్కృతంలో కః + అరుక్ అనే రెండు పదాలు కలసి కోఽరుక్ అనే సంధిరూపంగా మారుతాయి.  ధన్యః + అస్మి = ధన్యోఽస్మిదాసః + అహమ్ = దాసోఽహమ్ అనే సంధిరూపాలను మనం తెలుగుభాషాపదాలైనట్లుగా యథేచ్చగా వాడుతూ ఉంటాం కదా, అటువంటిదే ఈ కోఽరుక్ రూపం కూడా.)  కః అంటే ఎవడు? అని.  అది ఒక ప్రశ్నార్థకపదం.  రుక్ (రుజ్) అంటే రోగం.  రోగం కలిగినవాడు అనే అర్థం కూడా వస్తుంది.  అరుక్ అంటే రోగం లేనివాడు.  (అంటే, ఆరోగ్యవంతుడు) కాబట్టి, కః + అరుక్ = కోఽరుక్ అంటే ఎవడు ఆరోగ్యవంతుడు?” అని ఆ పక్షులు తనను అడుగుతున్నట్టు అన్న మాట. 

అలా అనిపించగానే నంబి వెంటనే సమాధానం చెప్పాడు.

కాలే హితమితభోజీ కృతచఙ్క్రమణః  క్రమేణ వామశయీ
అవిరుద్ధమూత్రపురీషః స్త్రీషు యతాత్మా చ యో నరః సోరుక్।।

(ఏ మనిషి సమయం ప్రకారం హితంగాను, మితంగాను భుజిస్తాడో, తగినంత కాలం సంచరిస్తాడో, ఎడమవైపుకు తిరిగి నిద్రిస్తాడో, మూత్రపురీషాలను ప్రతిదినం సమయానికి విసర్జిస్తాడో, స్త్రీవ్యామోహం లేనివాడై ఉంటాడో, ఆ మనిషే ఆరోగ్యవంతుడు అని అర్థం.)

ఆ సమాధానం వినగానే ఆ రెండు పక్షులూ ఎగిరిపోయాయి.  మరలా అవి కనబడలేదు.  "ఓహో అవి దేవతాపక్షులై ఉంటాయి.  నా సమాధానం సరైనదే అని గ్రహించి మరలా నన్ను ఆ ప్రశ్నను అడిగేందుకు రాలేదు కాబోలు అని నంబి భావించాడు.

కొన్ని రోజులు గడిచాక నంబి దగ్గరకు ఇద్దరు బాలురు వచ్చారు.  మహోదయా, మేము మీ చెంత ఆయుర్వేదవిద్యను నేర్చుకొనగోరి వచ్చాము అని అర్థించారు.  వారి తేజస్సును చూసి ముచ్చటపడిన నంబి వారిని తన శిష్యులుగా అంగీకరించాడు.

రాను రాను, తన శిష్యుల తెలివితేటలు నంబికి చాల ఆశ్చర్యం కలిగించడం మొదలుపెట్టాయి.  వారు ఏకసంథాగ్రాహులైన శిష్యులు మాత్రమే కారు, ప్రతి శ్లోకాన్ని వారు వ్యాఖ్యానిస్తున్న తీరు అసాధారణంగా ఉండేది.  నేను వారికి బోధిస్తున్నానా, లేక వారే నాకు తెలియని అనేకవిషయాలను చాల వివరణపూర్వకంగా చెబుతున్నారా?” అని అతడికి సందేహం కలిగేది.  వారు చెప్పిన ప్రకారం వైద్యం చేస్తే అది తాను పూర్వం అవలంబిస్తున్న విధానం కంటె ఎంతో ఫలితం ఎంతో మెరుగ్గా ఉండేది.

ఆ పిల్లలు మేధావులు మాత్రమే కారు.  చాల అల్లరి చేసేవారు.  వారి అల్లరిని నంబి ఎంతో ప్రేమతో సహించేవాడు.  నంబి మాత్రమే కాదు, అతని కుటుంబసభ్యులకు, ఆ ఊరిలో ప్రజలకు కూడా వారు ఎంతో ప్రీతిపాత్రులైనారు.

ఒకనాడు నంబి ఇంటిలో లేని సమయంలో ఒక రోగి వచ్చాడు.  అతడు దుర్భరమైన శిరోవేదనను అనుభవిస్తున్నాడు.  నంబి ఇస్తున్న ఔషధం అతనికి ప్రతిసారీ తాత్కాలికమైన ఉపశమనాన్ని ఇస్తోందే కాని, పూర్తిగా తగ్గించలేకపోతోంది.

ఈసారి అతడు వచ్చేసరికి నంబి ఇంటిలో లేడు.  కాని, అతని బాలశిష్యులిద్దరూ అతనిని చికిత్స చేసే గదిలోనికి తీసుకుపోయారు.  ఆ రోగి నుదుటిపై ఒక ఔషధాన్ని పూశారు.  ఆ తరువాత, అతడి నుదుటిమీదనున్న చర్మాన్ని పైకి లాగారు.  వెంటనే అది తడికి అంటుకున్న తమలపాకులాగ కపాలంనుండి ఊడిపోయి పైకి వచ్చేసింది.  అప్పుడు ఆ రోగి నుదుటిచర్మం క్రిందనున్న కపాలము, కండరాలు స్పష్టంగా కనబడసాగాయి.  ఆ బాలురు ఆ ప్రాంతంలో ఉన్న కొన్ని విషక్రిములను పైకి లాగి పడేసి, ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు.  తరువాత, నుదుటి చర్మాన్ని యథాప్రకారం కప్పివేసి, మరొక ఔషధం పూశారు. వెంటనే అది మచ్చకూడా లేకుండా యథాపూర్వం అతుక్కుపోయింది.  ఆ రోగికి శిరోవేదన శాశ్వతంగా మటుమాయమై పోయింది.

ఈ సంఘటనను నంబి కుమారులు చూసి దిగ్భ్రాంతి చెందారు.  తండ్రి ఇంటికి తిరిగి రాగానే జరిగిన విషయమంతా చెప్పారు.  వారు చెప్పినది నిజమేనని తెలుసుకున్న నంబి పరమానందభరితుడై ఆ బాలురు దేవవైద్యులైన అశ్వినీకుమారులే తప్ప వేరొకరు కారని నిశ్చయించుకున్నాడు.

ఇంత జరిగిన తరువాత, ఆ బాలురు ఇక తమకు సెలవు ఇప్పించమని నంబిని కోరారు.  మీరెవ్వరో చెప్పకుంటే మీరు వెళ్లిపోయేందుకు నేను అనుమతినివ్వను అని నంబి వారిని అడిగిన మీదట, వారు తాము దేవవైద్యులమైన అశ్వినీదేవతలమేనని, ఆయుర్వేదవైద్యాన్ని భూలోకంలో ప్రచారం చేసేందుకు వచ్చామని, మునుపు అతని వైద్యసామర్థ్యాన్ని పరీక్షించేందుకు గాను ఆలయప్రాంగణంలో పక్షులరూపంలో కోఽరుక్ అంటూ అతనిని ప్రశ్నించినది కూడా తామేనని చెప్పారు.  

ఆ సంగతి తెలిసిన తరువాత, నంబి వారు వెళ్లిపోయేందుకు అనుమతినిచ్చాడు కాడు.  అయితే వారు గురుదక్షిణగా నంబికి అపూర్వమైన ఒక ఆయుర్వేదవైద్యగ్రంథాన్ని బహూకరించి, అందులో ఉన్నట్టుగా వైద్యం చేయమని, అపుడు తాము లేని లోటు ఉండదని మాట ఇచ్చిన తరువాత, వారికి అనుమతి లభించింది.

ఆలయిత్తూర్ నంబి కేరళపాలిటి దేవునిగా, మహావైద్యునిగా ప్రఖ్యాతి చెందాడు.  ఆయన వంశంవారు ఈనాటికీ కేరళలో ప్రఖ్యాతులైన ఆయుర్వేదవైద్యులుగా ఉన్నారు.

ఉత్తరాదిలో వాగ్భటుడు అనే ఒక మహా-ఆయుర్వేదపండితుడు ఉండేవాడట.  దేవవైద్యుడైన ధన్వంతరి పక్షిరూపంలో వచ్చి కోఽరుక్ అని ఆయనను ప్రశ్నించగా, వాగ్భటుడు హితభుక్ మితభుక్, ఋతుభుక్ సోఽరుక్ (హితమైన ఆహారాన్ని, మితంగా షడృతువుల వాతావరణాన్ని అనుసరించి భుజించేవాడు, ఆయా ఋతువులలో సహజంగా ప్రకృతి ప్రసాదించే ఫలాదులను భుజించేవాడు ఆరోగ్యవంతుడై ఉంటాడు.) అనిసమాధానం చెప్పాడట.  ఇది రోగాన్ని తగ్గించడం కోసం కాదు.  అసలు రోగమే రాకుండా చేసుకునే ఉపాయం.  Prevention is better than Cure అని ఇంగ్లీషు వాళ్లు కూడా అభిప్రాయపడతారు కదా?

।।సర్వే భవంతు సుఖినః।।


3 comments:

  1. కోఽరుక్?

    లాక్‌డౌన్ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ముగిసిన తరువాత కూడా ఈరోజుల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నామో, అంతే జాగ్రత్తగా అటుపై కూడా జీవితాంతం ఉండాలంటున్నారు.

    జబ్బు లక్షణాలు కనబడితే ఎవరికి వారు స్వచ్ఛందంగా హోమ్ క్వారంటైన్‌లో ఉండాలి అని నేటి ప్రభుత్వాలు ఆశిస్తున్నాయి.

    ఎవడి జాగ్రత్త వాడు పడాలి, లక్షలాదిమంది జబ్బు బారిన పడితే వారందరికీ నయం చేసే శక్తి ప్రభుత్వాలకు లేదని ఒక నాయకురాలు కుండ బద్దలు కొట్టేసింది. అటువంటి ప్రకటనలను త్వరలో మిగిలిన అన్ని రాష్ట్రప్రభుత్వాలూ ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా మిగిలివుంది అంటున్నారు.

    1 నిత్యం మాస్కు, గ్లౌజులు ధరించటం, 2 నిత్యం పరిశుభ్రతను పాటించడం, 3 జబ్బు బారిన పడకుండా జాగ్రత్తగా ఉండటం, 4 జబ్బు చేస్తే ఇంట్లోనే మిగిలిన కుటుంబసభ్యులకు దూరంగా ఉండటం, 5 పుష్టికరమైన ఆహారాన్ని తినటం, 6 జబ్బు నయమైందని నిర్ధారించుకున్న తరువాత ఒక వైద్యుని చెంత పరీక్ష చేయించుకుని, ఏకాంతప్రపంచం నుండి బయటపడి బాహ్య ప్రపంచంలోనికి రావడం - వీటికి అందరూ అలవాటు పడిపోవాలని అంటున్నారు.

    కరచాలనాలను ఇప్పటికే చాలావరకు మానివేశారు. చాల కాలం తరువాత కలసినప్పటికీ మిత్రులు పరస్పరం హత్తుకొనడమనేది ఇకపై ఉండదు. గురుపాదోపస్పర్శ చిన్నవారికి అసాధ్యమౌతుంది. పెద్దలు చిన్నవారి తలపై చేయి ఉంచి దీవించడం నిషిద్ధక్రియ ఔతుంది. పని చేస్తూ చెమటను చిందించడం నేరమౌతుందేమో? కాబట్టి శ్రమను తగ్గించే యంత్రాలు మరింత విరివిగా పుట్టుకొస్తాయి. ప్రతి ఒక్కరూ దూరప్రాంతాలకు స్వంతవాహనాల మీద ప్రయాణించడం సాధ్యం కాదు కాబట్టి, పబ్లిక్ ట్రాన్సుపోర్టుకు ఒక ప్రత్యేకమైన యూనిఫాం ధరించవలసి రావచ్చు. అలాగే విద్యాలయాలలోనూ, కర్మాగారాల్లోనూ, బ్యాంకులూ, మార్కెట్లూ ఇత్యాదిప్రాంతాల్లో పనిచేసేందుకు ప్రత్యేకమైన దుస్తులు డిజైన్ చేయబడవచ్చు. ఇప్పుడైతే ఇలా ఉంది కానీ, లాక్‌డౌనుకు ముందు ప్రపంచం వేరేగా ఉండేది అని ఎంత చెప్పినా నమ్మని తరాలు పుట్టుకొస్తాయి అంటున్నారు.

    ప్రభుత్వం కూడా ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలను అతి తీవ్రంగా నిషేధించాలి. సిగరెట్లు, మద్యం లేకపోతే బ్రతకలేరు అని డాక్టర్ల సలహా పొందినవారిని ఒకరకం పేషంట్లుగా రిజిస్టర్ చేసుకొని, తగుమాత్రంలో వారికి స్వయంగా సరఫరా చేయాలి. 1999 సంవత్సరం తరువాతనుండి పుట్టిన వారు వాటిని వాడటం తీవ్రమైన నేరంగా పరిగణించాలి. క్రమంగా వాటి ఉత్పత్తిని మానివేసేలా ప్రణాళికలు రచించుకోవాలి.

    మొత్తానికి, మహాధనవంతుని కన్న ఆరోగ్యవంతుడే మహాభాగ్యవంతుడు అని అందరూ భావించేలా, చిన్నతనం నుండి కూడా సంపూర్ణమైన ఆరోగ్యస్పృహను కలిగి ఉండేలా సమస్తపాఠ్యప్రణాళికలను రచించాలి.

    మనిషి చక్కని ఆరోగ్యవంతుడై ఉండేందుకు మన పూర్వికులు ఒక సులువైన మార్గదర్శనం చేశారు. అదే ఈ కథలో ప్రస్తావించబడింది.

    #ఆయుర్వేదం
    #Ayurveda

    ReplyDelete
  2. నంబి గారి కథ చాలా బాగుందన్నా ������

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు సోదరా.

      Delete

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...