#భారతీయఋషులు 2
మరీచిమహర్షి స్వాయంభువమన్వంతరకాలం నాటి
సప్తర్షులలో ఒకరు. సనకసనందనాదుల వలనే ఈయన
కూడా బ్రహ్మమానసపుత్రుడు. కాని, వారివలె
నివృత్తిమార్గాన్ని కాక, ప్రవృత్తిమార్గాన్ని అనుసరించి గృహస్థుడైనాడు.
కళ అనే భార్య వలన అతడు కశ్యపుడనే సంతానాన్ని
పొందాడు. ఆ కశ్యపుడు అతడు అనేక వంశాలకు
మూల పురుషుడు.
శ్రీమహావిష్ణువుయొక్క పాలనశక్తి మరీచిమహర్షిగా
అవతారం దాల్చిందని పురాణాలు చెబుతాయి.
అతడి ప్రవర్తన అతి నిర్మలమైనది.
అతడి తపోజీవనం అతిప్రశాంతమైనది, నిరాడంబరమైనది. అతని సుగుణాలకు
బ్రహ్మదేవుడు ఎంతగానో ఆనందించాడు. ఒకసారి
తాను పుష్కరతీర్థంలో చేసిన యజ్ఞానికిగాను ప్రధానఋత్విక్కుగా నియమించుకున్నాడు. 10 వేల శ్లోకాలు కలిగిన బ్రహ్మపురాణాన్ని మరీచికి
బహుమానంగా ప్రసాదించాడు.
ఆనందసంహిత మొదలైన గ్రంథాలకు మరీచిమహర్షి
కర్త. కాని, ఆ మరీచి ఈ మరీచి భిన్నులని,
అతడు విఖనోమహర్షిశిష్యుడని కొందరు అంటారు.
కాదు, ఇద్దరూ ఒకరేనని మరికొందరు అంటారు.
నారదునిద్వారా ద్వాదశాక్షరీమంత్రాన్ని
పొంది తపస్సు చేయదలచిన బాలధ్రువునికి మరీచి తపోవిధానాన్ని ఉపదేశించాడు. కురుక్షేత్రయుద్ధభూమిలో బాణశయ్యపై విశ్రమించిన
భీష్ముని సందర్శించాడు.
కాళిదాసమహాకవి వ్రాసిన అభిజ్ఞానశాకుంతలనాటకాంతంలో
“మారీచ” అనే పేరిట ఒక మహర్షి
కనిపిస్తాడు. అతడెవరో కాదు, మరీచిపుత్రుడైన కశ్యపమహర్షియే.
స్వాయంభువాన్మరీచేర్యః
ప్రబభూవ ప్రజాపతిః।
సురాసురగురుః సోఽత్ర
సపత్నీకస్తపస్యతి॥
అని కాళిదాసు మాతలి చేత
పలికించాడు. “మరీచేః ప్రబభూవ” (అంటే - మరీచికి సంతానంగా జన్మించాడు)
"ప్రజాపతి",
"సురాసురగురుః"
(అంటే అదితినుండి సురులను,
దితినుండి అసురులను కన్నవాడు)
"సపత్నీకుడై (అంటే అదితిసహితుడై) తపస్సును చేస్తున్నాడు'' అనే మాటల ద్వారా ఆ మారీచుడు కశ్యపమహర్షి అని స్పష్టంగా
తెలుస్తుంది. కాబట్టి, రామాయణంలో మాయామృగంగా కనిపించి సీతారాములను
వంచించిన మారీచుడు ఇతడేనేమో అని పొరపాటు పడరాదు.
దుష్యంతతిరస్కృతయైన తన కుమార్తె
శకుంతలను మేనక మారీచమహర్షి ఆశ్రమంలోనే విడిచిపెట్టింది. ఆ ఆశ్రమంలోనే భరతుడు జన్మించాడు. శకుంతలాదుష్యంతుల పునఃసమాగమం ఆయన ఆశ్రమంలోనే
జరిగి, వారి కథ మంగళాంతమైంది.
మరీచిమహర్షికి ధర్మవ్రత అని మరొక భార్య
కూడా ఉన్నది. ఒకసారి అతడు ఆమెపై
నిష్కారణంగా ఆగ్రహించి ఆమెను శిలగా మారిపొమ్మని శపించాడు. తరువాత కోపాన్ని నిగ్రహించుకొనలేని తన అసమర్థత వలన
నిరపరాధిని అయిన ఆమె దండింపబడింది కదా అని ఎంతగానో పరితపించాడు. అప్పుడు అతనికి శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై, “నాయనా! నా సంకల్పం వల్లనే నీకు కోపం వచ్చింది” అని ఓదార్చాడు.
ధర్మవ్రత ఆపై దేవశిలగా పిలువబడుతుందని, ఆమెలో త్రిమూర్తులతో సహా సకలదేవతలు నివసిస్తారని, వారి సాన్నిధ్యం దేవశిలలో
మంత్రపూర్వకంగా ప్రతిష్ఠింపబడుతుందని వరమిచ్చాడు.
ఈ నాటికి కూడా మనం దేవశిలలో నెలకొన్న దేవతామూర్తులకు నమస్కరిస్తూనే ఉంటాము.
#పాల్ఘర్
#Palghar
సర్ , నివ్రృత్తి మార్గం , ప్రవృత్తి మార్గం అంటే తెలుపగలరు 🙏
ReplyDeleteఅమ్మా,
Deleteప్రవృత్తిమార్గమంటే కర్మమార్గము. నివృత్తిమార్గమంటే జ్ఞానమార్గము.