అనగా అనగా ఇద్దరు అన్నదమ్ములు. వారంతటి
సోమరులు ప్రపంచంలో బహుశః మరెవ్వరూ ఉండరు.
అయినప్పటికీ, తాము చాలా తెలివైన వారమని, తాము కాలు
మీద కాలు వేసుకుని ప్రపంచాన్ని శాసించడానికి పుట్టామని, మిగిలిన
వాళ్ళందరూ తన మాటలను వినడానికే పుట్టారని వారికి వారిద్దరికీ
గట్టి నమ్మకం.
అయితే వారి నమ్మకాల మీద ఇంకెవరికీ నమ్మకం లేదు కాబట్టి వారి
మాటలను ఎవరూ వినేవారు కారు. అసలు వారిద్దరినీ ఎవరూ పట్టించుకునే వారే
కారు.
వారికి పెళ్లి వయసు వచ్చింది. "మామా మామా, నీ
కూతుర్లిద్దరినీ మా ఇద్దరికీ ఇచ్చి పెళ్లి చెయ్" అని వాళ్లు మేనమామను
అడిగారు.
మేనమామ ఒంటికాలిమీద లేచాడు. శలకోల
తీసుకొని ఒళ్లు చీరేసినంత పని చేశాడు. "ఇంకోసారి ఆ మాట
ఎత్తితే నరికేస్తా" అన్నాడు.
"అదేమిట్రా
తమ్ముడూ మేనల్లుళ్లమీద నీకు అంత కోపం?" అని కనీసం అమ్మైనా
వారించింది కాదు.
సరే, ఒకరోజు వారు
"అమ్మా అమ్మా,జంతికలు
రవ్వ లడ్డులు చేసి పెట్టవే అన్నారు. ఈసారి స్వయంగా అమ్మే ఒంటికాలిమీద లేచింది. శలకోల
తీసుకొని వాయించి పారేసింది.
"మీరు ఏదో ఒక
పని చేసి సంపాదించి ఇంటికి డబ్బులు తెచ్చి పెట్టే దాకా నేనేమీ చేసి పెట్టను"
అని ఖరాఖండిగా చెప్పేసింది.
ఒంటిమీద వాతలతో రాత్రంతా ఏడుస్తూ గడిపిన వారికి తెల్లవారేసరికి
బుద్ధొచ్చింది. ఏదైనా పని
చేసి సంపాదించి, తామంటే
ఏమిటో తమ తెలివితేటలు ఎలాంటివో ప్రపంచానికి ఋజువు చేద్దామనుకున్నారు.
అమ్మ దగ్గరికి వెళ్లి "అమ్మా అమ్మా జంతికలు రవ్వలడ్డులు
చేసి పెట్టవే" అన్నారు. అమ్మ భీకరంగా గర్జించి మళ్లీ శలకోల
చేతిలోనికి తీసుకొనకముందే వారు అమ్మ కాళ్ల మీద పడ్డారు.
"అమ్మా, ఆ జంతికలు
రవ్వలడ్డులు మేము బజారుకు పోయి అమ్ముకొని వస్తాము. ఎంతో కొంత
సంపాదిస్తాము" అని చెప్పారు.
అమ్మ సంతోషపడింది. పోనీలే ఇప్పటికైనా వీరి సోమరితనం వదిలితే
చాలు అనుకున్నది. అన్నకు ఒక
బుట్ట నిండా 50 జంతికలు
తమ్మునికి ఒక బుట్టనిండా 50 రవ్వలడ్డులు
చేసి ఇచ్చింది.
"ఒక్కొక్కటి
ఒక్కొక్క రూపాయి చొప్పున అమ్ముకు రండి" అని చెప్పింది.
ఆ విషయం తెలుసుకుని మేనమామ కూడా సంతోష పడ్డాడు. "ఒరేయ్, మీరు
కష్టపడి మొత్తం అమ్ముకొని వచ్చిన రోజున చెప్పండి. మీరు
ప్రయోజకులు అయ్యారని నమ్ముతాను. నా కూతుళ్లను మీకు ఇచ్చి పెళ్లి
చేస్తాను" అన్నాడు.
సరేనని అన్నదమ్ములిద్దరూ బయలుదేరి బజారుకు వెళ్లారు. అంత దూరం
నడిచే సరికి పాపం వారిద్దరికీ బాగా ఆకలి వేసింది.
"అన్నా! నాకు
ఆకలి వేస్తోంది. కొన్ని జంతికలు ఇవ్వు" అన్నాడు తమ్ముడు.
"వీటిని అమ్మడానికి
తెచ్చాను. ఎలా తింటావ్?" అని అడిగాడు
అన్న.
తమ్ముడు కాసేపు ఆలోచించి, "సరే అన్నా. నా దగ్గర
పది రూపాయలు ఉన్నాయి. వాటిని తీసుకుని పది జంతికలు ఇవ్వు"
అన్నాడు.
"సరే
అయితే" అని అన్న తమ్ముని దగ్గర నుంచి పది రూపాయలు తీసుకొని పది జంతికలు
తమ్మునికి అమ్మాడు.
కాసేపు అయిన తరువాత అన్నకు ఆకలి వేసింది. తన దగ్గర
ఉన్న పది రూపాయలు తమ్మునికి ఇచ్చి తాను పది రవ్వలడ్లు తీసుకుని తిన్నాడు.
ఇద్దరూ చాలా సంతోషపడ్డారు. ఇలా చేయడం
వల్ల తమ సరుకు అమ్ముడు పోతుంది మంచి వ్యాపారం నడుస్తుంది అని కేరింతలు కొట్టారు.
మరి కాసేపు అయిన తర్వాత తమ్మునికి మళ్లీ ఆకలి వేసింది. ఎక్కడో బయట
తిని బయటవారికోసం ఎందుకు ఖర్చు పెట్టాలని అన్న దగ్గరే తినుబండారాలు కొనుగోలు
చేశాడు. ఆ తరువాత
అన్నకు ఆకలి వేసింది. అతడు కూడా అదే పని చేశాడు.
మొత్తానికి సాయంత్రమయ్యేసరికి ఇద్దరూ ఒకరి బుట్టనింకొకరు ఖాళీ
చేసేశారు. అన్నదమ్ములిద్దరూ
ఆనందబాష్పాలతో ఒకరినొకరు కౌగలించుకున్నారు. మేనమామ తమ కాళ్లు కడిగి కన్యాదానం చేయబోయే
దృశ్యాలను ఊహించుకున్నారు.
ఇంటికి తిరిగి వెళ్లారు. మొత్తం సరుకును అమ్మేశామని చెప్పేసరికి
అమ్మ ఆనందబాష్పాలు రాల్చింది. మేనమామ పరమోత్సాహంతో వచ్చాడు. ఆయన వెంట
పెళ్లి కూతుళ్లు కూడా మేలిముసుగు వేసుకుని సిగ్గుపడుతూ వచ్చారు. పెళ్లి
ముహూర్తం పెట్టేందుకు పంతులు గారిని కూడా పిలిచారు. వచ్చిన
చుట్టాలందరికీ విందులు చేశారు.
అందరి సమక్షంలోనూ మేనమామ తన మేనల్లుళ్ల ఘనతను అందరికీ చాటాడు. మొదటి
రోజునే మొత్తం సరుకును అమ్మేసిన వారు తమ జీవితంలో ముందు ముందు ఇంకా ఎంతటి
మహత్కార్యాలను సాధిస్తారోనని ఆశ్చర్యం వెళ్లబుచ్చాడు.
అందరూ నిశ్శబ్దంగానో చప్పట్లు కొడుతూనో కాసేపు కాలక్షేపం
చేసుంటే పాపం, అంతా
సవ్యంగా జరిగిపోయేదే! కాని, ఉన్నట్టుండి ఎవడో చింటూగాడు వచ్చి వీళ్ల
కాళ్లమీద పడిపోయాడు. మీరు మొత్తం సరుకును మొదటి రోజే ఎలా
అమ్మగలిగారు? నాకు కూడా ఆ
రహస్యం చెప్పి పుణ్యం కట్టుకోండి. నాకు కూడా పెళ్లి చేసుకోవాలనుంది"
అంటూ కళ్ల నీళ్లు పెట్టేసుకున్నాడు.
పాపం,జాలిగుండెల
అన్నదమ్ములు ఆ రహస్యాన్ని అరమరికలు లేకుండా విపులంగా విశదీకరించారు.
వెంటనే కెవ్వు మని కేక వినిపించింది. అందరూ ఆవైపు
చూశారు. పాపం, పెళ్లికూతుళ్లిద్దరూ
స్పృహతప్పి పడిపోయి ఉన్నారు.
మేనల్లుళ్ల నిర్వాకం చెవులారా విన్నటువంటి, తన కూతుర్ల
దురవస్థను కళ్లారా కన్నటువంటి మేనమామ కండ్లు చటచట ఎర్రబడ్డాయి. పళ్లు పటపటలాడాయి.
పెదవులు వడవడ వణికాయి.
ఆ తరువాత...
ఆ తరువాత ఏం జరిగిందని నన్నడక్కండి.
అన్నీ నేనే చెప్పాలా?
మీకా మాత్రం ఊహాశక్తి లేదా?
పోనీ హింటిస్తా.
రుద్రతాండవం అంటే తెలుసా?
పోనీ దక్షయజ్ఞం గూర్చి విన్నారా?
అంతే.
నీతి -
ప్రయోగదశ దాటకుండా ట్రీట్లు ట్రీట్మంట్లు ఇవ్వరాదు.
No comments:
Post a Comment