Wednesday, 29 April 2020

ట్రీట్లు ట్రీట్మెంట్లకు తొందరెందుకు?



అనగా అనగా ఇద్దరు అన్నదమ్ములు. వారంతటి సోమరులు ప్రపంచంలో బహుశః మరెవ్వరూ ఉండరు.
అయినప్పటికీ, తాము చాలా తెలివైన వారమని, తాము కాలు మీద కాలు వేసుకుని ప్రపంచాన్ని శాసించడానికి పుట్టామని, మిగిలిన వాళ్ళందరూ తన మాటలను వినడానికే పుట్టారని వారికి వారిద్దరికీ గట్టి నమ్మకం.
అయితే వారి నమ్మకాల మీద ఇంకెవరికీ నమ్మకం లేదు కాబట్టి వారి మాటలను ఎవరూ వినేవారు కారు. అసలు వారిద్దరినీ ఎవరూ పట్టించుకునే వారే కారు.
వారికి పెళ్లి వయసు వచ్చింది. "మామా మామా, నీ కూతుర్లిద్దరినీ మా ఇద్దరికీ ఇచ్చి పెళ్లి చెయ్" అని వాళ్లు మేనమామను అడిగారు.
మేనమామ ఒంటికాలిమీద లేచాడు. శలకోల తీసుకొని ఒళ్లు చీరేసినంత పని చేశాడు. "ఇంకోసారి ఆ మాట ఎత్తితే నరికేస్తా" అన్నాడు.
"అదేమిట్రా తమ్ముడూ మేనల్లుళ్లమీద నీకు అంత కోపం?" అని కనీసం అమ్మైనా వారించింది కాదు.
సరే, ఒకరోజు వారు "అమ్మా అమ్మా,జంతికలు రవ్వ లడ్డులు చేసి పెట్టవే అన్నారు. ఈసారి స్వయంగా అమ్మే ఒంటికాలిమీద లేచింది. శలకోల తీసుకొని వాయించి పారేసింది.
"మీరు ఏదో ఒక పని చేసి సంపాదించి ఇంటికి డబ్బులు తెచ్చి పెట్టే దాకా నేనేమీ చేసి పెట్టను" అని ఖరాఖండిగా చెప్పేసింది.
ఒంటిమీద వాతలతో రాత్రంతా ఏడుస్తూ గడిపిన వారికి తెల్లవారేసరికి బుద్ధొచ్చింది. ఏదైనా పని చేసి సంపాదించి, తామంటే ఏమిటో తమ తెలివితేటలు ఎలాంటివో ప్రపంచానికి ఋజువు చేద్దామనుకున్నారు.
అమ్మ దగ్గరికి వెళ్లి "అమ్మా అమ్మా జంతికలు రవ్వలడ్డులు చేసి పెట్టవే" అన్నారు. అమ్మ భీకరంగా గర్జించి మళ్లీ శలకోల చేతిలోనికి తీసుకొనకముందే వారు అమ్మ కాళ్ల మీద పడ్డారు.
"అమ్మా, ఆ జంతికలు రవ్వలడ్డులు మేము బజారుకు పోయి అమ్ముకొని వస్తాము. ఎంతో కొంత సంపాదిస్తాము" అని చెప్పారు.
అమ్మ సంతోషపడింది. పోనీలే ఇప్పటికైనా వీరి సోమరితనం వదిలితే చాలు అనుకున్నది. అన్నకు ఒక బుట్ట నిండా 50 జంతికలు తమ్మునికి ఒక బుట్టనిండా 50 రవ్వలడ్డులు చేసి ఇచ్చింది.
"ఒక్కొక్కటి ఒక్కొక్క రూపాయి చొప్పున అమ్ముకు రండి" అని చెప్పింది.
ఆ విషయం తెలుసుకుని మేనమామ కూడా సంతోష పడ్డాడు. "ఒరేయ్, మీరు కష్టపడి మొత్తం అమ్ముకొని వచ్చిన రోజున చెప్పండి. మీరు ప్రయోజకులు అయ్యారని నమ్ముతాను. నా కూతుళ్లను మీకు ఇచ్చి పెళ్లి చేస్తాను" అన్నాడు.
సరేనని అన్నదమ్ములిద్దరూ బయలుదేరి బజారుకు వెళ్లారు. అంత దూరం నడిచే సరికి పాపం వారిద్దరికీ బాగా ఆకలి వేసింది.
"అన్నా! నాకు ఆకలి వేస్తోంది. కొన్ని జంతికలు ఇవ్వు" అన్నాడు తమ్ముడు.
"వీటిని అమ్మడానికి తెచ్చాను. ఎలా తింటావ్?" అని అడిగాడు అన్న.
తమ్ముడు కాసేపు ఆలోచించి, "సరే అన్నా. నా దగ్గర పది రూపాయలు ఉన్నాయి. వాటిని తీసుకుని పది జంతికలు ఇవ్వు" అన్నాడు.
"సరే అయితే" అని అన్న తమ్ముని దగ్గర నుంచి పది రూపాయలు తీసుకొని పది జంతికలు తమ్మునికి అమ్మాడు.
కాసేపు అయిన తరువాత అన్నకు ఆకలి వేసింది. తన దగ్గర ఉన్న పది రూపాయలు తమ్మునికి ఇచ్చి తాను పది రవ్వలడ్లు తీసుకుని తిన్నాడు.
ఇద్దరూ చాలా సంతోషపడ్డారు. ఇలా చేయడం వల్ల తమ సరుకు అమ్ముడు పోతుంది మంచి వ్యాపారం నడుస్తుంది అని కేరింతలు కొట్టారు.
మరి కాసేపు అయిన తర్వాత తమ్మునికి మళ్లీ ఆకలి వేసింది. ఎక్కడో బయట తిని బయటవారికోసం ఎందుకు ఖర్చు పెట్టాలని అన్న దగ్గరే తినుబండారాలు కొనుగోలు చేశాడు. ఆ తరువాత అన్నకు ఆకలి వేసింది. అతడు కూడా అదే పని చేశాడు.
మొత్తానికి సాయంత్రమయ్యేసరికి ఇద్దరూ ఒకరి బుట్టనింకొకరు ఖాళీ చేసేశారు. అన్నదమ్ములిద్దరూ ఆనందబాష్పాలతో ఒకరినొకరు కౌగలించుకున్నారు. మేనమామ తమ కాళ్లు కడిగి కన్యాదానం చేయబోయే దృశ్యాలను ఊహించుకున్నారు.
ఇంటికి తిరిగి వెళ్లారు. మొత్తం సరుకును అమ్మేశామని చెప్పేసరికి అమ్మ ఆనందబాష్పాలు రాల్చింది. మేనమామ పరమోత్సాహంతో వచ్చాడు. ఆయన వెంట పెళ్లి కూతుళ్లు కూడా మేలిముసుగు వేసుకుని సిగ్గుపడుతూ వచ్చారు. పెళ్లి ముహూర్తం పెట్టేందుకు పంతులు గారిని కూడా పిలిచారు. వచ్చిన చుట్టాలందరికీ విందులు చేశారు.
అందరి సమక్షంలోనూ మేనమామ తన మేనల్లుళ్ల ఘనతను అందరికీ చాటాడు. మొదటి రోజునే మొత్తం సరుకును అమ్మేసిన వారు తమ జీవితంలో ముందు ముందు ఇంకా ఎంతటి మహత్కార్యాలను సాధిస్తారోనని ఆశ్చర్యం వెళ్లబుచ్చాడు.
అందరూ నిశ్శబ్దంగానో చప్పట్లు కొడుతూనో కాసేపు కాలక్షేపం చేసుంటే పాపం, అంతా సవ్యంగా జరిగిపోయేదే! కాని, ఉన్నట్టుండి ఎవడో చింటూగాడు వచ్చి వీళ్ల కాళ్లమీద పడిపోయాడు. మీరు మొత్తం సరుకును మొదటి రోజే ఎలా అమ్మగలిగారు? నాకు కూడా ఆ రహస్యం చెప్పి పుణ్యం కట్టుకోండి. నాకు కూడా పెళ్లి చేసుకోవాలనుంది" అంటూ కళ్ల నీళ్లు పెట్టేసుకున్నాడు.
పాపం,జాలిగుండెల అన్నదమ్ములు ఆ రహస్యాన్ని అరమరికలు లేకుండా విపులంగా విశదీకరించారు‌‌.
వెంటనే కెవ్వు మని కేక వినిపించింది. అందరూ ఆవైపు చూశారు. పాపం, పెళ్లికూతుళ్లిద్దరూ స్పృహతప్పి పడిపోయి ఉన్నారు.
మేనల్లుళ్ల నిర్వాకం చెవులారా విన్నటువంటి, తన కూతుర్ల దురవస్థను కళ్లారా కన్నటువంటి మేనమామ కండ్లు చటచట ఎర్రబడ్డాయి. పళ్లు పటపటలాడాయి. పెదవులు వడవడ వణికాయి.
ఆ తరువాత...
ఆ తరువాత ఏం జరిగిందని నన్నడక్కండి.
అన్నీ నేనే చెప్పాలా?
మీకా మాత్రం ఊహాశక్తి లేదా?
పోనీ హింటిస్తా.
రుద్రతాండవం అంటే తెలుసా?
పోనీ దక్షయజ్ఞం గూర్చి విన్నారా?
అంతే.

నీతి -
ప్రయోగదశ దాటకుండా ట్రీట్లు ట్రీట్మంట్లు ఇవ్వరాదు.


Monday, 27 April 2020

కోఽరుక్?




అనగా అనగా కేరళదేశం.  ఆయుర్వేదవైద్యానికి ప్రసిద్ధిగన్న దేశం.  అటువంటి దేశంలో ప్రఖ్యాతి చెందిన ఎనిమిది వైద్యకుటుంబాలు ఉండేవి.  అందులో ఒకానొక కుటుంబానికి చెందినవాడే ఆలత్తియూర్ నంపి.  (నంబి)

నంబి మహాభక్తుడు.  ఆయన ప్రతి రోజూ తమ కులదైవమైన శివుని మందిరానికి పోయి దర్శనం చేసుకుని, ధ్యానం చేసుకొనేవాడు.  ఒకరోజు అతడు దేవాలయానికి పోయినపుడు అక్కడ ఉన్న చెట్టుపై రెండు పక్షులు కూర్చుని కోరుక్ కోరుక్ అని అరవడం విన్నాడు.  ఆ పక్షుల మధురశబ్దాలను విని నంబి చాల ఆనందించాడు.  అవి ఏవో క్రొత్తరకం పక్షులు అనుకున్నాడే గాని, అంతగా వాటి శబ్దాలను పట్టించుకోలేదు.  అయితే అవి ప్రతి రోజూ ఆ చెట్టు మీద అదే స్థానంలో అదే సమయంలో కూర్చుని అరవడం అతడు గమనించాడు.

అలా వింటూ వింటూ ఉండగా, కోరుక్ - కోరుక్ అనే శబ్దాలతో ఆ పక్షులు తనను కోరుక్? - కోఽరుక్? అని తనను ప్రశ్నిస్తున్నట్టుగా నంబికి అనిపించింది.  

(సంస్కృతంలో కః + అరుక్ అనే రెండు పదాలు కలసి కోఽరుక్ అనే సంధిరూపంగా మారుతాయి.  ధన్యః + అస్మి = ధన్యోఽస్మిదాసః + అహమ్ = దాసోఽహమ్ అనే సంధిరూపాలను మనం తెలుగుభాషాపదాలైనట్లుగా యథేచ్చగా వాడుతూ ఉంటాం కదా, అటువంటిదే ఈ కోఽరుక్ రూపం కూడా.)  కః అంటే ఎవడు? అని.  అది ఒక ప్రశ్నార్థకపదం.  రుక్ (రుజ్) అంటే రోగం.  రోగం కలిగినవాడు అనే అర్థం కూడా వస్తుంది.  అరుక్ అంటే రోగం లేనివాడు.  (అంటే, ఆరోగ్యవంతుడు) కాబట్టి, కః + అరుక్ = కోఽరుక్ అంటే ఎవడు ఆరోగ్యవంతుడు?” అని ఆ పక్షులు తనను అడుగుతున్నట్టు అన్న మాట. 

అలా అనిపించగానే నంబి వెంటనే సమాధానం చెప్పాడు.

కాలే హితమితభోజీ కృతచఙ్క్రమణః  క్రమేణ వామశయీ
అవిరుద్ధమూత్రపురీషః స్త్రీషు యతాత్మా చ యో నరః సోరుక్।।

(ఏ మనిషి సమయం ప్రకారం హితంగాను, మితంగాను భుజిస్తాడో, తగినంత కాలం సంచరిస్తాడో, ఎడమవైపుకు తిరిగి నిద్రిస్తాడో, మూత్రపురీషాలను ప్రతిదినం సమయానికి విసర్జిస్తాడో, స్త్రీవ్యామోహం లేనివాడై ఉంటాడో, ఆ మనిషే ఆరోగ్యవంతుడు అని అర్థం.)

ఆ సమాధానం వినగానే ఆ రెండు పక్షులూ ఎగిరిపోయాయి.  మరలా అవి కనబడలేదు.  "ఓహో అవి దేవతాపక్షులై ఉంటాయి.  నా సమాధానం సరైనదే అని గ్రహించి మరలా నన్ను ఆ ప్రశ్నను అడిగేందుకు రాలేదు కాబోలు అని నంబి భావించాడు.

కొన్ని రోజులు గడిచాక నంబి దగ్గరకు ఇద్దరు బాలురు వచ్చారు.  మహోదయా, మేము మీ చెంత ఆయుర్వేదవిద్యను నేర్చుకొనగోరి వచ్చాము అని అర్థించారు.  వారి తేజస్సును చూసి ముచ్చటపడిన నంబి వారిని తన శిష్యులుగా అంగీకరించాడు.

రాను రాను, తన శిష్యుల తెలివితేటలు నంబికి చాల ఆశ్చర్యం కలిగించడం మొదలుపెట్టాయి.  వారు ఏకసంథాగ్రాహులైన శిష్యులు మాత్రమే కారు, ప్రతి శ్లోకాన్ని వారు వ్యాఖ్యానిస్తున్న తీరు అసాధారణంగా ఉండేది.  నేను వారికి బోధిస్తున్నానా, లేక వారే నాకు తెలియని అనేకవిషయాలను చాల వివరణపూర్వకంగా చెబుతున్నారా?” అని అతడికి సందేహం కలిగేది.  వారు చెప్పిన ప్రకారం వైద్యం చేస్తే అది తాను పూర్వం అవలంబిస్తున్న విధానం కంటె ఎంతో ఫలితం ఎంతో మెరుగ్గా ఉండేది.

ఆ పిల్లలు మేధావులు మాత్రమే కారు.  చాల అల్లరి చేసేవారు.  వారి అల్లరిని నంబి ఎంతో ప్రేమతో సహించేవాడు.  నంబి మాత్రమే కాదు, అతని కుటుంబసభ్యులకు, ఆ ఊరిలో ప్రజలకు కూడా వారు ఎంతో ప్రీతిపాత్రులైనారు.

ఒకనాడు నంబి ఇంటిలో లేని సమయంలో ఒక రోగి వచ్చాడు.  అతడు దుర్భరమైన శిరోవేదనను అనుభవిస్తున్నాడు.  నంబి ఇస్తున్న ఔషధం అతనికి ప్రతిసారీ తాత్కాలికమైన ఉపశమనాన్ని ఇస్తోందే కాని, పూర్తిగా తగ్గించలేకపోతోంది.

ఈసారి అతడు వచ్చేసరికి నంబి ఇంటిలో లేడు.  కాని, అతని బాలశిష్యులిద్దరూ అతనిని చికిత్స చేసే గదిలోనికి తీసుకుపోయారు.  ఆ రోగి నుదుటిపై ఒక ఔషధాన్ని పూశారు.  ఆ తరువాత, అతడి నుదుటిమీదనున్న చర్మాన్ని పైకి లాగారు.  వెంటనే అది తడికి అంటుకున్న తమలపాకులాగ కపాలంనుండి ఊడిపోయి పైకి వచ్చేసింది.  అప్పుడు ఆ రోగి నుదుటిచర్మం క్రిందనున్న కపాలము, కండరాలు స్పష్టంగా కనబడసాగాయి.  ఆ బాలురు ఆ ప్రాంతంలో ఉన్న కొన్ని విషక్రిములను పైకి లాగి పడేసి, ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు.  తరువాత, నుదుటి చర్మాన్ని యథాప్రకారం కప్పివేసి, మరొక ఔషధం పూశారు. వెంటనే అది మచ్చకూడా లేకుండా యథాపూర్వం అతుక్కుపోయింది.  ఆ రోగికి శిరోవేదన శాశ్వతంగా మటుమాయమై పోయింది.

ఈ సంఘటనను నంబి కుమారులు చూసి దిగ్భ్రాంతి చెందారు.  తండ్రి ఇంటికి తిరిగి రాగానే జరిగిన విషయమంతా చెప్పారు.  వారు చెప్పినది నిజమేనని తెలుసుకున్న నంబి పరమానందభరితుడై ఆ బాలురు దేవవైద్యులైన అశ్వినీకుమారులే తప్ప వేరొకరు కారని నిశ్చయించుకున్నాడు.

ఇంత జరిగిన తరువాత, ఆ బాలురు ఇక తమకు సెలవు ఇప్పించమని నంబిని కోరారు.  మీరెవ్వరో చెప్పకుంటే మీరు వెళ్లిపోయేందుకు నేను అనుమతినివ్వను అని నంబి వారిని అడిగిన మీదట, వారు తాము దేవవైద్యులమైన అశ్వినీదేవతలమేనని, ఆయుర్వేదవైద్యాన్ని భూలోకంలో ప్రచారం చేసేందుకు వచ్చామని, మునుపు అతని వైద్యసామర్థ్యాన్ని పరీక్షించేందుకు గాను ఆలయప్రాంగణంలో పక్షులరూపంలో కోఽరుక్ అంటూ అతనిని ప్రశ్నించినది కూడా తామేనని చెప్పారు.  

ఆ సంగతి తెలిసిన తరువాత, నంబి వారు వెళ్లిపోయేందుకు అనుమతినిచ్చాడు కాడు.  అయితే వారు గురుదక్షిణగా నంబికి అపూర్వమైన ఒక ఆయుర్వేదవైద్యగ్రంథాన్ని బహూకరించి, అందులో ఉన్నట్టుగా వైద్యం చేయమని, అపుడు తాము లేని లోటు ఉండదని మాట ఇచ్చిన తరువాత, వారికి అనుమతి లభించింది.

ఆలయిత్తూర్ నంబి కేరళపాలిటి దేవునిగా, మహావైద్యునిగా ప్రఖ్యాతి చెందాడు.  ఆయన వంశంవారు ఈనాటికీ కేరళలో ప్రఖ్యాతులైన ఆయుర్వేదవైద్యులుగా ఉన్నారు.

ఉత్తరాదిలో వాగ్భటుడు అనే ఒక మహా-ఆయుర్వేదపండితుడు ఉండేవాడట.  దేవవైద్యుడైన ధన్వంతరి పక్షిరూపంలో వచ్చి కోఽరుక్ అని ఆయనను ప్రశ్నించగా, వాగ్భటుడు హితభుక్ మితభుక్, ఋతుభుక్ సోఽరుక్ (హితమైన ఆహారాన్ని, మితంగా షడృతువుల వాతావరణాన్ని అనుసరించి భుజించేవాడు, ఆయా ఋతువులలో సహజంగా ప్రకృతి ప్రసాదించే ఫలాదులను భుజించేవాడు ఆరోగ్యవంతుడై ఉంటాడు.) అనిసమాధానం చెప్పాడట.  ఇది రోగాన్ని తగ్గించడం కోసం కాదు.  అసలు రోగమే రాకుండా చేసుకునే ఉపాయం.  Prevention is better than Cure అని ఇంగ్లీషు వాళ్లు కూడా అభిప్రాయపడతారు కదా?

।।సర్వే భవంతు సుఖినః।।


అత్రిఅనసూయామహర్షిదంపతులు




#భారతీయఋషులు 3



అత్రిమహర్షి వృత్తాంతం భౌతికమైనది కాదని, కొంతవరకు సాంకేతికమైనదని తోస్తుంది.  కాని, సీతారామలక్ష్మణులు తమ వనవాసకాలంలో ఆయనను ప్రత్యక్షంగా సందర్శించి సేవించుకున్నట్లు రామాయణం సాక్ష్యమిస్తుంది.

అత్రి కూడా బ్రహ్మమానసపుత్రుడే.  ఈయన ఋఙ్మంత్రద్రష్టగా వేదాలలో ఉదాహరింపబడ్డాడు.  (ఋగ్వేదం, పంచమమండలం)   బృహదారణ్యకోపనిషత్తు అతనిని వాక్కుగా వర్ణిస్తుంది.  వాగేవ అత్రిఃఈ సందర్భంలో వాక్కు అంటే రసనేంద్రియమే (నాలుక) అని కొందరి వ్యాఖ్యానం.     

ఉపనిషత్తులో తరువాత చెప్పిబడిన వాక్యాలు ఆ వ్యాఖ్యానం సమంజసమే అనిపించేలా చేస్తాయి.  వాచాహ్యన్మద్యతే – (వాక్కు చేతనే అన్నం భుజింపబడుతుంది.)  అత్తిర్హ వై నామైతద్ యదత్రిరితి – భుజిస్తుంది (అత్తి) కాబట్టి దీని పేరు అత్రి.  సర్వస్యాత్తా భవతి, సర్వమస్యాన్నం భవతి య ఏవం వేద (ఈ విషయాన్ని ఎవడు తెలుసుకుంటాడో అతడు సమస్తాన్నీ భుజింపగలిగినవాడౌతాడు.  సర్వమూ అతడికి అన్నమౌతుంది.) {బృహదారణ్యకం 2.2.4}

దేవహూతీకర్దముల పుత్రిక అయిన అనసూయ ఇతడి భార్య.  ఆ అనసూయ దయాస్వరూపిణి.  ఒకసారి వరుసగా పదిసంవత్సరాలపాటు అనావృష్టి ఏర్పడి తిండి నీరు లేక ప్రపంచమంతా అల్లాడిపోయిందట.  అపుడు అనసూయ తన తపఃప్రభావం చేత ప్రజలకోసం మూలాలను (దుంపలను) ఫలాలను సృష్టించిందట.  నీటిని కూడా సృష్టించిందట.  

యయా మూలఫలే సృష్టే
జాహ్నవీ చ ప్రవర్తితా
(రామాయణం.2.117.9)

అనసూయమ్మకు సాక్షాత్తుగా గంగ ప్రత్యక్షమైందని,  తన తపఃఫలాన్ని పతిసేవాధర్మపుణ్యాన్ని ధారపోసి అనసూయమ్మ గంగమ్మను నిలిపిందని శివపురాణంలో కోటిరుద్రసంహిత తెలుపుతుంది.

(తపస్సు అంటే తపించడం.  ఒక విషయాన్ని గూర్చి తీవ్రమైన శోధన చేయడం కూడా తపస్సే.  అంటే రిసెర్చ్ అన్నమాట.  బహుశః అనసూయమ్మ పరిశోధించి అతి తక్కువ నీటితో పండే మూలఫలాదులను కనిపెట్టింది అనుకోవచ్చు.  అలాగే, నీటివనరులను కాపాడుకొనడం, భూగర్భంలోని నీటిని పైకి తీయడం వంటివి ప్రజలకు నేర్పింది అనుకోవచ్చు.  ఈ విధంగా అనసూయమ్మ అతి ప్రాచీనకాలపు సైంటిస్టు, సంఘసేవికురాలున్నూ.  ఆమెను కేవలం ఒక పతివ్రతగా మాత్రమే గుర్తించడం అన్యాయం.) 

ఆ పుణ్యదంపతుల కోరిక మేరకు శివుడు గంగ నిలిచిన తావున అత్రీశ్వరుడనే పేరిట నిలిచిపోయాడు.

ఈ దంపతులిద్దరూ అతి గొప్ప తపస్సును చేశారు.  త్రిమూర్తులు వారి తపస్సుకు మెచ్చి ఏమి కావాలో కోరుకొమ్మని అడిగారు.  మీరు మాకు పుత్రులై జన్మించాలి అని వారు వరం కోరారు.  వారి కోరిక మేరకు బ్రహ్మ సోమునిగా, విష్ణువు దత్తాత్రేయునిగా, పరమేశ్వరుడు దూర్వాసునిగా వారి కుమారులై జన్మించి వారి ముచ్చటను తీర్చారు. 

ఈ విషయంలో మరొక కథ కూడా ఉన్నది.  ఒకసారి సూర్యచంద్రోదయాలకు తీవ్రమైన ఇబ్బంది ఏర్పడిందిట.  దాంతో త్రిమూర్తులు ఈ విషయంలో సహాయం చేయమని అనసూయను అడిగారట.  అపుడు ఆమె పదిరాత్రులను ఒక్క రాత్రిగా మార్చివేసి, సూర్యచంద్రోదయాలు జరిగేందుకు వీలు కలుగజేసింది. 

దశరాత్రం కృతా రాత్రిః (రామాయణం.2.117.11)

(ఈ కథ సాంకేతికంగా జ్యోతిషసంబద్ధమైన కాలగణనం.  జ్యోతిస్సులంటే సూర్యచంద్రగ్రహనక్షత్రాదులు. నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి ఫిబ్రవరిలో ఒక్క రోజు అధికంగా ఎలా వస్తుందో  మనకు తెలుసు.  అలాగే, చాంద్రమానాన్ని అనుసరించి, అధికమాసాలు, లేదా క్షయమాసాలు వస్తూ ఉంటాయి.  రెండు అమావాస్యల నడుమలో సంక్రాంతి ఎప్పుడైతే రాదో దానిని అధికమాసం అంటారు.  ఆ సంవత్సరంలో 13 నెలలు వస్తాయి. ఇటువంటి పరిస్థితి దాదాపు రెండున్నరసంవత్సరాలకు చొప్పున ఏర్పడుతుంది.  అలాగే, ఒకొక్కసారి రెండు అమావాస్యల నడుమ రెండు సంక్రాంతులు వస్తాయి.  ఆ కాలాన్ని క్షయమాసంగా లేదా లుప్తమాసంగా పరిగణిస్తారు.  అంటే ఆ సంవత్సరంలో ఒక  నెల లోపించి కేవలం 11 మాసాలు మాత్రమే ఉంటాయన్న మాట.  ఇది చాల అరుదైన ఘటన.  బహుశః, ఆనాడు అనసూయ కూడా ఇటువంటి కాలగణనం చేసి, ఒక తిథి (date) తరువాత మరుసటి రోజు 11వ తిథిని ఆనాటి క్యాలండర్లో పొందుపరచి ఉండవచ్చు.  దానినే పదిరాత్రులను ఒక్కరాత్రిగా మార్చడంగా సాంకేతికంగా పేర్కొని ఉంటారు.  ఈ విషయాన్ని అర్థం చేసుకొనడం చేతగాని దద్దమ్మలు పతివ్రతలంట, గ్రహగతులను మార్చివేశారంట అని వెక్కిరిస్తూ తమలో తాము ఆనందపడిపోతూ ఉంటారు.)

అనసూయ చేసిన ఘనకార్యానికి ఆనందపడిన త్రిమూర్తులు ఆమెను వరం కోరుకొమ్మంటే ఆమె వారిని తన బిడ్డలుగా జన్మించమని వరం కోరిందని, వారు తథాస్తు అని అంగీకరించారని ఆ మరొక కథ.  ఇంకొక కథలో త్రిమూర్తులు ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షింపగోరితే ఆమె వారిని పసిబిడ్డలుగా మార్చివేసిందని, త్రిమూర్తుల పత్నులు ఆమెను వేడుకుంటే వారు తనకు బిడ్డలుగా జన్మించాలని వరం కోరుకున్నదని చెబుతారు.  కథలు ఏమైనా, అనసూయమ్మ త్రిమూర్తులతో సమానమైన బిడ్డలను కన్న మహాతపస్విని అనే మాట నిజం.   

అతడు సోమమహారాజు చేసిన రాజసూయయాగానికి ప్రధానఋత్విక్కుగా ఉన్నాడు.  ఈనాడు ఉన్నట్టే ఆనాడు కూడా కొందరు రాక్షసులు ఉండేవారు.  వారు అత్రిమహర్షిని శతద్వారమనే పీడాగృహంలో చిత్రహింసలు పెట్టారు.  అతనిని చంపివేసేలోగా దేవవైద్యులైన అశ్వినీదేవతలు ఆ గృహంలోని అగ్నిని శమింపజేసి, బలప్రదమైన అన్నం పెట్టి కాపాడారు.

యువమత్రయేవనీతాయ
తప్తమూర్జమోమానమశ్వినావధత్తమ్
(ఋగ్వేదం, ప్రథమమండలం, 118 వ సూక్తం, 7వ ఋక్కు)

ఆ తరువాత సమస్తరాక్షసజాతిని అంతమొందించడానికి పరాశరమహర్షిని నాయకునిగా చేసుకుని ఇతరమునులు చేసిన మహాప్రయత్నాలను వద్దని అత్రి మహర్షి వారిని వారించాడు.  అంతటి కరుణాసముద్రుడు అతడు.  కౌరవపాండవుల నడుమ యుద్ధం జరగకుండా కూడా ఉండాలని ప్రయత్నించిన శాంతిప్రియుడు అత్రి.

చిత్రకూటం విడిచి దండకారణ్యానికి పోతున్నపుడు తనను సందర్శించుకున్న రామునితో అత్రి, సేయం మాతేవ తేనఘ (రామాయణం.2.117.11) ఇదిగో నాయనా, ఈమె నీ తల్లివంటిదే అని అనసూయమ్మను పరిచయం చేశాడు.  నిజానికి కూడా దత్తాత్రేయరూపంలో రాముడు అనసూయాపుత్రుడే కదా.  ఆ అనసూయమ్మ సీతామహాసాధ్వికి కూడా సుద్దులు చెప్పిన దొడ్డ ఇల్లాలు. 

సీతారామలక్ష్మణులు ఇక వెళ్లివస్తామని పలికినపుడు అత్రి చెప్పిన హెచ్చరిక నిత్యస్మరణీయం.

రక్షాంసి పురుషాదాని
నానారూపాణి రాఘవ
వసన్త్యస్మిన్ మహారణ్యే
వ్యాళాశ్చ రుధిరాశనాః।।
ఉచ్చిష్టం వా ప్రమత్తం వా
తాపసం ధర్మచారిణమ్
అదన్యస్మిన్ మహారణ్యే
తాన్ నివారయ రాఘవ।।
(రామాయణం 2.119.18-19)

నాయనా రాఘవా! ఈ మహారణ్యంలో క్రూరమృగాలతో పాటు రక్తపిపాసులూ నరమాంసభక్షకులూ అయిన రాక్షసులు వివిధరూపాలలో సంచరిస్తూ ఉంటారు.  తాపసులు భోజనం చేసిన తరువాత గాని, అజాగ్రత్తగా ఉండే సమయాలలో గాని హఠాత్తుగా వారిమీద దాడి చేసి చంపి తినేస్తూ ఉంటారు.  ఈ ఘోరాలన్నిటినీ నివారించు నాయనా!”

#పాల్ఘర్
#Palghar

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...