Saturday, 24 June 2023

మధురవాణి

గీతాప్రెస్, గోరఖ్ పుర్ వారి కల్యాణ్ పత్రిక (జూన్ 2023) లోని వ్యాసం


 

మధురవాణి వలన ఉపయోగాలు


వాక్సంయమో హి నృపతే సుదుష్కరతమో మతః।

అర్థవచ్చ విచిత్రం చ న శక్యం బహు భాషితుమ్।।

ఓ రాజా, మాటలను అదుపులో ఉంచుకుని పలకడం చాల కష్టమైన పని.  అయినప్పటికీ, అర్థవంతములు, నేర్పుతో కూడినవి అయిన మాటలను నిత్యం పలుకుతూ ఉండటం (అందరికీ) సాధ్యం కాదు.


అభ్యావహతి కల్యాణం వివిధం వాక్ సుభాషితా।

సైవ దుర్భాషితా రాజన్ననర్థాయోపపద్యతే।।

ఓ రాజా, చక్కగా మాటలాడటం వల్ల వివిధములైన శుభాలు చేకూరుతాయి.  కాని, చెడ్డ మాటలు పలికితే అవి వివిధములైన అనర్థాలను చేకూరుస్తాయి.

  

రోహతే సాయకైర్విద్ధం వనం పరశునా హతమ్।

వాచా దురుక్తం బీభత్సం న సంరోహతి వాక్క్షతమ్।।

బాణాలతో దెబ్బ తిన్నప్పటికీ, గొడ్డళ్లతో నరుకబడినప్పటికీ అడవి మరల చిగురిస్తుంది.  కాని, చెడ్డ మాటలతో బీభత్సంగా దెబ్బ తిన్నది ఏదీ కూడా (ఉదాహరణకు స్నేహం) మరల మొలకెత్తదు.


కర్ణినాలీకనారాచాన్నిర్హరన్తి శరీరతః।

వాక్శల్యస్తు న నిర్హర్తుం శక్యో హృదిశయో హి సః।।

శరీరంలో కర్ణి, నాళీకము, నారాచము మొదలైన రకరకాల బాణాలు గ్రుచ్చుకున్నప్పటికీ వాటిని మరలా పెరికివేయవచ్చును.  కాని, చెడ్డమాట అనే బాణం హృదయంలో గ్రుచ్చుకుంటే దానిని మరలా బయటకు పెరకడం సాధ్యం కాదు.


వాక్సాయకా వదనాన్నిష్పతన్తి యైరాహతః శోచతి రాత్ర్యహని।

పరస్య నామర్మసు తే పతన్తి తాన్ పణ్డితో నావసృజేత్ పరేభ్యః।।

నోటినుండి వెలువడే పదునైన బాణాల వంటి మాటలతో దెబ్బ తిన్న వ్యక్తి రాత్రింబగళ్లు బాధపడుతునే ఉంటాడు.  అవి సున్నితమైన మనస్సును దెబ్బ తీసి ఇతరుల ప్రాణాలను కూడా తీయగలవు.  అందువల్ల పండితుడు అటువంటి మాటలను పలుకరాదు. 


అతివాదం న ప్రవదేన్న వాదయేద్ యోనాహతః ప్రతిహన్యాన్న ఘాతయేత్।

హన్తుం చ యో నేచ్ఛతి పాపకం వై తస్మై దేవాః స్పృహయన్త్యాగతాయ।।

ఎవడు ఇతరులను దుర్భాషలతో బాధించడో, ఎవడు ఇతరులు తన పట్ల దుర్భాషలాడేందుకు అవకాశం ఇవ్వడో, ఎవడు ఇతరుల దుర్భాషలకు తాను బాధపడకుండా ఉంటాడో, ఎవడు ఇతరుల దుర్భాషలకు తాను స్వయంగా గురి అయినప్పటికీ, వారిని క్షమించి తిరిగి దుర్భాషలాడకుండా ఉంటాడో అటువంటి వాని ఆగమనం కోసం దేవతలు కూడా ఎదురుచూస్తూ ఉంటారు.

{{విదురనీతి (2.76-80, 4.11)}} 



ఆషాఢశుక్లషష్ఠీ, శోభకృత్, స్థిరవాసరః

శ్రీనివాసకృష్ణ



No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...