అమృతమహల్ అనే భారతీయగోజాతి అధికంగా కర్ణాటకలోని హసన, చిక్కమగళూరు, చిత్రదుర్గ జిల్లాలలో కనిపిస్తుంది.
ఇది కరువును చాల చక్కగా తట్టుకోగలదు. ఇది బలానికి, చురుకుదనానికి, పనిలో నైపుణ్యానికి పెట్టింది పేరు. ఈ జాతి ఎద్దులు వ్యవసాయపు పనులకు, రవాణాకు చాల చక్కగా ఉపయోగపడతాయి. ఆవులు తక్కువగా పాలను ఇస్తాయి. కాని వాటి సంతానం చాల బలంగా చురుకుగా ఉండేందుకు వాటి పాలే కారణం. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అనడంలో ఇదే అంతరార్థం.
సామాన్యశకం 1572 – 1636 కాలంలో మైసూరు పాలకులు పాలకోసం, పాల ఉత్పత్తులకోసం ఈ జాతి ఆవులను ప్రత్యేకమైన శ్రద్ధతో పెంచారు. ఈ జాతి ఎద్దులను యుద్ధసామగ్రి తరలింపుకోసం వాడేవారు. అమృతమహల్ జాతిలో మరలా హల్లికర్, హగల్ వాడి, చితల్ దుర్గ అనే మూడు ఉపజాతులు ఉన్నాయి.
అమృతమహల్ గోజాతి తెలుపునుండి నలుపువరకు వివిధ చాయలలో ఉంటాయి. కొన్ని పశువులలో ముఖం మీద, గంగడోలు మీద బూడిదరంగు మచ్చలు కూడా ఉంటాయి. వాటి మూతి, ముక్కు, తోక సాధారణంగా నలుపు రంగులో ఉంటాయి. వయసు పైబడుతున్న కొద్దీ ఆ నలుపు క్రమంగా పల్చబడుతుంది. ఈ జాతికి చెందిన పశువుల తల, కొమ్ముల ఆకృతి ప్రత్యేకంగా ఉంటుంది. వీటి దూడల తల పొడుగ్గా, మూతివైపు కూచిగా ఉంటుంది. వీటి నుదురు సన్నగా ఉండి మధ్యభాగం బయటకు ఉబ్బి ఉంటుంది. వీటి కొమ్ములు తమ కుదుళ్లనుండి కొద్దిగా వెనుకవైపుకు వంగి చివరి భాగంలో పదునుదేలి ఒకదానివైపుకు ఒకటి ఒరిగినట్టు ఉంటాయి. వాటి చివరిభాగం నలుపు రంగులో ఉంటుంది. వీటి కండ్లు ప్రకాశవంతంగా ఉంటాయి. చెవులు చిన్నవిగా, ఎటువైపూ వాలక సమతలంగా ఉండి, చివర ఆదోకగా ఉంటాయి. దీని మూపురం ఎత్తుగా పెరిగి, కొద్దిగా ముందుకు ఒరిగినట్టు ఉంటుంది. దీని గంగడోలు మరీ పొడుగైనది కాదు. వీటి చర్మం నూగుతో కూడి, పల్చగా, మృదువుగా, శరీరానికి బిగుతుగా ఉంటుంది. వీటి కాళ్లు మరీ పొడుగ్గా ఉండవు కాని, సమపాళ్లలో బలంగా ఉంటాయి. వీటి గిట్టలు చిన్నవిగా, దగ్గరగా, చాల గట్టిగా ఉంటాయి.
ఆవు పొదుగు చిన్నది. చనుమొనలు చిన్నగా దృఢంగా ఉంటాయి. ఎదిగిన ఆబోతు సరాసరి 500 కేజీలు, ఆవు 318 కేజీలు బరువు తూగుతాయి.
#గోవత్స_రాధేశ్యాం_రవోరియా గారి #భారతీయగోవంశ్ పుస్తకంలో ఒక వ్యాసానికి నా స్వేచ్ఛానువాదం. (1)
మరిన్ని వివరాలకు - Amrit Mahal Cattle Breed Facts, Features, Characteristics | Agri Farming
చిత్రం - Agri Farming వారిది.
వైశాఖపూర్ణిమా, శోభకృత్, శుక్రవాసరః
No comments:
Post a Comment