“శస్త్తేణాజీవనం రాజ్ఞో భూతానాం చాభిరక్షణమ్” అని రాజనీతిశాస్త్రాలు రాజధర్మాన్ని ఉద్ఘోషించాయి. రాజులకు ఆయుధవిద్యలతోనే బ్రతుకుతెరువు. బ్రహ్మసృష్టిని యథాతథంగా సంరక్షించడం అనేది వారికి అప్పజెప్పబడిన విధి.
అయితే అది అంత సులువు కాదు. నిత్యం అధర్మపరులను అదుపులో ఉంచడం, రకరకాల దండనల ద్వారా వారిలో మార్పు తేవడం, తమ తమ సామాజికధర్మాలను ప్రజలందరూ అసూయారహితులై పరిపాలించేలా చూడటం, ధర్మసంరక్షణకోసం అవసరమైతే నిస్సంకోచంగా ప్రాణత్యాగం చేయడం - ఇవన్నీ వారి బాధ్యతలు. అందువల్లనే దశరథమహారాజు తన నలుగురు కుమారులను చక్కని విద్యావంతులను చేశాడు. అశ్వగజరథచాలనాదులలోను, ధనుర్వేదంలోను, పితృశుశ్రూషణలోను కుమారులందరూ నిష్ణాతులైనారు. రాజకుమారులందరూ గొప్ప తేజస్వులు, అయినప్పటికీ మన రాముడు పరమప్రశాంతుడై సదానందలసదంతరంగుడై నిత్యసత్యవ్రతుడై సమస్తప్రజలందరికీ ప్రేమపాత్రుడైనాడు. నిత్యం అన్నను తమ ఆదర్శమూర్తిగా భావించే తమ్ములు కూడా క్రమంగా అటువంటివారే ఐనారు. అటువంటి మన రాముడే లోకకంటకుడైన రావణాసురుని పీడను తొలగించేందుకు సమర్థుడు అని దేవగణాలు, ఋషిసంఘాలు నిశ్చయించుకున్నాయి. బాల్యం నుండే అతనికి తగిన శిక్షణనివ్వాలని నిశ్చయించాయి. ఆ కార్యాన్ని కార్యసాధకుడైన విశ్వామిత్రునకు అప్పగించాయి. విశ్వామిత్రుడు పరమానందంతో ఆ బాధ్యతను అంగీకరించాడు. నా యాగసంరక్షణకోసం రాముడు అవసరం అని దశరథుని అడిగి, అతడు వెనుకంజ వేస్తే కాస్త బెదిరించి మరీ రాముని తీసుకుని తన ఆశ్రమానికి పోతున్నాడు. మన రాముని అనుసరించి మన లక్ష్మణుడు కూడా బయలుదేరాడు. తనతో పాటు కొండలు కోనలు ఎక్కుతూ దిగుతూ, నదులను దాటుతూ, కంటకావృతమైన అరణ్యమార్గాలలో ఎఱ్ఱని ఎండలో కాసేపు ఆగుదాం అని కూడా అడుగకుండా నడచివస్తున్న ఈ చిన్నారి కుఱ్ఱలను చూసేసరికి విశ్వామిత్రునికి జాలి కలిగింది. శిక్షణలో భాగంగా వారిని విచక్షణాపరులైన మహావీరులుగా తీర్చిదిద్దడం తన బాధ్యత. అందువలన మన రామునికి బల అతిబల అనే విద్యలను ప్రసాదించాడు. రామా, వీటి ప్రభావం వలన నీకు అలసట కలుగదు, జ్వరం రాదు, నీ వన్నె తఱుగదు, నీవు నిద్రిస్తున్నపుడు గాని, ఏమరుపాటుగా ఉన్నపుడూ గాని, ఆసురశక్తులు నీకు హాని కలిగించలేరు. బాహుబలంలో నీకు సాటిరాగలవారు ఈ ముల్లోకాలలోనూ ఎవరూ ఉండరు. సౌభాగ్యంలో గాని, దాక్షిణ్యంలోగాని, జ్ఞానంలోగాని, నిశ్చయబుద్ధిలోగాని, సమాధానాలు ఇవ్వటంలోగాని నీతో సరిసమానులు ఎవరూ ఉండరు. నిన్ను ఆకలిదప్పులు బాధించవు అని ఆ విద్యల ప్రభావాన్ని వివరించాడు. ప్రదాతుం తవ కాకుత్స్థ సదృశస్త్వం హి ధార్మిక (రా.1.22.18) నీవు ధర్మాత్ముడవు కాబట్టే ఈ విద్యలను స్వీకరించేందుకు పాత్రుడవైనావు అని స్పష్టంగా సూచించాడు. ఆ తరువాత గురువుగారి ఆదేశానుసారం తాటకావధ చేసిన మన రాముని చూసి ఆనందించిన దేవతలందరూ విశ్వామిత్రునితో, మునే కౌశిక భద్రం తే... స్నేహం దర్శయ రాఘవే... తపోబలభృతాన్ బ్రహ్మన్ రాఘవాయ నివేదయ। కర్తవ్యం చ మహత్ కర్మ సురాణాం రాజసూనునా... (రా.1.26.28-30) బ్రహ్మర్షీ, రాముడు చేయవలసిన గొప్ప దేవకార్యం ఉన్నది (రావణనిర్మూలనం, ధర్మసంరక్షణం) అందువలన రామునిపై స్నేహం ప్రదర్శించి, నీవు తపోబలంతో సాధించిన దివ్యాస్త్రాలను అతడికి ప్రసాదించు అని పలికారు. విశ్వామిత్రుడు పరమప్రీతితో సరేనని అనేకమైన దివ్యాస్త్రప్రయోగమంత్రాలను రామునికి ఉపదేశించాడు. బాల్యం నుండి చక్కని యోగాభ్యాసం చేసి నిశ్చలమైన మనఃస్థితిని సాధించివున్న మన రాముడు అన్ని మంత్రాలనూ ఏకసంథాగ్రాహియై స్వీకరించాడు. జీవితంలో మరలా ఎన్నడూ వాటిని అతడు మరువలేదు. అటువంటి యోగాభ్యాసం లేకుంటే అంతటి దృఢమైన జ్ఞాపకశక్తి ఎవరికైనా కష్టమే. ఆ తరువాత లోకహితంకరుడైన రాముడు తనకు దివ్యాస్త్ర-ఉపసంహారమంత్రాలను కూడా ఉపదేశింపమని విశ్వామిత్రుని ప్రార్థించాడు. ఎందుకంటే ఒకొక్కసారి కొన్ని దివ్యాస్త్రాలను ఉపసంహరించకుంటే అవి లోకసంక్షోభకారకాలు కావచ్చును. విశ్వామిత్రుడు మన రాముని అభిప్రాయం గ్రహించి వాటిని కూడా ఎంతో సంతోషంతో ప్రసాదించాడు. ఆ తరువాత మన రాముడు గురువుగారి ఆదేశానుసారం విశ్వామిత్రునినుండి తాను పొందిన సమస్తవిద్యలను మన లక్ష్మణునికి కూడా ఉపదేశించాడు. తతస్తు రామః కాకుత్స్థః శాసనాద్ బ్రహ్మవాదినః లక్ష్మణాయ చ తాన్ సర్వాన్ వరాస్త్రాన్ రఘునందనః సంహారాంశ్చ సంహృష్టః శ్రీమాంస్తస్మై న్యవేదయత్ (రా.1.28.16) ఈ విధంగా మన రాముడు మన లక్ష్మణునికి జన్మతః జ్యేష్ఠసోదరుడే కాదు, కర్మతః గురువు కూడా ఐనాడు. ఆ విధంగా దివ్యాస్త్రవరసంపన్నులైన రామలక్ష్మణులు ఎన్నో ఘనకార్యాలు చేశారు. విశ్వామిత్రయాగసంరక్షణం చేశారు. అరణ్యవాసం చేస్తూ తాపసులను పీడిస్తూ ఉన్న రాక్షసగణాలను పారద్రోలారు. బలగర్వంతో తమను ఎదిరించిన విరాధుని సంహరించారు. ఆ తరువాత కాలంలో నిత్యం మునిసంతాపకారకులైన ఖరదూషణత్రిశురలను సంహరించారు. వారి అనుచరులైన పద్నాలుగువేల రాక్షసులను తెగటార్చారు. సుగ్రీవుని భార్యను అధర్మపరుడై అపహరించిన వాలిని హతమార్చారు. ఈ విధంగా మన రామలక్ష్మణులు ఆయుధధారులుగా ఉండటం కొందరు దుర్మార్గులకు సుతరామూ నచ్చలేదు. ఎందుకంటే వారు తమ దుష్టచేష్టలను అరికట్టగలరు కాబట్టి. విరాధుడైతే - యువాం జటాచీరధరౌ శరచాపాసిధారిణౌ (రా.3.2.10) ఏమయ్యా మీరు చూస్తే మునుల వేషాన్ని ధరించారు. మరి మీ చేతులలో విల్లుబాణాలు ఎందుకయ్యా అని ఆక్షేపించాడు. అయితే ఎవడో ఏదో అన్నంతమాత్రాన తమ క్షత్రియధర్మానికి విరుద్ధంగా ఆయుధాలను విడిచిపెట్టేంత అమాయికులు కారు మన రామలక్ష్మణులు. అసలు ఎవరో మరెవరో ఎందుకు, సాక్షాత్తు మన సీతమ్మ కూడా రామునితో ఒకసారి అలాగే అన్నది. వనవాసం చేస్తూ ఉండగా సీతమ్మ ఒకసారి మన రామయ్యతో “ఆర్యపుత్రా, ఆర్తాభిరక్షణకోసమే క్షత్రియులు ఆయుధాలను ధరించాలి. కాని, మీరు ప్రస్తుతం వనవాసం చేస్తున్నారు కదా, అటువంటి మీ చేత ఆయుధాలెందుకు? వనవాసధర్మంగా మీరు చేయవవలసిన తపస్సును విడిచి క్షత్రియధర్మపరులై ఆయుధాలను ధరించడమేమిటి? వ్యావిద్ధమిదమస్మాభిః దేశధర్మస్తు పూజ్యతామ్. (రా.3.9.27) ఇది విరుద్ధమైన ధర్మాచరణం. కాబట్టి (ఆయుధాలను విడిచిపెట్టి తపస్సు చేస్తూ) మనం దేశధర్మాన్ని పాటిద్దాం. (ఇక్కడ దేశం అంటే ప్రదేశం – ఈ సందర్భంలో అడవి అని అర్థం) కావాలంటే పునర్గత్వా త్వయోధ్యాయాం క్షత్త్రధర్మం చరిష్యసి (రా.3.9.28) కావాలంటే మరలా అయోధ్యకు తిరిగిపోయిన తరువాత క్షత్రియధర్మాన్ని పాటిస్తూ ఆయుధాలను ధరించవచ్చు” అన్నది. అపుడు మన రామయ్య కూడా మృదుస్వరంతో దేవీ, క్షత్రియైర్ధార్యతే చాపో నార్తశబ్దో భవేదితి (రా.3.10.3) ఆర్తశబ్దం వినిపించరాదనే ఉద్దేశ్యంతోనే క్షత్రియులు ఆయుధాన్ని ధరిస్తారని నీవే స్వయంగా అన్నావు కదా, దండకారణ్యంలోని మునులు రాక్షసులబారినుంచి మమ్మల్ని కాపాడమని వేడుకున్నారు. నేను సరేనని వారికి మాట కూడా ఇచ్చాను. నా ప్రాణాలను, నిన్ను, లక్ష్మణుని సైతం నేను వదులుకోగలను కాని, ఆడిన మాట తప్పలేను సంశ్రుత్య చ న శక్ష్యామి జీవమానః ప్రతిశ్రవమ్। అప్యహం జీవితం జహ్యాం త్వాం వా సీతే సలక్ష్మణామ్।। అని పలికాడు. అదీ మన రాముడు మాటకిచ్చే విలువ. ఈ విధంగా మన రాముడు ధర్మాత్ముడై దుష్టశిక్షణకు శిష్టరక్షణకు కట్టుబడినవాడు కాబట్టే అతడికి సమస్త ఋషులు, సమస్తదేవతలు, సహకరించారు. సమస్తప్రకృతి సహకరించింది. శరభంగాదిమహామునులు తమ తపశ్శక్తిఫలితాన్ని మన రామునికి ధారవోశారు. సముద్రాన్ని ఆపోశన పట్టిన మహాముని అగస్త్యుడు మన రామునికి విశ్వకర్మనిర్మితమైన వైష్ణవచాపాన్ని, బ్రహ్మదత్తమైన ఒక ఉత్తమశరాన్ని, మహేంద్రదత్తములూ అగ్నిసంకాశమైన బాణములు కలిగిన రెండు తూణీరాలను, బంగారు ఒరతో కూడిన హేమఖడ్గాన్ని సమర్పించాడు. జటాయువు రావణుని దురాగతాన్ని ఎదిరించి రామబంధువైంది. సీతను అపహరించినప్పటికీ, బ్రహ్మశాపభయంతోను, నలకూబరశాపభయంతోను రావణుడు సీతను కేవలం బెదిరించగలిగాడు. త్రికరణశుద్ధమైన ఆమె పాతివ్రత్యతేజస్సుకు బెదిరి దూరంగానే ఉండిపోయాడు. రామకార్యనిరతుడైన హనుమంతుని తోకకు రావణానుచరులు కాల్చదలచినప్పటికీ, అగ్ని అతనిని ఎంతమాత్రం దహించలేదు. కాని, అదే అగ్ని మరలా సమస్తలంకానగరాన్నీ భస్మీపటలం చేసింది. విచిత్రంగా సముద్రం మీద బరువైన బండరాళ్లు కూడా తేలడం మొదలుపెట్టి సేతునిర్మాణానికి సహకరించాయి. యుద్ధంలో రామలక్ష్మణులను నాగాస్త్రాలు బంధించగా పక్షిరాజు గరుడుడు విచ్చేసి వాటిని తరిమేశాడు. హనుమంతుడు తెచ్చిన సంజీవనిపర్వతంలోని దివ్యౌషధులప్రభావంతో లక్ష్మణుడు, హతులైన వానరులు కూడా మరలా నిద్రనుండి లేచినట్లు లేచారు. రాముని అగస్త్యమహర్షి మరలా యుద్ధరంగానికి విచ్చేసి రామునికి ఆదిత్యహృదయాన్ని ఉపదేశించాడు. రథంమీద రావణుడూ, పాదచారియై రాముడు యుద్ధం చేస్తుంటే సహించలేక దేవతలు మాతలి సారథిగా మన రామునికోసం దివ్యరథాన్ని పంపారు. చివరకు రావణసంహారం జరిగింది. లోకమంతా హర్షించింది. ఈవిధంగా ఒక రాజు తన క్షత్రియధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తే సమస్తప్రకృతులూ సంతోషంగా సహకరిస్తాయని రామాయణం ఈవిధంగా వివరించింది. రావణవధ జరిగినప్పటికీ ఇంకా కొందరు దుష్టపాలకులు అక్కడక్కడ మిగిలిపోయారు. రామాజ్ఞపై శత్రుఘ్నుడు లవణాసురుని జయించాడు, భరతుడు సింధునదికి ఇరుతీరాలలోనూ వ్యాపించిన గంధర్వులను జయించి అక్కడ శాంతిని నెలకొల్పారు. మన రాముడు ఆ ప్రాంతంలో తక్షశిల, పుష్కలావతి అనే నగరాలను నిర్మింపజేసి భరతుని కుమారులను ధర్మపరిపాలకులుగా నియమించాడు. కారుపథదేశంలో చంద్రకాంతపురాన్ని, అంగదీయపురాన్ని నిర్మింపజేసి అక్కడ లక్ష్మణకుమారులను ధర్మరక్షకులుగా నియమించాడు. కుశావతి, శ్రావస్తి నగరాలలో తన కుమారులైన కుశలవులను ధర్మపరిరక్షణకు నియోగించాడు. రామాదేశంపై శత్రుఘ్నుడు మధురానగరానకి, విదిశానగరానికి తన కుమారులను అధిపతులుగా చేసి ధర్మరక్షణకర్తవ్యాన్ని వారికి అప్పజెప్పాడు. మన రాముడు అశ్వమేధయాగం చేసి, సమస్తరాజులను ఓడించి తన బలాధిక్యంతో వారిని తన మిత్రులుగా మార్చుకుని, మీరంతా ప్రజానురంజకులై ధర్మబద్ధంగా మీ మీ రాజ్యాలను సుఖంగా ఏలుకొండని ఆదేశించాడు. ఈ విధంగా, క్షత్రియధర్మానుసారం తాను ధరించిన ఆయుధాన్ని ఎంతమాత్రం వదలకుండా, సమస్తప్రజల ఆర్తిని తొలగించి, వారికి పరమశాంతియుతమైన, పరమాహ్లాదకారకమైన, సమస్తపురుషార్థసాధనకు ఉపయుక్తమైన పరిపాలనను అందిస్తూ సమస్తక్షత్రియజాతిని ధర్మపథంలో నిలిపిన మన రాముని పరిపాలన రామరాజ్యమనే పేరిట అందరికీ ఆదర్శమైంది. అటువంటి సీతాలక్మ్షణహనుమత్సమేతకోదండపాణి అయిన రాముని దివ్యవిగ్రహం మనకు నిత్యం మదిలో మెదులుతూ ఉండుగాక. #జయశ్రీరామJust Visit this blog if you feel bored with the world around you. Just leave away this blog if you feel bored with this. Feel free to come and go. A Vana Vihanga (A Wild Bird) does not mind to go anywhere in the forest. Cheer Up!
Friday, 16 April 2021
Subscribe to:
Post Comments (Atom)
సురక్షాసూక్తమ్
ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...
-
అవ్యాజమైన ప్రేమ? అదేమిటి? అలాంటిది ఎక్కడైనా ఉంటుందా? వ్యాజము అంటే కారణం లేదా సాకు. నిష్కారణంగా మనం ఎవరినైనా ప్రేమిస్తామా? అనగా అనగా య...
-
आसीदिदं तमोभूतम् अप्रज्ञातमलक्षणम्। अप्रतर्क्यमविज्ञेयं प्रसुप्तमिव सर्वतः।। (1.5) What was there before the Creation...
-
What is Personality? The Collins Dictionary defines the word Personality as – 1. The distinctive characteristics which make an indivi...
No comments:
Post a Comment