Tuesday, 13 April 2021

మన రాముని కథలు - 1

 



త్వం వయస్యోఽసి మే హృద్యో
హ్యేకం దుఃఖం సుఖం చ నౌ।

“ఓ రామా, నీవు నాకు స్నేహితుడవు. నా హృదయానికి ఎంతో ప్రియమైన వాడవు. మన దుఃఖసుఖాలు ఒక్కటే” అన్నాడు సుగ్రీవుడు. వారిద్దరూ అగ్నిసాక్షిగా మిత్రులైనారు. ఒకరి పట్ల మరొకరు వారిరువురి మనస్సులూ చాల ప్రీతిని పొందాయట. ఒకరినొకరు ఎంతగా చూసుకుంటున్నా తనివి తీరలేదట.

తతః సుప్రీతమనసౌ
తావుభౌ హరిరాఘవౌ।
అన్యోఽన్యమభివీక్షన్తౌ
న తృప్తిముపజగ్మతుః।।

రాజు అన్న తరువాత అతడికి ఎన్నో చేయవలసిన పనులు ఉంటాయి. తానొక్కడే చేయలేని పనులను అతడు తన పరివారం ద్వారా సాధిస్తాడు. అయినా సాధ్యం కాని పనులు కొన్ని ఉంటాయి. వాటిని అతడు తన మిత్రుల ద్వారా సాధిస్తాడు.

స్వామి (రాజు), అమాత్యుడు (మంత్రులు), రాష్ట్రం (భూమి/ప్రజలు), దుర్గం (కోట/రాజధాని), కోశం (ఖజానా) బలం (చట్టం/సైన్యం) అని ఆరింటిని పేర్కొన్న తరువాత, సుహృత్ (మిత్రుడు) అనే ఏడవ అంగాన్ని కూడా పేర్కొని, ఇవన్నీ కలిపి సప్తాంగరాజ్యమని భారతీయరాజనీతిశాస్త్రాలు పేర్కొన్నాయి. కాబట్టి కార్యసాధనలో మిత్రుడు చాల అవసరమని రాజనీతిధురంధరులు స్పష్టంగా అభిప్రాయపడ్డారు.

మిత్రుల అవసరాన్నిఎంత ప్రధానమో చెబుతూ విష్ణుశర్మ తన పంచతంత్రంలో మిత్రసంప్రాప్తి అనే అధ్యాయాన్ని, నారాయణపండితుడు తన హితోపదేశంలో మిత్రలాభమనే అధ్యాయాన్ని వెలయించారు. వాటిలో చిన్నపిల్లలకు కూడా అర్థమయే రీతిలో మిత్రుల నడుమ ఉండవలసిన సుహృద్భావాన్ని, సహకారాన్ని చక్కగా అనేకమైన కథల రూపంలో వివరించారు.

అంతేకాదు, తమ మైత్రితో తమ ఐకమత్యంతో అజేయులు, దుర్నిరీక్ష్యులుగా మారిన మంచి మిత్రుల నడుమ వారి శత్రువులు ఏ విధంగా పొరపొచ్చాలు సృష్టించి వారిని విడదీసి నాశనం చేసేందుకు ప్రయత్నిస్తారో వారు తమ తమ గ్రంథాలలో సుహృద్భేదము, మిత్రభేదము అనే అధ్యాయాలలో చాల చక్కగా వివరించారు.

ఈ కథలన్నీ పిల్లలకోసం మాత్రమే అని అభిప్రాయపడితే అది చాల తప్పు. పంచతంత్రం, హితోపదేశం నేటి భారతరాజకీయనాయకులకు నిత్యపారాయణగ్రంథాలుగా ఉండేందుకు చాల యోగ్యమైనవి.

మన దాశరథి శ్రీరాముడు రాజనీతిశాస్త్రంలో ఆరితేరినవాడు. పంచవటిలో మన సీతమ్మ రాక్షసుల చేత అపహరింపబడింది అని తెలుసుకున్న తరువాత, ఆమె ఎక్కడున్నదో వెతికి తిరిగి సాధించేందుకు తగిన మిత్రులు అవసరమని అతడు భావించాడు.

తన అన్న అయిన వాలి తరిమివేయగా గతిలేక ఋశ్యమూకపర్వతంపై కాలక్షేపం చేస్తున్న సుగ్రీవుడు నీకు సీతాన్వేషణంలో తోడ్పడగలడు అని శాపవిమోచనం చెందిన కబంధుడు మన శ్రీరామునికి సలహా చెప్పాడు.

వాలిసుగ్రీవులు వానరులు. వానరులు నాకు సహాయం చేయడమేమిటి అని మన శ్రీరాముడు ఎంత మాత్రం భావించలేదు.

ఈనాటి రాజకీయనాయకులైతే, వారిద్దరిలోనూ బలవంతుడైన వాలి మాత్రమే నాకు తోడ్పడగలడు, పైగా అతడు ప్రస్తుతం సమస్తవానరరాజ్యానికి ఏకచ్ఛత్రాధిపతి, తమ్ముడైన సుగ్రీవుడేమో అన్న చేతిలో చిత్తుగా ఓడిపోయాడు, రాజ్యాధికారం కోల్పోయాడు, రాజ్యం విడిచి పారిపోయాడు, అటువంటి బలహీనుడు నాకు ఎలా సహాయపడగలడు అని భావించి, సుగ్రీవుని స్నేహాన్ని కాదని, వాలి దగ్గరకు పోయి సహాయం అర్థించేవారేమో.

ఎందువల్లనంటే ఈనాటి రాజకీయనాయకులకు అర్థం (అంటే డబ్బు లేదా ఏదో ఒక స్వార్థప్రయోజనం) మాత్రమే ముఖ్యం. అది ఉంటే ముందూ వెనుకా చూడకుండా తమకు తాత్కాలికంగా లాభం అనుకున్నవారినే మిత్రులుగా చేసుకుంటారు. లాభం లేదనుకుంటే వదులుకుంటారు.

మన శ్రీరాముడికి కూడా అర్థం ప్రధానమైనదే. కాని, దానికంటె అతడికి ధర్మం చాల చాల ప్రధానమైనది. నేటి రాజకీయనాయకులు విగ్రహవంతః అర్థాః (రూపు దాల్చినప్రయోజనాకాంక్షులు) అయితే రామో విగ్రహవాన్ ధర్మః. అంటే మన శ్రీరాముడు రూపు దాల్చిన ధర్మం. అందువల్ల మన శ్రీరాముని ఆలోచనే వేరుగా ఉన్నది.

వాలి చాల బలవంతుడు. మామూలు బలవంతుడు కూడా కాదు, మునుపు రావణాసురుని చిత్తుగా ఓడించిన అమితబలసంపన్నుడు. పైగా మహారాజు. అందువల్ల మన శ్రీరాముడు వాలితో స్నేహం చేసినట్లైతే, అటుపిమ్మట రావణుడు సీతమ్మను అపహరించిన విషయాన్ని మన శ్రీరాముడు వాలికి వివరించి, ఆ విషయంలో తనకు సహాయం చేయమని అడిగితే వాలి మాటకు భయపడి రావణాసురుడు వెంటనే సీతమ్మను మర్యాదగా మన శ్రీరామునికి అప్పజెప్పేవాడే.

మరి ఆ మాత్రం గోటితో పోయేదానికి మన శ్రీరాముడు గొడ్డలిని ఎందుకు ఎంచుకున్నట్లు?

రావణాసురుని కంటె మహాబలవంతుడైన వాలితో స్నేహం చేయకుండా, వాలికంటె బలహీనుడైన సుగ్రీవునితో ఎందుకు స్నేహం చేసినట్లు?

మన శ్రీరాముని లెక్కలు వేరు. వాలి ఎంతటి బలవంతుడైనప్పటికీ అతడు అధర్మపరుడు. అతడు తన తమ్ముడైన సుగ్రీవుడు ఇంకా బ్రతికి ఉండగానే అతడి భార్య అయిను రుమను బలాత్కారపూర్వకంగా తన స్వాధీనం చేసుకున్నాడు. అటువంటి వాలిని తనకు సహాయం చేయమని మన శ్రీరాముడు ఎలా అర్థించగలడు? ఏ తప్పు చేయడం ద్వారా రావణాసురుడు శ్రీరామునికి శత్రువైనాడో, అదే తప్పును చేసిన వాలిని శ్రీరాముడు ఎలా తన మిత్రునిగా అంగీకరించగలడు?

అందువల్ల, ఆ విధమైన స్నేహం చేసివుంటే మన శ్రీరామునికి మన సీతమ్మ సులువుగా తిరిగి లభించి ఉండేదే. కాని, అందువల్ల అధర్మాత్ములు, పరమపాపిష్ఠులు అయిన వాలి, రావణాసురుడు బ్రతికిపోయేవారు. వారి వలన లోకాలన్నీ పీడింపబడుతూనే ఉండేవి. కేవలం మన సీతమ్మను దక్కించుకొనడం కోసం మన శ్రీరాముడు వారు చేసే లోకపీడను సహించి దురాగతాలను భరించి ఊరుకోవాలా? కుదిరే పని కానే కాదు.

అందువల్లనే, అర్థానికంటె ధర్మానికి ప్రథమప్రాధాన్యతనిచ్చే మన శ్రీరాముడు వాలితో స్నేహం చేయాలని ఎంతమాత్రం భావించలేదు. బలహీనుడైనప్పటికీ ధర్మాత్ముడైన సుగ్రీవునితోనే స్నేహం చేశాడు. ఆ సుగ్రీవునికోసం రావణాసురునికి కూడా భయం కలిగించిన వాలిని హతమార్చాడు. బలహీనుడైన మిత్రునికి బలం చేకూర్చాడు. సమస్తవానరాలూ సుగ్రీవుని తమ నాయకునిగా అంగీకరించేలా చేశాడు. అప్పుడే సీతాన్వేషణంలోనూ, రావణవధలోనూ సుగ్రీవుని సహాయాన్ని ప్రీతిపూర్వకంగా అంగీకరించాడు.

ఆవిధంగా మిత్రులిరువురూ పరస్పరప్రయోజనాలను సాధించారు. జీవితాంతం వారి మైత్రి వర్ధిల్లింది. ఈనాటికీ వారి స్నేహం అందరికీ ఆదర్శపాత్రంగా నిలిచింది.

అదీ ధర్మం పట్ల మన శ్రీరామునికి ఉన్న నిబద్ధత. ఎటువంటివారి పొత్తును తిరస్కరించాలో, ఎటువంటివారితో పొత్తును కుదుర్చుకోవాలో, ఎలా కుదుర్చుకోవాలో మన శ్రీరాముని చూసి ఈనాటి రాజకీయనాయకులు, ఈనాటి రాజకీయపార్టీలు నేర్చుకోవాలి.

అంటే తాత్కాలికమైన స్వార్థపూరితమైన పొత్తులను మొగమాటం లేకుండా తిరస్కరించి శాశ్వతంగా ధర్మబద్ధాలు,, ధర్మపరిపుష్టకాలు అయిన పొత్తులను మాత్రమే అంగీకరించాలి.

రామాయణం అంటే కేవలం పారాయణగ్రంథంగా పరిగణించేవారు మూర్ఖులు. రామాయణం అంటే మన శ్రీరాముని పయనం. అంటే మన శ్రీరాముని నడవడిక. మన శ్రీరాముని నడవడికను మనం ఆదర్శంగా మార్గదర్శకంగా గ్రహించాలి. అప్పుడే మనం రామాయణం చదివినా, మన శ్రీరామునికి గుడికట్టుకున్నా సార్థకత!

#జయశ్రీరామ

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...