“నాయనా, చాల కాలం క్రితమే మంచి బుద్ధిని అందరికీ ప్రసాదించాను. కాని, దానిని ఇపుడు అందరూ అపార్థం
చేసుకుంటున్నారు.”
“ఏమిటి ఆ బుద్ధి స్వామీ?”
“గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యమ్.”
“.....”
“ఏమి నాయనా ముఖం విచిత్రంగా పెట్టావు?”
“అది కాదు స్వామిన్, గోవులు బ్రాహ్మణులకు మాత్రం శుభం కలిగితే చాలా?
గేదెలకు మేకలకు శుభం వద్దా? క్షత్రియులు,
వైశ్యులు, శూద్రులు ఇలా మిగిలినవారికి శుభం కలుగవద్దా? చాల అన్యాయం స్వామిన్!”
“నాయనా! ఎంత బుద్ధిహీనమైన మాట
పలికావు! ఆ సుభాషితం నీకు అర్థం కావాలంటే
నీకు మరి కాస్త బుద్ధిని ప్రసాదించాల్సిందే!”
“అయ్యో! స్వామిన్! అపరాధాన్ని క్షమించండి. శిష్యస్తేऽహం
శాధి మాం త్వాం ప్రపన్నమ్.”
“గోవు అనేది ఇక్కడ ఒక జాతి కాదు, మానవేతరసర్వప్రాణులకూ అది సంకేతాత్మకంగా
వాడబడింది. అంతే. గోవులకు శుభం కలగాలి అంటే – గేదెలు, మేకలు,
గొర్రెలు, చెవులపిల్లులు, చీమలు చెదలతో సహా అన్ని ప్రాణులకూ శుభం కలగాలి అని
అర్థం. అలాగే బ్రాహ్మణులు అనే పదం
సమస్తమానవజాతులకూ శుభాన్ని కోరేవారికి సంకేతాత్మకంగా వాడబడిన పదం.”
“స్వామీ అర్థం కాలేదు.”
“సరే, అసలు బ్రాహ్మణుడు అంటే ఎవరు?”
“చతుర్వర్ణాలలోనూ ప్రథముడు. అగ్రజన్ముడు.”
“అగ్రజన్ముడు అంటే?”
“అగ్రే జన్మ యస్య సః. అందరికంటే ముందు పుట్టినవాడు.”
“అందరికంటె ముందు తాను ఎందుకు జన్మించాడో
అర్థం చేసుకున్నవాడు కాదా?”
“అవును స్వామీ, అలా కూడా అర్థం చేసుకోవచ్చు.”
“వచ్చు కాదయ్యా, చేసుకో.”
“సరే స్వామీ!”
“బ్రాహ్మణుల ప్రాథమికవిధులు ఏమిటి?”
“అధ్యయన-అధ్యాపనాలు, యజన-యాజనాలూ,
దానాదానాలు”.
“వాటిలో ప్రధానమైనవి ఏమిటి?”
“అధ్యయన-అధ్యాపనాలు”
“వాటిని చేసేవారు బ్రాహ్మణులే కదా?”
“అవును స్వామిన్!”
“అటువంటి బ్రాహ్మణులు ఎక్కడ ఉన్నారు?”
“అదేమిటి స్వామీ? మునుపు ఉన్నంతమంది ఉన్నారో లేదో కాని, ఇప్పటికీ
చాలామంది ఉన్నారు కదా?”
“నా మాటను వ్యతిరేకార్థంలో గ్రహించకు.
అలాంటివారు లేరు అని నేను చెప్పడం
లేదయ్యా! వారు ఎక్కడ ఉన్నారు అని అడుగుతున్నాను.”
“దేశమంతా ఉన్నారు స్వామిన్!”
“ప్రపంచమంతా ఉన్నారు అని అంటాను నేను.”
“అవును స్వామీ, ‘సముద్రం దాటి వెళ్లరాదు’ అనే
చాదస్తపుభావాన్ని దాటుకుని బ్రాహ్మణులు ప్రపంచమంతా వ్యాపించి స్థిరపడ్డారు.”
“నాయనా!
చాదస్తమా కాదా అనేది కాదు, ఇక్కడనుండి వెళ్లినవారిలో కొందరు మాత్రమే కాదు,
ప్రపంచంలో చాల చోట్ల బ్రాహ్మణులు నా అనుగ్రహంతో ఉద్భవించారు.”
“అదేమిటి స్వామీ?”
“అధ్యయన-అధ్యాపనాలు చేసేవారు ప్రపంచమంతా జన్మించారు
అంటున్నాను.”
“అంటే సైంటిస్టులు, టీచర్లా స్వామీ?”
“అవును!”
“అదేమిటి స్వామీ? అధ్యయనం అంటే ఇక్కడ
వేదాధ్యయనం అని అర్థం కదా?”
“నాయనా, తెగేవరకూ లాగుతావా? వేదం అంటే అర్థం ఏమిటి?”
“వేదయతీతి వేదః – తెలియజేస్తుంది కాబట్టి
వేదం. అది అపౌరుషేయశాస్త్రజ్ఞానం.”
“కదా? వేదాలు ఎన్ని?”
“నాలుగు.”
“మరి ‘అనంతా వై వేదాః’ (తైత్తిరీయబ్రాహ్మణం 3.10) అనే వేదవాక్కుకు అర్థం ఏమిటి?
“వేదాలు అనంతాలు అని అర్థం.”
“మరి వేదాలు నాలుగే అంటున్నావేమిటి?”
“స్వామిన్!
పరీక్షిస్తున్నారా? వేదాలు నాలుగే
అంటే – వేదశబ్దంతో వ్యవహరింపబడే గ్రంథసమూహాలు నాలుగే అని అర్థం. ‘అనంతా వై వేదాః’ అనే చోట జ్ఞానం అనంతం అనే
అర్థం వస్తుంది.”
“బాగా చెప్పావయ్యా! మరి ఆ అనంతజ్ఞానమూ నాలుగు వేదాలలో ఉందా?”
“సాంకేతికంగా దాగి ఉంది స్వామీ!”
“నువ్వు కూడా వేదంలో ఉన్నావా?”
“నేను అంటే ఏమిటో వేదంలో వివరింపబడి ఉంది
స్వామీ!”
“నువ్వు ఏమిటో వేదంలో వివరింపబడి ఉంది. కాని, నువ్వుగా వ్యవహరింపబడుతున్న నువ్వు ఇపుడు
వేదంలో ఉన్నావా, లేక నా ఎదుట ఉన్నావా?”
“అర్థం కాలేదు స్వామీ!”
{చిరునవ్వు} “మరి? మరీ తెలివికి పోయి సమాధానాలు చెబితే సంధింపబడే
ప్రతిప్రశ్నకు సమాధానం చెప్పే సామర్థ్యం కూడా ఉండాలి మరి!”
“తప్పైంది స్వామీ!”
“చెబుతా విను! సృష్టిరహస్యాలను అధ్యయనం చేసే ప్రతివాడూ,
వాటిని సక్రమవినియోగం చేసేందుకు ఇతరులను ప్రేరేపించే ప్రతివాడూ బ్రాహ్మణుడే!
వారు భారతదేశంలోనూ ఉన్నారు, ప్రాక్పాశ్చాత్యప్రపంచమంతటా కూడా వ్యాపించి ఉన్నారు.
వినాశనాన్ని ఏ విధంగా ఆపవచ్చునో అందరూ అధ్యయనం చేస్తున్నారు. ప్రపంచానికి తెలియజేస్తున్నారు.
వారి కార్యకలాపాలను కూడా భారతీయులు అధ్యయన-అధ్యాపనాలుగా ఆదరించి ఆచరించాల్సిన అవసరం ఉంది.”
వారు భారతదేశంలోనూ ఉన్నారు, ప్రాక్పాశ్చాత్యప్రపంచమంతటా కూడా వ్యాపించి ఉన్నారు.
వినాశనాన్ని ఏ విధంగా ఆపవచ్చునో అందరూ అధ్యయనం చేస్తున్నారు. ప్రపంచానికి తెలియజేస్తున్నారు.
వారి కార్యకలాపాలను కూడా భారతీయులు అధ్యయన-అధ్యాపనాలుగా ఆదరించి ఆచరించాల్సిన అవసరం ఉంది.”
“అది కాదు స్వామిన్, మీరు ఇపుడు ఇచ్చిన ఆదేశం ఉందే? అది
ఏతద్దేశప్రసూతస్య
సకాశాదగ్రజన్మనః।
స్వం స్వం
చరిత్రం శిక్షేరన్
పృథివ్యాం సర్వమానవాః।।
అని చెప్పే
స్మృతివాక్యానికి విరుద్ధంగా ఉన్నది కదా మరి?”
“ఏమయ్యా?
నువు ఇపుడు చేసింది దాంభికమైన వాదన (hypocritical argument) అని నీకు అనిపించటం లేదా?”
“అదేమిటి స్వామీ, అంత మాట అనేశారు?”
“కాదా మరి?
ఆ పాశ్చాత్యులు ఇచ్చిన విద్యను అనుసరించి బస్సులు, కార్లు, నౌకలు, విమానాలు
తయారుచేసుకుని వాటిమీద మీరు ప్రయాణం చేయటం లేదా?
వారి విద్యను గ్రహించి, మీ స్మార్ట్ ఫోన్లనూ కంప్యూటర్లనూ వాడుకొనటం
లేదా? ఇలా ఒకపక్క వారి అధ్యయనఫలితాలనుండి
ఆవిష్కరింపబడిన ఎన్నెన్నో విద్యలను, వాటి ప్రయోజనాలను నిస్సంకోచంగా గ్రహించి,
నిరభ్యంతరంగా వాడుకుంటున్నారే? అప్పుడు
అడ్డు రాలేదా, నువ్వు చెప్పిన ఈ స్మృతివాక్యం?
వాటిని ఎలా స్వీకరించారో, అలాగే ఇపుడు నువు నివేదించిన ప్రపంచవినాశకసమస్యల
విషయంలో కూడా వారి అధ్యయనాల ఫలితాలను గ్రహించి
తత్ప్రకారంగా నడుచుకోండి అని నేను చెప్పినపుడు మాత్రం మీ ఆభిజాత్యం కొద్దీ చటుక్కున
గుర్తొచ్చిందేం ఆ స్మృతివాక్యం?”
“చిత్తం స్వామీ!”
“చిత్తం గిత్తం కాదు!
భారతీయేతరులు అనగానే, మీలో చాలామందికి ఒకరకమైన వైమనస్యం ఉండటం గమనించాను.
అలాగే మరి కొందరిలో భారతీయేతరులు ఏమి చెప్పినా గొప్పే, ప్రపంచంలో కెల్లా పనికిమాలినవారు మాత్రం భారతీయులే అనే భయంకరమైన ఆత్మన్యూనతాభావం కూడా ఉంది.
నాయనా! గొప్పవారు భారతీయులలోనూ ఉన్నారు, ఇతరులలో కూడా ఉన్నారు. అందరూ నావారే! వారి పట్ల వైముఖ్యం తగ్గించుకోండి. అలాగే, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుకోండి.
‘వసుధైకకుటుంబకమ్’ అనే భావన అందరిలోనూ వర్ధిల్లాలి!
భారతీయేతరులు అనగానే, మీలో చాలామందికి ఒకరకమైన వైమనస్యం ఉండటం గమనించాను.
అలాగే మరి కొందరిలో భారతీయేతరులు ఏమి చెప్పినా గొప్పే, ప్రపంచంలో కెల్లా పనికిమాలినవారు మాత్రం భారతీయులే అనే భయంకరమైన ఆత్మన్యూనతాభావం కూడా ఉంది.
నాయనా! గొప్పవారు భారతీయులలోనూ ఉన్నారు, ఇతరులలో కూడా ఉన్నారు. అందరూ నావారే! వారి పట్ల వైముఖ్యం తగ్గించుకోండి. అలాగే, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుకోండి.
‘వసుధైకకుటుంబకమ్’ అనే భావన అందరిలోనూ వర్ధిల్లాలి!
“స్వామీ, మీ ఆదేశం శిరోధార్యం!”
“నేను చెప్పానని కాదు, నువ్వు స్వయంగా ఉదాహరించిన
స్మృతిలోనే మరొకచోట ఉన్న ఉదాత్తమైన మరొక విషయాన్ని విస్మరించావు. నీ ఆవేశంవల్ల వివేకాన్ని కోల్పోతున్నావు.
విషాదప్యమృతం గ్రాహ్యం
బాలాదపి సుభాషితమ్।
అమిత్రాదపి సద్వృత్తం
అమేధ్యాదాపి కాంచనమ్।।
దొరికితే, విషం నుండి కూడా అమృతం గ్రహించు. పిల్లవాడు చెప్పినా మంచిమాటను గ్రహించు. శత్రువులోనైనా మంచిగుణం ఉంటే గ్రహించు. అమేధ్యంలో ఉన్నప్పటికీ, బంగారాన్ని గ్రహించు అని
ఎంతో స్పష్టంగా చెప్పారు కదా మన స్మృతికారులు?
మరి, వారి ఆదేశాలప్రకారం మనదేశపు బ్రాహ్మణులలాగానే
లోకసంక్షేమం కోరి సదుపదేశం చేసే భారతీయేతరబ్రాహ్మణుల మాటలను మీరు ఎందుకు ఆదరించరు?
వారి మాటలను నిర్లక్ష్యం చేయడం మీ అహంకారం
కాదా?
ప్రపంచంలో ఎవరో ఎవరిపట్లనో జాతివివక్ష
(Racism) చూపుతారని విమర్శిస్తూ ఉంటారే? మరి
ఈవిధమైన మీ ప్రవర్తన మాట ఏమిటి? ఇది మాత్రం
Racism కాదా?”
“నిజమే స్వామీ! కళ్లు తెరిపిస్తున్నారు.”
“గత నలబై సంవత్సరాలలో ప్రపంచంలోని అడవుల్లో
నలబై శాతం నాశనమయ్యాయి. తెలుసా?”
“విన్నాను, చదివాను స్వామీ!”
“ఆ విషయం భారతీయేతరబ్రాహ్మణుల అధ్యయనం వల్ల తెలిసినదే!”
“అవునా స్వామిన్!”
“అవును!
ప్రపంచమంతా అలా అడవులను నరికి ఏమి చేస్తున్నారో తెలుసునా?”
“తెలియదు స్వామిన్!”
“ఆ నశించిన అరణ్యప్రాంతంలో అత్యధికశాతాన్ని
పంటపొలాలుగా మార్చుతున్నారు.”
“పెరుగుతున్న ప్రపంచజనాభా ఆహార-అవసరాలను
తీర్చటానికా స్వామీ?
“కాదు, అక్కడ సోయాబీన్ పంటను
పండిస్తున్నారు. లక్షలాది సంఖ్యలో ఉన్న
గోవులకు మేతగా వాటిని ఉపయోగిస్తున్నారు.’’
“ఓ!
గోజాతి అభివృద్ధికి అడవులను నరుకుతున్నారా? వారి పిచ్చితనం కాకపోతే, అలా ఎందుకు
స్వామీ? అడవుల్లోనే వాటిని స్వేచ్చగా
తిరగనిస్తే వాటి తిండిని అవే తింటాయి కదా?
ఆ మనుషులకు పంటలు పండించడం, కోసి ఆవులకు మేతగా వెయ్యడం - ఇంత శ్రమ ఎందుకు?”
“నాయనా!
ఆ గోవులు వారు ప్రేమతోనో భూతదయతోనో పెంచుకుంటున్నవి ఏమీ కాదు. వారు వేసిన మేత మేసి ఆ గోవులు బలంగా ఎదిగాక,
వాటిని నరికి, తమ ఆహారంగా మార్చుకుంటున్నారు.”
“.....”
“నాయనా!
దిగ్భ్రాంతి చెందావా?”
“అ... అవును స్వామిన్!”
“ఎందుకు దిగ్భ్రాంతి?”
“అదేమిటి స్వామీ? భారతీయులు భక్తితో పూజించుకుంటున్న గోజాతికి
అక్కడ అంతటి దురవస్థ కలిగిందని తెలిస్తే దిగ్భ్రాంతి కలుగదా?”
“ఓహో!
వారు గోవుల బదులు మేకలనో గొర్రెలనో పందులనో అలా పోషించి వాటిని చంపి తింటూ
ఉంటె నీకు అంతటి దిగ్భ్రాంతి కలిగేది
కాదన్నమాటేగా?”
“నా ఉద్దేశం అది కాదు స్వామీ!”
“మరేది?”
“ఇప్పుడేగా అధ్యయనం అధ్యాపనం చేస్తున్న ఆ భారతీయేతరులు
కూడా బ్రాహ్మణులే అని మెచ్చుకున్నారు? మరి
ఇంతటి క్రూరకర్మలు చేసేవారికి అటువంటి మెప్పుకోలు ఏమిటని?”
“నాయనా!
బ్రాహ్మణులు అనేది మెప్పుకోలు పదమూ కాదు, శూద్రుడు చండాలుడు అనేవి తిట్లూ
శాపనార్థాలు కూడా కావు. ఆయా జనాలు చేసే
ఆయా వృత్తులను బట్టి, వారి గుణాలను బట్టి ఆ పదాలు ఒకప్పుడు వాడబడ్డాయి. అన్ని రకాల వృత్తులవారూ ఈ ప్రపంచానికి
అవసరమే! కాని, మీరు మీమీ
అభిరుచులకొద్దీ కొన్ని వృత్తులను
ఉత్తమమైనవాటిగానూ, కొన్నిటిని నీచమైనవాటిగానూ పరిగణించి, ఆయా పదాలను ప్రశంసార్థకంగానూ
నిందార్థకంగానూ వాడుతున్నారు. చివరకు ఆ
పదాలను నేను వాడినా, మీరు భావిస్తున్న అర్థంలోనే నేను కూడా వాడుతున్నట్లు
అనుకుంటున్నారు. ఇది ఏమీ బాగులేదు.”
“క్షమించండి స్వామిన్!”
“సరే, నాయనా! నువ్వన్నట్టు ఆ క్రూరకర్మలు
చేస్తున్నవారు, నేను చెప్పిన ఆ పాశ్చాత్యబ్రాహ్మణులు ఒక్కరే కారు! వారూ వీరూ వేరు వేరు.”
“కొంత కొంత అర్థం అవుతోంది స్వామిన్!”
“ఏమి అర్థమైందో చెప్పు?”
“బ్రాహ్మణ – అనే పదం సంకుచితార్థంలో
వాడబడలేదు. విద్యావంతులు జ్ఞానులు అనే
అర్థంలో వాడబడింది. విద్యావంతులు జ్ఞానులు
ఎవరైనా బ్రాహ్మణులే!”
“కొంతవరకు బాగానే ఉంది. కాని, విద్య అంటే కేవలం పుస్తకజ్ఞానం కాదు, అది
అనుభవసిద్ధమైన జ్ఞానం. నిత్యసత్యం. విద్యావంతులంటే చదువుకున్నామని సర్టిఫికేట్
కలిగినవారు కాదు, తాము నేర్చిన జ్ఞానం ఏ విధంగా అవసరమో, ఎంతవరకు ఆచరణయోగ్యమో
తెలిసినవారు. అలాగే, ప్రపంచశ్రేయస్సును
కలిగించే తమ జ్ఞానాన్ని తరువాతతరాలవారికి నిస్స్వార్థంగా అందజేసేవారు వారు. వారు బ్రాహ్మణులు అంటే! కాబట్టి బ్రాహ్మణ అనే పదం జన్మవాచకంగా కాదు,
గుణవాచకంగా వాడబడింది అని అర్థం చేసుకో. అలాంటివారు
ఇపుడు ప్రపంచమంతటా విస్తరించి ఉన్నారు.”
“అవును.
అర్థమైంది స్వామీ, అటువంటి గుణసంపన్నులైన బ్రాహ్మణులకు శుభం కలగాలి అని
కోరడంలో తప్పు లేదు. అలా కోరుకుంటే
మిగిలినవారికి శుభం కలగకూడదు అనే దురర్థం లేదు. ఎందుకంటే, వారికి శుభం కలిగితే అది సమస్తలోకానికి
కూడా వారు శుభం కలిగించే పనులనే చేస్తారు.”
“బాగుంది.
మరి గోవులకు మాత్రమే శుభమా?
మిగిలిన జంతువులకు శుభం వద్దా అని కూడా వగచినట్టున్నావు?”
“క్షమించండి స్వామీ! అది కూడా ఇప్పుడు అర్థం అయింది!”
“ఏమిటి అర్థమైంది?”
“గేదెలు, మేకలు, గొర్రెలు, లాగానే గోవులు
కూడా సాధుజంతువులే కదా స్వామిన్! వీటన్నిటిలోనూ
సులభంగా మచ్చికయ్యేవి గోవులే! అవి తమ
యజమానులను ఎంతగానో ప్రేమిస్తాయి. తమ
యజమానులకు ఇష్టమైనవారిని కూడా అవి గ్రహిస్తాయి.
గేదెలు దారితప్పిపోతే మళ్లీ తమ యజమానిని వెతుక్కుంటూ రావడం జరుగుతుందో
లేదో! గోవులు మాత్రం యజమానితో తమ
వేరుబాటును సహించలేక వెనక్కు వస్తాయి. మేకలు
గొర్రెలు కూడా దారి తప్పితే వెనక్కు రాకపోవచ్చు.
అందుకే కాపరులు వాటిని వెనక్కు మళ్లించుకొనడం కోసం కుక్కలను పెంచుతారని అందరికీ
తెలిసిన విషయమే. ఈరకంగా యజమానులకు
అత్యంతసన్నిహితంగా ప్రేమాస్పదంగా ఉండే గోవులను సకలమానవేతరప్రాణులకూ ప్రతినిధులుగా పరిగణించి
వాటికి శుభం కలగాలని కోరుకొనడంలో తప్పేమీ లేదు!
{చిరునవ్వు}
“ఏమి స్వామీ, తప్పు చెప్పానా?”
“నువ్వు జంతుప్రవర్తనశాస్త్రంలో ఏమైనా
పరిశోధన చేసి ఉంటావా అని ఆలోచిస్తున్నాను!”
“అయ్యో, అదేమీ లేదు స్వామిన్!”
“పోనీ, నువ్వంటున్నట్టు, యజమానులను
ప్రేమించడం, ఎక్కడా తప్పిపోకుండా వెనక్కు తిరిగిరావడమే మంచి జంతువుకు ఉండాల్సిన
ప్రధానలక్షణం అనుకుందాం. అప్పుడు రక్షణార్హమైనదని
నువు సిఫారసు చేస్తున్న గోవు కంటే ఒక కుక్కకు ఆ లక్షణాలు మరింత అధికంగా ఉన్నాయి
కదా?”
“అయ్యో, నేను సిఫారసు చేయడమేమిటి స్వామీ?”
“అయితే సిఫారసు చేయటం లేదా?”
“స్వామీ, గోవు ఏ విధంగా రక్షణార్హమైనదో,
మిగిలిన జంతువులు కూడా అలాగే రక్షణార్హమైనవి అని నా అభిప్రాయం.”
“మరి, ఇంతసేపు గోవు మిగిలిన జంతువుల కంటె ఏ
విధంగా గొప్పది అనే విషయంలో నాకు బోలెడంత వివరణ ఇచ్చావే?”
“అంటే, అప్పటివారు ఎందుకు ఆవుకు అంత
ప్రాధాన్యతను ఇచ్చారో ఊహించే ప్రయత్నం చేశాను స్వామిన్!”
“ఆవు కాదు నాయనా! గోవు!
గోవు!”
“ఆవు కాదు, గోవు? అదేమిటి స్వామిన్?”
“నువు చేస్తున్న చిన్నపొరబాటును సరిదిద్దాను.”
“ఓ!
అర్థమైంది స్వామీ! మీరు చిన్న
చిన్న మాటలతో నాకు మరింత మరింత చక్కగా సరైన అర్థం స్ఫురించేలా చేస్తున్నారు!”
“ఇపుడు కొత్తగా అర్థమైంది ఏముంది?”
“నిఘంటువు ప్రకారం గోవు అంటే ఆవు మాత్రమే
కాదు, ఎద్దు కూడా!”
“అయితే ఏమిటి?”
“అంటే, గోవు మనుషులకు బహుళార్థకంగా
ఉపయోగపడుతుంది. ఆవు రూపంలో మంచి
పోషకాహారమైన పాలను ఇస్తుంది. ఎద్దు రూపంలో
పొలం దున్ని పంటలు పండించుకునేందుకు ఉపయోగపడుతుంది. ఆ రోజుల్లో మనుషులు ఎవరి మీదా ఆధారపడకుండా హాయిగా
స్వతంత్రంగా బ్రతికేందుకు కొన్నిఆవులు, కొన్ని ఎద్దులు ఉంటే చాలు. కాబట్టి, ఆ రెండింటినీ గోవు అనే శబ్దంలో
ఇమిడ్చి, వాటికి శుభం కలగాలని అన్నారు.
అవి చక్కగా ఉంటే సమస్తమానవాళి వాటి తోడ్పాటుతో సుఖంగా బ్రతకవచ్చునని దాని
అంతరార్థం!”
{చిరునవ్వు}
“గోభిస్తుల్యం న పశ్యామి
ధనం కించిదిహాచ్యుత।
గావో లక్ష్మ్యాః సదా మూలం
గోషు పాప్మా న విద్యతే।।”
[గోవులతో సమానమైన ధనం వేరే ఏమీ లేదు, గోవులు
సంపదలకు మూలం] అని మహర్షులు అందుకే అన్నారు కదా స్వామిన్!”
“నువ్వు ఉటంకించిన శ్లోకంలో ఆ చివరిపాదానికి
అర్థం చెప్పలేదేమి నాయనా?”
“గోవులయందు పాపము లేదు అని అర్థం!”
“అంటే?”
“గోవులు పవిత్రమైనవి.”
“నీ ముఖం!
ఈరోజుల్లో సంపదను సృష్టిస్తాం అంటూ మీ మానవులు ఏమి చేస్తున్నారో తెలుసు
కదా? సృష్టించడానికి వారేమైనా బ్రహ్మదేవుడితో సమానులా? వారుచేస్తున్నది సృష్టి కానే
కాదు, తమ చర్యలతో వారు సృష్టివినాశనం చేస్తున్నారు. నువ్వే చెప్పావుగా? వారు దారుణాతిదారుణంగా పర్యావరణాన్ని ధ్వంసం
చేస్తూ సమస్తజీవావరణాన్ని కూడా సమూలంగా నాశనం చేస్తున్నారు. అది మహాపాపం.
కాని, గోవులను తోడుగా చేసుకుని ఉన్నదానితో సంతృప్తి చెందుతూ బ్రతకడం వలన
అటువంటి పాపం చేయవలసిన అవసరం ఉండదు. అదీ ఆ
చివరిపాదానికి వివరణ!”
“అంటే? మానవులు
తమ మేధాసంపత్తితో సృష్టించిన సమస్తవిజ్ఞానమయప్రపంచాన్నీ వదులుకుని, మరలా
చరిత్రపూర్వయుగాలకు పోయి గోవులను పెంచుకుంటూ పొలం దున్నుకుంటూ బ్రతకమంటున్నారా
స్వామీ?”
“ఎందుకు నాయనా అంత ఆవేశం?”
“మరేమిటి స్వామీ, మీరు అభివృద్ధినిరోధకుల్లా, ప్రాతచాదస్తపు భావాలకు సరిక్రొత్త ప్రతినిధులకు మల్లే మాట్లాడుతున్నారే?
“నాయనా, ఒకసారి
జాగ్రత్తగా ఆలోచించు? నువ్వేమన్నావ్
మొదట? మేకలు గొర్రెలు, గేదెలు ఆవులు అన్నీ
సాధుజంతువులే అని అన్నావు కదా?”
“అవును స్వామీ, అన్నాను! అందులో తప్పేముంది?”
“మరి జింకలు, చిలుకలు కోతులు క్రూరజంతువులా?”
“అయ్యో, నా భావం అది కాదు స్వామీ!”
“మరి ఆ జంతువులు మీ పొలాలమీద పడితే మీరు ఎందుకు
తరిమేస్తారు?”
“.....”
“చెప్పవయ్యా?
మొగమాటమెందుకు?”
“... అంటే, స్వామీ... అవన్నీ మా పంటలను తినేస్తే మేము
తినడానికి ఇంకేముంటుంది? మేము కూడా
బ్రతకాలి కదా?”
“వాటిని అదుపుచేయడానికి పులులున్నాయి, గ్రద్దలున్నాయి,
పాములున్నాయి కదా? మీరెందుకు వాటి జోలికి
పోతున్నారు?”
“అవి అడవిలో ఉండకుండా మా పొలాల్లోనికి
వస్తున్నాయి కదా స్వామీ?”
“అవి అడవి జంతువులా?”
“అంతేగదా స్వామీ?”
“అవి అడవుల్లో బ్రతకడానికి ఏమున్నాయ్?”
“గడ్డి ఉంటుంది, పండ్ల చెట్లు ఉంటాయి.”
“అడవులంటూ ఉంటే నువ్వు చెప్పినవన్నీ ఉంటాయి. అసలు అడవులనేవే లేకుండా మీరు
తుడిచిపెట్టేస్తున్నారు గదయ్యా?”
“.....”
“ఇప్పుడు చెప్పు! మేకలు, గొర్రెలు, గేదెలకు శుభమస్తు వద్దా అని
గోల గోల చేశావే? మరి ఆ జింకలకు, చిలుకలకు,
కోతులకు మాత్రం శుభమస్తు వద్దా? ఎందుకు ఇంతటి పక్షపాతం? అని నేను మీ మనుషులను అడుగుతున్నాను.”
“తప్పే స్వామీ!”
“మీకు ఉపయోగపడేవి ఏవి ఉన్నా, వాటికి
శుభమస్తు, మీకు అవసరం లేదు అనుకున్నవాటికి వాటి ఖర్మ అస్తు! – ఇదేగా మీ మానవుల
స్వభావం?”
“మా ఆలోచనలలోని తప్పును గ్రహించాను స్వామీ!”
“నాయనా! ప్రాచీనభారతీయమహర్షులు ఇప్పటివారిలా సంకుచితభావాలు
కలిగినవారు కారు. మేము మాత్రమే బాగుండాలి, మిగిలినవాళ్లు ఏమైపోయినా మాకు అనవసరం’ అని
భావించలేదు.
‘స్వస్తి ప్రజాభ్యః’ [ప్రజలందరకూ శుభం కలగాలి]
– అనేది వారి అసలైన ఆకాంక్ష. ఆ ఆకాంక్ష నెరవేరడానికి
మార్గాన్ని సూచిస్తూ – ‘పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః’ [రాజులు భూమిని
న్యాయమైన మార్గంలో పరిపాలింతురుగాక!] అని చెప్పారు.
తరువాత - ‘లోకాః సమస్తాః సుఖినో భవంతు’ [సమస్తచరాచరప్రాణులూ
సుఖాన్ని అనుభవించాలి] అని ఆకాంక్షించారు. ఆ ఆకాంక్ష నెరవేరాలంటే మార్గం ఏమిటి? దాన్ని సూచిస్తూ ‘గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు
నిత్యం’ అని చెప్పారు.
అలా అనడంలోని అంతరార్థం ఏమిటో మనం ఇంతసేపు మాట్లాడుకున్న మాటలను
బట్టి నీకు అర్థం అయ్యుంటుంది.
“అర్థమైంది స్వామీ!”
“అదే సందర్భంలో – ‘కాలే వర్షతు పర్జన్యః’ [మేఘాలు
సకాలంలో సక్రమంగా వర్షించాలి] ‘పృథివీ సస్యశాలినీ’ [భూమి అంతటా వృక్షజాతులు, ధాన్యజాతులు
వర్ధిల్లాలి] ‘దేశోऽయం క్షోభరహితః' [దేశము ఏ రకమైన
సంక్షోభాలకూ లోనుకాకుండా ఉండాలి] 'సజ్జనాః సంతు
నిర్భయాః' [మంచివారికి భయం కలుగకుండా ఉండాలి] అనే ఆకాంక్షలు కూడా చెప్పబడ్డాయి కదా?
ఇలా అందరికీ శుభం, అందరికీ సుఖం కలగాలని జాగ్రత్తగా
ఆలోచించి చూస్తే ఆమాత్రం ఈమాత్రం చదువుకున్న ప్రతి ఒక్కరికీ కూడా అర్థమయ్యేంత సులువుగా
ఈ వాక్యాలు ఉంటే, గోవులకేనా శుభం? గేదెలకు శుభం వద్దా? బ్రాహ్మణులకేనా
శుభం? బ్రాహ్మణేతరులకు శుభం వద్దా? అంటూ అల్లరి
చేస్తావేమయ్యా?”
“తప్పు తెలుసుకున్నాను స్వామిన్!”
“శుభమస్తు.”
“మరొక్క సందేహం ఉండిపోయింది స్వామిన్!”
"ఏమిటది?"
“మానవాళి ఆర్జించిన ఈ అపారసాంకేతికవిజ్ఞానం ఉందే?
దీన్ని వదిలేసుకుని, గోవులను వెంటేసుకుని వ్యవసాయం చేసుకొనడం మాత్రమేనా ప్రపంచవినాశనం
జరగకుండా ఉండేందుకు ఉన్న ఏకైక మార్గం?”
“నాయనా! ఇంతసేపు నేను చెప్పింది ఏమిటి?
ఉత్తిష్ఠత. జాగ్రత. ప్రాప్య వరాన్ నిబోధత.
[లే. మేలుకో.
ఉత్తములైన ఆచార్యులను చేరుకో. తెలుసుకో.]
తద్విద్ధి ప్రణిపాతేన
పరిప్రశ్నేన సేవయా।
ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానినః తత్త్వదర్శినః।।
[జ్ఞానులు, తత్త్వం తెలిసిన వారు అయిన గురువులకోసం
అన్వేషించు. వారిని గౌరవించు. వారితో చర్చలు చేయి. వారికి సహకరించు. వారు నీకు కర్తవ్యాన్ని ఉపదేశిస్తారు. ఆ విధంగా తెలుసుకో.]”
“మీకన్నా జ్ఞానులు, తత్త్వం తెలిసినవారు ఇంకెవరున్నారు
స్వామీ?”
“సంవత్సరానికి ఓ కృష్ణాష్టమి నాడు తప్ప మరెప్పుడూ
నేను గుర్తుకురాను కదా నీకు? ఇంకేమిటయ్యా నువ్వు
నాతో చర్చలు చేసేది?”
“అంతమాట అనకండి స్వామిన్!”
“సరే, మార్గాంతరం మరోమారు చూద్దాంలే.
లోకాః సమస్తాః సుఖినో భవంతు.”
This comment has been removed by the author.
ReplyDeleteఓహ్. పరమాద్భుతంగా ఉంది.. ఏకబిగిన చదివేశాను.. నాలోని ఆలోచనలన్నీ ఇలా ప్రింట్ అయ్యాయి అనిపిస్తుంది.. ఈ సంవాదం రూపంలో ఎంతోమంది మదిలో ఉన్న ఆలోచనలను, వారు వ్యక్తీకరించలేని భావాలను అత్యద్భుతంగా రాశారు.. 👌👌👌😊😊
ReplyDelete