“కృష్ణం వందే జగద్గురుమ్”
“.....”
“వందే వాసుదేవం శ్రీహరిమ్”
“.....”
“స్వామిన్”
“ఆ?”
“స్వామిన్! నమో నమః. పరధ్యానంలో
ఉన్నట్టున్నారు?”
{అందమైన చిరునవ్వు} “నాకు పరధ్యానం ఆత్మధ్యానం అంటూ రెండు లేవు.”
“అవును స్వామిన్! మత్తః పరతరం
నాన్యత్ కించిదస్తి ధనంజయ (7.7) – అని
మీరే సెలవిచ్చారు.”
“సరే! ఏమిటి విశేషం?”
“మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదామని వచ్చాను స్వామిన్!”
{మళ్లీ చిరునవ్వు}
“క్షమించండి స్వామిన్!”
“దేనికి?”
“మీరు అనాదిమధ్యాంతులు (11.19) సనాతనులు (11.18) అని తెలిసి కూడా మీకు పుట్టినరోజు అంటూ
శుభాకాంక్షలు చెప్పబోయాను కదా, అందుకు!”
{మళ్లీ చిరునవ్వు}
“అర్థమైంది స్వామిన్! మాకు
ఇలా కాస్త తెలివిని కలుగజేసేదీ మీరే, మళ్లీ మమ్మల్ని మోహంలో ముంచేది కూడా మీరే
కదా! మీరేగా ‘మమ మాయా దురత్యయా’ (7.14) అని సెలవిచ్చింది?
“నేను అందుకే నవ్వానంటావా? అన్నీ
నీకు నువ్వే అనేసుకుంటున్నావు గదా?”
“మరెందుకు నవ్వినట్టు స్వామీ?”
“గత సంవత్సరం కృష్ణాష్టమి నాడు తలచుకున్నావు. మళ్లీ ఈ సంవత్సరం కృష్ణాష్టమి నాటికి గాని
మళ్లీ నేను నీకు గుర్తుకు రాలేదు చూడు?
అందుకు నవ్వాను!”
“.....”
“సరేలే! ముఖమెందుకు
ముడుచుకుంటావ్? నేను నవ్వానే గాని తిట్టలేదుగా?”
“వెక్కిరింతగా నవ్వారు! అంతేగా స్వామిన్?”
“అవును! సరే, వెక్కిరింపు
వద్దు, మెచ్చుకోమంటావా చెప్పు?”
“మీ ఇష్టం స్వామిన్! మీరు
నన్ను ఏమి చేసినా నాకు ఇష్టమే!”
{మళ్లీ చిరునవ్వు}
“స్వామిన్! మీ భక్తులు
ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు. మీరే
ఎలాగైనా కాపాడాలి అని అడిగేందుకు వచ్చాను”.
“నా భక్తులా?”
“మీరే స్వయంగా చెప్పారు కదా స్వామిన్? –నా భక్తులు నాలుగు రకాలుగా
ఉంటారు –‘ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ’ (7.16) అని? పైగా, ప్రపంచంలో ఎవరెవరు ఎవరెవరిని ఏయే పద్ధతులలో
ఆరాధించినా, వారికి ఆయా పద్ధతులలో శ్రద్ధను కలిగించేది నేనే అని కూడా చెప్పారుగా? (7.21)
పైగా ‘సర్వదేవనమస్కారః కేశవం ప్రతి గచ్ఛతి’ – ఏ దేవుడికి నమస్కారం చేసినా అది
తిరిగి తిరిగి మీకే కదా చెందేది? అందుకే,
ఈ సృష్టిలో ఎక్కడ ఎటువంటి ఆరాధన జరిగినా, అది మీకే జరిగినట్టు. అందువల్ల, వారికీ వీరికీ ఎందుకు, ఏకంగా మీకే
ఫిర్యాదు చేద్దామని వచ్చాను”.
“సరే అయితే! ప్రపంచంలో ఉన్న
ప్రతి ఒక్కరూ నా భక్తులే కాబట్టి, ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా నన్నే బాధ్యత
వహించమంటావ్! అలాగే కానీ, నీ ఫిర్యాదు
ఏమిటో చెప్పు!”
“స్వామీ, ప్రపంచం నాశనం అయిపోతోంది!
కొండలను తవ్వేస్తున్నారు! అడవులను
నరికేస్తున్నారు! నదులను మురికినీటిప్రవాహలుగా మార్చేస్తున్నారు! భూగర్భాలను
దోచేస్తున్నారు! పీల్చే గాలిని కూడా విషమయంగా
చేస్తున్నారు!”
“.....”
“మౌనంగా ఉన్నారేమి స్వామిన్?”
“నువ్వు ఇంకా ఏమైనా చెబుతావేమోనని!”
“ముందు ఈ అకృత్యాలను ఎలా ఆపాలో చెప్పండి స్వామిన్!”
“నాయనా! నాలుగురకాల భక్తులలో ‘అర్థార్థీ’
అన్నావే – అలాంటివారు – కేవలం ధనం మాత్రమే కోరే భక్తులు చేస్తున్న పనులు ఇవి. వారికి ప్రపంచశ్రేయస్సు పట్టదు. నిజం చెప్పాలంటే ప్రపంచశ్రేయస్సు అంటే ఏమిటో వారికి
తెలియదు. తాము కూడా ప్రపంచంలో ఒక భాగమని,
తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కుంటున్నామని తెలుసుకోలేని అజ్ఞానులు వారు.
‘నష్టాత్మనోऽల్పబుద్ధయః...
ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతోऽహితాః।।’ (16.9) -
‘నాస్తికులు, అల్పబుద్ధులు, ఉగ్రవాదులు, క్రూరమైన పనులతో అందరికీ
అపకారం చేసేవారు, ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఉద్భవిస్తారు’ అని ఎప్పుడో చెప్పాను
కదా. వారే వీరు.
“అయ్యో! మీ భక్తులను మీరే
తిడుతున్నారుగా స్వామిన్! అసలు మీ భక్తులు
నాస్తికులు ఎలా అవుతారు?”
“నువ్వు కూడా మనిషివేగా?
ఉన్నది ఉన్నట్టు చెబితే అది తిట్టు అనుకునే స్వభావం కలవాడివి. నువ్వు చెప్పిన పద్ధతుల్లో ప్రపంచవినాశనానికి
కారణం అవుతున్నవాళ్ల లక్షణాలు ఇవి అని అర్జునుడికి ఎప్పుడో చెప్పాను. మీ మనుషులకోసం మళ్ళీ చెబుతున్నా విను!
“కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః।
మోహాద్ గృహీత్వాऽసద్గ్రాహాన్ ప్రవర్తంతేऽశుచివ్రతాః।। (16.10)
[వారిలో కొందరుదంభము (hypocrisy) దురభిమానము, మదము కలిగి, ఎన్నటికీ సంతృప్తి
చెందని కోరికలు కలిగి, అజ్ఞానం కొద్దీ కొన్ని మిథ్యాసిద్ధాంతాలను ప్రవచిస్తూ,
ప్రపంచశ్రేయస్సు మా సిద్ధాంతాలవల్లనే, మా పనులవల్లనే కలుగుతుంది అనే భ్రమలో ప్రవర్తిస్తూ
ఉంటారు.]
ఆశాపాశశతైర్బద్దాః కామక్రోధపరాయణాః।
ఈహన్తే కామభోగార్థమ్ అన్యాయేనార్థసంచయాన్।।
(16.12)
[వారిలో మరికొందరువందలాది ఆశాపాశాలతో బంధింపబడి ఉంటారు. కోరికలు, కోపము వారిని పట్టి వదలవు. వారి భోగభాగ్యాలకోసం నువ్వు చెప్పిన అనేక
పద్ధతులలో అన్యాయంగా ధనార్జనకు పాల్పడుతూ ఉంటారు.]
ఆఢ్యోऽభిజనవానస్మి కోऽన్యోऽస్తి
సదృశో మయా।
యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞానవిమోహితాః।।
(16.15)
[మరి కొందరు నేను ధనవంతుడను, నేను గొప్పజాతిలో పుట్టినవాడను, నాకు సాటి ఇంకెవరూ లేరు, నేను మహాత్కార్యాలను చేస్తున్నాను, ఎందరికో
బ్రతుకుతెరువును ఇస్తున్నాను, అందువలన నేను కూడా సుఖపడతాను అంటూ అజ్ఞానమోహాంధకారంలో
పడి కొట్టుకుంటున్నారు.]”
“స్వామీ! ఆగ్రహించకండి, అనుగ్రహించండి. మీకు ఇంతటి కోపం తగదు.”
“నాయనా! నాకు ఎవరిమీదా కోపం
లేదు. ‘న మే ద్వేష్యోऽస్తి
కశ్చన’ (9.29) ముందే చెప్పాను కదా, నువ్వు మానవమాత్రుడివి
కాబట్టి, నేను నిజం చెబితే నేను ఎవరినో తిడుతున్నట్టు, నేను ఎవరిమీదనో కోప్పడుతున్నట్టు నీకు అనిపిస్తుంది అంతే.”
“ధన్యులం స్వామిన్! అయినా
ఇలాంటి వినాశకరమైన దుర్మార్గపు పనులు చేసేవారు మీ భక్తులు ఎలా అవుతారు?”
“నాయనా, నా భక్తులు మరో విధంగా మూడు రకాలు. సాత్త్వికులు, రాజసికులు,
తామసికులు. ఎవరి బ్రతుకువల్ల మిగిలిన ఏ
ప్రాణులకూ హాని కలుగదో, ఎవరివల్ల అందరికీ సుఖం కలుగుతుందో - వారు సాత్త్వికులు.
ఎవరు ఉత్సాహంగా పని చేస్తూ అందరినుండి సత్కారాన్ని,గౌరవాన్ని ఆశిస్తూ ఉంటారో వారు రాజసికులు.
ఎవరి పనుల వలన పర్యావరణానికి, తద్వారా ఇతరప్రాణులకు హాని కలుగుతుందో వారు తామసికులు. వీరందరూ కూడా నా భక్తులే.”
ఎవరు ఉత్సాహంగా పని చేస్తూ అందరినుండి సత్కారాన్ని,గౌరవాన్ని ఆశిస్తూ ఉంటారో వారు రాజసికులు.
ఎవరి పనుల వలన పర్యావరణానికి, తద్వారా ఇతరప్రాణులకు హాని కలుగుతుందో వారు తామసికులు. వీరందరూ కూడా నా భక్తులే.”
“మిమ్మల్ని తిట్టేవారు కూడా మీ భక్తులు ఎలా అవుతారు స్వామిన్?”
“నాస్తికులు అనేవారు అసలు ఎక్కడైనా ఉన్నారంటావా? ప్రతి ఒక్కరికీ నేను అనే భావన ఉంది. ఆ నేనులో నేను ఉన్నాను కదా?”
“స్వామీ! 'త్వమేవాహం' అంటున్నారా?”
“ఆ ‘నేను’ అనే పదార్థాన్ని సరైన విధంగా అర్థం చేసుకున్నవారికి 'త్వమేవాహం' అని ప్రత్యేకంగా చెప్పవలసిన పని ఉంటుందా? కాబట్టి, నన్ను పొగిడేవారందరూ ఆస్తికోత్తములూ
కారు, నేను అర్థం కానివారందరూ నాస్తికాధములూ కారు. ఏమయ్యా, హిరణ్యాక్షహిరణ్యకశిపులు, రావణకుంభకర్ణులు
మాత్రం నన్ను తిట్టలేదా? అయినా వారిని నేను అనుగ్రహించలేదా? దానిని వైరభక్తి అంటారు.”
“మీ అనుగ్రహం అపారమైనది స్వామిన్!”
{చిరునవ్వు}
“స్వామిన్! మీ తామసభక్తులు
చేస్తున్న వినాశకరమైన పనులతో ప్రపంచం అంతమైపోయేట్టు ఉన్నది స్వామిన్! మీరు పూనుకుని రక్షించాలి.”
“నేను రక్షించాలా? ఏమయ్యా? మీ మనుషులేమైనా పశువులా? నేను ఇపుడు కర్ర చేతబుచ్చుకుని పశుపాలకుడిలా మీకోసం రావాలంటావా?”
“అర్థమైంది స్వామిన్!”
“ఏమిటర్థమైంది?”
“న దేవా దండమాదాయ రక్షంతి పశుపాలవత్।
యం తు రక్షితుమిచ్ఛంతి బుద్ధ్యా సంయోజయంతి తమ్।।”
“అంటే అర్థమేమిటి?”
“కర్ర పట్టుకుని పశువులను కాపాడినట్టు కాపాడడానికి
దేవతలు ప్రతిసారీ రానక్కరలేదు, వారు ఎవరిని కాపాడదామని అనుకుంటారో వారికి బుద్ధిని
ప్రసాదిస్తారు అని అర్థం.” ''అందరికీ అటువంటి మంచి బుద్ధిని ప్రసాదించండి స్వామిన్!”
“ఇచ్చాను గదయ్యా! చాల కాలం క్రితమే మంచి బుద్ధిని అందరికీ ప్రసాదించాను. కాని, దానిని ఇపుడు అందరూ అపార్థం
చేసుకుంటున్నారు.”
“ఏమిటి ఆ బుద్ధి స్వామీ?”
“గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యమ్.”
“.....”
“ఏమి నాయనా ముఖం విచిత్రంగా పెట్టావు?”
“అది కాదు స్వామిన్, గోవులు బ్రాహ్మణులకు మాత్రం శుభం కలిగితే చాలా?
గేదెలకు మేకలకు శుభం వద్దా? క్షత్రియులు,
వైశ్యులు, శూద్రులు ఇలా మిగిలినవారికి శుభం కలుగవద్దా? చాల అన్యాయం స్వామిన్!”
(ఈ విషయమై స్వామివారికి నాకు జరిగిన సంవాదం రెండవభాగంలో వివరిస్తాను)
అద్భుతంగా ఉంది మీ సంవాదం.. :-) 😊👌
ReplyDelete