క్రీ.శ. 19 వ శతాబ్దం చివరి దశకం.
చెన్నై. (అప్పట్లో మద్రాస్)
******************
అమెరికాలో చికాగోలో World Religion Congress జరుగుతుందని The Hindu లో వార్త వచ్చింది.
చెన్నైలో spiritually elite people అందరూ అక్కడికి హిందూధర్మప్రతినిధిగా ఎవరిని పంపాలి అని తర్జనభర్జనలు పడుతున్నారు. ధర్మమంటే ఏమిటో, దాన్ని ఔన్నత్యమేమిటో ఎలుగెత్తి చాటగలవారు చాలామంది ఉన్నారు. కాని, వెళ్లేది పాశ్చాత్యప్రపంచం కాబట్టి, ఇంగ్లీషులో చెప్పగలిగినవారు కావాలి. దానికి కూడా సమస్య లేదు. ఇంగ్లీషు అద్భుతంగా వచ్చినవారు చాలామంది ఉన్నారు. కాని, అమెరికా వెళ్లాలంటే సముద్రం దాటి వెళ్లాలి. ఆర్యావర్తము, యజ్ఞియదేశము అంటూ మనువు పేర్కొన్న భారతదేశాన్ని విడిచిపోయేందుకు సంశయిస్తున్నారు.,
1 మనువు భారతానికి ఆవలిదేశాన్ని మ్లేచ్ఛదేశమంటారన్నాడే కాని, ఎవరూ దేశం విడిచిపోవడాన్ని నిషేధించలేదు.
2 ద్విజులు భారతదేశాన్ని ప్రయత్నపూర్వకంగా ఆశ్రయించాలని మాత్రం చెప్పాడు.
అక్కడికి ఆయన ఊరుకుంటే బాగుండేది.
ఎవరికీ ఏ భయమూ ఉండేది కాదు. కాని,
3 శూద్రులు మాత్రం వృత్తిని వెతుక్కుంటూ మ్లేచ్ఛదేశాలకు కూడా స్వేచ్ఛగా పోవచ్చునని చెప్పాడు.
((Note: 1: మనువును వ్యతిరేకించేవారెవరూ ఆయన శూద్రులకు ఇంతటి నిరభ్యంతరమైన స్వేచ్ఛ ఉందంటూ పేర్కొన్నాడనే విషయాన్ని పొరపాటున కూడా చెప్పరు. సరే, ఆ విషయం ఇక్కడ అప్రస్తుతం.))
సరే, వెనక్కొస్తే, పైన పేర్కొన్న మూడవవిషయం వల్ల ఉపనయనార్హత, వేదాధ్యయనార్హత కలిగిన ద్విజులందరూ దేశం దాటితే మాకు ద్విజకులభ్రష్టత (కర్మభ్రష్టత) తో పాటు శూద్రత్వం ప్రాప్తిస్తుంది అని భయపడే అవసరమొచ్చింది. కాని, అప్పటికి దేశం దాటి అమెరికాకు వెళ్లి అక్కడ హిందూధర్మపు గొప్పదనాన్ని చాటవలసిన అవసరముంది., ఎవరిని పంపించాలి? ఎవరు ద్విజత్వాన్ని వదులుకొని శూద్రత్వాన్ని కోరుకుంటారు? పిల్లి మెడలో నేను గంటను కడతానని ఏ ఎలుక ధైర్యంగా ముందుకొస్తుంది? అని తటపటాయిస్తున్నారు.
((Note: 2 : ద్విజులు సంధ్యావందనాది నిత్యకర్మలను విధిగా చేసితీరాలి. అలా చేస్తే పుణ్యమేమీ రాదు. కాని, చేయకపోతే మాత్రం పాపం వస్తుంది. నిత్యకర్మలను భారతభూభాగంలోనే చేయాలి. భారతభూమి బయట చేస్తే దానికి విలువ లేదు. అందువల్ల భారతం దాటితే కర్మభ్రష్టత్వం కలుగుతుంది. అలా కర్మభ్రష్టత కలగడం వలన ద్విజజాతిభ్రష్టులౌతారు... అనేది కారణం.))
((Note: 3 : భ్రష్టుడు అనేది నీచాతినీచమైన తిట్టు అని భ్రమించేవారు చాలమంది ఉన్నారు. కాని, అదేమి తిట్టు కాదు. భ్రష్టత్వమంటే జారిపోవడం, లేదా కోల్పోవడం. అంతేకాని, చెడిపోవడం కాదు.))
((Note: 4 :నిజానికి హిందువులు సముద్రం దాటి సుదూరప్రాచ్యదేశాలతో వాణిజ్యం చేయడం ఎన్నడో ప్రారంభమైంది. దక్షిణదేశక్షత్రియులు సముద్రపు ఆవలిభూముల్లో తమ రాజ్యాలను స్థాపించి పరిపాలన సాగించారని కూడా చరిత్ర చెబుతుంది.))
పాపం, అలా చెన్నై పండితులు ఆందోళనలో ఉండగా, వారికి ఒక ఆశాకిరణం కనిపించింది. ఆ కిరణమే వివేకానందుడు. అప్పటికి ఆయన భారతపర్యటన చేస్తూ చెన్నైకి వచ్చి ఉన్నాడు. ఇంగ్లీషులో అనర్గళంగా ప్రసంగించగల నేర్పరిగా, భారతీయ తత్త్వసామాజికశాస్త్రాలలో మహా దిట్టగా, ప్రపంచచరిత్రను ఔపోసనపట్టిన మేధావిగా అప్పటికే ఆయన గొప్ప ఖ్యాతిని గాంచి ఉన్నాడు. ఆయనతో కాస్త చనువు ఏర్పడ్డాక ఈ చెన్నైవాసులు ఆయనను హిందూధర్మప్రతినిధిగా అమెరికాకు వెళ్లమని అభ్యర్థించారు.
((Note: 5: వివేకానందుడు సన్న్యాసి. సన్న్యాసికి కులమనేది ఉండదు. వారు ఎటువంటి నిత్యకర్మలను చేయవలసిన అవసరం లేదు. అందువల్ల భ్రష్టత్వమనేది వారికి ఉండే అవకాశం లేదు.))
కాని, వివేకానందుడు మొదట పెద్దగా ఆసక్తిని కనబరచలేదు. కాని, ఆయన సముద్రం ఒడ్డున ఉండగా ఆయన గురువైన శ్రీరామకృష్ణపరమహంస సముద్రజలాలపై నిలబడి, పదే పదే రమ్మంటూ సైగలు చేస్తున్నట్టు తోచిందట. దాంతో తనను తన గురువు సముద్రం దాటి విదేశాలకు వెళ్లవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నట్టు వివేకానందుడు భావించాడు. గురుపత్ని అయిన శ్రీశారదాదేవి నుండి కూడా అనుమతి లభించేసరికి ఆయన హిందూ ప్రతినిధిగా అమెరికాకు వెళ్లేందుకు సుముఖుడయ్యాడు.
ఆతరువాత జరిగినదంతా చరిత్ర.
హిందూప్రతినిధిగా వెళ్లిన ఆయన భారతీయ ఆధ్యాత్మికవైభవాన్ని, సాంస్కృతికౌన్నత్యాన్ని సమస్తప్రపంచదేశాల ప్రతినిధులముందు ఘనంగా చాటి చెప్పారు. ఆయన విదేశగమనంతో భారతదేశం పట్ల పాశ్చాత్యదేశాలవారికుండే దృక్పథం మారింది. చిన్నచూపు చూడడం మాని, కాస్త గౌరవం చూపడం ప్రారంభమైంది. భారత్ నుండి ద్విజజాతులు కాస్త స్వేచ్ఛగా పాశ్చాత్యదేశాలకు వెళ్లడం ప్రారంభమైంది. అలా వెళ్లినవారిలో శ్రీనివాస రామానుజన్, గాంధీ, రవీంద్రనాథ టాగోర్ వంటి ప్రముఖద్విజులున్నారు. వారు మళ్లీ వెనుకకొచ్చారు గాని, అందరూ వారిలా వెనక్కురాలేదు. అలా భారత్ నుండి క్రమంగా ద్విజజాతుల వలస ప్రారంభమైంది.
క్రమంగా 20 వ శతాబ్దంలోనే ద్విజులందరికీ విదేశగమనంలో తప్పేమీ లేదని భావించే మానసికపరివర్తన కలిగింది. 21 వ శతాబ్దంలో అసలు విదేశగమనమే తమ జన్మకు పరమార్థమన్నట్టు కష్టిస్తున్నారు, అనుకున్నది సాధిస్తున్నారు. నిత్యకర్మాచరణకు, స్వాధ్యాయానికి license వంటిదైన ఉపనయనాన్ని పెళ్లిముందు జరిగే మొక్కుబడి తంతుగా మార్చేశారు. విదేశాలలోనే సర్వపాశ్చాత్యవిద్యలు నేర్చి, అక్కడే ఉద్యోగం చేస్తూ, కేవలం పెళ్లి కోసం ఓ నెలరోజులు సెలవు పెట్టి, అప్పుడే విమానం దిగివచ్చిన ద్విజుడు కూడా ఆజన్మవిరక్తునిలా నటిస్తూ కాశీకి పోయి సన్న్యాసం స్వీకరిస్తానని ఉత్తుత్తి బెట్టు చేస్తాడు. ఏమీ వెళ్లడని తెలిసికూడా పెళ్లికూతురి సోదరుడు ఆయనను బ్రతిమలాడి పెళ్లిపీటలమీదకు తెస్తాడు. పెళ్లవుతుంది. కొద్దిరోజులయ్యాక గృహస్థుడైన ద్విజుడు తన వధువుతో సహా విదేశాలకు ఎగిరిపోతున్నాడు.
(పోనీ, ఇక్కడ మనువుగారి గౌరవార్థం "మనువాడిన ద్విజుడు" అందామా?)
కర్మభ్రష్టత, ద్విజత్వభ్రష్టత -
ఇలాంటి కాలం చెల్లిన చాదస్తపు మాటలు, భయాలేమీ ఇప్పుడెవరికీ లేవు.
ఎవ్వరూ మనుస్మృతిని చదవటం లేదు,
చదివినా ఆయన చెప్పిన ప్రతివిషయాన్నీ ఎవరూ పాటించటం కూడా లేదు. పాపం, మనువు!
ద్విజులందరూ మరచిపోయిన ఆ మనువును కొందరు మాత్రం తమ మనుగడ కోసం గుర్తు చేసుకొంటూ "మనువాదం నశించాలి, మనువాదులు ఖబడ్దార్" అంటూ ఉండడం చూస్తే, వారు తమ కత్తులతో కసికసిగా గాలిని చీల్చి చెండాడుతున్న మహావీరులనిపిస్తూ ఉంటుంది.
పాపం, రాబోయే రోజుల్లో చదివేవారెవరూ లేరని మనుస్మృతిని పబ్లిషర్లెవరూ ముద్రించడానికి ఇష్టపడరు. కాని తగలబెట్టడానికి మాకు ఇన్ని కాపీలు కావాలని, మనువాదవ్యతిరేకులమని చెప్పుకొనేవారు ఆర్డరిచ్చి ప్రింట్ చేయిస్తూ ఉంటారు.
No comments:
Post a Comment