Friday, 9 December 2016

దేవో దుర్బలఘాతకః

అనగనగా ఓ దర్జీ ఉన్నాడట.

ఓరోజు ఓ పెద్దాయన ఒక మంచి గుడ్డ తెచ్చి, ఏమయ్యా దర్జీ దర్జీ, దీనితో నాకు ఓ చొక్కా కుట్టి పెట్టవయ్యా అని అడిగాడట. ఆ దర్జీ గుడ్డ కొలత చూసి, అబ్బే, ఇది మీకు సరిపోదండీ అన్నాడట. అదేమిటీ? అమ్మిన షాపువాడు సరిపోతుందని చెప్పి ఇచ్చాడే అన్నాడట ఆ పెద్దమనిషి. అయితే ఆ షాపువాడినే అడగండి కుట్టిపెట్టమని అని నిర్లక్ష్యంగా చెప్పాడట దర్జీ. 


కొద్ది రోజులయ్యాక ఆ పెద్దమనిషి ఆ చొక్కాను కుట్టించుకొని వేసుకొచ్చాడట. ఏమయ్యా చూశావా? నేను ఇంకో దర్జీని అడిగాను. అతడు నాకు చక్కగా కుట్టివ్వడమే కాకుండా తన అబ్బాయికి కూడా అదే గుడ్డతోనే చొక్కా కుట్టుకున్నాడు తెలుసా? అని చెప్పాడట.

అవునా? ఆ అబ్బాయి వయసు ఎంత అని అడిగాడట దర్జీ. ఐదేళ్లు అని చెప్పాడట పెద్దాయన. అదీ! అలా చెప్పండి! మా అబ్బాయికి ఇరవై ఏళ్ళు కదా? మరి సరిపోతుందని నేనెలా చెప్పగలను? అన్నాడట దర్జీ.
నేటి వ్యాపారస్థుల తంతు కూడా ఇలాగే ఉంటుంది.
<><><><><><>

తమకు ఎక్కువ లాభం ఏ ప్రోడక్ట్ మీద వస్తుందో, దానినే వ్యాపారస్థులు మార్కెట్ లో ప్రజలకు అందిస్తారు. అంతేగాని, వస్తువు మంచి చెడ్డలను వారు పట్టించుకోరు. ఫలానా కూల్ డ్రింకులో పురుగులమందు అవశేషాలు ఉంటున్నాయి అని వార్తలు వచ్చినా వారు కూల్ గా అమ్మేస్తూ ఉంటారు. ఫలానా నూడుల్స్ లో ఫలానా ప్రమాదకర రసాయనాలు ఉన్నాయి అని ల్యాబోరేటరీ ఫలితాలు స్పష్టంగా చెప్పినా, తమకు అదేమీ తెలియనట్టు నటిస్తూ షాపునుండి ఆ వస్తువులను తొలగించే ప్రయత్నం ఏదీ చేయరు.

వినియోగదారుల్లో ఆందోళన బాగా పెరిగి నిరసన వ్యక్తం చేసినపుడో లేక ఏ ప్రభుత్వమో ఏ కోర్టో ఆ ప్రోడక్టును తొలగించమని ఆదేశమిస్తే అప్పుడు తప్పదు కాబట్టి మహా బాధ్యత కలిగి ఆ ఆజ్ఞను శిరసావహించేవారిలా ఆ ప్రోడక్టులను పక్కన పెడతారు. గొడవ సద్దు ముణిగిన తరువాత చల్లగా మళ్ళీ దానినే జనాలకు అంటగట్టడం ప్రారంభిస్తారు. వినియోగదారుల శ్రేయస్సు వారికేమీ అవసరం లేదు అనేది స్పష్టం.
<><><><><><>

అగ్రరాజ్యమైనా మార్పు లేదు, ఇదే తంతు!

1929లో ప్రపంచదేశాలలో - ముఖ్యంగా యూరోపియన్ దేశాలు & అమెరికాలో మహా - ఆర్థికమాంద్యం ప్రారంభమైంది. (దీనినే గ్రేట్ డిప్రెషన్ అంటారు).

అంటే వ్యాపారుల పెట్టుబడులకు తగినంత రాబడులు రాకపోవడం. వ్యాపారంలో వచ్చే లాభాలకంటే బ్యాంకు వడ్డీ రేట్లే అధికంగా ఉండటంతో అందరూ వ్యాపారం మానేసి బ్యాంకులోనే డిపాజిట్లు చేయడం మొదలు పెట్టారు. కానీ, సహజంగానే బ్యాంకు తనవద్ద లోన్లు తీసుకొనేవారు లేక, ఆదాయం దానికి కూడా సరిపోక తాను చెల్లించే వడ్డీ రేట్లు తగ్గించింది. దాంతో అందరూ బ్యాంకు నుండి డిపాజిట్లను వెనక్కు తీసుకొనడం మొదలు పెట్టారు. బ్యాంకులు దివాళా తీసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా అటు లాభాలు రావని వ్యాపారం చేసేవారు లేరు, బ్యాంకులు మూకుమ్మడిగా మూతపడే పరిస్థితులు వచ్చాయి. నిరుద్యోగం ఎక్కువైంది. దెబ్బకు గొప్ప గొప్ప దేశాలుగా పేరు మోసినవన్నీ, అమెరికాతో సహా పెద్ద పెద్ద దరిద్రుల దేశాలుగా మారిపోతున్నట్టు కనిపించింది.

1933 లో అమెరికాలో డెమొక్రాట్ అయిన రూజ్వెల్ట్ ప్రెసిడెంటు అయ్యాక, రేడియోలో తన ప్రసంగాలను ధారావాహికలుగా ప్రజలకు వినిపించి వారిలో భవిష్యత్తుమీద నమ్మకం రేకెత్తించాడు. కానీ, ఉద్యోగావకాశాలు కల్పించటం కంటే, ఆయన వ్యాపారాభివృద్ధికే చొరవ చూపాడు.

ఆయన తీసుకున్న నిర్ణయం ఏమిటో తెలుసా? అమెరికాలో ఇబ్బడిముబ్బడిగా అవసరాలకు మించి పండుతున్న గోధుమ పంటను లక్షలాది టన్నులు ఆయన నిర్దాక్షిణ్యంగా తగలబెట్టించాడు, సముద్రాలలో పారబోయించాడు. ఈ చర్య ద్వారా ఆయన సప్లై - డిమాండ్ - ధర సూత్రాన్ని స్థిరంగా అమలుపరచాలని సంకల్పించాడు. సహజంగానే, ఆహారపదార్థాల సప్లై తక్కువయ్యే సరికి డిమాండ్ పెరిగింది. రేటు కూడా పెరిగింది. వ్యాపారులు లాభపడ్డారు. నెమ్మదిగా ఆర్థికవ్యవస్థ కుదుట పడింది. కానీ, ధనవంతులు మాత్రమే ఆహారపదార్థాలు కొనుక్కోగలిగితే, పెద్దగా డబ్బులేనివారు పేదవారు మాత్రం తమ ప్రెసిడెంటు స్వయంగా సృష్టించిన ఈ కృత్రిమ కరువు దెబ్బకు ఆకలితో మల మల మాడిపోవలసి వచ్చింది. కానీ, వారి గోడు ఎవరికీ పట్టలేదు. ఏదేమైనా, ఇదేదో బావుందని యూరోపియన్ దేశాలు కూడా ఇలా చేతికందిన ఆహారపదార్థాలను తమ ప్రజల నోటికందకుండా నాశనం చేయడం ప్రారంభించాయి. ఫలితం కూడా కనిపించింది. ఆర్థికరంగాన్ని పైకెత్తేందుకు పేదల కడుపుపై కొట్టడం ఎంత క్రూరమైన చర్య!

ఇది చరిత్రలో మాయని పెద్ద మచ్చగా, కళంకంగా మిగిలిపోయేలా కనిపించింది. కానీ, ఇంతలో 1941 లో, జపాన్ అమెరికాకు చెందిన పెరల్ హార్బర్ మీద భయంకరంగా వైమానిక దాడి చేయడంతో అమెరికా తప్పనిసరిగా రెండవప్రపంచ యుద్ధంలో పాల్గొనవలసి వచ్చింది. ఆ సందర్బంగా దాదాపు 17 మిలియన్ల అమెరికన్లకు ఉద్యోగావకాశాలు లభించాయి. యుద్ధపరికరాలు నిర్మించే పరిశ్రమలలోనూ, దానికి అవసరమైన ఖనిజాదులను సేకరించే పరిశ్రమలలోనూ, సైనికులుగానూ - ఇలా. ఆ ఉద్యోగాలు రావడంతో, యుద్ధం అంటే ఇష్టం ఉన్నా లేకున్నా, ఆకలితో చచ్చిపోయే కంటే కడుపునిండా తింటూ, యుద్ధం చేస్తూ చచ్చిపోవడం మేలని అమెరికాలోని పేదజనమంతా పొలోమని మిలటరీలో చేరిపోయారు. అమెరికా సాయంతో మిత్రపక్షాలు యుద్ధం గెలిచాయి. 1945 April 30 తేదీన హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు.

మొత్తానికి గెలిచినప్పటికీ, యుద్ధం ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల, మళ్ళీ మాంద్యం విజృంభించే సూచనలు కనబడ్డాయి. దాన్ని అరికట్టడానికి ఫ్రీ మార్కెట్ కేపిటలిజం విధానాన్ని పరిచయం చేశారు. అసలు ఇందుకోసం రకరకాల కసరత్తులు యుద్ధం జరుగుతూ ఉండగానే ప్రారంభమయ్యాయి. 1944 జూలైలో, 730 మంది డెలిగేట్లతో, 44 మిత్రదేశాలు న్యూ హ్యామ్ప్ షైర్ నగరంలో సమావేశమయ్యాయి. దీన్నే బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అంటారు. ఆయా దేశాల మధ్య ఎగుమతులు దిగుమతుల సందర్బంగా సుంకాలు తక్కువగా విధించాలన్న ఒప్పందం అందులో ప్రధానమైన నిర్ణయం. ఈ ఒప్పందంలో అమెరికా చెప్పలేనంతగా లాభపడింది. మిగిలిన అన్ని దేశాలకు దాదాపు నాయకునిగా మారిపోయింది. (ఈ ఒప్పందంలోని అంశాలే కొన్ని చేర్పులు మార్పులతో ఆ తరువాత GATT అనే పేరుతో (General Agreement on Trade and Tariff) ప్రసిద్ధమయ్యాయి.

ఇదిలా ఉండగా హిట్లర్ మరణంతో ఆగిపోయిందనుకున్న ప్రపంచయుద్ధం జపాన్ విజృంభణతో ఆగేలా కనిపించలేదు. మిత్రదేశాలన్నీ తమ నాయకుడైన అమెరికా ఏం చేస్తుందని చూడసాగాయి. అమెరికా తన నాయకత్వాన్ని వదులుకుంటే వ్యాపారపరమైన అధికలాభాలను కోల్పోవలసి వస్తుంది. కానీ, జపాన్ ను అణచడం అంత సులువుగా కనిపించలేదు. దాంతో, అమెరికా సాంప్రదాయ యుద్ధాన్ని విడిచి, తెగబడి, హిరోషిమా నాగసాకిలను అణుబాంబులతో ధ్వంసం చేసి, జపాన్ దేశాన్ని పాదాక్రాంతం చేసుకుంది.

ఇలా, కేవలం వ్యాపార ఒప్పందాల రక్షణకోసం మహావిధ్వంసం జరిగింది! హిరోషిమాలో 150000 మంది, నాగసాకిలో 75000 మంది తక్షణమే మరణించారు. మరెంతమందో తరాలతరబడి అంతుతెలియని రోగాలతో జీవచ్ఛవాల్లా బ్రతికారు, ఇప్పటికీ కొందరు బ్రతికే ఉన్నారు.
<><><><><><>

ఆధునిక వ్యాపారం ఈ విధంగా పేదల పట్ల దయలేనిదిగా, క్రూరంగా మారి పోవడానికి మూలబీజం అక్కడే పడింది. ఆ విధ్వంసక బాంబుల ఫలితం అమెరికా తలరాతను సంపూర్ణంగా మార్చేసింది. ప్రపంచమంతా అది చెప్పినట్లల్లా విని తల ఆడించవలసిన రోజులు వచ్చాయి. సోవియట్ రష్యా ఉన్నంతవరకు అది కొంత అదుపులోనే ఉంది, రష్యా విచ్చిన్నం కాగానే దానికి మరి అడ్డూ అదుపూ లేకుండా పోయాయి. చమురు కోసం అది సృష్టించిన కల్లోలం చిన్నదేమీ కాదు. మధ్య ఆసియా దేశాల్లో పట్టు సంపాదించేందుకు గాను, ఆ దేశాల్లో పరస్పరకలహాలు రేపేందుకు గాను అది సృష్టించిన తీవ్రవాద భూతం ఇప్పుడు ప్రపంచపు అస్తిత్వానికే పెను ముప్పుగా పరిణమించింది. ఇవన్నీ అమెరికా వ్యాపారదాహంతో విచక్షణారహితంగా చేసిన తప్పిదాలకు మనం చెల్లిస్తున్న మూల్యాలు!
<><><><><><>

ఇటువంటి క్రూర వ్యాపార సంస్కృతి గ్లోబలైజేషన్ ముసుగులో నెమ్మదిగా 20 వ శతాబ్దపు చివరి దశకంలో భారత్ లోకి కూడా చొరబడింది. అప్పటినుండి భారత్ లో వ్యాపారులు పుట్టలు పుట్టలుగా మహామహా కోటీశ్వరులు కావడం మొదలు పెట్టారు. అతిథిదేవో భవ అని ఆశాసించే మన దేశంలో చివరకు మంచి నీళ్లను కూడా డబ్బు పెట్టి కొనుక్కోవాల్సిన రోజులు దాపురించాయి.

క్రమంగా వారి ప్రభావం భారత్ రాజకీయ వ్యస్థను శాసించడం మొదలు పెట్టింది. వ్యాపారుల డొనేషన్లు లేకుంటే పార్టీని నడిపించడమనే అతి ఖరీదైన పనిని ఎంతటి తెలివైనవాడైనా, ఎంతటి సమర్ధుడైనా, ఎంతటి గొప్ప ఆశయాలు ఉన్నవాడైనా డబ్బులేని వాడు చేయలేడు. ఈ వ్యాపారులు మీడియాను కొనేసి, దాని ద్వారా తమకు అనుకూలమైన రాజకీయ పార్టీలను నిత్యం ప్రశంసిస్తూ ప్రజల ఆలోచనలను ప్రభావితం చేస్తూ, ఎన్నికల ఫలితాలను దాదాపు వారే నిర్ణయిస్తున్నంత పని చేస్తున్నారు. ఇపుడు ఏ పార్టీయైనా వారు చెప్పినట్టు వింటేనే మనుగడలో ఉంటుంది, లేదా ధూళిలో కలిసిపోతుంది అన్నట్టు తయారైంది పరిస్థితి.

చివరకు పన్ను కట్టడంలో ఎన్ని లొసుగులు ఉన్నాయో కనిపెట్టి ఎగ్గొట్టడంలో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరు వ్యాపారస్తులు అందరూ సమబుద్ధులై ఉన్నారు. మనకు రసీదు ఇస్తున్న వ్యాపారులెంతమంది ఉన్నారు కనుక?
<><><><><><>

సరే, చరిత్రపుటలనుండి నేటి రోజుకు తిరిగి వద్దాం. ప్రస్తుతం అటువంటి వ్యాపారులు నగదు చలామణీ లేక, కొనుగోళ్లు జరగక ఇబ్బంది పడుతున్నారు అని వార్తలు వస్తున్నాయి. వారి మీద మనం ఏమాత్రం జాలి పడనవసరం లేదు. మన ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టు పట్టించి ధనస్వామ్యంగా మార్చిన ఘనత వారిది. వారికి ఏ ఇబ్బందులు ఉన్నా అవన్నీ తాత్కాలికమే, నగదు విరివిగా చలామణీలోనికి వస్తే వాళ్ళు రక్తబీజుల్లా మళ్ళీ విజృంభిస్తారు. సందేహం లేదు, కాబట్టి, ఎవరు ఏ నిర్ణయాలు తీసుకున్నా చివరకు బాధలు అనుభవించేది బలి అయ్యేది ఎప్పటికీ మనమే! సామాన్యప్రజలమే!

अश्वं नैव गजं नैव व्याघ्रं नैव च नैव च।
अजापुत्रं बलिं दद्याद् देवो दुर्बलघातकः।।

చివరకు ఆ దేవుడు కూడా తనకు బలిగా బలమైన గుఱ్ఱాన్ని గాని, ఏనుగును గాని, పులిని గాని కోరడట. కోరేది పాపం అమాయకమైన మేకపిల్లనట! అయ్యయ్యో! దేవుడు కూడా బలహీనుణ్ణే దెబ్బకొడతాడు కానీ, బలవంతుల జోలికి పోడే అని, పాపం, ఓ సంస్కృత కవి ఎప్పుడో వాపోయాడు!

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...