శివోఽహమ్
శివః+అహమ్ అనే రెండు పదాల కలయిక వలన శివోఽహమ్ అనే సంధి ఏర్పడుతుంది. అంటే నేను శివుడను అని అర్థం.
చాల చిన్నపదం కదా? పలికేందుకు ఒక సెకను సమయం కూడా పట్టదు కదా? కాని, అలా పలికే అర్హత మనకు ఉన్నదా?
శివము అంటే కల్యాణము, మంగళము, (శుభము) సుఖము, మోక్షము,, శ్రేయస్సు అని అర్థాలున్నాయి. . ఇవన్నీ ఆ దేవదేవునిలో ఉంటాయి కాబట్టి ఇతడు శివుడు.
ఇంకా అణిమాదులైన అష్టసిద్ధులు శేరతే - అవతిష్ఠంతే - ఇతనియందు ఉంటాయి కాబట్టి ఇతడు శివుడు.
ఇంత తెలిసిన తరువాత కూడా మనం శివోఽహమ్ (నేను శివుడను) అనుకోగలమా?
}}}{{{
అత్యంతసారవంతమైన సుక్షేత్రం ఉన్నదనుకోండి - అక్కడ ఎటువంటి విత్తనం వేసినా ఏపుగా బలంగా పెరుగుతుంది.
ఎడారిలో ఖర్జూరం వంటి ఎడారి మొక్కలు మాత్రమే పెరుగుతాయి కాని, అక్కడ రసభరితమైన మంచి మామిడి తోట వేద్దామనుకుంటే అది వృథాప్రయాస కదా. అది ఎడారిభూముల లక్షణం. అందుకు మనం ఎడారిని నిందించడం వలన ప్రయోజనం లేదు.
అలాగే సుక్షేత్రాలలో విషవృక్షపు విత్తనం నాటినా అది బలంగా ఎదుగుతుంది. ఆ విషవృక్షాల పుష్పాలు అతిరమణీయమైన రంగులతో కన్నులను ఆకర్షిస్తూ ఉంటాయి. వాటి ఫలాలు సుమధురసౌరభాలను వెదజల్లుతూ సమస్తప్రాణులను ఆకర్షిస్తూ ఉంటాయి. ఆ రంగులకు సౌరభాలకు ఆశపడి తమ చెెంతకు వచ్చే ప్రతి మనిషినీ, జంతువును. పక్షినీ, కీటకాన్నీ అవి తమ విషంతో నిర్దాక్షిణ్యంగా చంపేసి తాము మరింత బలంగా ఎదిగేందుకు ఎరువుగా మార్చుకుంటాయి.
అయితే తత్కారణంగా మనం ఆ క్షేత్రాన్ని తప్పుపట్టడానికి వీల్లేదు. ఎందువల్లనంటే అక్కడ అమృతఫలబీజం నాటినా నిస్సందేహంగా చక్కగా పెరుగుతుంది.
కాబట్టి, సుక్షేత్రనింద చేయరాదు.
సృష్టి ఆవిధంగా జరిగింది మరి.
)))(((
మరి మనం చేయవలసిన పనులు ఏమిటి?
1 విషవృక్షాలను ఖండిస్తూ, విషవృక్షబీజాలను నశింపజేయడం.
2 అమృతబీజాలను నాటుతూ, సంరక్షించుకుంటూ ఉండటం.
3 పై రెండు పనులనూ సమన్వయం చేయడం.
మనలో కొందరకు విషవృక్షాలను ఖండించడంలో నేర్పు ఉండవచ్చు కాని, అమృతబీజాలను నాటడం చేతకాకపోవచ్చును.
అలాగే కొందరకు అమృతబీజావాపనంలో చక్కని నైపుణ్యం ఉండవచ్చును కాని చేత గొడ్డలి ధరించి విషవృక్షాలను ఖండించేంత బలం లేకపోవచ్చును.
అలాగే కొందరు రెండుపనులలోనూ సమర్థులై ఉండవచ్చును.
ఈ రెండుపనులలోనూ నేర్పరులైన వారి నడుమ చక్కని సమన్వయం అవసరం. లేకుంటే ఎంత ఖండించినా విషవృక్షాలు మరలా తలెత్తవచ్చు. అందువల్ల ఖండించిన వెంటనే అక్కడ అమృతబీజాలను తప్పక నాటేయాలి. అందువల్ల సమన్వయం చేయడంలో నేర్పరులైన వారు ఎంతైనా అవసరం. అప్పుడే సుక్షేత్రాలన్నిటా సమస్తప్రాణిసుఖకరములూ సమస్తజీవానందదాయకములూ అయిన అమృతఫలవృక్షాలు విస్తరిస్తాయి.
అదీ జరగవలసిన పని.
)))(((
భారతీయులు శివోఽహమ్ అనుకోవచ్చు. ఎందుకంటే శివునిలో ఉండే ఒక లక్షణం మనలో కూడా ఉన్నది. ఈ పరమశివుడు మంచి చెడ్డ అనే భేేదం లేకుండా అందరినీ ఆదరించేస్తాడు. దేవతలైనా అదే ప్రేమ, రాక్షసులైనా అంతే ప్రేమ ఆయనకు.
చెప్పేదేమి, మన భారతీయులు కూడా ఇలాంటివారే. అచ్చం శివుడిలాంటివారే. చెడ్డవారు మన దరి చేరి స్నేహం చేస్తే వారిని కూడా ఆత్మీయులుగా భావించేస్తాం. అప్పుడు మంచివారిని కూడా మన శత్రువులుగా భావించి వారిమీద పగను పెంచుకుంటాం. అలాగే ముందుగా మంచివారే మన చెంత చేరితే మంచిని గూర్చి మంచి అవగాహను పెంచుకుంటాం. చెడును దరిజేరనియ్యం.
ఇటువంటి లక్షణం మన బలహీనత, బలం కూడా. సృష్టి అలా జరిగింది. ఎవరినీ నిందించవలసిన పని లేదు. జరగవలసింది కృషి.
)))(((
అయితే శివుడిలో మరో లక్షణం కూడా ఉన్నది.
విషం వల్ల లోకాలకు ఆపద కలగనివ్వకుండా ఆయన దానిని మ్రింగివేసి తన కంఠంలో దాచుకుని శ్రీకంఠుడయ్యాడు. గరళకంఠుడన్నా విషకంఠుడన్నా అవి నిందావాచకపదాలనిపిస్తాయి కాని ఆయన నిజానికి శ్రీకంఠుడు. ఎందుకంటే విషం కూడా ఆయన కంఠానికి ఒక ఆభరణంలా మారి మంచి శోభను కలిగించింది కాబట్టి!
ఆవిధంగా ఆయన విషాన్ని లోపలనే అణచివేసి అగాధసాగారాంతరాళంలో దాగివున్న అమృతం పైకి వచ్చేందుకు అనుమతించాడు.
ఈ రెండు పనులనే కదా, మనం ఈ సందర్భంలో
1 విషవృక్షఖండనం అని,
2 అమృతబీజావాపనం అని
అంటున్నాము.
ఈ రెండు పనులనూ విజయవంతంగా చేయగలిగితే మనకు శివోఽహమ్ అనుకునే అర్హత లభిస్తుంది.
ఆ అర్హతకోసం ఆయా రంగాలలో ఆయా పనులలో నైపుణ్యం ఉన్నవారు పరస్పరసమన్వయంతో పని చేయవలసిన ఆవశ్యకత ప్రస్తుతం మన భారతదేశంలో చాల బలంగా, ఉన్నది.
సర్వేఽత్ర సుఖినః సంతు
సర్వే సంతు నిరామయాః।
సర్వే భద్రాణి పశ్యంతు
మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్।।
అంటూ సమస్తవిశ్వశాంతిని కోరుకునే సనాతనధర్మమే అమృతబీజం. విషవృక్షాలను నేర్పుగా ఖండించి అమృతబీజాలను నాటడమే భారతీయులందరి కర్తవ్యం.
అందుకు శివుడే మనకు ఆదర్శం కాబట్టి, శివోఽహమ్।।
।।కార్తికశుక్లప్రతిపత్, ప్లవః।।