Thursday, 4 March 2021

ఎవరి తప్పుకు ఎవరిని నిందిస్తారు?

 


ఎవరి భక్తి గొప్ప?  

ధూర్జటిమహాకవి శ్రీకాళహస్తీశ్వరమాహాత్మ్యంలో ఈ గొడవను చక్కగా వర్ణించారు -

ఒక్క కాలఫణి భక్తిన్ దివ్యమాణిక్యముల్ పాతాళంబుననుండి తెచ్చి దినముం బాలేందుచూడార్చనల్ ప్రాతర్వేళలజేయు... (2.108)

త్రేతాంతంలో శివునికి మహాభక్తుడైన ఒక నల్లటి నాగుపాము పాతాళలోకంనుండి దివ్యమైన రత్నాలను తెచ్చి శివునికి కానుక పెట్టి పూజచేసేదట.

ఆ శివునికి ఒక ఏనుగుకూడా పరమభక్తుడు. అది పాము సమర్పించిన దివ్యమణులను చూసి, తామసగుణంతో భ్రాంతులైనవారెవరో ఇటువంటి పని చేశారనుకుంది.

"పెక్కు వర్ణముల ఱాలు కపర్దికి పెట్టజూతురే?" (2.112) అనుకుంది.

ఆ రత్నాలను తోసి పారేసి, తొండంతో తెచ్చిన నీటితో శివునికి అభిషేకం చేసి, తాను కానలు గొలకులు కలయతిరిగి, శివుని కోసం కోసిన మాలూరశాఖలు, నాళీకకహ్లారములు, కుముదపుష్పంబులు సమర్పించింది.

ఆ తరువాత వచ్చిన పాముకు తాను సమర్పించిన రత్నాలు నేల దుమ్ములో ఉండటం, ఏనుగు సమర్పించినవన్నీ శివలింగం చుట్టూ ఉండటం చూసి ఒళ్లు మండింది.

"డగ్గరి యెవ్వడో కటకటా శివలింగముమీది రత్నముల్ గగ్గుల కాట గప్పి, ములుకంపలు, తీవెలు వెట్టె నేడు నా కెగ్గొనరించి పోయె" అనుకున్నది.

అది కూడా ఏనుగు సమర్పించిన వాటిని పడద్రోసి, మళ్లీ రత్నాలతో అలంకరించి పోయింది.

తరువాత ఏనుగు వచ్చింది. మరలా ఆ రంగురాళ్లను చూసి కోపగించి, వాటిని దిక్కులం పాఱ జల్లేసింది. మరలా తన పూజను తాను చేసి పోయింది.

తరువాత పాము వచ్చింది. మళ్లీ పెక్కులైన జగతీరుహశాఖలను, తమ్మికాడలను చూసింది.

ఎవరో ఇలాంటి దుండగపు పని చేస్తుంటే "ఊరకె యుండె శంకరుండక్కట యేమి సెప్ప నహహా పగవారిని కూడె దైవమున్" (2.115) అని విషాదంలో మునిగిపోయింది.

చూడండి మరి, ఆ పాము, ఈ ఏనుగు ఇరువురూ శివభక్తులే. కాని, తాము చేసే పూజ మాత్రమే శ్రేష్ఠమైనదని ఇరువురూ అనుకుంటున్నారు.

పాముచెంత రత్నరాసులు మణిమాణిక్యాలు దండిగా ఉన్నాయి కాబట్టి, బాగా ధనవంతుడు (Rich by money) అనుకుందాము. ఏనుగు చెంత అవేమీ లేవు, తాము తినేవే శివునికి కూడా ఇష్టమనుకుని వాటినే తెచ్చి యిచ్చి పూజించుకునే పేదజనం అన్నమాట. కాని, ఇది పాము కంటె బాగా బలమైనది ( Physically strong).

ఇలా ధనవంతులకు, పేదలకు మధ్య కలహబీజం ఏర్పడి క్రమంగా వైరంగా మారిపోయింది. ఏనుగు పామును గూర్చి, అజ్ఞాని, తామసగుణుడు (2.112) అనుకుంది. పాము ఏనుగును గూర్చి మదాంధుడు (2.110) దుర్మదుడు (2.115) (పొగరుబోతుతనంతో కళ్లు మూసుకుపోయినవాడు) అనుకుంది.
అయితే రాజసగుణమెక్కుడైన పాము తన పూజను పాడుజేస్తున్న వ్యక్తిమీద పగ బూనింది. తన రాణులతో కలసి జలక్రీడలాడటంలో ఉన్న సంతోషం తనకు ఉడిగిపోయిందట. తన పూబోణులతో కలసి మధురసుధలతో కూడిన ఆహారం రుచించడం లేదట. బహువిధ సంగీత నృత్య గానాలను ఆనందించే నేర్పు పోయిందట. నిద్రాసుఖం కూడా కరువైందట. ఏనుగు చేస్తున్న పనికి గాను ఆ పాముకు ప్రతిరాత్రి శివరాత్రి జాగరమైపోయిందట.

(అలా చేస్తున్నది ఏనుగు అనే విషయం తెలియకముందే పాము దానిమీద కోపం తెచ్చుకుంది. అంటే దాని కోపం నిజానికి ఆ పని మీదనే తప్ప ఒక వ్యక్తిమీద కాదు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి.)

ఏనుగు కూడా తక్కువ తినలేదు. రాళ్లపూజను స్వీకరిస్తున్నందుకు గాను ఏకంగా శివుని తప్పు బట్టింది.

ఏమయ్యా శివా, నీలం రాళ్లు నల్లని కలువలతో సమానం కాగలిగేనా? ఆ పచ్చ రాళ్లు (అవి మరకతమణులని ఏనుగుకు తెలియదు) బిల్వపత్రాలు కాగలవా? ఆ ఎఱుపు రాళ్లకు ఎఱ్ఱదామరల సౌభాగ్యం ఉన్నదా? అసలు ఈ రాళ్లు నీకెట్లా నచ్చాయయ్యా, వీటిలో వాసన ఉన్నదా, మెత్తదనం ఉన్నదా, చల్లదనం ఉన్నదా? అని అడిగింది. (2.120)

శివా, నువ్వుండేది పెద్ద రాళ్ల కొండ (హిమాలయం). నీ భార్య కొండకూతురు (హిమవత్పర్వతరాజపుత్రిక పార్వతి). నీ ధనుస్సు కూడా ఒక కొండ (త్రిపురాసురసంహారకాలంలో ఆయనకు మేరు పర్వతమే ధనుస్సు). నీ రథం రత్నగర్భ అయిన భూమి. (త్రిపురాసురసంహారకాలంలోనే). ఇన్నేసి రాళ్లమధ్యలో ఉంటున్నా నీకు ఇంకా ఈ రాళ్లను (మణులను) అలంకారంగా ధరించాలనే కోరిక ఎట్లా ఉందయ్యా? అని అమాయికంగా అడిగింది.

ఇలా ఇన్నేసి మాటలన్నా, చివరకు ఆ ఏనుగు కోపం పాము మీదకు మళ్లింది. అయినా నిన్నని ఏమి లాభం? ఏమనగలవాడ నిన్ను, వ్రతహాని యొనర్చు దురాత్ముడుండగన్? (2.121) అనుకుంది.

(ఇక్కడ ఏనుగు కూడా అంతే, తన పూజను పాడు చేయడమనే పనిమీదనే దానికి కోపం తప్ప, పాము అనే ఒక వ్యక్తి మీద వ్యక్తిగతమైన పగ లేదా ద్వేషం లేదు.)

చివరకు, ఆ పగబట్టిన పాము ఏనుగు తొండంలో దూరి కుంభస్థలాన చేరి దానిని చంపదలచింది. ఏనుగు ఆ బాధ భరించలేక గగ్గోలు పెట్టింది. ఏనుగు బాధ వర్ణనాతీతమైనా ధూర్జటి దానిని హృదయవిదారకంగా తన కావ్యంలో చెప్పగలిగాడు. చివరకు ఆ పోరులో కాళము (పాము) హస్తి (ఏనుగు) రెండూ మరణించాయి. (ద్వితీయాశ్వాసం 138 నుండి 150 వ శ్లోకం వరకు)

రెండిటికీ శివసాన్నిధ్యం కలిగింది.

ఇలా నా పూజ గొప్పదంటే నా పూజ గొప్పదనే అహంకారం వ్యక్తులకు ఉండటం సహజమే. సరే, అవి రెండూ జంతువులే కదా అనుకుందాం. కాని, అదే ధూర్జటి, అదే కావ్యంలో తృతీయాశ్వాసంలో మనుషులకు కూడా ఇటువంటి బుద్ధి ఉంటుందని నిరూపించాడు.

తరువాత కాలంలో కణ్ణప్ప అని పేరుగాంచిన బోయ తిన్నడు ఉన్నాడే, అతడు కూడా ఏనుగు లాంటి భక్తుడే. తాను తినేదే శివునికి ఇష్టమైన తిండి అనుకున్నాడు. ఆ తిండిని సమర్పించడమే శివునికి ఆనందం కలిగించే పూజ అనుకున్నాడు.

ఒక వరాహాన్ని గెడిపాడు. కాల్చి, వ్రేల్చి, ప్రేల్చాడు. ఆకు దొప్పలలో మాంసఖండాలను తెచ్చి తినమని నట్టడవిలో కొలువైన శివునికి ఇచ్చాడు. శివుడు తినకుండా ఊరకున్నంత మాత్రాన తిన్నడు ఊరుకోలేదు.

కాలవో? క్రొవ్వవో? మాడంగాలెనో? చవి గావో? కమ్మగావో? నీకున్
జాలవో? యలవడవో? తినవేలా కఱుకుట్లు, పార్వతీశ్వర చెపుమా.
(3.88)

అని అడిగాడు. (కఱుకుట్లు అంటే చువ్వకు గుచ్చి కాల్చిన మాంసపు ముక్కలు.) అయితే శివుడు పలుకలేదు. అయినా తిన్నడు ప్రశ్నించడం మానలేదు.

ఆకలి గాదో? భక్తిం దేకువ గలవాడ గానో? తినవేల కృపన్?
సాకగదే నన్నిపుడఱ్ఱాకల బెట్టక ఫలాశనాసక్తుడవై.
(3.89)

అన్నాడు. నువు తినకుంటే నేను కూడా ఇట్లే అఱ్ఱాకలితో ఉండవలసి వస్తుంది అని black mail చేయడానికి కూడా ప్రయత్నించాడు. నన్ను ఆకలితో చంపక నువ్వు తిని నన్ను సాక్కోవయ్యా అని బ్రతిమలాడాడు. తాను తినకుండా మారాం చేస్తే అమ్మ తనను ఎలా బుజ్జగిస్తుందో గుర్తొచ్చినట్లుంది.

నెపమొకటి గలదె నాపై, నుపవాసము తోడ బడలియుండగ, నీకే
యపరాధము సేయంగదె, కృపతో గఱుకుట్టు లారగింపంగదవే.
(3.90)

అని తన తప్పేమైన ఉందా అని విచారించి, తప్పులు చేయనని వాగ్దానం చేశాడు. తినమన్నాడు. అయినా శివుడు తినేట్లు కనిపించలేదు. దాంతో తిన్నడికి ఏం చేయాలో తోచలేదు.

"నీవారగింపకుండిన జీవనమేమిటికి శివ? నీ పదరాజీవముల మీద ప్రాణములే విడుతు" అని ఏడ్చాడు.

అప్పటికి శివుడు కనికరించి సరే ఇటు తే అని తిన్నడు ఇచ్చినవన్నీ తిన్నాడు. తిన్నడు పరమానందభరితుడైనాడు.

తరువాత ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. శివలింగం పరిసరాలు చూసేసరికి అతనికి కంపరం పుట్టుకొచ్చింది.

ఏమిటి శివలింగంపై ఈ చారికలు? ఈ ఎంగిలి పుల్లియలేమిటి? ఈ ఎంగిలిమంగలంబులైన దొప్పలేమిటి? ఈ కసుమాలము ఏమిటి? ఈ రోత ఏమిటి? ఈ దుందుడుకుతనం ఎవరిదై ఉంటుంది? అనుకున్నాడు. ఈయనకు కూడా శివునితో చనవు ఎక్కువే.

ఏమయ్యా శివా, పాత బట్టలు మీద కప్పినా ఓర్చుకుంటావు, నీచులైన రాక్షసాధములతో ప్రేమగా పొత్తులు కడతావు. నీ భక్తుడు తన ప్రియురాలి చెంతకు తన తరపున రాయబారం పొమ్మంటే కిమ్మనకుండా పోతావు. శవాల బూడిదను ఒంటిమీద ధరిస్తావు, కపాలాన్ని భోజనపాత్రగా స్వీకరించావు, ఇన్ని రోతలు చాలక, ఇపుడీ కొత్త రోత ఏమిటయ్యా అని దబాయించేశాడు. ఈ రోత నీకిష్టమైతే అట్లే కానీ, ఆ దుర్మార్గుడెవడో నాకు చెప్పు. (ఏం చేద్దామనో?) లేకుంటే కూడుగ్గబట్టి ప్రాణం విడిచేస్తా అన్నాడు.

ఆగవయ్యా ఆగు అంటూ శివుడు అతడిని ఆపి, తిన్నడి భక్తిని అతడికి కళ్లారా చూపాడు. (అదే ఈనాటికి కూడా సుప్రసిద్ధమైన కథ - శివునికి తిన్నడు తన కండ్లను తృణప్రాయంగా భావించి అర్పించిన కథ)

ఇలా, పోటీ వస్తే, ఎవరి భక్తి గొప్పదని చెప్పగలం?

)))(((
ఈ మధ్యనే ఒక మిత్రుడు అన్నారు - హిందూమతాన్ని సంస్కరించాలి, దానిలోని ఆధిపత్యభావజాలాన్ని సంస్కరించాలి - అని.

వారికోసం, వారిలా భావించే వారికోసమే ఈ పోస్టు.

మహోదయా, చూశారు కదా, ఇటువంటి ఆధిపత్యభావజాలాలు సమాజంలో మొదటినుండీ ఉన్నాయి. అయితే ఇతడి ఆధిపత్యం లేదా వీరి ఆధిపత్యం కరెక్టు అని హిందూమతగ్రంథాలలో ఎక్కడా చెప్పలేదు. ఎవరైనా ఆధిపత్యం చెలాయించబోతే అది ఆయా కాలాలలో, ఆయా వ్యక్తుల అజ్ఞానం వల్లనో లేదా గర్వం వల్లనో జరిగిందే తప్ప దానికి హిందూమతం ఎటువంటి ఆమోదముద్ర వేయలేదు.

దేవాలయాలలో గర్భగుడిలోనికి అర్చకులకు తప్ప వేరొకరికి ప్రవేశం లేదు. నిజమే. ప్రధానమంత్రి కార్యాలయంలోనికి కూడా అందరికీ ప్రవేశం లేదు కదా? అందుకుగాను అక్కడున్న సెక్యూరిటీ గార్డులను ద్వేషిస్తామా? రక్షణవ్యవస్థను నిందిస్తామా?

మన దేశంలో లక్షలాది ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయంలోనూ కేవలం బ్రాహ్మణులు మాత్రమే అర్చకులుగా లేరు. బ్రాహ్మణేతరులు కూడా అర్చకులుగా ఉన్న ఆలయాలను నేను చూశాను. అక్కడకు కూడా భక్తులు వెడుతున్నారు. అక్కడ కూడా కానుకలను సమర్పిస్తున్నారు. ఎవరూ బ్రాహ్మణేతర అర్చకులను ఆక్షేపించడం లేదు. బ్రాహ్మణార్చకులను గౌరవించినట్లే వారిని కూడా గౌరవిస్తున్నారు. అక్కడ కూడా మేమే ఉండాలి వారిని తొలగించాలి అని బ్రాహ్మణులెవరూ అడగటం లేదు కదా?

బ్రాహ్మణులు అర్చకులుగా ఉన్న గుడులు పెద్దవి, బ్రాహ్మణేతరులు అర్చకులుగా ఉన్న గుడులు చిన్నవి అంటారా? సరే. కాని చూడండి, ఆ పెద్ద పెద్ద గుడులు మహారాజులు కట్టించినవి. వాటిలో శాస్త్రోక్తవిధానంలో అర్చనలు జరిపించేందుకు బ్రాహ్మణులను అర్చకులుగా నియమించింది కూడా ఆ మహారాజులే.

అప్పటినుండి అది అలా కొనసాగుతోంది. ఆ మహారాజులు పోయారు. హైందవేతరమతాల రాజులు వచ్చారు. వారి కాలంలో దేవాలయాలు దాడికి గురైనాయి. కొన్ని నామరూపాలు లేకుండా ధ్వంసమైనాయి. కొన్ని రూపు మార్చుకుని మసీదులుగా ఆవిర్భవించాయి. అనేకం శిథిలం అయినాయి. వాటిని రక్షించుకునే క్రమంలో భారతీయసైనికులతో పాటు అనేకులైన బ్రాహ్మణార్చకులు కూడా తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఆ తరువాత భక్తులు సందర్శించకపోయినా, ఆదాయం లేకపోయినా, శతాబ్దాల తరబడి పేదరికంలో మగ్గుతున్నా, నిత్యం భగవంతుని ఆరాధనలో బ్రతుకుతున్నవారు లక్షలాది అర్చకులు ఉన్నారు. వారు తమ వృత్తికి ఇప్పటికీ కట్టుబడే ఉన్నారు. అందువల్లనే ఇప్పటికీ అర్చకులుగా ఉన్నారు. ఈనాడు కొన్ని దేవాలయాల స్థితి మెరుగుపడి, అర్చకులలో కొందరు మంచి స్థితిలో ఉండవచ్చును. కాని, లక్షలాది అర్చకులు ఇప్పటికీ పేదవారుగానే ఉన్నారు. కాని, అర్చకవృత్తిని విడువలేదు. వారి అంకితభావాన్ని తప్పుగా భావించడం సమంజసం కాదు. వారు గుడులను విడవనంతమాత్రాన గుడులపై వారు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు అనలేము.

సరే. ఇక అంటరానితనం హిందూమతంలో ఉన్న తప్పు అన్నారు మరో పెద్దాయన. అది పక్కాగా తప్పు. హిందూమతగ్రంథాలలో అటువంటి అంటరానితనాన్ని ఆమోదించిన వాక్యాలను ఎక్కడా లేవు.

ఒకానొక కాలంలో కొందరు వ్యక్తులు తమకు సంక్రమించిన అధికారాన్ని, ధనబలాన్ని చూసుకుని గర్వించి అవి లేని కొందరిపై పెత్తనం చెలాయించిన మాట నిజం. అయితే అది హిందూమతానికి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇటువంటి పరిస్థితులలో కొందరు వ్యక్తులు చేసిన దురాగతాలను మతానికి అంటగట్టి ఇది హిందూమతస్వభావం అనడం కేవలం మిషనరీల కుట్ర మాత్రమే.

మహాశివభక్తుడైన రావణుడు పరమలోకకంటకుడైనాడు. లోకాలన్నిటినీ తన బలగర్వంతో పీడించాడు. వేలాది కన్యలను అపహరించాడు. సీతను అపహరించాడు. చివరకు రాక్షసవంశమే నిర్మూలమైపోయేంతటి ఉపద్రవం తెచ్చిపెట్టాడు. అందుకు శివుడు బాధ్యుడు కాదు. రాముడు కూడా శివుడిమీద అలుగలేదు. శివపూజను మానుకోలేదు. పైగా రామేశ్వరంలో శివప్రతిష్ఠ కూడా చేశాడు కదా? రాముడే కాదు, రావణపీడితులైన ఎవరూ కూడా శివద్వేషులు కాలేదు. ఎందుకంటే అలా లోకాలను పీడించమని, అంత దుర్మార్గంగా ప్రవర్తించమని రావణుడికి శివుడు చెప్పలేదు కదా? ఆ రావణుడు జన్మతః బ్రాహ్మణుడైనాడు. అతనిని సంహరించమని బ్రాహ్మణులే స్వయంగా రాముని వేడుకున్నారు. విశ్వామిత్రుడు, అగస్త్యుడు మొదలైన బ్రాహ్మణులే రావణాసురవధకు ఉపయోగపడగల దివ్యాస్త్రాలను రామునికి ఉపదేశించారు, ప్రసాదించారు. రాముడు కూడా వెనుకాడకుండా అతని పీచమణచాడు. బ్రాహ్మణుడైన రావణుడు తన భార్యను అపహరించాడు కాబట్టి రాముడు సమస్తబ్రాహ్మణసమాజం మీద ద్వేషం పెంచుకోలేదే?

అలాగే, కొందరు క్షత్రియులు తన కుటుంబానికి చేసిన అన్యాయానికి ప్రతికారంగా దేశదేశాల క్షత్రియులందరినీ పగబట్టి వెంటాడి మరీ వధించిన పరశురాముడి పట్ల గాని, అతడి సంతానం పట్ల గాని, అతడి కులం పట్లగాని ఆ రాముడు ద్వేషం పెంచుకోలేదే? ఇలా అనేక కారణాలవల్లనే శ్రీరాముడు భారతీయులకు ఆరాధ్యదైవమైనాడు.

#జైశ్రీరామ్

సరే, అంటరానితనం అనేది ఇప్పుడు లేదు. అది తప్పు అని హిందువులందరూ హార్దికంగా అంగీకరిస్తున్నారు. శివుని ఆలయాన్ని ఎంగిలిమంగలంగా మార్చిన తిన్నడినే కణ్ణప్పనాయనారుగా చేసి, శివాలయంలో శాశ్వతస్థానం కల్పించిన సంస్కృతి కదా మనది. అటువంటి మన సంస్కృతి అంటరానితనాన్ని ప్రోత్సహిస్తుంది అనడానికి ఎవరికైనా నోరు ఎలా వస్తుంది? ఎక్కడో దేనినో చూసి, అనాలోచితంగా దానిని హిందూమతానికి అంటగట్టి తూలనాడడం సమంజసమేనా?

ఇలా ఎవరైనా ప్రశ్నిస్తే వాడిని హిందూమతసారం తెలుసుకొనలేని హిందువు అంటూ దూషించడం, నేను మాత్రమే నిజమైన హిందువును అంటూ ఆత్మస్తుతి చేసుకొనడం - ఏమిటిదంతా? ఇది కేవలం చిన్నతనం!

కాని, కొన్ని గ్రామాలలో ఇది ఇంకా ఉంది అని ఇదే మిత్రుడు అంటున్నారు. అక్కడ కొన్ని వర్గాల ఆధిపత్యం ఉంది అంటున్నారు. ఆ వర్గాల వారు ఎవరు? ఆ వర్గాలవారు ధనవంతులు అయ్యుంటారు. లేదా ఆ గ్రామంలో సంఖ్యలో అధికులై ఉండవచ్చు. (మెజారిటీ వర్గం) లేదా భూములు అధికంగా ఉన్నవారై ఉండవచ్చు. లేదా అధికారవర్గానికి చెందినవారై ఉండవచ్చు. ఇటువంటి ఆధిక్యత వలన వారు ఇతరులను చులకనగా చూడటం చేస్తూ ఉండవచ్చు.

వారి చేష్టలకు హిందూమతం ఎలా బాధ్యత వహిస్తుంది? వారు తమ పొగరుబోతుతనం కొద్దీ చేస్తున్న దురాగతాలకు హిందూమతాన్ని క్రొత్తగా సంస్కరించడమేమిటి? ఎవరు చేస్తున్న తప్పుకు ఎవరిని నిందిస్తారు?

హిట్లర్ చేసిన మారణకాండకు క్రైస్తవం బాధ్యత వహించిందా? జలియన్ వాలాబాఘ్ లో డయ్యర్ చేసిన సామూహికహత్యలకు క్రైస్తవం బాధ్యత వహించిందా? అల్లూరి, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, బటుకేశ్వర దత్, సుఖదేవ్, రాజ్ గురు వంటి భారతీయవీరులపై బ్రటిషు ప్రభుత్వం అధికారమదంతో బుద్ధిపూర్వకంగా చేసిన అత్యాచారాలకు క్రైస్తవం బాధ్యత వహించిందా?

జిహాద్ అంటూ మతం పేరు చెప్పి మరీ ప్రపంచమంతటా విచ్చలవిడిగా నరమేధం సాగిస్తూ అల్లకల్లోలం సృష్టిస్తున్న క్రూరాతిక్రూరులైన మూకల చర్యలకు, మనసులో వారి పనులకు మద్దతు పలుకుతూ, సంతోషిస్తూ, పైకి మాత్రం పరమశాంతిపరులైన మిత్రులుగా నటనకనబరుస్తున్నవారికి మీ మతం బాధ్యత వహించాలి అని ఏనాడైనా బోధించారా? బుద్ధి చెప్పే సాహసం చేశారా?

అణచివేతకు గురైన వారు మాత్రమే హిందూమతం వదలి మతాంతరం స్వీకరిస్తున్నారు అనే భ్రమను కొందరు మిత్రులు వదులుకోవాలి. ఆ లెక్కన రెడ్లు, కమ్మలు, కాపులు, బ్రాహ్మణులు కూడా క్రైస్తవులుగా ఎందుకు మారారు? విదేశాలనుండి వస్తున్న నిధులకు ఆశపడి కాదా?

అంటరానితనానికో లేదా కొందరు వ్యక్తుల అనుచితమైన ఆధిక్యానికో హిందూమతం ఎన్నడూ ఆమోదముద్ర వేయలేదని చాల స్పష్టంగా చెబుతున్నాను. ప్రభుత్వం కూడా దీనిని నిషేధించింది. అమలు చేయడం, బాధ్యులైన వారిని శిక్షించడం ప్రభుత్వం బాధ్యత.

(అట్లని అంతా ప్రభుత్వానిదే బాధ్యత అని హిందువులు నిష్క్రియాపరులై ఉండటం ఆత్మహత్యతో సమానం అని హిందువులంతా తక్షణం గుర్తించాలి.)

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...