Tuesday, 15 September 2020

మోత - మోత - మోత


కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు కాని, కాకి తన పిల్లను మోయడం ఎప్పుడైనా ఎవరైనా చూశారా?
సమస్తప్రాణికోటులకు చెందిన తల్లులు తమ తమ సంతానాన్ని ఎంతో కొంత కాలం గర్భంలో మోస్తారు. ఆ తరువాత కూడా, అంటే గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్ని ప్రాణులు తమ సంతానం స్వయంగా సంచరిస్తూ ఆహారాన్ని సంపాదించుకునే శక్తి వచ్చేవరకు వాటిని మోస్తూనే ఉంటాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే, తమ సంతానం తమ శత్రువుల నుండి తమంతట తాముగా కాపాడుకొనే స్థాయికి చేరుకునేంతవరకు స్వయంగా మోస్తూ కాపాడుతూ ఉంటాయి.
పాపం జింకలు, దున్నలు, గుఱ్ఱాలు, గోవులు, మేకలు, గొఱ్ఖెలు వంటి జంతువులు, చిలుకలు, పావురాలు, కోళ్లు వంటి పక్షులు తమ పిల్లలను కాపాడుకునేందుకు ప్రయత్నం చేయగలవు కాని, వాటిని ఎత్తుకొని దూరంగా పరుగెత్తడం వాటికి సాధ్యం కాదు. అందువల్లనే అవి అధికంగా వేటాడబడుతూ ఉంటాయి.
కోతి జాతికి చెందిన చింపాంజీలు, గొరిల్లాలు, ఉరాంగుటానులు, బబూనులు, మాండ్రిళ్లు, కొండముచ్చులు మొదలైన ప్రాణులన్నీ తమ పిల్లలను వీపుమీద మోస్తాయి.
మార్సూపియల్ జాతికి చెందిన కంగారూలు, వల్లబీలు తమ పిల్లలను తమ పొట్టలోని సంచిలో మోసుకొని తిరుగుతుంటాయి. ఇటువంటి జంతువులు దాదాపు 250 రకాలు ఉన్నాయి అంటారు.
పిల్లి జాతికి చెందిన పిల్లి, పులి, సింహం, చిరుత అన్నీ తమ పిల్లలను నోటితో మోస్తాయి.
నీటిలో ఈదే పక్షులు ఈదేటపుడు తమ పిల్లలను వీపుపై మోస్తాయి.
చీమలను చెదలను ఆహారంగా తీసుకునే అలుగులు కూడా తమ పిల్లలను వీపుపై మోస్తాయి.
కొన్ని రకాల కప్పలు కూడా తమ పిల్లలను వీపుపై మోస్తాయి.
సాలీడు పురుగులు, తేళ్లు కూడా తమ పిల్లలను వీపుమీద మోస్తూ ఉంటాయి.
పిల్లి వేరు ఎలుక వేరు అని భావిస్తామేమో కాని, పిల్లలకు తల్లులుగా ప్రేమనందించే విషయంలో రెండూ సమానమే. ఎలుకలు కూడా తమ పిల్లలను నోటకరచుకొని మోస్తాయి.
ఈ విధంగా తమ తమ పిల్లలను ప్రేమతో మోసే ప్రాణులు ఈ ప్రపంచంలో కోకొల్లలుగా ఉన్నాయి.
అయితే,
ఇవన్నీ ఒక ఎత్తు, మనిషి వేరొక ఎత్తు.
సాధారణంగా మిగిలిన ప్రాణులను మోసేవి వాటివాటి తల్లులే కాని తండ్రులు కాదు. కాని, మానవజాతిలో తండ్రులు కూడా తమ సంతానాన్ని ఎత్తుకుంటారు. కేవలం తల్లిదండ్రులు మాత్రమే కాదు, పిల్లల్ని ముద్దు చేస్తూ బంధువులు స్నేహితులు కూడా ఎత్తుకుంటారు. ఇలా ఎత్తు కొనడాన్ని మోత అనరు. ఆ పదాన్ని ఆ సందర్భంలో ఉపయోగిస్తే అవమానకరంగా కూడా భావిస్తారు. ఎత్తు కొనడం అనే పదాన్ని మాత్రం ప్రేమకు ఆప్యాయతకు చిహ్నంగా భావిస్తారు.
అయితే మనిషి ప్రేమ హద్దులు లేనిది. అతడు ప్రేమ కొద్దీ కేవలం తన సంతానాన్ని మాత్రమే కాదు, ఇతర జాతుల సంతానాన్ని కూడా ఎత్తుకుంటాడు. చిన్న పిల్లలు కూడా ఎంతో ప్రేమతో పిల్లి పిల్లలను, కుక్క పిల్లలను, మేక పిల్లలను, పక్షి పిల్లలను, ఎత్తుకుంటారు.
ఆవుదూడలకు పందిపిల్లలకు మధ్యలో తేడాను పెద్దవారు గ్రహించగలరేమో గానీ పిల్లలు మాత్రం ఆ రెండింటినీ సమానంగానే ముద్దు చేస్తారు.
అది మనిషి ప్రత్యేకత.
అయితే, తల్లిదండ్రులు అయినా స్నేహితులైనా, చుట్టాలైనా తమరి పిల్లలనైైనా, ఇంకెవరి పిల్లలనైనా కొంత వయసు వరకు మాత్రమే వారిని ఎత్తుకుంటారు. ఆ తరువాత కూడా వారిని ఎత్తుకుంటే చూసేవారికి కూడా వింతగానే ఉంటుంది. ఒక ఇరవై యేండ్ల పిల్లవాడిని తల్లిదండ్రులు ఎత్తుకొనడం మనం ఊహించగలమా? ఎప్పుడైనా ఎక్కడైనా ఆ విధమైన దృశ్యం చూస్తే, మనం ఆ పిల్లవాడికి కాళ్లు సరిగా లేవు కాబోలు, అందువల్లనే అతడిని తల్లిదండ్రులు మోస్తున్నారు అని జాలి పడతాం.
( ఈ సందర్భంలో ఎత్తుకున్నారు అనుకోం. ఎత్తుకొనడం ప్రేమకు చిహ్నమైతే మోయడం అనే పదం అనివార్యమైన భారానికి చిహ్నంగా మనం భావిస్తాం.)
అలా కాదు, కాళ్లు సక్రమంగానే ఉన్నాయి, ఆ ఇరవైయేండ్ల పిల్లవాడు నడవ గలడు, అయినప్పటికీ కూడా వాళ్లు ప్రేమ కొద్దీ ఎత్తుకుంటున్నారు అని తెలిస్తే, మనకు సంబంధం లేకపోయినా, ఆ అతి ముద్దును మనం భరించలేం. వారు ఎత్తుకుంటున్నారు అని కూడా అనుకోం. వారు ఆ పిల్లవాడిని మోస్తున్నారు అనే పదమే ఉపయోగిస్తాం.
అయితే నాగరికత పెరుగుతున్న కొద్దీ కొందరు మనుషులు కూడా మోయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు. అయితే వారు కూడా అందరినీ మోయటం లేదు. (అందరినీ పక్షపాతం లేకుండా మోయాలి అని చెప్పడం నా ఉద్దేశం కూడా కాదు.) వారు కొన్ని కొన్ని వర్గాల వారిని మాత్రమే ప్రత్యేకించి మోస్తున్నారు. అందులో చాలమందికి నడక వచ్చు. నడక ఏమిటి? పరుగెత్తగలరు. యుద్ధాలు కూడా చేయగలరు. ఇతరులను వేటాడి చంపనూ గలరు. అయినా సరే, అటువంటివారిని కూడా రాజకీయనాయకులు తల్లిదండ్రులు కంటె మిన్నగా వారిని మోస్తున్నారు.
నిజం చెప్పాలంటే, వారు వారిని స్వయంగా మోయటం లేదు. ఇతరుల చేత బలవంతంగా మోయిస్తున్నారు. వారు స్వయంగా మోయాలి అంటే తమ సొంత జేబులోంచి ఖర్చు పెట్టాలి. కాని, ఇతరులు చెల్లించే పన్నుల ద్వారా సమకూరే సొమ్మును యథేష్టంగా తీసుకుంటూ వారిని తరతరాలుగా మోస్తున్నారు.
మోయండయ్యా, మోయండి. ముందే చెప్పినట్లుగా, ప్రపంచంలో ప్రతి ప్రాణీ మోస్తుంది. కాని, అవసరమైనంత కాలమే మోస్తుంది. ఆ తరువాత ఆ మోతను దించుకుంటుంది. ఇక మీరే స్వయంగా బ్రతకవలసిన సమయం వచ్చిందంటుంది. కాని, మీరు వారిని ఒక పట్టాన దించేలా లేరే?
మహానగరాల్లో ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర చిన్నపిల్లలను మోస్తూ, వారిని చూపిస్తూ, వారికి ఆకలేస్తుంది బాబూ అని దీనంగా మాట్లాడుతూ చేయి చాపి అడుక్కునే వారికి, మీకు కాస్త తేడా ఉండాలి కదా? నిజానికి అదొక పెద్ద మాఫియా అని కూడా అంటారు.
ఈవిధంగా చేస్తూ, మీరే స్వయంగా అందరినీ మోస్తున్నట్లుగా కీర్తిని పొందుతున్నారు. కాని, నిజంగా మోస్తున్న జనాలకు మాత్రం చచ్చే చావుగా ఉంది.



 

Saturday, 12 September 2020

కుమారశతకం




పూర్వకాలంలో బడికి వెళ్లే పిల్లలకు మంచి ప్రవర్తనను నేర్పే కుమారశతకం ఇది.  ఎన్నో మంచి విషయాలను ఇది ప్రబోధిస్తుంది.  మచ్చుకు కొన్ని.

 

1 బడికి పొమ్మని ప్రబోధం

 

తెల తెల వారగ లేచియు

పలు దోమియు మురికి లేని పంచలతో నీ

పలకయు బలపము బుస్తక

ములు జేకొని బడికి జనుము ముద్దు కుమారా. (8)

 

2 కలిగిన దానిని ఆనందంగా స్వీకరించాలనే ప్రబోధం

 

కొఱ్ఱన్నమైన గానీ

గొఱ్ఱెల చల్లన్నమైన గాని కోపపడకమీ

కుఱ్ఱలతో జుఱుజుఱ్ఱని

జుఱ్ఖుకొనియు  లేచిపొమ్ము సొగసు కుమారా. (20)

 

సొమ్ములు సొగసులు గోరకు

కమ్మని పచ్చళ్లు గూరగాయలెపుడు తే

తెమ్మని మారము సేయక

తమ్ములతో గూడి చదువ దగును కుమారా. (23)

 

3 తోటి బాలురతో సఖ్యంగా ఉండాలనే ప్రబోధం

 

ఆట్లాడబోయి పెద్దలు

పోట్లాడగ జేయకయ్య బుద్ధి గలిగియే

తిట్లాడక బాలురతో

గొట్లాడక కూడి యాడుకొనుము కుమారా. (34)

 

4 ఓర్పు వహించాలనే ప్రబోధం

 

ఉడికియు నుడకని యన్నము

కడుపున దినబోకు నొప్పి గలుగును రుచిగా

నుడికిన యన్నము గూరలు

గుడుచుట సౌఖ్యంబు మంచి గుణము కుమారా. (63)

 

5 ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ప్రబోధం

 

చలికాలము నీ యింటను

గల బట్టలు గప్పికొనుము కాసేపయినన్

మొల బట్ట తోడ దిరుగకు

చలి బుట్టును జలుబు సేయ సాగు కుమారా.  (66)

 

నెల కొకనాడయినను నీ

తలకాయను నూనె చేత దట్టించుమురా

కలలెపుడు రావు నిద్దుర

గలుగును జదువుటకు దెలివి గలుగు కుమారా.  (88)

 

6 మేలు కోరి మంచిని చెప్పే పెద్దల మాటను వినమని ప్రబోధం

 

పెద్దలు వలదని చెప్పిన

దెద్దయినను జేయబోకు మెఱిగిన నిను గం

గెద్దని మొద్దని పిలుతురు

బుద్ధి కలిగి మంచిపనికి బొమ్ము కుమారా.  (70)

 

7 ఇతరులను హేళన చేయవద్దనే ప్రబోధం

 

రోగుల బిచ్చి బికారుల

జోగుల జంగముల పిల్ల జట్టులవారిన్

మూగల ముక్కిడివారిని

నాగడంపు బల్కు బల్కకయ్య కుమారా.  (75)

 

8 స్త్రీల పట్ల మర్యాద కలిగియుండాలనే ప్రబోధం

 

అసె వసె యని యాడంగుల

పసితనమున బిలువబోకు పరువు తొలగురా

పసివాడవనుచు జూడరు

గసరుచు కొట్టిదరు చెంపకాయ కుమారా.  (77)

 

9 జాగ్రత్తగా సంచరించాలనే ప్రబోధం

 

కాలికి జెప్పులు దొడుగక

కాలవకును బోకు మచట గల ముండులు నీ

కాలిని విరుగును జీకటి

కాలములో దేలు పాము కరచు కుమారా.  (80)

 

10 దురభ్యాసాలకు దూరంగా ఉండుమనే ప్రబోధం

 

పొగ చుట్టలు బీడీలును

సిగరెట్టులు త్రాగబోకు చిన్నతనమయా

పొగ చేతను రొమ్మెండును

సొగసగు నీ పెదవి నలుపు సోకు కుమారా.  (89)

 

చీట్లాటలు నేర్చికొనకుము

పోట్లాటలు వచ్చు జదువు పోవును పాడై

తిట్లాట లేని చదువుల

పోట్లాటలు నేర్చికొనగ పొమ్ము కుమారా.  (92)

నవ్వులకైన నబద్ధం

బవ్వలతోనైన నెప్పుడాడకు గీడౌ

ని వ్వసుదలోన తంగెడు

పువ్వయినను దొంగిలంగబోకు కుమారా.  (99)

 

11 దొంగతనము కూడని పని అని ప్రబోధం

 

బడిలోని బలపమైనను

గుడి లోపలి తులసి తోటకూరాకైనన్

దడి కందిపుల్లలైనను

తడబడకను దొంగిలించ దగదు కుమారా. (93)

 

 

ఇందులో కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పబడ్డాయి.  అయితే అందులో కొన్ని ఈ రోజుకు అతిగా అనిపిస్తాయి.  పిల్లల మీద అతి నియంత్రణ కూడదనిపించేలా ఉంటాయి.  అయితే అప్పుడప్పుడు మనం కూడా ఇలాంటి మాటలు యథాలాపంగా అంటూ వుంటాం.  అయితే పిల్లల భద్రత కోరి చెప్పిన మాటలే అవన్నీ.  వాటిని పిల్లల సాహసకృత్యాలను నిషేధించడంగా వారి బాల్యపు ఉత్సాహాన్ని అణచివేయడంగా భావించకూడదు. మచ్చుకు కొన్ని.

 

బావులను దొంగి చూడకు

మావుల దొడ్లోకి బోయి యాటాడకుమీ

త్రోవను నెగురుచు బోవకు

మావల మోసంబు వచ్చు నయ్య కుమారా.  (29)

 

ఎండల  వానలలోపల

కొండల వాగులకు జెరువు కోనేళ్లకు బో

కుండుము కాల్జారిన నొ

క్కండయినను లేవదియ్య గలడె కుమారా.  (32)

 

అయ్యలు వలదని చెప్పిన

గొయ్యలు వ్రేలాడు చెట్టు గొమ్మలతోనే

యుయ్యాలలూగ బ్రోకుము

చెయ్యో కాలో విరుగంజేయు కుమారా.  (71) 

 

ఇంకా,

ఇతరుల యెంగిలి యన్నము

గతుకంగా బోకు వారిగల రోగము నీ

కతుకును మూతికి గావున

సతతము బండైన జీక జనదు కుమారా (16)

 

అని ఆరోగ్యపరంగా చేసిన నాటి ప్రబోధాన్ని నేటి అత్యాధునిక సోషలిస్టులు పిల్లల నడుమ పంచుకుని తినడమనే సద్గుణాన్ని నిషేధించడంగా నిందిస్తూ రచ్చ చేసి ఈ పుస్తకాన్ని నిషేధించాలన్నా నేను ఆశ్చర్యపోను.

 

చంద్రునిలో చిన్న చిన్న మచ్చలున్నంత మాత్రాన చందమామను ఇష్టపడని వారుంటారా?  అలాగే ఈ కుమారశతకము కూడా.  కుండినసీమలో ఫిరంగిపురవాసి అయిన కరణం బొల్లయ్యామాత్యుని కొడుకునైన చిల్కా వేంకటకృష్ణుడనే పేరు కలిగిన నేను ఈ కుమారశతకాన్ని వ్రాశాను అని రచయిత చెప్పుకున్నాడు.  గుంటూరు నరసరావు పేటల మధ్యలో ఉండే ఫిరంగిపురమే అయ్యుండవచ్చు.  ఆ ప్రాంతాన్ని పూర్వం కుండినసీమ అనే పేరుతో పిలిచేవారా?  తెలుగు నేలలో ఫిరంగిపురమనే ఊరు ఇంకెక్కడైనా ఉన్నట్టు నాకు తెలియదు.  మరొకటి ఉంటే చెప్పగలరు. క్రీస్తుశకం 20వ శతాబ్దంలో శార్వరీనామసంవత్సరంలో ఈ కుమారశతకం వ్రాయబడిందని రచయిత స్వయంగా తెలియజేశాడు.  ఇప్పుడు (2020-21) నడుస్తున్నది కూడా శార్వరీనామ  సంవత్సరమే.  అంటే  ఇప్పటికి 60 యేండ్ల ముందుగాని, 120 యేండ్ల ముందుగాని ఇది వ్రాయబడి ఉండాలి.  అంటే 1960-61 ప్రాంతంలో కాని, 1900-01 ప్రాంతంలోగాని ఇది వ్రాయబడి ఉండాలి.  కాని, 1934 నాటికే ఇది తెలుగుప్రాంతపు పాఠశాల పిల్లలకు ఒక అప్రూవ్డ్ పాఠ్యపుస్తకంగా ఉన్నది.  అంటే, ఇది 1900-01 సంవత్సరాలలో వ్రాయబడింది అని చెప్పవచ్చు.  (ఇరువదవశతాదిని – అనే పదం రచయిత ఉపయోగించాడు.)

 

వికీపీడియాలో కుమారశతకాన్ని గూర్చి వేరే విధమైన వివరాలు ఉన్నాయి.  కుమారశతకం సంస్కృతంలో భాస్కరరావు చేత వ్రాయబడిందని, దేవులపల్లి సుబ్బరాయశాస్త్రిచేత తెనిగింపబడిందని వ్రాసుకొచ్చారు.  మచ్చు తునకలు అంటూ అందులో రెండు పద్యాలు కూడా ఇచ్చారు.  అవి నేను చెప్పిన కుమారశతకంలో లేవు. ఈ కారణాల వల్ల, వికీపీడియాలో వ్రాయబడ్డ కుమారశతకం వేరు, నేను పేర్కొన్నటువంటి కుమారశతకం వేరు అని స్పష్టంగా చెప్పవచ్చు.

 

ఈ రెండూ కాకుండా గుంటూరు జిల్లా సాతులూరు గ్రామవాసి అయిన మునగపాటి చినహనుమయ్య చేత రచింపబడి, 1925లో ముద్రింపబడిన కుమారశతకం మరొకటి ఉన్నది.  ఇది తెలుగులో వ్రాయబడినప్పటికీ, ఇందులో సంస్కృతశబ్దావళి ఎక్కువగా ఉన్నది.

 

ఈ మూడూ కాకుండా, ప్రక్కి కులోద్భవుడైన అప్పల నరసింహుని చేత 1860, రౌద్రినామసంవత్సరంలో వ్రాయబడి, భాగవతుల దక్షిణాముర్తిగారిచేత టీకాతాత్పర్యాలు వ్రాయబడి, యం.యస్ శర్మ అండ్ కో (గుంటూరు-తెనాలి) వారి చేత  1935లో ముద్రింపబడిన కుమారశతకం వేరొకటున్నది.  ఇందులో కూడా సంస్కృతశబ్దగుంఫనం ఎక్కువే.

 

మరి, ఈ విధంగా నాలుగు కుమారశతకాలుండగా చిల్కా వేంకటకృష్ణుడు వ్రాసినదే పాఠశాల పిల్లలకు అప్రూవ్డ్ కాబడిందని ఎలా చెప్పావు అని అడుగుతారా?   ఖచ్చితంగా ఆ నాలుగింటిలో ఇదే అప్రూవుడు అని నేను చెప్పలేను గాని, ఇందులో పసి బిడ్డల కోసం, పెద్దగా చదువుకోని పెద్దలకోసం నేను తేలికైన తెలుగును వాడాను, అందువల్ల సభలలోగాని, బాగా చదువుకున్నవారు గాని, తేలికగా తీసిపారవేయవద్దు అని వేంకటకృష్ణుడు చెప్పిన మాటలు నచ్చాయి. 

చదివిన పెద్దలు సభవా

రిది తేలిక తెలుగటంచు నెంచగవలదీ

చదివెడి పసిబిడ్డలకును

జదువని పెద్దలకు దెలియు సరళి కుమారా.  (4)

 

సామాన్యబాలురకోసం వ్రాయబడినా, అతడు వారిని రాజకుమారా అని సంబోధించడం ఇంకా బాగా నచ్చింది.  అటువంటి వేంకటకృష్ణుని పట్ల నాది పూర్తిగా పక్షపాతం.  100% నిజం.  అందువల్ల, నేను ఇప్పుడు విద్యాశాఖామంత్రినై యుంటే గనుక, ఈ వేంకటకృష్ణుని శతకాన్నే ఒకటవ తరగతి నుండి పిల్లలకు కంఠస్థం చేయించాలని ఆదేశాలు జారీచేసి ఉండేవాడిని. 

 

సరే, తిరుపతికి వచ్చినపుడు గోవిందరాజస్వామి గుడిదగ్గర గాని, శ్రీకాళహస్తీశ్వరుని గుడికి దక్షిణగోపురం దగ్గర గాని కనిపించే చిన్న పుస్తకాల అంగళ్లలో ఈ కుమారశతకాలు దొరికే అవకాశాలు ఉన్నాయి.  ప్రయత్నించండి.  నేను కొన్న వేంకటకృష్ణుని పుస్తకం శ్రీకాళహస్తిలో దొరికింది.

 

ఏదేమైనా, అన్నిటికంటె ఇందులో నాకు నచ్చిన ప్రబోధం మాత్రం ఈ క్రిందిది.  ఇదుగో ఆ పద్యం.

 

అదలించిన బెదరించిన

పద పద యని నిన్ను క్రింద బడ ద్రోసిన నీ

వదరక బెదరక నిజమును

వదలకురా నీకు మేలు వచ్చు గుమారా.  (97)

 

నేటి పరిస్థితులలో భారతీయులు ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అలవరచుకొనవలసిన సద్గుణం ఇది.  ఈ ప్రబోధాన్ని మనసుకెక్కించుకుని ఆ విధంగా ప్రవర్తించగలిగితేనే భారతీయులు మనుగడను కొనసాగిస్తారు.  లేదా  అంతరించిపోవలసిందే. 

 

ఇది కుమారశతకం కాబట్టి, బాలురకే ఎక్కువ ప్రబోధం జరిగింది.  బాలికలకు ప్రత్యేకంగా వేంకటనరసింహకవీంద్రుడు వ్రాసిన కుమారీశతకం వేరే ఉన్నది.  దానిలో విషయాలను మరెప్పుడైనా చూద్దాం.

 

 


సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...