అక్బరు ఫతేపూర్ సిక్రీని కట్టించెను, సలీం అనార్కలిని ప్రేమించెను, షాజహాను తాజమహలును కట్టించెను అంటే రకరకాల పరీక్షల్లో మార్కుల కోసం వాటిని గుర్తు పెట్టుకుని వారు చాలా ఘనులు అనుకుంటాం. కాని, మన ప్రాంతాలలోనే ఫలానా జమీందారు లేదా ఫలానా పాలెగాడు బావులు త్రవ్వించెను, వాపీకూపతటాకాలు నిర్మించెను అని నిజమైన చరిత్రను చెప్పేవారు కూడా లేరు. మనకు సంబంధించి జమీందార్లు పాలెగాళ్లు దోపిడీదారులు ముఠానాయకులు మాత్రమే. వాళ్ల బూర్జువా గుర్తులు కూడా మిగలడానికి వీల్లేదు పూడ్చేయండిరా, ఆక్రమించండిరా అంటూ వాటిని దుంపనాశనం చేశాం.
ఫలానా శెట్టి ప్రయాణికులు తల దాచుకొనేందుకు తమ తల్లిదండ్రుల పేరిట సత్రాలు మండపాలు కట్టించెను అని ఎక్కడైనా వింటే కోటికి పడగలెత్తిన ఆ శెట్టి బీదవాళ్లను దోచి సంపాదించినదేలే (???) అంటూ వాళ్ల ఔదార్యాన్ని తీసి పడేశాం. ఏ మండపాల క్రింద ఏ నిధులు దాచారో అంటూ దొంగలు వాటిని తవ్వేసుకుని పోతే, ఆ మిగిలిన స్తంభాలను రాళ్లను కూడా ఇంకెవడో ఎత్తుకుపోయి అమ్ముకుంటే మనకు చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు.
విలాసవంతమైన మన బైకుల్లో కార్లల్లో బస్సుల్లో ఎంత దూరమైనా అలసట లేకుండా పోగలం కాబట్టి మనకు చెట్ల నీడ అవసరం లేదు.
మధ్యాహ్నాల పూట, రాత్రి వేళల్లోనూ కూడా మనం ఆగకుండా ప్రయాణం చేయగలం కాబట్టి సత్రాల అవసరం మండపాల అవసరం లేదు.
మనవి ఏసీ వాహనాలు కాబట్టి, అలసిపోవడానికి అవకాశమే లేదు, తినడానికి కూడా ఎక్కడా ఆగనవసరం లేదు, ఒక బాటిల్లో లీటరు నీరు పూర్తిగా అయిపోయే సమయానికి మనం మన ఊరికి చేరుకోగలం కాబట్టి దారిలో ఎన్ని బావులు పూడిపోయినా మనకేం నష్టం లేదు.
ఎందుకంటే మనం అతివేగవంతమైన తరానికి చెందినవారం అంటూ కాలర్లెగరేశాం.
చివరికి మన వేగం ఎంతవరకు వచ్చింది? ఈ రోజు వలస కార్మికులు తమ కుటుంబాలతో సహా సుదీర్ఘగమ్యాలకు నడుచుకుపోతూ ఉన్నపుడు దారుల వెంబడి చెట్లు, బావులు, మండపాలు ఉండి ఉంటే వారు ఇంతటి శ్రమ పడేవారు కాదు కదా అన్న ఆలోచన ఎంతమందికి వచ్చింది?
మన చరిత్రను మనమే ఈసడించుకున్నాం. ఎవడు బడితే వాడు దానితో ఆడుకుంటూ ఇష్టం వచ్చినట్టు మార్చివేస్తూ మన మహారాజులను బూజులంటే ఆహా ఓహో అన్నాం. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్న మన పూర్వపు పరిపాలకులను కూడా పరిపాలన చేతగాదు అని, నిజానికి పరమకర్కోటకులైన విదేశీపాలకుల చరిత్రను కప్పిపుచ్చుతూ వారే లేకపోతే మన దేశానికి ఒక సాంస్కృతికమైన గుర్తింపు లేదు అని ఎవడో అంటే ′′చూశావా ఈ ఎవడోగాడొచ్చి చెప్పకపోతే మనకు నిజాలు ఎలా తెలిసేవి′′ అని నిట్టూర్చాం.
మన సంస్కృతిని మనమే చాదస్తం అంటూ అపహాస్యం చేసుకున్నాం. మన పూర్వికులలో ధనవంతులైనవారి ఔదార్యాన్ని మనమే ఎగతాళి చేసుకున్నాం. వారి ఘనకార్యాలను అబద్ధాలన్నాం. వారి గుర్తులన్నీ చెరిపివేయబడుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాం.
పేదవారికి డబ్బులు పంచేది మాత్రమే సంక్షేమప్రభుత్వమని అభిమానులందరం జేజేలు కొడుతూ ఆయా ప్రభుత్వాలను నెత్తికెత్తుకున్నాం. అంతేగాని, ఆ పేదవారికి శాశ్వతలాభదాయకమైన పథకాలు ప్రవేశపెట్టరేం అని ఎన్నడూ మనం అడగనే అడగలేదు.
ఇలా మన పూర్వికులనుండి మనకు వారసత్వంగా రావలసిన క్రియాశీలత్వం, ఔదార్యం, సమయస్ఫూర్తి మొదలైన గుణాలన్నిటినీ పాక్షికంగా పోగొట్టుకుని, ఇప్పుడిదేదో హఠాత్తుగా వచ్చిపడిన సమస్య అన్నట్టు వలసకార్మికుల కష్టాలను చూసి కన్నీళ్లను కార్చేస్తూ ఎవరెవరికో శాపనార్థాలను పెడుతున్నాం.
అన్నిటికీ మూలకారణం మన అలసత్వమే. మన నిర్లక్ష్యమే. మన ఆత్మవిశ్వాసలోపమే. మన అవగాహనారాహిత్యమే. మన స్వార్థమే.
ఎవరెవర్నో తిట్టడం వలన లాభం లేదు. ఇప్పటికి వారిని చేతనైన విధంగా ఆదుకుందాం.
కేవలం కూటికోసం వలసపోవలసిన అవసరం లేని పాలనను అందించగలిగిన ప్రణాళికలను వేసే ప్రభుత్వాలను మాత్రమే ఇకపై ఎన్నుకుందాం.
No comments:
Post a Comment