క్రొత్త పెళ్లికొడుకైన తన కుమారుడు గుళ్లను కళ్లారా చూసుకుని మురిసిపోయాడు దేవయ్య. ఆ సందర్భంలో కొడుకుకు నాలుగు మంచి మాటలను చెప్పాలనిపించింది అతడికి.
గుళ్ళకు తండ్రి దేవయ్య సందేశం |
“గుళ్ళా! ఇంత వరకు ఒంటివాడివి. ఇప్పుడు పెండ్లి చేసుకుని గృహస్థుడవై బాధ్యతను తలకెత్తుకున్నావు. ఇకపై దుడుకుతనం తగ్గించుకో. డబ్బు సంపాదించడం కోసం ఎప్పుడూ ధర్మాన్ని తప్పి ప్రవర్తించకు. నీకు శివయ్య ఇచ్చినదాన్ని నలుగురితో కలిసి పంచుకో. ఊరిలో జనాలతో పొందికను పరస్పరవిశ్వాసాన్ని కలిగి బ్రతుకు” అని ఉపదేశించాడు.
అత్తారింటికి పోబోతున్న పెండ్లికూతురుకు హితబోధలు చేయడం చూశాం గాని, ఇలా పెండ్లికొడుకుకు హితబోధలు చేయడం ఎక్కడైనా చూశామా?
బూతయ్య మరణశయ్య మీద ఉన్నాడు. తన ప్రాణాలు పోనున్నాయి అని గ్రహించాడు. ఆ సమయంలోనైనా దేవుని మనసారా స్మరించుకోలేకపోయాడు. తన కుమారుడైన అయ్యును పిలిచి, అతడికి అప్పజెప్పవలసింది అప్పజెప్పి, చెప్పవలసింది చెప్పాడు.
అయ్యుకు బూతయ్య సందేశం |
“నమ్మవద్దు. ఊరిలో ఎవ్వరినీ నమ్మవద్దు. అందరూ దొంగలే. రైతులను పట్ల జాలిపడితే ఆరునెలలు పాపం చుట్టుకుంటుంది. నిప్పు లేనిదే వెన్న కరగదు. అలాగే వేడి తగిలితే గాని రైతు లొంగిరారు. వారిని తిడుతూ ఉంటేనే జేబులో చెయ్యిపెట్టి డబ్బు తీసి ఇస్తారు. మనం మంచి మాటలు మాట్లాడితే ఆ పైసలు తన జేబులోనికే జారవిడుచుకుంటాడు. గుర్తుంచుకో” అని బూతయ్య బోధ. “ఆ దేవయ్య ఇల్లొకటే నాకు పక్కలో ముల్లులా ఉంది. దానిమీద ఎప్పుడూ ఒక కన్ను వేసుంచు. అతడు రాసిచ్చిన పత్రం ఉంది. సమయం వచ్చినపుడు దాన్ని ఉపయోగించుకో” అని తన చివరి కోరికను కూడా వెలిబుచ్చి ప్రాణం వదిలాడు.
బూతయ్యన మగ అయ్యు అనే ఒక కన్నడ చిత్రంలోని రెండు సన్నివేశాలివి. బూతయ్య కుమారుడు అయ్యు అని అర్థం.
అనగా అనగా కన్నడనాట ఒక ఊరు. పేరు యానళ్లి.
ఆ ఊరిలో మహా ధనవంతుడైన పరమ క్రూరుడైన ఒక పిసినారి. అతని పేరు బూతయ్య. ఎంతటి పిసినారి అంటే దేవునికోసం వెలిగించిన అగరువత్తిని తన పూజ పూర్తి కాగానే ఆపేస్తాడు. తన విరిగిన పోయిన కళ్లద్దాలను దారం పెట్టి కట్టుకుని వాడుతుంటాడు. అమాయికులైన గ్రామప్రజల ఆస్తులను తాకట్టు పెట్టుకుని అప్పులిచ్చి, చివరకు వాటిని స్వాధీనం చేసుకుంటూ ఉంటాడు. గ్రామస్థుల ఆస్తులలో తన కంటపడి నచ్చినదెల్లా తన స్వంతం చేసుకొనేందుకు ఎంతకైనా తెగించేవాడు. పచ్చి బాలింతలనైనా వదిలి పెట్టకుండా వెళ్లగొట్టి ఇల్లు స్వాధీనం చేసుకునే తెంపరి. చాకలివాని గాడిదలను కూడా స్వాధీనం చేసుకొని వాని పొట్టగొట్టే నిర్దయుడు.
తన చెప్పులు కుట్టేవానికి కాసు ఇవ్వకపోగా, తన చెట్టు క్రింద కూర్చుని పని చేసి సంపాదించుకుంటున్నందుకుగాను అతడే తనకు కాసులు చెల్లించాలనే వాదం చేసేవాడు.
బైరన్న అనే పేదరైతు ఉన్నాడు. ఒకానొక సందర్భంలో బూతయ్యకు అతడి ఎద్దులమీద కన్నుపడింది. ఒక రాత్రిపూట బైరన్న ఆదమరచి నిద్రపోతూండగా బూతయ్య ఆ ఎద్దులను విప్పుకుని తోలుకుపోయాడు. తరువాత ఆ విషయం తెలుసుకుని బైరన్న కొడవలి తీసుకుని బూతయ్యమీదకు దండెత్తి వచ్చాడు. బూతయ్యను బాగా తన్నాడు. ఆ కక్షతో బూతయ్య బైరన్న ఇంటికి మరుసటి రాత్రి నిప్పు పెట్టి తగలబెట్టాడు. బైరన్న తప్పించుకొనడం కేవలం అతడు చేసుకున్న అదృష్టం.
బూతయ్యను ఆకర్షించిన బైరన్న ఎడ్లు |
బూతయ్య ధనదాహానికి కేవలం గ్రామస్థులే కాదు, అతని బంధువులు కూడా బలయ్యేవారు. తన కోడలు మూడు సంవత్సరాల తరువాత తనను చూడవచ్చిన అన్నకు భోజనం పెడుతూ ఉంటే సహించలేక, అతడు కూర్చున్న విస్తరిని విడిచి పోయేంతవరకు అతడిని మాటలతో చిత్రహింసలు పెట్టేశాడు. అటువంటి బూతయ్య తాత అంటే అతడి మనుమడికి మనువరాలికి కూడా హడలు. తాతను చూస్తే ఇంట్లో వేరే గదిలోనికి పారిపోయేవారు.
తన కోడలి అన్నను దుర్భాషలాడుతున్న బూతయ్య |
గ్రామంలో ఎవరైనా తనకు ఎదురు తిరిగితే అతడిని రహస్యంగా మట్టుబెట్టనిదే అతడికి నిద్ర పట్టదు. పరమకర్కోటకుడైన తనకు ఆ గ్రామమంతా శత్రువులే కాబట్టి తన రక్షణకోసం నడుముకు కట్టుకునే తోలు బెల్టుకు ఎప్పుడూ గుళ్లు లోడై వుండే ఒక లైసెన్సుడు పిస్తోలు ఉండేది. .
ఊరు ఊరంతా బూతయ్యను ద్వేషిస్తూ ఉంటుంది. బూతయ్యకు బంధువైన సింగ్లయ్యకైతే బూతయ్య వంశాన్ని నిర్వంశం చేయాలన్నంత పగ. బూతయ్యకు చేరువగా ఉంటూ అతడు మరిన్ని తప్పుడు పనులు చేసేందుకు ప్రోత్సహిస్తూ వెనుక మాత్రం గోతులు తవ్వుతూ ఉంటాడు.
అటువంటి బూతయ్య కుమారుడు అయ్యు. తండ్రివంటి దుర్మార్గుడు కానే కాదు. ఆత్మాభిమానం కలిగినవాడు. మానవసహజమైన ఈర్ష్య, క్రోధం వివిధకారణాల వలన అతడిలో కొంతకాలం బుసలు కొట్టినప్పటికీ, వివిధ ప్రతికూలపరిస్థితుల రీత్యా అతడు కొంతకాలం కఠినంగా వ్యవహరించినప్పటికీ, అతడిలోని సహజగుణాలైన దయ, ఉపకారగుణం తరువాత తరువాత సంఘటనలలో పాలనుండి పైకి తేలిన మీగడలా స్పష్టంగా కనిపిస్తాయి. అతడికి ఏటిలో ఈత కొట్టడం అభిమానవ్యాపకం. అతడివంటి గజ ఈతగాడు ఆ చుట్టుపక్కలే లేడని గ్రామస్థులు అతని గూర్చి అనుకుంటూ ఉంటారు.
గజ ఈతకాడు అయ్యు |
అదే గ్రామంలో ధర్మస్థళ మంజునాథుని భక్తుడైన దేవయ్య అనే ఒక సజ్జనుడు ఉన్నాడు. అతడు గ్రామస్థులందరితోనూ కలసి మెలసి బ్రతుకుతూ అవసరమైనవారికి అవసరమైనపుడు తనకు చేతనైన సహాయం చేస్తూ ఉండేవాడు.
మంజునాథభక్తుడు దేవయ్య |
దేవయ్య కుమారుడే గుళ్ళ. చాల అభిమానవంతుడు. రోషగాడు. పంతం పడితే విడువని వాడు. అయినప్పటికీ బోలా మనిషి. నిజాయితీపరుడు. గ్రామప్రజలందరినీ కూడగట్టగల నాయకత్వలక్షణాలు మెండుగా కలిగిన చురుకైన యువకుడు.
రోషగాడు గుళ్ళ |
బూతయ్య కుమారుడైన అయ్యుకు, దేవయ్య కుమారుడైన గుళ్ళ నాయకత్వంలోని గ్రామప్రజలకు నడుమ జరిగిన ప్రాణాంతకమనిపించే సంఘర్షణమే ఈ చిత్రకథ.
1970 దశకంలోని కథ ఇది. అప్పటి నైఋతికర్ణాటకగ్రామవాతావరణం చిత్రంలోని ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తూ ఉంటుంది. మనుషులు తలపాగాలు, పంచెకట్లు, పిలకలు, చెవిదుద్దులతో విరివిగా కనిపిస్తారు. పెంకుటిండ్లు, కంబాల ఇండ్లు, కనిపిస్తాయి. కరెంటు లేని ఇండ్లు, లాంతరు దీపాలు కనిపిస్తాయి. ధాన్యం బస్తాలు, మొక్కజొన్న కండెలు ఇంటిలో ఒక మూలన కుప్ప పోసి ఉండటం, కనిపిస్తాయి. రైతుల ఇండ్లలో వ్యవసాయపు పనిముట్లు కనిపిస్తాయి. నూనె గానుగ కనిపిస్తుంది. కాస్త కలిగిన వారి ఇండ్లలో గోడలమీద ఫ్రేములు కట్టిన దేవుళ్ల పటాలు, పెద్దల పటాలు కనిపిస్తూ ఉంటాయి. బల్లలు, కుర్చీలు అన్నీ చెక్కతో చేసినవే కనిపిస్తూ ఉంటాయి. ఫోన్లూ ప్లాస్టిక్ వస్తువులూ లేని కాలమది!
రైతులు తమ కృషిసంస్కృతిననుసరించి వేసుకున్న పండ్ల తోటలు కనిపిస్తాయి. పశువుల స్వేచ్ఛాసంచారం కనిపిస్తుంది. ఆవులను పోషించుకుంటూ వాటి పాలతో బ్రతుకు గడిపే మనుషులు కనిపిస్తారు. మేకపిల్లలను భుజాన వేసుకుని గెంతే పిల్లలు కనిపిస్తారు. ఉత్సాహంతో జరుపుకునే ఊరుమ్మడి ఎడ్ల పందేలు కనిపిస్తాయి. టెంకాయ కొట్టి పనులు ప్రారంభించే ఆచారం కనిపిస్తుంది. తప్పెట కొట్టి చాటింపు వేయడాలు ఉంటాయి. తప్పెట కొట్టేవాడిన చుట్టూ పిల్లలు గుమిగూడి సరదాగా నడవడం కనిపిస్తుంది. ఆ పిల్లలందరూ కలసి వీధుల్లోనే రకరకాల ఆటలాడుకొనడం కనిపిస్తుంది.
అనేక రకాల మనస్తత్త్వాలు ప్రవర్తనలు కలిగిన మనుషులు మనకు ఆ గ్రామంలో కనిపిస్తూ ఉంటారు.
ఆ చెప్పులు కుట్టే మనిషికి ఉప్పినకాయ (ఊరగాయ) తినాలని చాల ఆశగా ఉంటుంది. ఇవ్వడని తెలిసినప్పటికీ, ఏమో, ఏ క్షణంలో అతడి మనసులో కరుణ పుట్టి తనకు ఎంతో కొంత ఇవ్వకపోతాడాని అతడు బూతయ్యను కొంత ఉప్పినకాయ ఇవ్వమని అడిగి బంగపోతూ ఉంటాడు.
బూతయ్యను ఉప్పినకాయ అడుగుతున్న దృశ్యం |
పెళ్లాం కన్నెర్ర జేస్తే భయపడే ఒక మొగుడుంటాడు. భంగు తాగుదాం రమ్మని పిలిచే జతగాడి పిలుపు మేరకు పెండ్లాంకు తెలియకుండా ఆమె ఉట్టికుండలో దాచుకున్న డబ్బులను దొంగిలించేందుకు ప్రయత్నిస్తాడు. తన మొగుడిని జత చేసుకుని చెడ్డ అలవాట్లపాలు చేసిన అతడి స్నేహితుడిని మాటలతో చెడామడా వాయించే ఇల్లాలు ఉంటుంది. “ఏమయ్యోవ్, బీడీ తాగే నా మొగుడికి భంగు అలవాటు చేసింది నువ్వు కాదా అంటుంది. అయితే ఆ మాటల్లో కూడా కాస్త జాలి దయ ఉంటాయి. పాలూ గీలూ కావాలంటే మా ఇంటికొచ్చి తాగేసి పో. అంతే గాని భంగు త్రాగడానికి నా మొగుడిని వెంటేసుకుని పోతే సహించేది లేదు” అని హెచ్చరిస్తుంది.
భార్య డబ్బును దొంగిలించబోయిన భర్త |
స్నేహితుల పిల్లలు కనబడితే వారిని అంగడికి తీసుకుపోయి వారికి నచ్చిన బూరలు, మిఠాయిలు కొనిచ్చి ఆనందపడే మనుషుల మనస్తత్త్వం మనలను కూడా ఆనందపరుస్తుంది.
గిరిజక్క పిల్లలకు అంగడిలో బూరలు మిఠాయిలు కొంటున్న మాదేవి |
గ్రామాలన్నాక పోటీలుంటాయి. పోటీలలో ఆవేశకావేశాలకు లోనయ్యే మనుషులుంటారు. ఎవరు గెలుస్తారనే విచారమే లేకుండా కేవలం పోటీపడడంలోని మజాను ఆనందించి అనుభవించేవారుంటారు. తాను కాకుండా వేరొకరు గెలిచారనే అసూయాపరులు ఉంటారు. తమకు నచ్చిన వ్యక్తి గెలిచాడని కాకుండా తమకు నచ్చని వ్యక్తి ఓడిపోయినందుకు సంతోషపడే జనాలు ఉంటారు.
ఈ చిత్రంలో ఎడ్లపోటీల చిత్రీకరణ ఒక విశేషం.
ఎడ్ల పందేలు |
విశాలమైన మైదానంలో ఎడ్ల పోటీలు ప్రారంభమయ్యే ముందు పోటీదారులలో గెలవాలనే పట్టుదలను ప్రతిఫలించేలా ఢమఢమమంటూ డోలువాయిద్యాల శబ్దాలను వినిపించిన సంగీతదర్శకుడు పోటీలు జరుగుతూ ఉండగా కొంతసేపు సహజశబ్దాలను వినిపించాడు. పోటీదారుల కోలాహలం, ఎద్దులు లాగుతూ ఉండగా కర్రలు నేలకు రాసుకుంటూ వినిపించే బరబరశబ్దాలు, ఎద్దుల మెడలలోని గంటల శబ్దాలు, ఏయ్ ఏయ్ ఓయ్ ఓయ్ అంటూ ఎద్దులను అదిలించే శబ్దాలు, ప్రమాదాలు జరిగినపుడు జనాలు చేసే హాహాకారాలు వినిపిస్తుంటాయి. చిన్న ఎడ్లు, పెద్ద ఎడ్లు, తెల్ల ఎడ్లు, నల్ల ఎడ్లు, మచ్చల ఎడ్లు, అదుపు తప్పే ఎడ్లు, మొండికేసే ఎడ్లు, తప్పించుకు పోయే ఎడ్లు, క్రిందపడిపోయే పోటీదారులు, క్రిందపడ్డాక జారిపోయిన తమ తలపాగాలను పట్టించుకోకుండా తమ ఎద్దులను మరలా చిక్కించుకుని పోటీలో కొనసాగేందుకు కాలిసత్తువ కొద్దీ పరుగెత్తి ప్రయత్నించేవారు, కొంతరు క్రిందపడినపుడు కాలు తాడుకు తగులుకుంటే ఎద్దులు ఆగకుండా ఆ మనుషులను అలాగే లాగుకుపోయే దృశ్యాలు – ఇవన్నీ చూస్తుంటే మనం కూడా అక్కడే ప్రత్యక్షంగా ఉండి చూస్తున్నామేమో అనిపిస్తుంది. అల్లాటప్పా పోటీదారులు పడిపోయిన తరువాత, తొలగిపోయిన తరువాత, వెనుకబడిపోయిన తరువాత తీవ్రమైన పోటీదారులు మాత్రమే మిగిలిన తరువాత, గెలిచి తీరాలనే వారి పంతాన్ని తెగువను సూచిస్తున్నట్టు మరలా సంగీతం ప్రారంభమై మన ఉత్కంఠను పెంచుతుంది. దారి పక్కన ఇరువైపులా జనాలు తమ చేతులను, చేతులలోని తుండుగుడ్డలను, ఛత్రీలను ఊపుతూ, ఎగురుతూ కేరింతలు కొడుతూ పోటీదారులను ఉత్సాహాన్ని పెంచుతుంటారు. చివరకు గెలిచిన మనిషిని గ్రామప్రజలు కరతాడధ్వనులతో అభినందిస్తారు. పూలమాలలు వేస్తారు. భుజాలమీదకెక్కించుకుని మోస్తారు.
ఎడ్ల పందేలలో గెలిచిన గుళ్ళ తన తండ్రి మొక్కు చెల్లించేందుకు ధర్మస్థళం వెడతాడు. అదే సమయంలో అయ్యు కూడా పత్నీపుత్రసమేతంగా మంజునాథదర్శనం కోసం వెళ్తాడు. ఆ విధంగా గ్రామంలో వారిద్దరూ లేని సమయంలో గ్రామంలో జరిగిన ఒకానొక సంఘటన, రాబోయే కాలంలో వారిద్దరి నడుమ తీవ్రమైన శత్రుత్వం పెరిగేందుకు బీజమౌతుంది.
ఊరిలో బూతయ్య వద్ద అప్పు చేసిన దొడ్డశెట్టి అనే ఒక వ్యక్తి మరణిస్తాడు. తన కొడుకు (సణ్ణశెట్టి) పెండ్లి కోసం అప్పు తీర్చకుండా ఆ వ్యక్తి శవానికి అంత్యక్రియలు జరగడానికి వీల్లేదని బూతయ్య అడ్డుపడతాడు. అప్పు తీర్చమని బలవంతం చేసేందుకు ఇది సమయం కాదని దేవయ్య బూతయ్యకు నచ్చజెప్పబోతాడు. అయితే ఆ అప్పును తీరుస్తానని నువు నాకు పత్రం రాసిస్తావా అంటాడు బూతయ్య. దేవయ్యకు ఏమి సంబంధం, నేనే పత్రం రాసిస్తాను అంటాడు మరణించిన వ్యక్తి కుమారుడు. గతిలేని నువ్వు నాకు రాసిచ్చే పత్రానికి విలువ లేదంటాడు బూతయ్య. గత్యంతరం లేని పరిస్థితులలో దొడ్డశెట్టి కుమారుని తరపున హామీపత్రం (గ్యారంటీపత్రం) రాసిచ్చేందుకు దేవయ్య ఒప్పుకుంటాడు. అప్పటికి గాని శవాన్ని కదలనివ్వలేదు బూతయ్య. అలా శవయాత్ర మొదలైందో లేదో, ఇలా దేవయ్య చేత పత్రం రాయించుకుంటాడు. ఇంతవరకూ ఈ గ్రామంలో బూతయ్య బారిన పడకుండా ఉన్నది దేవయ్య ఒక్కడే, ఇప్పుడు అతడు కూడా ఆ భూతానికి చిక్కిపోయాడే అని సింగ్లయ్య జరగబోయే ఘోరాన్ని స్వగతంగా ప్రేక్షకులకు సూచిస్తాడు.
నా అప్పు తీర్చి శవాన్ని తీసుకుపొండని నిలేసిన బూతయ్య |
సరే, వీరం అంగిరసంగా, బీభత్సం, రౌద్రం, భయానకం అంగరసాలుగా ఉన్న ఈ చిత్రంలో కొద్దిపాటి హాస్యం శృంగారం కూడా తళుక్కుమంటాయి.
పెండ్లామే
పోషించాలి మరి! పెండ్లామే
పసులను పోషించి, పాలు పితికి, అమ్మి, డబ్బులు పోగుజేసి మొగుడికి ఇంత బువ్వ పెట్టి
కడుపు నింపాలి. కాని, ఆ మొగుడేమో పెండ్లాం
ఊరికిపోతే ఆ పసుల పాలు పితకడానికి కూడా చేతగాని దద్దమ్మ. పాలు పితకబోతే ఆవు చాచి తంతుంది. అందుకని, పరిష్కారమార్గం ఆలోచించి ఆలోచించి అతగాడు
పెండ్లాం చీర కట్టుకుని పాలు పితకబోతాడు. పాపం
ఆవు కూడా మోసపోయి పాలివ్వడం మొదలు పెడుతుంది.
ఈలోగా అతని మిత్రుడు అది చూసి పరిహసిస్తాడు. వాళ్లిద్దరి మాటల్లో నిజాన్ని గ్రహించిన ఆవు
మళ్లీ చాచి ఒక్కటి తన్నగానే ఆ మొగుడితో పాటు పితికిన పాలన్నీ నేలబడతాయి.
పెండ్లాం చీర కట్టి పాలు పితుకుతున్న భర్త |
ధర్మస్థళంలో అనుకోకుండా ఒకరికొకరు తారసపడిన గుళ్ళ, మాదేవి (మహాదేవి)ల నడుమ చిగురించిన తొలిచూపు ప్రేమ, దాన్ని ఒండొరులకు వ్యక్తం చేసుకొనేందుకు వారు పడిన పాట్లు చిరునవ్వు తెప్పిస్తాయి. తన భర్త అయ్యుతో కలసి తీర్థయాత్రకు వచ్చిన గిరిజక్క అక్కడ తనకు కనిపించిన తన స్నేహితురాలైన మాదేవికి తగిన వరుడు తమ ఊరిలోనే ఉన్నాడని చెప్పడం, ఆమె అతడిని పెళ్లి చేసుకుని, తమ ఊరికి వస్తే మరలా తమ స్నేహబంధం శాశ్వతంగా కొనసాగుతుందని ఆశపడడం మనసును కరిగిస్తుంది. మావూళ్లో ఎవరబ్బా మీ మాదేవికి తగిన వరుడు అని అయ్యు అడిగితే ఇంకెవరు, దేవయ్యగారబ్బాయి గుళ్ళ ఉన్నాడు కదా అంటుంది గిరిజ. అవునవును. వారి జోడీ చక్కగా ఉంటుంది అని అయ్యు కూడా సంతోషపడతాడు. ఈ సంఘటన అయ్యు గుళ్ళలకు నడుమ వ్యక్తిగతమైన పరస్పరవిరోధం అంతవరకూ ఏమీ లేదని స్పష్టం చేస్తుంది.
ధర్మస్థళంలో కలుసుకున్న స్నేహితురాళ్లు |
చివరకు తనను కలుసుకోవాలంటే ఏవూరికి రావాలో అన్యాపదేశంగా మాదేవి గుళ్ళకు సూచిస్తుంది.ఆ సూచనలను అనుసరించి గుళ్ళ మళెనాడులోని వారి ఊరికి పోతాడు. ఆ సందర్భంలో మళెనాడ హణ్ణ మైబణ్ణ అనే పాట కన్నడ పాటల శ్రోతలకు చెవులవిందును కలిగిస్తుంది. ఆ పాటలో మళెనాట తేయాకు తోటలు, పశ్చిమకనుమలు, కొండల నడుమ తేలాడే మేఘాలు, ఎక్కడో దిగువన కనిపించే నదులు, అక్కడకు ఎన్నడూ పోయి ఎరుగని జనాలకు చక్కగా చిత్రీకరించి చూపించాడు దర్శకుడు.
ఆ పాట లింకు ఇదుగో -
https://www.youtube.com/watch?v=aaLROE7cm5o
మొత్తానికి, అయ్యుగిరిజల మధ్యవర్తిత్వం వల్లనైతేనేమి, పెద్దల పరస్పరాంగీకారం వల్లనైతేనేమి, గుళ్ళ మాదేవిల ప్రేమ ఫలించి, పెళ్లికి దారి తీసింది. ఒక జంట కలిసింది. ఆ సందర్భంగా మళెనాట పెండ్లివేడుకల సంప్రదాయాన్ని కూడా దర్శకుడు చక్కగా చిత్రీకరించేశాడు.
నవవధూవరులు గుళ్ల, మాదేవి |
అలా పెండ్లి చేసుకున్న గుళ్ళకు తండ్రి దేవయ్య చేసిన ఉపదేశం పైన చూశాము.
ఇలా ఉండగా బైరన్న ఇంటిని కాల్చివేసిన తరువాత బూతయ్య పాపాలు పండి అతడికి పక్షవాతం వస్తుంది. అతడికి మరణం ఆసన్నమౌతుంది. అతడు కూడా మరణశయ్యపై తన కుమారుడైన అయ్యుకు తనదైన ఉపదేశం చేస్తాడు. అతడు తాను చేస్తున్నది హితబోధ అనుకున్నాడేమో తెలియదు. కాని, దేవయ్య తన కుమారునికి చేసిన బోధకు పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది బూతయ్య బోధ.
ఊరుమ్మడి శత్రువైన బూతయ్య శవాన్ని మోసేందుకు దేవయ్య తప్ప గ్రామస్థులు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు వచ్చారు కారు. సింగ్లయ్య ఎడ్లబండి తోలుతూ ఉండగా అయ్యు ముందు నడుస్తూ తండ్రి శవాన్ని తీసుకుపోతూ ఉంటే ఊరంతా శ్మశానంలా నిర్జనమైపోయింది. ఒక్కరు కూడా బయటకు వచ్చి అయ్యో అనలేదు. పైగా పీడ విరగడ అయిందని మెటికలు విరిచారు. బైరన్న థూ అని ఉమ్మేశాడు. ముసలివారు దుమ్మెత్తిపోశారు.
మరణించిన తన తండ్రి పట్ల గ్రామం ప్రవర్తించిన తీరు పట్ల అయ్యుకు క్రోధం చెలరేగింది. తనకు తన తండ్రి చేసిన బోధలో ఒక్క అక్షరం కూడా తప్పులేదనిపించింది. వెంటనే సణ్ణశెట్ఠి గానుగకు వెళ్లి, అతడి తండ్రి చేసిన అప్పును తీర్చమని అడిగాడు. ఇద్దరి మధ్య వాదోపవాదాలు చెలరేగాయి. దొంగపత్రాలు గింగపత్రాలు అంటే కోర్టుకు పోతాను అని అయ్యు బెదిరించాడు. ఏమి చేసుకుంటాలో చేసుకో పో అని సణ్ణశెట్టి ఎదురు తిరిగాడు. “ఏం చేయాలో నాకు తెలుసు, గ్యారంటీ పత్రం రాసిచ్చిన దేవయ్య చేతా డబ్బు కట్టిస్తాను, నీ చేత కూడా కట్టిస్తాను” అని అయ్యు హెచ్చరించాడు.
అప్పు చెల్లించమని సణ్ణశెట్టిని నిలేసిన అయ్యు |
ఇంతలో ఆ వైపు వచ్చిన గుళ్ళ మా నాన్న పేరెత్తి మాట్లాడుతున్నావేమోయ్ అని అడిగాడు. అతడికి తన తండ్రి రాసిచ్చిన పత్రం గూర్చి తెలియదు. అప్పుడు ఇద్దరి మధ్య వేడివేడిగా వాదోపవాదాలు నడిచాయి. మాటల వేడిలో మా డబ్బులు తిన్న పందులు మీరు అనేశాడు అయ్యు. ఊరిలో దిక్కులేని వాళ్ల డబ్బులను, మొగుడు చచ్చిన వాళ్ల డబ్బులను తిన్న ముండ్లపంది మీ నాన్న అని అయ్యుకు తీవ్రంగా బదులిచ్చాడు గుళ్ళ. కోపం తట్టుకోలేక అయ్యు గుళ్లపై చేయి చేసుకున్నాడు. గుళ్ళ ఎదురు తిరిగాడు. ఇద్దరూ చేతికందిన వస్తువులతో కొట్టుకున్నారు. సింగ్లయ్యతో సహా ఊరంతా వారి యుద్ధాన్ని చూసింది. అందరూ తమాషా చూశారే గాని, ఏ ఒక్కరూ వారిని వారించేందుకు ముందుకు రాలేదు.
చివరకు కాయకష్టం చేసి బ్రతుకుతూ బలిష్ఠుడైన గుళ్ళ ముందు అయ్యు నిలబడలేకపోయాడు. గుళ్ళ అయ్యు మెడమీద కాలు వేసి తొక్కసాగాడు. కాసేపుంటే అయ్యు చచ్చిపోతాడనే అనిపించింది. అయితే అయ్యు తన బెల్టుకు ఉన్న పిస్తోలును బయటకు తీసేసరికి గుళ్ల భయపడి వెనక్కు తగ్గాడు. అయితే సింగ్లయ్య అడ్డుపడి అయ్యును వారించాడు.
నిన్ను జైలుకు పంపి నీ చేత మన్ను మోయించకపోతే నా పేరు బూతయ్యన మగ అయ్యునే కాదు అన్నాడతడు. అది జరిగే లోపల నీ కత ముగించకపోతే నేను దేవయ్యన మగ గుళ్లనే కాదు అన్నాడితడు. ఆ యిరువురి ప్రతిజ్ఞలను ఊరంతా విన్నారు.
అయ్యు గుళ్ళల శపథాలు |
“పులిబిడ్డ పులిలాగానే బ్రతకాలి. ఎలుకలా బ్రతికితే ఊరంతా పిల్లై మింగేస్తుంది. పద మామా, లక్షలు ఖర్చైనా ఫరవాలేదు, ఆ గుళ్ల పొగరును అణగద్రొక్కాలి” అంటూ మరుసటి రోజు అయ్యు సింగ్లయ్యను పిలుచుకుని పట్నం బయలుదేరాడు.
తన స్నేహితురాలు మాదేవమ్మ భర్తకు, తన భర్తకు మధ్య బయలుదేరిన ఈ వైరం గిరిజకు చాల భయం కలిగించింది. భర్త కోపాన్ని శాంతపరచాలని ప్రయత్నించింది. “నువ్వే కాదు, చచ్చి స్వర్గంలో ఉన్న మా అప్ప వచ్చి చెప్పినా నేను ఈ విషయంలో వెనక్కు తగ్గను” అంటాడు అయ్యు.
ఈ విషయం తెలిసిన దేవయ్య అయ్యు ఇంటికి వచ్చి తన కొడుకు తప్పుకు తాను క్షమాపణలు వేడుకుంటాడు. “చౌకులో చావగొట్టి నాలుగ్గోడలమధ్య క్షమాపణలు వేడడం కుదరదని” అయ్యు తిరస్కరిస్తాడు. “నీ కొడుకును భూమిలో పాతిపెట్టేవరకు నేను విడిచిపెట్టేది” లేదు అని హుంకరిస్తాడు.
అప్పుడు దేవయ్య అన్న మాటలు మనసును కరిగిస్తాయి. “నీవు చిన్నవాడివి. అతడూ చిన్నవాడే. ఇద్దరూ ఒకే ఊరిలో పుట్టారు. ఒకే చెరువు నీరు త్రాగారు. ఒకే నేల మీద ఆడుకున్నారు. అలాంటి మీరు ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకొనడమేమిటి? ఉడుకు రక్తం వయసు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. శాంతించు అయ్యూ, కావాలంటే నీ కాళ్లు పట్టుకుంటాను” అంటూ అయ్యు కాళ్లు పట్టుకుంటాడు.
అయ్యు
విదిలించిపారేస్తాడు. ఇంతలో అక్కడకు వచ్చిన
గుళ్ళ జరిగినదాన్ని చూసి కోపోద్రిక్తుడై అయ్యును క్రిందపడేసి చావగొడతాడు. దేవయ్య తన కొడుకును చెంప పగులగొట్టి
పంపేస్తాడు. ఈ సంఘటనతో అయ్యు కోపం నేయి
పడిన అగ్నిలా ప్రజ్వరిల్లుతుంది.
సింగ్లయ్య అయ్యును వకీలు చెంతకు తీసుకుపోతాడు. నా ప్రాణాలు తీయడానికి వచ్చాడు అంటూ అయ్యూ గుళ్లమీద క్రిమినల్ కేసు, తన బాకీ తీర్చాలంటూ దేవయ్య మీద సివిల్ కేసు వేశాడు. అయ్యు పట్టుదలను గమనించిన లాయరు దండిగానే ఫీజును గుంజుతాడు. అందులో సింగ్లయ్యకు కూడా రహస్యమైన కమిషన్ ఉంటుంది.
లాయర్ నోటీసు వచ్చేసరికి దేవయ్య ఎంతగానో బాధపడతాడు. కాని, అటు గుళ్ళ కూడా పంతానికి పోతాడు. తాను కూడా ఒక లాయరును ఆశ్రయిస్తాడు. వద్దని చెప్పినా వినని కొడుకును ఆపలేక, చేసేదేమీ లేక, కేసు, కోర్టు, లాయరు ఇవేనప్పా రైతుల జీవితాన్ని పాడుజేసేవి అని దేవయ్య నిట్టూరుస్తాడు.
కోర్టులో తీవ్రమైన వాదోపవాదాలు జరుగుతాయి. కోర్టు ఖర్చులకు, లాయర్ ఫీజులకు మాదేవమ్మ తన ఒంటిమీద నగలన్నీ ఒలిచి గుళ్ళకు సమర్పిస్తుంది. తాను కూడబెట్టిన డబ్బునంతా దేవయ్య కొడుకుకు ఇస్తాడు. ఇంటిలో ఉండే పాత్రలను, పొలాన్ని కూడా గుళ్ళ అమ్ముకోవలసి వస్తుంది. అంతవరకు దేవయ్య ఇంటిలో సుఖంగా ఉండిన బంధువు ఒకామె తనను కూడా ఖర్చులకు డబ్బు అడుగుతారేమోననే భయంతో పెట్టే బేడా సర్దుకుని నిష్క్రమిస్తుంది. నగలు పోయినా బాధపడని మాదేవి బంధువు ఇల్లు విడిచేసరికి కన్నీటిని విడుస్తుంది. దేవయ్య ముఖంలో జీవకళ ఆవిరౌతుంది. డిస్ట్రిక్ట్ సెషన్ కోర్టులో ప్రారంభమైన వారి తగవు బెంగళూరు హైకోర్టు వరకు పోతుంది. తనకొచ్చే ఫీజు విషయంలో లాయరు రాజీపడక గుళ్ళను నానా మాటలంటాడు.
కోర్టు ప్రాంగణంలో తమ తమ వకీళ్లతో అయ్యు, గుళ్ల |
ఈ దృశ్యాలన్నిటినీ చూపిస్తూ “విరసవెంబ విషకె బలియాద ఏతకే, సుఖశాంతి నాశకే మరుళా?” (సుఖశాంతులను నాశనం చేసే వైమనస్యం [పగ/పంతం] అనే విషానికి ఎందుకు బలౌతావురా పిచ్చోడా?) అని అత్యంతవిషాదాన్ని ఒలికిస్తూ స్వయంగా సంగీతకారుడైన జి.కె.వెంకటేష్ నోట నేపథ్యంలో గుండెను పిండేస్తూ వినిపించే పాట కన్నడనాట సుప్రసిద్ధమైనది. బహుశః ఎందరో ప్రేక్షకుల మనసుల్లో పశ్చాత్తాపాన్ని మార్పును కలిగించి ఉంటుంది.
ఆ పాటకు ఇదుగో లింకు -
https://www.youtube.com/watch?v=PUyQAtpswvM
డిస్ట్రిక్ట్ కోర్టులో గెలిచిన గుళ్ళ చివరకు హైకోర్టులో ఓడిపోతాడు. గుళ్ళ చుట్టూ నిలిచిన గ్రామస్థులు కొందరు సుప్రీంకోర్టుకు కూడా పోదామని ప్రోత్సహిస్తూ ఉంటారు. కాని, గుళ్ళకు మాత్రం తన పరిస్థితి బాగా తెలుసు. తన జేబులో ఉన్న రెండు రూపాయలను వారికిచ్చి, నా దగ్గర ఇంతే ఉంది. దీనిని తీసుకుని, కాస్త తిని ఊరికి పొండి అంటాడు. ఆ రెండు రూపాయలతో ఆ నలుగురు గ్రామస్థులు తమ ఆకలిని తీర్చుకున్న విధానం, కాలికి చెప్పులు కూడా లేకుండా గుళ్ళ ఊరికి తిరిగి వచ్చిన విధానం అతడు నిస్సహాయుడై దివాలా తీసిన వైనాన్ని తెలుపుతుంది.
ఇదిలా ఉండగా, ఈ పరిస్థితులు ఎంతగా విషమించినప్పటికీ అయ్యు భార్య గిరిజమ్మ, గుళ్ల భార్య మాదేవమ్మల మధ్య స్నేహం మాత్రం ఎప్పటిలాగే నిష్కల్మషంగా కొనసాగుతుంది. గిరిజమ్మ మాదేవమ్మను గౌరీవ్రతానికి పిలుస్తుంది. ఇద్దరూ పరస్పరం కష్టసుఖాలను వెళ్లబుచ్చుకుంటారు. తమ భర్తలు పరస్పరశత్రుత్వాన్ని విడిచి పెడితే ఎంత బాగుంటుందోనని మాట్లాడుకుంటారు. గౌరీవ్రతం రోజున ఇంటికి వచ్చిన ముత్తైదువ ఉట్టి చేతులతో పోరాదని గిరిజమ్మ మాదేవమ్మకు ఒక బుట్టలో చీరనిచ్చి పంపిస్తుంది.
అలా తిరిగి ఇచ్చేందుకు వెళ్లినపుడు తన భార్య గుళ్ళ భార్యకు ఇలా సాయం చేసిన విషయం అయ్యుకు తెలుస్తుంది. “ఎప్పటినుండి సాగుతోంది ఈ వ్యవహారం?” అంటూ అయ్యు కూడా భార్య చెంపను చెళ్లుమనిపిస్తాడు. “నా ప్రాణం తీయవచ్చిన నా శత్రువుకు నా యింటినుండే డబ్బులు, పప్పులు ఉప్పులు సరఫరా అవుతున్నాయా? ఇంకొకసారి మాదేవి మన ఇంటికి వస్తే ఆమెను, నిన్నూ కలిసి రివాల్వర్ తో కాల్చి పారేస్తాను జాగ్రత్త” అని తీవ్రంగా హెచ్చరిస్తాడు.
చెప్పులు
కుట్టే వ్యక్తి అయ్యును కూడా ఉప్పినకాయ కోసం అడిగి బంగపోతాడు.
అయ్యు వ్యవహారాన్ని గమనించి, అంతకు మునుపు బూతయ్యను మాత్రమే గ్రామానికి శత్రువుగా పరిగణిస్తూ ఉండిన గ్రామస్థులు అతని కుమారుడు కూడా క్రూరత్వంలో తండ్రికేమీ తీసిపోడని భావించి, అతనిని కూడా తమ శత్రువుగా పరిగణించడం మొదలు పెట్టారు. ఊరిలోని పిల్లలు అయ్యు పిల్లలను తమతో కలిసి ఆడుకోనివ్వరు.
అది తెలుసుకుని గిరిజమ్మ బాధపడుతుంది. “మరేం ఫరవాలేదు, నా పిల్లలు ఆ దరిద్రప్పిల్లలతో కలసి ఆడుకోనవసరం లేదు” అంటాడు అయ్యు. వీరి తాత లాగ, మీలాగ గ్రామప్రజలతో కలవకుండా వీళ్లు కూడా ఒంటి బ్రతుకు బ్రతకాలా అని గిరిజమ్మ అడుగుతుంది. లెక్కచెయ్యని అయ్యు అలా బ్రతికితేనే ఊరికి మనమంటే భయగౌరవాలు ఉంటాయి అంటాడు.
ఇది ఇలా ఉండగా దేవయ్య ఇంటిని వేలం వేయవచ్చునని కోర్టు ఆదేశాలు వస్తాయి. దాంతో దేవయ్య క్రుంగిపోతాడు. నేను వీధిన పడతాను. ఇక తల ఎత్తుకుని ఎలా బ్రతకను? పరువు పోయాక మనిషి బ్రతికితేనేమి, చస్తేనేమి? అని కుమిలిపోతాడు. మా తాత, మా అప్ప, నేను, నీ భర్త పుట్టి పెరిగిన ఈ ఇల్లు, నీ పొట్టలో బిడ్డ పుట్టకముందే చేయిజారిపోతోందమ్మా, ఈ రోజుతో ఋణం తీరిపోయింది అని కోడలి చెంత తన బాధను వ్యక్తం చేస్తాడు.
మరుసటి రోజు గుళ్ళ ఇంటి తలుపును తెరిచేసరికి చెట్టుకు ఉరిపోసుకు చనిపోయిన తండ్రి శవం కనిపిస్తుంది. ఊరందరి ఉమ్మడి బంధువైన దేవయ్య మరణానికి గ్రామమంతా విషాదమయమౌతుంది కఠినాత్ముడైన సింగ్లయ్య కూడా కంట తడి పెడతాడు. శవయాత్రకు గ్రామం మొత్తం తరలివస్తుంది.
గిరిజమ్మ, దేవయ్య ఇదంతా ప్రత్యక్షంగా చూశారు. మన దగ్గర కావలసినంత డబ్బుంది. కాని, మామగారి శవాన్ని మోసేందుకు ఒక్కడంటే ఒక్కడు కూడా రాలేదు. ఈ దేవయ్య దగ్గర తినడానికి తిండి కూడా లేదు. కాని పల్లె మొత్తం కదిలివచ్చింది. సంపాదించవలసింది డబ్బును కాదు, ఇటువంటి భాగ్యాన్ని అంటుంది గిరిజమ్మ.
తన తండ్రి మరణానికి కారణమైన అయ్యు మీద గుళ్ళ తీవ్రమైన పగను పెంచుకుంటాడు. ఒక్క వేటుకే అయ్యు తలను ఛక్కుమని తెగవేయాలన్న ప్రతీకారవాంఛతో జ్వలించిపోతూ గుళ్ళ తన మచ్చుకత్తికి పదును పెట్టుకుంటున్న భయంకరశబ్దం విని, భర్త తలంపును తెలుసుకుని మాదేవమ్మ హడలిపోతుంది. ఆ తరువాత నిన్ను పోలీసులు పట్టుకుపోరా అన్న ప్రశ్నకు సమాధానంగా నన్ను ఉరి తీయనీ, గుళ్ళ ఊరికి ఉపకారం చేశాడన్న పేరు నాకు చాలు అంటాడు.
ఇంతవరకు ఇలాగే హఠానికి పోయి ఇల్లు వాకిలి పోగొట్టావు. దేవునిలాంటి తండ్రిని పోగొట్టుకున్నావు. ఇప్పుడు నీ ప్రాణం కూడా పోగొట్టుకుని నన్ను వీధిన పడేస్తావా, వద్దు వద్దు అని మాదేవమ్మ ప్రాధేయపడుతూ అతడిని ఆపబోతుంది.
నువ్వు కాదు కదా, ఆ దేవుడు (దేవుడిలాంటి తండ్రి) వచ్చి చెప్పినా అయ్యును ముక్కముక్కలుగా నరకనిదే విడిచిపెట్టేది లేదు, ఆ పని ముగిసేవరకు, నా కంటబడకు, నాతో మాటాడకు అని గుళ్ళ తన ఇల్లాలి మాటలను లెక్కచేయడు.
ఈ విషయమై తనను హెచ్చరించవచ్చిన మాదేవమ్మ మాటలను విని అయ్యు హేళనగా నవ్వుతాడు. ఏడు చెరువుల నీళ్లను త్రాగించి వీధిలో నిలబెట్టినా నీ మొగుడి కొవ్వు ఇంకా కరగలేదా? రానీ, వాడు కత్తి ఎత్తడానికి ముందే తుపాకిగుండుతో అతని గుండె చీల్చి అతడి రక్తం ఎగజిమ్మేలా చేస్తాను అని ఆమె ముందే ఆమె భర్తను చంపుతానని బెదిరిస్తాడు.
అయ్యా, పోరాటం జరిగితే తప్పకుండా మీరే గెలుస్తారు. మేము ఇప్పటికే అన్నీ పోగొట్టుకున్నాము. ఇప్పుడు నా దగ్గర పసుపుకుంకుమలు తాళి తప్ప మరేమీ లేవు. అవైనా నాకు మిగల్చండి అని మాదేవమ్మ ప్రాధేయపడుతుంది.
నీ తాళిని కాపాడి, నా పెండ్లాం తాళిని బలివ్వాలా అని అయ్యు ఈసడించుకుంటాడు.
బేల అయిన మాదేవమ్మ అయ్యా, మీరు ఉత్తములు, విద్యావంతులు. తండ్రి మరణంతో గుళ్ళ తల చెడిపోయింది. అతడి కోపం మహా అయితే మూడు రోజులుంటుంది. ఆ తరువాత మామూలు మనిషి అయిపోతాడు. అంతవరకు మీరు ఎక్కడికైనా పోయి మళ్లీ రండి అని బ్రతిమలాడుతుంది.
ఈ మాటను వెళ్లి నీ మొగుడికే చెప్పుకో పో అని అయ్యు తిరస్కరించాడు. మాదేవమ్మ కళ్ల నీళ్లతో వెళ్లిపోయింది.
అయ్యు రివాల్వర్లో గుళ్లు నింపుకుని గుళ్ళపై దాడికి బయలుదేరుతాడు. ఆ సమయంలో తాను సాహసించకపోతే ఎన్నో అనర్థాలు జరుగుతాయని గ్రహించిన గిరిజమ్మ అమేయమైన సాహసంతో చేతులు అడ్డంగా చాచి భర్తకు అడ్డు నిలబడి, నిలు అని అతనిని ఆపేస్తుంది. వెళ్లవద్దు అని దాదాపు శాసిస్తున్న స్వరంతో అంటుంది.
నన్నాపకు, నేను వెళ్లకుంటే అతడే వస్తాడు అన్నాడు అయ్యు.
రానీ, ఆ వచ్చినవాడికి బుద్ధి చెప్పండి అన్నది గిరిజమ్మ.
ఇలా మొదలైన భార్యాభర్తల సంవాదం కథాగమనాన్ని నెమ్మదిగా మలుపు తిప్పేస్తుంది. కరణేషు మంత్రీ అని నిరూపించుకునేలా గిరిజమ్మ అద్భుతంగా మాట్లాడుతుంది.
శ్రీమంతుడైనప్పటికీ బూతయ్యను గ్రామం ఎందుకు శత్రువుగా భావించిందో, పేదవాడైనప్పటికీ దేవయ్యను అదే గ్రామం తమ ఆప్తునిగా ఎందుకు ఆదరించిందో గిరిజమ్మ భర్తకు కళ్లకు కట్టినట్టుగా వివరించింది. బూతయ్య వద్ద దేవయ్య పైసా అప్పు తీసుకోకపోయినప్పటికీ ఎలా బాకీ పడ్డాడో అతనికి తెలియజేసింది. అటువంటి దేవయ్య మరణానికి కారణమైన అయ్యుమీద గుళ్ళకు కోపం రావడం సహజమేనని చెప్పింది. కోపతాపాలను కొంతకాలం సహిస్తే అవి ఎక్కువ కాలం కొనసాగవని చెప్పింది. బూతయ్య చేసిన పనుల వల్ల గ్రామం అతడి కుమారుడైన అయ్యును కూడా ద్వేషించడం ప్రారంభించిందని, అయ్యు కూడా అటువంటి పనులనే చేస్తే అయ్యు పిల్లలను కూడా గ్రామం శత్రువులుగా భావిస్తుందని భయానకభవిష్యత్తును వివరించింది. అప్పటికీ గుళ్ళను చంపాలనుకుంటే ముందు తనను, తన పిల్లలను చంపి బయటకు పొమ్మని గద్దిస్తుంది.
తనను పిల్లలను చంపి తరువాత గుళ్ళను చంపమని భర్తను అడ్డుకున్న గిరిజమ్మ |
భార్య మాటలు గుళ్ళను ఆలోచనలో పడవేస్తాయి. అతడిలోని వివేకం నెమ్మది నెమ్మదిగా మేల్కొనడం ప్రారంభించింది. మనిషి ప్రసన్నుడైనాడు. చివరకు చేతిలోని తుపాకీని పడవేసి, తన అభిమానస్థలమైన ఏటి ఒడ్డుకు పోతాడు.
ఇంతలో అటు తన భర్త గుళ్ళ కాని, ఇటు గిరిజమ్మ భర్త అయ్యు కాని, ఎవ్వరూ శాంతించడానికి ఒప్పుకోకుండా యుద్ధానికే కాలు దువ్వుతూ ఉండటంతో తన పసుపుకుంకుమలు పోకముందే తాను పోవాలని భావించిన బేల మాదేవమ్మ ఆత్మహత్య చేసుకొనేందుకు ఏటిలో దూకుతుంది. అది చూసినప్పటికీ గ్రామస్థులెవరూ ఏటిలోనికి దూకి ఆమెను కాపాడే సాహసం చేయలేరు. అప్పుడే ఆ వైపు వచ్చిన అయ్యు మహాసహాసంతో ఏటిలోనికి దూకి ఆమెను ఒడ్డుకు చేరుస్తాడు. ఊరిలోని వారు ఆమె త్రాగిన నీటిని కక్కించి ఆమె ప్రాణాన్ని రక్షిస్తారు.
తన భార్య ఆత్మహత్యాప్రయత్నం చేయడానికి కారణం తానే అని తెలుసుకున్న గుళ్ళ పశ్చాత్తాపపడతాడు. అయినప్పటికీ, ఇంకొకరెవరైనా నిన్ను కాపాడి ఉంటే వారికి పాదనమస్కారం చేసి ఉండేవాడిని. కాని, నిన్ను కాపాడింది నా శత్రువు అయ్యు ఐపోయాడు. నీ పెళ్లాం చెరువులో పడితే కాపాడుకొనడం చేతకాని వెధవ్వి అని అందరికీ నిరూపించాడు అని అవమానంతో రగిలిపోతాడు.
ఇంతలో కోర్టు ఖర్చుల కోసం గుళ్ళ ఒక షావుకారు దగ్గర చేసిన అప్పు తీర్చాలని, లేకుంటే అతనిని అరెస్టు చేయాలని కోర్టు ఆదేశిస్తుంది. తన దగ్గర ఆస్తి ఏమీ లేకపోయినా, ఒంటిలో శక్తి ఉందని, కాయకష్టం చేసి బాకీ తీరుస్తానని గుళ్ళ షావుకారును బ్రతిమలాడుతాడు. మనిషిని తీసుకు పోయి జైలులో పెడితే డబ్బొస్తుందా, విడిచిపెట్టండి షావుకారూ, మొగుడూ పెండ్లాం ఇద్దరమూ, ఏదో ఒక పనిచేసి మీ ఋణం తీర్చుకుంటాము అని మాదేవమ్మ బ్రతిమలాడుతుంది. కాని, ఇటువంటి మాటలను నమ్మేదెలా అని షావుకారు నిరాకరిస్తాడు.
ఇంతలో అయ్యు వచ్చి షావుకారును ఆగమంటాడు. ఇదుగో అయ్యూ, నేను జైలుకు పోతున్నాను, తప్పెట్లు కొట్టించి అందరికీ చాటింపు వేయించు అంటూ గుళ్ళ జైలుకు పోయేందుకు సిద్ధపడతాడు.
అయ్యు అది పట్టించుకోకుండా, నీకు నీ డబ్బు కావాలా లేక అతడు జైలుకు పోవడం కావాలా అని షావుకారును సూటిగా అడుగుతాడు.
జైలుకు పంపితే ఆ ఖర్చులు కూడా నేనే భరించాలి. నాకు కావలసింది నా డబ్బులు మాత్రమే అని షావుకారు స్పష్టం చేస్తాడు.
ఆ డబ్బును నేనిస్తాను అంటాడు అయ్యు, షావుకారుతో.
నీ
భిక్ష నాకు అక్కరలేదు, అంటాడు గుళ్ళ.
జైలుకు వెళ్లి ఏం చేస్తావు?
మన్ను మోస్తాను, రాళ్లు కొడతాను, అక్కడ చెప్పిన పని చేస్తాను. అదంతా నీకెందుకు?
అలా అయితే నీ బాకీ తీరుతుందా? కడుపుతో ఉన్న నీ పెండ్లాం మనశ్శాంతి ఉంటుందా? ఊర్లో నీ మర్యాద నిలబడుతుందా? ఇతనికి ఇవ్వవలసిన డబ్బు నేను ఇస్తాలే.
నీ భిక్ష నాకు అవసరం లేదు అని ముందే కూశాను. నీకు చెవులు పని చేయవా?
భిక్ష కాదులే. అప్పు అనుకో.
ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్పు మోసుకోమంటావా?
ఆయన అప్పు తీర్చకుంటే జైలుకు పోవాలి. నా అప్పు తీర్చకుంటే జైలుకు పోవలసిన అవసరం లేదు.
నీ అప్పు ఎలా తీర్చాలి?
ముందే చెప్పావు కదా, అక్కడా ఇక్కడా పని చేస్తానని? ఆ పనేదో నా ఇంట్లోనే చెయ్. జీతం తీసుకో. అప్పు తీర్చు.
అయ్యు నోటినుండి ఆ మాటలు విన్నాక గుళ్ళ నోటినుండి వెంటనే మరో మాట రాలేదు. మౌనంగా మాదేవమ్మ ముఖం చూశాడు. ఒప్పుకో, అలా చెయ్ అన్నట్టుగా ఆమె తలాడించి సూచించింది. మొత్తానికి సరి అంటూ గుళ్ళ అంగీకరించాడు.
అయితే అయ్యు మంచితనంతో తమ వైరం సమసిపోయినట్లు కాదని గుళ్ళ అయ్యును హెచ్చరిస్తాడు. నా ఇల్లూ వాకిలి పోగొట్టి వీధిలో నిలబెట్టిన నీ మీద నా పగ అణగిపోదు. నిన్ను భూగతం చేసి మా అప్ప మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాను. గుళ్ళను జైలుకు పోకుండా ఆపాను కాబట్టి అతడికి నామీద ఉన్న కోపం పోతుంది అని మాత్రం అనుకోవద్దు. ఏం పని చేయమంటావో చెప్పు. చేస్తాను అని ఊరందరిముందు తీవ్రంగా పలుకుతాడు.
అయ్యు గుళ్ళ మాటలకు కోపం తెచ్చుకోడు. తండ్రి మరణసమయంలో గ్రామప్రజల ప్రవర్తనను చూసి అతడిలో నెలకొన్న కోపం అప్పటికే పోయింది. అతనికి సహజమైన శాంతస్వభావం సద్భావపరిమళాలు వెదజల్లడం ప్రారంభమైంది.
గుళ్ళ అయ్యు దగ్గర పనిచేయడం మొదలు పెడతాడు. తోటలోని పోకకాయలను రాల్చాడు. వాటిని గంపల్లో మోశాడు. కుండల్లో ఉడకబెట్టాడు. ఎండలో ఆరబెట్టాడు. చేతికందిన పంటను బస్తాలలో పోసి అయ్యు ఇంటికి చేర్చాడు. ఆ చిత్రీకరణలో పోకపంట తీరుతెన్నులు రేఖామాత్రంగా తెలుస్తాయి.
మాదేవి పట్ల గుళ్ళ ప్రేమ ఎంతగానో పెరుగుతుంది. బయట తాను ఎంతగానో శ్రమించి అలసిపోయి వచ్చినప్పటికీ, నిండు గర్భిణి అయిన ఆమె పనిభారాన్ని చూసి సహించలేక, తన పనులు కూడా తానే చేయడం మొదలు పెడతాడు. మాదేవి పండంటి మగబిడ్డను కంటుంది.
గుళ్ళ సంతోషానికి అంతు ఉండదు. మరింత ఉత్సాహంగా కష్టపడతాడు. గుళ్ళ కష్టాన్ని అయ్యు దంపతులు గమనిస్తారు. తన పట్ల అయ్యు చూపే దయను అంగీకరించేందుకు గుళ్ళ ఎంతమాత్రం ఇష్టపడడు. అయితే అయ్యు పట్ల ఎంత కోపంగా ఉన్నప్పటికీ, గుళ్ళ ఎంతో విశ్వాసంతో పని చేశాడు. గ్రామస్థులు ఒక రాత్రి వేళ అయ్యు తోటలో చొరబడి కొబ్బరికాయలు, అరటి గెలలు దొంగతనం చేయబోతే గుళ్ళ వారిని పట్టుకుని తంతాడు. నేను అయ్యు ఇంటి కుక్కను అని చెప్పుకుంటాడు. నిన్ను బికారిని చేసి, నీ తండ్రి చావుకు కారణమైన అయ్యుమీద అంత విశ్వాసమేమిటని గ్రామస్థులు అతడిని రెచ్చకొడతారు. అతడి ఋణం తీర్చుకునే వరకు తప్పదు. ఋణం తీరిన తరువాతనే నేను నా తండ్రి కొడుకును. అప్పుడు అతడు నాకు చేసిన అన్యాయానికి బదులు తీర్చుకుంటాను. సరే, ఇంకెప్పుడూ ఈ పరిసరాల్లోకి రాకండి. వస్తే ఊరుకోను అంటూ గుళ్ళ వారిని హెచ్చరిస్తూ తన సిద్ధాంతాన్ని స్పష్టం చేస్తాడు. అయ్యు అతడి మాటలను చెవులారా విని అతడి మనోభావాన్ని గ్రహించి నవ్వుకుంటాడు.
చివరకు ఒక రోజు గుళ్ళ ఋణం తీరిందని, అతడు స్వతంత్రుడని అయ్యు ప్రకటిస్తాడు. నీవు ఎక్కడకూ పోవద్దు, నీవు స్వతంత్రంగా, సంతోషంగా, నా తమ్మునిలా నాతో పాటే ఉండు అని గుళ్ళను కోరుతాడు. గుళ్ళ తిరస్కరించి వెళ్ళిపోతాడు.
ఊరిలో అమ్మవారి పండుగ వస్తుంది. ఊరంతా ఆనందంతో ఉర్రూతలూగుతుంది. రాత్రంతా కాగడాల వెలుతురులో తలల మీద అమ్మోరిని, నైవేద్యాల కుండలను మోస్తూ, తప్పెటలు కొడుతూ, మేళతాళాలు వాయిస్తూ, చిత్రవిచిత్రమైన వేషాలతో ఆటలతో పాటలతో మనుషులు కుణుస్తారు. అమ్మోరికి బలి ఇవ్వడానికి ఒక దున్నను లాక్కొచ్చి బలికాష్ఠానికి కట్టేస్తారు. బలి ఇచ్చే సమయానికి డోళ్లు మా జోరుగా మ్రోగుతాయి. పూనకాలు వస్తాయి. దున్న భయంతో గింజుకుంటుంది. తలారి దాని తల నరికేందుకు కత్తినెత్తుతాడు.
ఇంతలో హఠాత్తుగా అక్కడకు వచ్చిన అయ్యు బలిని ఆపమంటూ ఆ కత్తిని లాక్కుని పక్కన పడేస్తాడు. మూఢనమ్మకాలు వద్దంటాడు. బలి ఇవ్వకుంటే జగన్మాత కరుణించదా అంటాడు. వాదోపవాదాలు జరుగుతాయి. ఊరంతా ఒక్కటై అతనికి ఎదురు తిరుగుతుంది. సరే, ఊరంతా బలి ఇవ్వాలంటున్నారు. నేనొక్కడిని కాదంటే ఆగుతుందా, మీ యిష్టం. ఆ తల్లే మిమ్మల్ని కాపాడుతుంది అని అయ్యు నిష్క్రమిస్తాడు.
అయ్యు ఈ జాతరలో బలి ఇవ్వరాదని ఎందుకు అన్నాడో తెలుసా? అమ్మవారికి కోపం వచ్చి ఈ ఊరికి కలరా, ప్లేగు మొదలైన మహమ్మారులొచ్చి ఊరంతా నున్నగా (ఖాళీ) కావాలని అతడి తలంపు అని ఆరోపించాడు గుళ్ళ. ఊరంతా ఉడికిపోతుంది. అటువంటి అవకాశం కోసమే సింగ్లయ్య వచ్చి ఊరి జనాల కోపమనే అగ్నిలో ఆజ్యం పోస్తాడు. అయ్యు ఇంటిలో ఉన్నదంతా మన సొమ్మే, అది తెచ్చుకుని ఆ తరువాతనే జాతర చేసుకుందాం పదండని గ్రామమంతా ఏకకంఠంతో తీర్మానిస్తుంది. ఊరు ఊరంతా కర్రలు, గొడ్డళ్లు, కత్తులు వంటి చేతికి దొరికిన రకరకాల ఆయుధాలతో అయ్యు ఇంటికి దండెత్తిపోతుంది.
రాత్రిపూట తలుపు తట్టిన శబ్దం విని గిరిజమ్మ భయంతో, వాకిలి తెరవవద్దని అయ్యును వారిస్తుంది. కాని, అయ్యు మాత్రం, ఊరిలో జాతర నడుస్తోంది. ఏదో సరుకులో వస్తువులో అవసరమైనవారు వాటికోసం వచ్చి ఉంటారు అంటాడు. వాకిలి తెరిచిన అయ్యు తన గుమ్మం ముందు ఆయుధాలతో నిలిచిన జనసముద్రాన్ని చూసి నిర్ఘాంతపోతాడు. అతడి దేహమంతా చెమట అలముకుంటుంది. వారిని ఎదిరించి ప్రాణాలు దక్కించుకొనడం సాధ్యం కాదని గ్రహిస్తాడు. మీ యిష్టం, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా, వారి కండ్ల ముందే తన రివాల్వర్ ను పడేసి ఆయుధపరిత్యాగం చేస్తాడు.
గ్రామస్థులందరు అతడి ఇంటిని చుట్టుముడతారు. కొందరు నిర్భయంగా ఇంట్లో చొరబడతారు. గుళ్ళ పర్యవేక్షణలో ఎవరికి కావలసింది వారు దోచుకుంటూ ఉంటే, వారిని చూసి గిరిజమ్మ భయంతో వణికిపోతుంది. అయ్యు ప్రశాంతంగా మరేం భయం లేదని ఆమెను అనునయిస్తాడు. బైరన్న తన ఎడ్లను విడిపించుకుంటాడు. మిగిలిన వారు తమకు కావలసిన పశువులను తోలుకుపోయారు. కొందరు ఇనప్పెట్టెను పగలగొట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటే అయ్యు స్వయంగా వారికి తాళం చెవులను ఇస్తాడు. వారు డబ్బు బంగారంతో పాటు తాము బూతయ్యకు రాసిచ్చిన అప్పుపత్రాలను కూడా మూటగట్టుకుని ఎత్తుకుపోతారు. చెప్పులు కుట్టేవాడు వంటిట్లోనికి దూరి వాసన పసిగట్టి ఉప్పినకాయ జాడీని స్వాధీనం చేసుకుంటాడు. నాలుక ఆత్రం తట్టుకోలేక, అక్కడే మూత విప్పి నోట్లో వేసుకుని జుర్రుకుంటాడు. కొందరు బీరువా తెరచి బట్టలన్నీ దోచుకుంటారు. కొందరు ఇంట్లోని పాత్రలన్నింటినీ ఎత్తుకుపోతారు. కొందరు ధాన్యం బస్తాలను ఎత్తుకు పోతారు. ఒకడు అయ్యు కండ్ల ముందే గిరిజమ్మను కత్తి చూపి బెదిరిస్తే ఆమె నగలన్నీ ఒలిచి ఇస్తుంది. అది గమనించిన గుళ్ళ వాడిపైకి దూసుకువచ్చి వాడిని కొట్టి ఆడవారి జోలికి పిల్లల జోలికి పోతే జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. కాసేపట్లోనే అందరూ అయ్యు ఇంటిని పూర్తిగా దోచేసి చేతికందిన ప్రతివస్తువునూ పట్టుకుని ఉడాయిస్తారు.
అందరి పగ ఒక ఎత్తైతే, బైరన్న పగ మరో ఎత్తు. బూతయ్య తన ఇంటిని తగలబెట్టి తనను వీధిపాలు చేసింది అతడు ఇంగా మరచిపోలేదు. అందరూ వెళ్లిపోయిన తరువాత అతడు అయ్యు ఇల్లంతా గబ్బునూనె జల్లి, అయ్యు కండ్లముదే ఇంటికి నిప్పు పెడతాడు. అగ్నికీలలు ఆకాశమంత ఎత్తున ఎగసి ఇల్లు కండ్లముందే కాలి బూడిద అయిపోతుంటే పిల్లలు భయపడి తమ తల్లిదండ్రులను కావలించుకుంటారు.
అయ్యు అగ్నికీలలను తదేకంగా ప్రశాంతంగా చూశాడు. ఆ సంఘటనలో కాలిపోయింది అతడి ఇల్లు కాదు. అతనిలో మునుపు ఉండిన క్రోధము, అసూయ దగ్థమైపోయాయి. ఇతరులకంటె నేను అధికుడిని అని ఇంతకు ముందు అతడికి ఉండిన అహంకారం కాలిపోయింది. నా ఇల్లు, నా సంపద అనుకునే అతడి మమకారం కాలిపోయింది. తన తండ్రి బ్రాహ్మణ్యాన్ని మరచి, స్వధర్మవిరుద్ధంగా వ్యవహరిస్తూ వడ్డీవ్యాపారం నిర్వహించి గడించిన పాపపు సొమ్మును తాను అనుభవిస్తున్నాననే సంకోచం ఆరోజు తీరిపోయి అతని మనసు ఎంతో తేలికైపోయింది. గ్రామస్థులు తన ఇంటిని దోచడానికి వచ్చిన దొంగలు కాదు, తనను నరకంలో పడిపోకుండా ఉద్ధరించేందుకు వచ్చిన దేవదూతలు అన్నట్టుగా అతనికి తోస్తారు. కాలిపోతున్నకొద్దీ ఆ ఇల్లు నల్లని పొగలను వెలువరుస్తుంటే, అయ్యు ముఖం మాత్రం అగ్నిశుద్ధమైన బంగారంలా మరింత తేజస్సును వెలువరిస్తుంది. గిరిజమ్మ కూడా జరిగిన దానికి రవంత కూడా బాధపడకుండా నిశ్చింతగా, తమ ఋణభారం తీరిపోయినట్టుగా ఫెళ ఫెళార్భాటాలతో కాలిపోతూ కూలిపోతున్న ఇంటిని చూస్తుంది. ఆవిధంగా భార్యాభర్తలిరువురూ ఆపత్కాలంలో కూడా నిర్వికారంగా, భయానికి, కోపానికి, ప్రతీకారభావానికి ఏమాత్రం గురికాకుండా పరమశాంతస్వభావులుగా ఏకమనస్కులై నిలిచిన అపురూపసన్నివేశమది.
ఈ దుర్ఘటన ఎలా తెలిసిందో ఏమో గాని, మరుసటి రోజు చాలామంది పోలీసులు గ్రామానికి వచ్చేశారు. గ్రామస్థులందరినీ ఒక చోట నిలబెట్టారు. రాత్రి ఒళ్లు తెలియని ఆవేశంలో వారంతా కూడబలుక్కుని అలా దోపిడీ చేసేశారే గాని, తెల్లవారేసరికి ఆ ఆవేశం తగ్గి గ్రామస్థులలో భయం ఆవరించింది. పోలీసులను చూసే సరికి వాళ్లలో వణుకు మొదలైంది. ఎవ్వరూ తలెత్తి ధైర్యంగా నిలబడలేక ముఖం దించుకుంటున్నారు. పోలీసులు ఏటి ఒడ్డున తోటలోనున్న తమ మరొక ఇంటికి చేరుకున్న అయ్యును రప్చించారు.
అందరినీ విడివిడిగా విచారించాం. ఎవరూ నిజం చెప్పడం లేదు. వీరిలో మీ ఇంటిని దోచుకున్నదెవరు, ఇంటికి నిప్పు పెట్టిందెవరు? అని అతనిని అడిగారు.
అయ్యు వారందరిలోనూ ఆ పని చేసినవారెవరు అన్నట్టు కాసేపు వెదికి, ఇందులో ఎవరూ లేరు అని చెబుతాడు. అయ్యు తమ పేరు చెబుతాడు, తమను పోలీసులు పట్టుకుపోతారు, తమకు శిక్ష తప్పదు అని భావిస్తున్న గ్రామస్థులందరూ అయ్యు మాటలను విని నిర్ఘాంతపోతారు. ఊరంతా ఒక్కటై మిమ్మల్ని తరువాత ఇబ్బంది పెడతారని భయపడకండి నిజం చెప్పండి, ఎవరో ఒకరు నిప్పు పెట్టనిదే ఇల్లు కాలిపోతుందా అని పోలీసు అధికారి అడిగితే, లేదు, ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. గ్రామస్థులందరూ వచ్చి సహాయం చేసి, నా భార్యాబిడ్డలను కాపాడారు అని అయ్యు చెబుతాడు. అయ్యు మాటలతో గ్రామస్థులందరూ తాము చేసిన పనికి సిగ్గుపడతారు. గుళ్ళకు కూడా అయ్యు మంచివాడేనని నమ్మకం కుదురుతుంది. అందరినీ రెచ్చగొట్టిన సింగ్లయ్య, దోపిడీకి నాయకత్వం వహించిన గుళ్ళ, ఇల్లు కాల్చిన బైరన్న అంతా పశ్చాత్తాపంతో కంట తడిపెడతారు.
ఎక్కడో కరెంటు కనెక్షనులో షార్టం సర్క్యూట్ అయ్యుంటుంది, నిప్పు బయలుదేరి ఇల్లు కాలిపోయింది. మీకు తప్పుడు సమాచారం అందించారు.
మీకు శ్రమ కలిగినందుకు క్షమించిండి అని అయ్యు పోలీసులను కోరుతాడు. ఇంతలో మైసూరులో అయ్యు వాళ్ల పినతల్లికి సీరియస్
గా ఉందనే టెలిగ్రాము వస్తే ఊరు వదిలి పోతాడు.
అయ్యు లేనపుడు ఊరిని హోరుగాలులతో ఉరుములతో మెరుపులతో పెద్ద గాలి వాన ముంచెత్తుతుంది. అయ్యు కుటుంబం తోటలోని ఇంటిలో రాత్రిపూట భోజనం ముగించేసరికి వాన కుండపోతగా మారుతుంది. తోటలో పైరు మునిగి పోతుంది. క్రమంగా పెద్ద ఎత్తన వడివడిగా పారే నీటితో ఏరు పోటెత్తుతుంది. రాత్రిపూట చీకటిలో బయట ఏమి జరుగుతుందో తెలుసుకునే అవకాశం కూడా గిరిజమ్మకు లేకపోయింది. పిల్లలు నిద్రపోతుంటే తాను మాత్రం ఏ సమయంలో ఎటువంటి ప్రమాదం వస్తుందోనని జాగరణ చేస్తూ కూర్చుంటుంది. చివరకు కట్ట తెగి, ఏటినీరు తోటను ముంచెత్తుతుంది. నీరు ఇంట్లోనికి చొరబడుతుంది. గిరిజమ్మ పిల్లలను నిద్ర లేపి మేడమీదకు చేరుకుంటుంది. ఊరికి దూరంగా ఉన్న తోటలో తాము మునిగిపోతున్నట్టు గ్రామస్థులెవరికీ తెలిసే అవకాశం లేదు. భయపడుతున్న పిల్లలను గుండెకు పొదువుకుంటూ గిరిజమ్మ నిస్సహాయంగా దిక్కులన్నీ చూస్తుంది. రాను రాను, వాన కురవడం మానినా, పైనుండి పొంగి వస్తున్న వరదనీటితో తోట, ఇల్లు కూడా ఏటిమధ్యలోనే ఉన్నట్టుగా ఒకటై కలసిపోతాయి. నీటిమట్టం క్రమక్రమంగా పెరిగి మేడమీదనున్న మనుషుల కాళ్లను ముంచుతాయి.
ఊరిలో ఉన్న గుళ్ళకు, మాదేవమ్మకు కూడా నిద్ర పట్టదు. మాటల సందర్భంలో గుళ్ళ, ఏమిటీ శబ్దం? కట్ట తెగి ఉంటుంది, తోటలోనున్న బూతయ్య ఇల్లు మునిగిపోయి ఉంటుంది అంటాడు. దాంతో మాదేవమ్మ కంగారుపడి, అయ్యయ్యో, గిరిజక్క, పిల్లలు అందరూ ఆ ఇంట్లోనే ఉన్నారు, అయ్వవారు కూడా ఊరిలో లేరు అంటుంది. అది విని, ఒక్క ఉదుటున లేచి గుళ్ళ వాళ్లను కాపాడాలని పరుగుపరుగున వెడతాడు. విషయం తెలుసుకున్న గ్రామమంతా అయ్యు కుటుంబాన్ని కాపాడాలని పరుగులు తీస్తుంది.
గుళ్ళ ఒక తెప్పమీద తోటలోని ఇంటివద్దకు పోతాడు. ఆపద్బాంధవునిలా వస్తున్న గుళ్ళను చూసి, త్వరగా రా, త్వరగా రా అంటూ గిరిజమ్మ, పిల్లలు కేకలు వేస్తారు. భయపడకండి, వస్తున్నాను అంటూ గుళ్ల వస్తాడు. చివరకు ఎలాగైతేనేం, మహాసాహసంతో, నేర్పుతో వారిని కాపాడతాడు. గుళ్ళా, నీకు అయ్యూకు ఏదో ఋణానుబంధం ఉందయ్యా, అందుకే ఒకరి కుటుంబాన్ని ఒకరు కాపాడారు. శబాష్ శబాష్ అని ఊరంతా అతని సాహసాన్ని ప్రశంసిస్తుంది.
అయ్యు ఊరికి తిరిగివచ్చేసరికి గుళ్ళ అతనికి ఎదురువస్తాడు. అప్పటికి అతడిలో కూడా అయ్యు పట్ల ఉన్న కోపం పగం చల్లారి, మునుపటి మనిషిగా మారిపోయి ఉంటాడు. మాటలేమీ లేకుండా, కన్నీళ్లతో అయ్యును గాఢంగా ఆలింగనం చేసుకుని తన స్నేహభావాన్ని ప్రకటిస్తాడు. ఇద్దరూ ఎదుటివారు తమకు చేసిన ఉపకారాన్ని చెప్పుకుని తమ కృతజ్ఞతాభావాన్ని ప్రకటించుకుంటారు.
ఊరి జనాలందరూ కూడా అక్కడికి తాము అయ్యు ఇంటిలో దోపిడీ చేసిన వస్తువులను తీసుకొచ్చి అతడి ముందు పెడతారు. తమ తప్పును మన్నించమని వేడుకుంటారు. అయ్యు ఇదంతా మీ సొమ్మే మీ చెంతనే ఉంచుకోండి అంటాడు. ఇప్పటినుండి నేను బూతయ్యన మగ అయ్యు అల్ల, హళ్లిన మగ సాంబయ్య (నేను బూతయ్య కమారుడు అయ్యును కాదు, ఈ పల్లె కుమారుడు సాంబయ్యను) మీతో కలిసి బ్రతికేందుకు నాకు అవకాశం ఇవ్వండి అని వేడుకుంటాడు. గ్రామస్థులంతా అతనిని తమలో ఒకడిగా చేర్చుకుంటారు.
మునుపు ఆగిపోయిన అమ్మవారి జాతరను అందరూ కలసి చేసుకుంటారు. అందరూ కలసి అమ్మవారి రథాన్ని లాగుతూ ఉండగా, కూడిబాళిదరె స్వర్గసుఖ అనే సందేశంతో చిత్రం సుఖాంతమౌతుంది.
))((
గోరూరు రామస్వామి అయ్యంగార్ వ్రాసిన వయ్యారి అనే నవలను అనుసరించి సిద్ధలింగయ్య దర్శకత్వంలో వెలువడిన చిత్రం ఇది. కన్నడచలనచిత్రచరిత్రలోనే పూర్తిగా ఔట్ డోర్ లో షూటింగ్ జరుపుకుకన్న మొట్టమొదటి ఈస్ట్ మన్ కలర్ చిత్రమట. 1974 వ సంవత్సరంలో 12 లక్షల బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం 45 లక్షల వసూళ్లను సాధించిందట.
దర్శకుడు ప్రధానపాత్రలైన బూతయ్య, దేవయ్య, గిరిజమ్మ, అయ్యు, గుళ్ళ, మాదేవమ్మ పాత్రలకు ఖచ్చితమైన నటులను ఎంచుకొనడంలో సగం విజయం సాధిస్తే, కథకు తగిన గ్రామాన్ని ఎంచుకొనడంలోనూ మిగిలిన సగం విజయం సాధించాడనిపిస్తుంది. చిక్కమగళూరు సమీపంలో కళశాపురం గ్రామం అది. సందర్భానుసారంగా జి.కె. వెంకటేష్ అందించిన సంగీతం మనలను ఆయా సన్నివేశాలలో లీనం చేయిస్తుంది. పి.బి.శ్రీనివాస్, కెమెరామ్యాన్ ప్రతిభ ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
బూతయ్య, దేవయ్య ఇద్దరూ తమ కుమారులకు విభిన్నమైన ఉపదేశాలు చేశారు. అయ్యు తన తండ్రి ఉపదేశాన్ని పాటించి గ్రామానికి బద్ధవిరోధి అయ్యాడు. గుళ్ళ తన తండ్రి ఉపదేశాన్ని పాటించక ఉన్నదంతా పోగొట్టుకుని అప్పులపాలైపోయాడు. ఒకానొక సమయంలో ఒకరినొకరు చంపుకుందామన్నంత కసితో రగిలిపోయిన వారిద్దరికీ వారి వారి ధర్మపత్నులే సరైన సమయంలో సరైన ఉపదేశం చేసి వారిని మరలా మనుషులుగా నిలబెట్టడం, వారు చివరకు ప్రాణమిత్రులుగా మారిపోవడం ప్రేక్షకులందరికీ ఎంతో నచ్చింది. చిత్రం సాధించిన ఘనవిజయమే అందుకు నిదర్శనం.
అయినా, 2020లో థప్పడ్ సినిమాను ప్రశంసించేవారికి ఈ సినిమా నచ్చకపోవచ్చు. మాదేవమ్మను కొట్టిన గుళ్ళ వారి దృష్టిలో ఒక పనికిమాలిన దగుల్బాజీ కావచ్చు. కాని, ఆ తరువాత భార్య కష్టాన్ని చూడలేక, ఆమె చేయవలసిన పనిని కూడా తానే ప్రేమతో చేయడం చూడలేరేమో. ఒకవేళ చూసినా తన వంశాంకురం కోసం చేశాడే తప్ప భార్యమీద ప్రేమతో కాదని వాదించవచ్చు. గిరిజమ్మను కొట్టిన అయ్యులో పురుషదురహంకారాన్ని వారు చూసి నిందించవచ్చు. కాని, తన భార్యాబిడ్డల ప్రాణాలను దక్కించుకొనడం కోసం తన సంపదనంతటినీ తృణప్రాయంగా నిర్వికారంగా వదులుకున్న అతడి ధీరశాంతతను ఎలా అర్థం చేసుకుంటారో!
భర్తల చేత దెబ్బలు తిన్నప్పటికీ తమ కాపురాలను కూలదోసుకుని పోనందుకు మాదేవమ్మ గిరిజమ్మ పురుషాహంకారానికి నిశ్శబ్దంగా బలైపోతున్న స్త్రీజాతిప్రతినిధులుగా తోచవచ్చునేమో. కాని, సరైన సమయానికి తమ భర్తలకు సరైన సలహాలనిచ్చి వారితో బాటు తమ జీవితాలను, గ్రామప్రజల జీవితాలను ఒక సక్రమమైన ఆనందకరమైన మార్గంలో పెట్టిన నాయకురాళ్లలా తోచరేమో.
ఏమో.
స్వాభిమానం చాల గొప్ప విషయం. కాదనలేం. కాని, సహనం మరింత గొప్ప విషయం. ఆవేశాలు క్షణికాలు. ఆత్మీయతలు శాశ్వతాలు. ఇటువంటి విషయాలను అర్థం చేసుకొనేందుకు ప్రయత్నించనివారికి ఇటువంటి సినిమాలు అర్థరహితంగా తోచవచ్చును. అది కేవలం వారి సమస్య. ఎందుకంటే స్త్రీని కొట్టడం గొప్ప విషయంగా ఈ సినిమాలో గ్లోరిఫై చేసి చూపలేదు. అది చిత్రీకరించిన పద్ధతి ప్రకారం తప్పు అనే భావననే కలిగించేలా చేయడంలో దర్శకుడు సఫలమైనాడు.
ఇంకా,
ఆ కాలానికి ఊరిలో పార్టీలు, పార్టీల కార్యకర్తలు లేరు కాబట్టే, గ్రామం అంతా ఒక్కటి కాగలిగింది. పార్టీలు ఉంటే బూతయ్య అనే బూచి శాశ్వతంగా బ్రతికి ఉండేది. ఎంత మార్పు వచ్చినప్పటికీ, ఎంత మంచితనాన్ని ప్రదర్శించినప్పటికీ అయ్యు, అతని పిల్లలు ఆ బూచికి శాశ్వతప్రతినిధులుగా తరతరాలుగా అవమానం పాలౌతూ బ్రతికేలా చేసేవారు ఆ పార్టీజనాలు. గుళ్ళ పగ జైలులోనే చల్లారేది. అతని భార్యాబిడ్డలు దిక్కులేనివారై, ఏదో ఒక పార్టీకి కథావస్తువుగా మారి, వోటర్లచేత కన్నీళ్లు పెట్టించి, ఆ కులపు వోట్లను ఆ పార్టీకి గంపగుత్తగా వేయించగలిగేది. అదృష్టవశాత్తు, పార్టీలు లేని ఊరు కాబట్టి అది బాగుపడింది.
ఇదుగో ఆ సినిమా లింకు, మీదే ఆలస్యం, చూడండి.
https://www.youtube.com/watch?v=fdWR956VzHQ
https://www.youtube.com/watch?v=aRJkkpOC12s
చిత్రం
కన్నడభాషలో ఉన్నప్పటికీ తెలుగువారికి చక్కగా అర్థమౌతుంది. అయినప్పటికీ ఆ భాష రానివారు హిందీలో చూడవచ్చు. 1980లలో ఇది
హిందీభాషలో కూడా ఎక్ గావ్ కీ కహానీ పేరిట పునర్నిర్మింపబడింది. స్క్రీన్ ప్లే యథాతథంగా ఉంది. అదే ప్రాంతాల్లో చిత్రీకరించారు. అయితే ప్రధానపాత్రలకు కన్నడంలో కుదిరినంత చక్కగా
హిందీలో నటులు కుదరలేదు. ముఖ్యంగా ఇల్లు కాలిపోయేటపుడు
నిర్వికారంగా చూసే కన్నడ గిరిజమ్మకు, భర్త తలమీద భుజం పెట్టి ఏడ్చేసిన హిందీ గిరిజమ్మకు
చాలా తేడా ఉంది. గుళ్ల పాత్ర కన్నడంలో కనబడినంత
శక్తివంతంగా హిందీలో లేదు. మళెనాటి ఆడపడుచుగా
కన్నడ మాదేవమ్మ సరిపోయినంత చక్కగా హిందీ మాదేవమ్మ (ఆమె తెలుగునటి మంజుల) సరిపోలేదు. కన్నడంలోనూ, హిందీలోనూ కూడా అయ్యు పాత్రను పోషించింది
ఒకే నటుడు అయినప్పటికీ, కొంత తేడా కనిపిస్తుంది. విరసవెంబ వ్యథకె అనే కన్నడ పాటను హిందీలో చేయడం అసాధ్యం అని తెలిసిపోయిన దర్శకుడు కేవలం సంగీతంతో సరిపెట్టి పాట లేకుండా వదిలేశాడు.
ఇదిగో ఆ హిందీ సినిమా లింకు.
https://www.youtube.com/watch?v=ho3pZpv_cZo
మీకు నచ్చిన భాషలో చూసి ఆనందించండి.