03/10/2019
ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో ప్లాస్టిక్ హెల్త్ సమ్మిట్ జరిగింది. ఇటువంటి కాన్ఫరెన్సు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జరిగిందట.
మైక్రో/నానో ప్లాస్టిక్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రాణికోట్లకు తీవ్రమైన హానిని కలిగిస్తున్న పరిణామాలు ఈ కాన్ఫరెన్సు ద్వారా వెలుగు చూశాయి.
మైక్రో/నానో ప్లాస్టిక్స్ అంటే చాల చిన్న ప్లాస్టిక్ కణాలు. సాధారణంగా 5 మిమీ కంటే తక్కువ పరిమాణంలో ఉంటాయి. సముద్రంలోను, మంచినీటిలోను భూమిలోను చేరి, వాటిని కలుషితం చేసే మైక్రో/నానో ప్లాస్టిక్స్ గణనీయమైన స్థాయిలో ఉన్నాయి. మనుషులు జంతువులు కూడా మైక్రో/నానో ప్లాస్టిక్‌లను తింటున్నారు అని పరిశోధనలో తేలింది.
మనం వాడుతున్న పెద్ద ప్లాస్టిక్ వస్తువులు కాలక్రమేణ చిన్న చిన్న ముక్కలుగా విచ్ఛిన్నమౌతాయి. ఈ చిన్న చిన్న ముక్కలు పర్యావరణంలో కలుస్తాయి.
జలతరంగాలు, వాయుతరంగాలు, సూర్యరశ్మి, భౌతికమైన ఒత్తిడి వంటివి ప్లాస్టిక్‌ను క్రమంగా చిన్న చిన్న ముక్కలుగా విచ్ఛిన్నం చేస్తాయి. ప్లాస్టిక్ సంచులు, వాటర్ బాటిళ్లు, కుర్చీలు, టీ పొడి ప్యాకెట్లు - ఇలా ప్రతి ఒక్క ప్లాస్టిక్ పదార్థమూ విచ్ఛిన్నమై మైక్రో/నానో ప్లాస్టిక్‌గా మారి, పర్యావరణంలో కలిసి సమస్తప్రాణులకు చేటు కలిగిస్తోంది.
మైక్రో/నానో ప్లాస్టిక్‌లు వివిధమార్గాలలో మనుషుల శరీరాల్లో ప్రవేశిస్తాయి.
1 నీళ్లలో కలిసిన మై/నా ప్లా.లను ప్లాంక్‌టన్ ▶️ చేపల వంటి జలచరాలు తింటాయి. వాటిని మనుషులు తింటారు. ఆహారంలో కలిసిన మై/నా ప్లా.లను కోళ్లు మేకలవంటివి తింటాయి. వాటిని మనుషులు తింటారు. ఇలా...
2 ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు అరిగిపోతూ మై/నా ప్లా.లను నీటిలోకి విడుదల చేస్తుంటాయి. వాటిని మనం తాగుతాము.
3 గాలిలో స్వేచ్ఛగా తిరుగుతున్న మై/నా ప్లా.లను మనం పీల్చుకుంటాము.
ఇలా మనం ప్లాస్టిక్‌నే తింటున్నాము, త్రాగుతున్నాము, ఊపిరి తీసుకుంటున్నాము.
ఇలా మన శరీరంలో ప్రవేశిస్తున్న మై/నా ప్లాస్టిక్, BPA, PFAS, phthalates వంటి చాలా ప్రమాదకరమైన విషరసాయనాలను మన జీవకణాలలోనికి విడుదల చేస్తోంది.
ప్లాస్టిక్ తేలికగా, పారదర్శకంగా, ఉంటూ చాలా కాలం మన్నటానికి ప్రత్యేకించి వాడే రసాయనం phthalate. ఇది ఆటోమొబైల్, కాస్మటిక్ రంగాలలో కూడా విపరీతంగా వినియోగింపబడుతుందట. ఇవి మనుషుల కాలేయాన్ని, మూత్రపిండాలను, శ్వాసకోశాలను, పునరుత్పత్తి (సంతానోత్పత్తి) వ్యవస్థను దారుణంగా దెబ్బతీస్తాయి.
ఆహారపదార్థాలను, పానీయాలను ప్యాక్ చేసే ప్లాస్టిక్‌లో BPA పుష్కలంగా ఉంటుంది. ద్రవపదార్థాలలో అది నెమ్మదిగా కరిగి కలిసిపోతుంది కూడా.
PFAS అనే రసాయనం తల్లి పాలలో కూడా కనిపించేంతంటి ప్రమాదకరమైన స్థాయికి చేరుకున్నదట.
ఇవన్నీ మన శరీరంలో చేరుతూ మన రోగనిరోధకవ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయి. తత్ఫలితంగా, మనం సులువుగా అనేకరోగాలకు గురి అవుతాం. మన జీవకణాలు ఔషధాలకు ప్రతిస్పందించడం మానేస్తాయి. రోగకారకాలైన విషాలకు ఆపై తిరుగు ఉండదు. చిన్న వయసులోనే వృద్ధాప్యం ఆవహిస్తుంది. కీళ్లు పట్లు తప్పుతాయి. కంటి చూపు మందగిస్తుంది. వినికిడి శక్తి తగ్గుతుంది. ఎంతటి ఖరీదైన వైద్యమైనా ఈ లక్షణాలను నయం చేయలేదు. అందువల్ల ఆయుఃప్రమాణం తగ్గిపోతుంది. బ్రతికినంత కాలం కూడా సుఖంగా బ్రతికే అవకాశం ఉండదు.
పూర్తిగా వాటర్ బాటిల్ మీదనే నేరారోపణ చేయడానికి వీలు లేదు. మనం ధరించే సింథటిక్ దుస్తులు కూడా ఇందుకు తమ వంతు నేరాన్ని తాము కూడా చేస్తున్నాయి. నూలు వస్త్రాల మీద మనుషులకు మోజు పోయింది. ఆక్రిలిక్, నైలాన్, పాలిస్టర్ వస్త్రాలు ఎక్కువైనాయి. వాటిని ఉతుకుతున్న ప్రతిసారీ బిలియన్ల కొద్దీ మై/నా సింథటిక్ కణాలు దుస్తులనుండి విడిపోయి, నీటిలోనికి ⏩ కాలువలలోనికి ⏩ జలాశయాలలోనికి ⏩ సముద్రంలోనికి ⬆️ వాతావరణంలోనికి చేరుకుంటున్నాయి.
😫
ప్రపంచమంతటా ఈ ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా యుద్ధం జరుగుతోంది. అది మానవాళికి ఎలా శత్రువో వారందరూ ఉద్ఘోషిస్తున్నా మన భారతీయసమాజంలో మనం ఇంకా వినీ విననట్టు నటిస్తున్నాము.
సమావేశాలలో మన రాజకీయనాయకులు ప్లాస్టిక్ బాటిళ్లను ఎదురుగా పెట్టుకొని, మాట్లాడి మాట్లాడి అలసిపోయినప్పుడల్లా వాటి మూత విప్పి త్రాగుతూ ఉంటే చూడటం మనకు అలవాటైపోయింది. మన క్రీడాకారులు తమకు శక్తిని, ఉత్సాహాన్ని ఇచ్చే పదార్థాలు ప్లాస్టిక్ డబ్బాలలో ఉంటాయని చెబుతుంటే అవునా అని అమ్మానాన్నలం వాటిని వెంటనే తెచ్చి మన పిల్లలకు తినిపించే స్థాయిలోనే ఉన్నాం.
గతానుగతికో లోకః।
న లోకః పారమార్థికః॥
సాధారణంగా ఈ లోకంలో ఒకరిని చూసి మరొకరు గుడ్డిగా ప్రవర్తిస్తూనే ఉంటారు. పరమార్థమేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయరు.
సమాజం సమాజమంతా స్తబ్ధంగా నిస్తేజంగా మారిపోయింది. ప్రమాదం ముంచుకొచ్చినా తప్పించుకొనే ప్రయత్నం చేయలేని తమోగుణమగ్నమైన ఒక చెట్టుకూ మనకూ పెద్ద తేడా లేకుండా పోయింది.
https://www.facebook.com/srinivasakrishna.patil/posts/2626356474151683
No comments:
Post a Comment