పాక్ ప్రభుత్వానికి ఉగ్రవాదమూకలపై అదుపు లేదన్నది చరిత్ర చెబుతున్న సత్యం. పాక్ ప్రభుత్వంతో చర్చలు జరిపితే ఉగ్రవాదం తగ్గుతుందనుకొనడం మన భ్రమ. అనేకానేక భారతప్రభుత్వాలు చాల చొరవ చేశాయి. కాని, అది తగ్గినట్టు ఎక్కడా జాడ లేదు.
బలవంతుడు తనకంటె బలవంతుడికే భయపడతాడు. అమెరికా లాడెన్‌ను హతం చేసి తన ఆధిపత్యాన్ని చాటడం ఒక ఉదాహరణ మాత్రమే.
వారు కాశ్మీరం పాకిస్తాన్ కు చెందాలని కోరుతున్నారు. వారితో చర్చలు చేస్తే వారు అడిగేది అదే. అది మనం ఇచ్చే సమస్య లేదు, వారు ఉగ్రవాదం ఆపేది లేదు.
కాబట్టి, వారి ఉగ్రవాదాన్ని ఆపేందుకు ప్రయత్నించవలసింది మనమే. నిజమే, కాని, ప్రస్తుత పరిస్థితులు పాకిస్తాన్ పై యుద్ధాన్ని ప్రకటించడానికి మనకు తగినంత అనుకూలంగా లేవు.
పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఎన్నుకొనేది పాకిస్తాన్ ప్రజలే అయినా, అంతటితో వారి ప్రమేయం ముగిసిపోతుంది. అక్కడ ప్రధానమంత్రి పేరుకు మాత్రమే ప్రభుత్వాధినేత. భారత్‌లో నిన్న పులవామాలో జరిగిన సంఘటనకు మమ్మల్ని తప్పు పట్టవద్దు, అని భుజాలు తడుముకుంటూ వారి విదేశాంగశాఖ తక్షణమే ఒక లేఖను జారీ చేసింది కూడా.
ఈవిధంగా భారత్ లో ఉగ్రవాదం మేము చేస్తున్న పని కాదు, మామీద యుద్ధమేమిటి అని పాకిస్తాన్ వాళ్లు అంతర్జాతీయస్థాయిలో గొంతు ఎత్తుతారు. అచ్చం, ఇపుడు చంద్రబాబు తన అవినీతిని, తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు ఢిల్లీకి పోయి అరుస్తున్నట్లుగా.
అందరూ ఉగ్రవాదాన్ని ఒక ఫార్మాలిటీ కోసం అంతర్జాతీయంగా ఖండించేవారే కాని, యుద్ధం అంటూ వస్తే, మనకు సంపూర్ణసహకారం అందించే వారు ఎవరో ఎందరో అనేది సందేహాస్పదం. అందువల్ల, మనం గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, చిరకాలం పాటు మన సామాజిక ఆర్థిక పరిస్థితులను ఛిన్నాభిన్నం చేసే ప్రత్యక్షయుద్ధం కంటె మరొక వ్యూహాన్ని అమలు పరచవలసిన అవసరం ఉంది.
భారతీయులు ఎప్పటినుండో కోరుతున్నట్టు, కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని అందించే ఆర్టికల్ 370 ని రద్దు చేసి, భారతదేశంలోని మిగిలిన ఏ రాష్ట్రంలోనైనా మనకు స్వేచ్ఛగా నివసించే హక్కు ఉన్నట్టు కాశ్మీర్‌లో కూడా నివసించే హక్కు, అక్కడ భూమిని, ఇతర స్థిరాస్తులను కొనే హక్కు, అక్కడ శాశ్వతనివాసం ఏర్పరచుకునే హక్కు భారతీయులందరికీ కల్పించాలి. అందుకు బలమైన ఏర్పాట్లు చేయాలి.
అప్పుడు కాశ్మీరు నాయకులు తిరుగుబాటు చేస్తారు. వారిని నిర్బంధించవలసి రావచ్చు. అల్లర్లు రేగుతాయి. ప్రారంభంలో ఉగ్రవాదం మరింత తీవ్రతను సంతరించుకున్నట్టు కనిపిస్తుందేమో కూడా. ప్రభుత్వం వాటిని తీవ్రంగా అణచివేయాలి. అంతర్జాతీయమైన వత్తిడులు వస్తాయి. కాని, భారత్ కు సంబంధించి, ఇది తమ అంతర్గతమైన సమస్య. వివిధరాష్ట్రాలనుండి భారతీయులు కాశ్మీరానికి వెళ్లి స్థిరపడుతున్నకొద్దీ క్రమంగా శాంతిభద్రతలు చేకూరుతాయి. దీనికి దీర్ఘకాలం పట్టవచ్చు గాక. కాని, ఇంతకు మించిన పరిష్కారం లేదు.
1989 లో తియానన్మెన్ స్క్వేర్ లో చైనా ప్రభుత్వం తన స్వంత పౌరులపై దాడి చేసి 10000 మందికి పైగా ప్రాణాలను బలిగొన్నది. అప్పుడు అంతర్జాతీయంగా రేగిన గగ్గోలు అసామాన్యమైనది. కాని, చైనా ప్రభుత్వం ఎవ్వరినీ లెక్క చేయలేదు.
భారతప్రభుత్వం తీవ్రవాదుల మీద అంతటి తీవ్రమైన చర్యలు తీసుకుంటే తప్పు ఏమీ లేదు. ప్రభుత్వం పిరికిది కాకుంటే తక్షణమే ఇటువంటి పనిని చేసి తీరాలి.
ఒక ప్రాంతంలో తమ జనాభాను బాగా పెంచుకొనడం, తరువాత ఆ ప్రాంతం తమదే అనడం, తమకు అచ్చంగా ఇచ్చేయాలి అనడం ఆ ఉగ్రవాదుల దీర్ఘకాలికవ్యూహం. అందువల్ల ముల్లును ముల్లుతోనే తీయాలి అనే వ్యూహం అనుసరిస్తూ, ఆర్టికిల్ 370 ని రద్దు చేయడం ఒక బలమైన చర్య.
కాశ్మీరచరిత్ర రాజకీయంగానూ, సాహిత్యరంగంలోనూ, కళారంగంలోనూ అవినాభావంగా భారతీయసంస్కృతితో ముడిపడి ఉంది. దానిని సమగ్రభారతంలో ప్రచారం చేయాలి. గత వంద ఏళ్లుగా జరుగుతున్నది మాత్రమే అసలైన కాశ్మీరచరిత్ర అయినట్టు, అంతకు ముందు కాశ్మీర్‌కు ఒక అస్తిత్వమనేదే లేనట్టు కుహనాచరిత్రకారులు చిత్రీకరిస్తూ ఉండడాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. అక్కడ అశాంతికి కారణం పాకిస్తాన్ ప్రభుత్వపు రహస్యచర్యలే అనేది అందరికీ స్పష్టంగా అవగాహన కలిగేలా చక్కని ప్రచారం చేయాలి.
దాదాపు భారతభూభాగం మొత్తం తమదే అన్నట్టుగా, భారతీయులు తమను అన్యాయం చేసి ఏదో కొంతభాగం మాత్రమే తమకు ఇస్తున్నట్టుగా పాకిస్తాన్‌లో విద్యార్థులకు చిత్రపటాలు వేసి మరీ నూరి పోస్తున్నారు.
మనం మాత్రం కనీసం కాశ్మీరు కూడా మనదే అని గట్టిగా చెప్పకుండా చర్చలు చర్చలు అంటూ శతాబ్దాలతరబడి ఆ సూత్రాన్ని తెంచేయకుండా ఆలస్యం చేస్తూ ఉంటే, మన తరువాత తరాల మన వారసులకు కూడా కాశ్మీరం మనది కాదేమో అని సందేహం కలిగి తీరుతుంది.
బలవంతుడు బలవంతుని గౌరవిస్తాడు. మూర్ఖుడు భయపడతాడు. ఉగ్రవాదులు మూర్ఖులు. తనకు ఎక్కడో జన్నత్ లో ఏదో లభిస్తుందని ఇక్కడ నరకం సృష్టించడం మూర్ఖత్వం మాత్రమే.
{2019/ఫిబ్రవరి/14 నాడు కాశ్మీరంలోని పులవామాలో భారతసైనిక పటాలంపై ఒక మతమౌఢ్యపు ఆత్మాహుతికారుడు దాడి చేసి 44 మంది భారతవీరజవానుల మృతికి కారకుడైనాడు.}